"అవునవును లాస్ట్ టైం వచ్చినప్పుడు నాలుగు గ్లాసుల గ్రేప్ జ్యూస్ తాగాం. అసలు లంచే చేయలేదు మధ్యాహ్నం".
"అవును..." అన్నాడు అభినయ్ గుర్తు చేసుకుంటూ.
* * *
ఆఫనెవర్ లో ప్రేషప్ అయి, బ్రేక్ ఫాస్ట్ కూపన్స్ రిసెప్షన్ లో కలెక్ట్ చేసుకొని బ్రేక్ ఫాస్ట్ సెక్షన్ కు వెళ్ళారు. వాళ్ళని చూడగానే మేనేజర్ గుర్తుపట్టాడు.
"వెల్ కమ్ సర్!" అన్నాడు వాళ్ళకు ఎదురెళ్ళి వీళ్ళిద్దర్నీ చూస్తుంటే అతనికి ముచ్చటేసింది.
ఆ అమ్మాయి పెదవుల మీద చిర్నవ్వు.
ఆ అబ్బాయి మొహంలో ఎఫెక్షన్.
వాళ్ళిద్దర్నీ చూస్తే "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అన్న మాట పుట్టిందేమోనన్నంత బావుంటారు.
బ్లూ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ లో అతను. లైట్ పింక్ కలర్ మైసూర్ క్రేప్ పై ఎంబ్రాయిడరీ చేసిన శారీ. అదే కలర్ బ్లౌజ్ లో విరజ. అప్పుడే విరసిన రోజాపువ్వులా వుంది. అభినయ్ వెనకే ఒద్దికగా నడుస్తూ వస్తోంది. ఆ మేనేజర్ కు ఎప్పుడో చదివిన విషయం గుర్తొచ్చింది. భర్తలో ఒదిగిపోయే స్త్రీ లక్షణం యిలానే వుంటుందని.
"ఎంత అణుకువ" అనుకున్నాడు. పైగా.... ఇలాంటి భార్య దొరకడం అతని అదృష్టం అనుకున్నాడు.
విరజ రెండు ప్లేట్లు రెండు చేతుల్తో పట్టుకుంది. అభినయ్ ఇడ్లీ, వడ, పూరీ... అలా ఒక్కోటి ప్లేటులో వడ్డిస్తున్నాడు.
ఇద్దరూ కలిసి కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. ఆ హోటల్ వాళ్ళు చేసిన డెకరేషన్ చాలా బావుంది.
ఇంతలో మేనేజర్ వచ్చి ఓ స్లిప్ ఇచ్చి వెళ్ళాడు. 'ఒపీనియన్ స్లిప్' అది.
ఆ హోటల్ గురించి వాళ్ళు తీసుకునే శ్రద్దలో ఓ భాగం అది వచ్చిన కస్టమర్ల ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడతారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వాళ్ళ మేనేజ్ మెంట్ ఏ విషయంలోనయినా శ్రద్ద తీసుకుంటుంది. మంచి పద్దతి కూడా అది. ఇంచుమించు ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ ఈ పద్ధతినే ఫాలో అవుతాయి.
టేబుల్ సిస్టమ్ ఎలా వుంది?
సర్వీస్ ఎలా వుంది?
టిఫిన్స్ టెస్ట్ ఎలా వుంది?
ఎనీ అదర్ సజీషన్స్.... అంటూ చాలా క్వశ్చిన్సే ఉన్నాయి.
అభినయ్ ని పెన్ అడిగి విరజ ఫాం మొత్తం ఇంట్రెస్ట్ గా ఫిల్ చేసింది.
'సీటింగ్ సిస్టమ్' అని ఉన్న దగ్గర మాత్రం 'నాట్ గుడ్' అని పెట్టి ఓ వాక్యం రాసింది.
"సీట్స్ ఇలా విడిగా కాకుండా రెండూ కలిపి ఒకే సీటుగా వుంటే బావుంటుంది" అని రాసింది.
మ్యారేజ్ డే అన్న దగ్గరికి ఆమె తలమీద ముద్దు పెట్టుకున్నాడు.
అభినయ్ అదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆ క్షణం విరజను అలానే పొదివి పట్టుకొని గదిలోకి తీసుకెళ్ళి ముద్దు పెట్టుకోవాలనిపించింది.
* * *
బ్రేక్ ఫాస్ట్ పూర్తయ్యేక అదే హోటల్ ప్రెమిసెస్ లో ఉన్న ట్రావెలర్స్ దగ్గరికి వెళ్ళారు.
బుర్రాకేవ్స్, అరకు చూడ్డానికి 'హైర్' చేసుకున్నారు.
నైన్ థర్టీకి బయల్దేరాలని డిసైడ్ చేసుకున్నారు. ఈలోగా కాసేపు రిలాక్స్ అవ్వడానికి రూమ్ కు వచ్చారు.
* * *
"అబ్బ లంచ్ చేయడానికి కూడా కడుపులో ప్లేస్ లేదు కదూ..." అన్నాడు అభినయ్.
అవును అయినా లంచెందుకు? బుర్రాకేవ్స్, అరుకు చూసి ఈవినింగ్ వరకు వస్తాం కదా!.... ఆ తర్వాత బీచ్ కు వెళ్దాం. అక్కడ మిరపకాయ బజ్జీలు తిని తీరాల్సిందే. తర్వాత ఓ బట్టర్ స్కాచ్ తిని అంతే....బస్....స్టమక్ ఫుల్..." అంది చిన్నపిల్లలా అభినయ్ ఒళ్ళో తలపెడుతూ.
సెంట్రలైజడ్ ఎసి. కాబట్టి రూమ్ మొత్తం కార్పెట్ పరచి వుంది నీట్ గా అతను మంచంపైన కూర్చుని వుంటే, విరాజ కార్పెట్ పైన కూర్చుని అతని ఒళ్ళో తల పెట్టింది.
"ఏయ్.... నేలమీద కూచోవడమెందుకు? పైకొచ్చేయ్" అన్నాడు అభినయ్.
"నాకిలానే బావుంది అభీ.....కొన్ని ఫీలింగ్స్ లాజిక్కు అందవు. ఇలా కూచొని నీ ఒడిలో తలపెట్టి కూచుంటే నిశ్చింతగా వుంటుంది"
అభినయ్ కాస్త కిందికి వంగి ఆమె తలమీద ముద్దు పెట్టుకున్నాడు.
* * *
మరో అరగంటలో మొహం కడుక్కుని బయల్దేరారు.
"విరూ.... చీర వద్దు.... చుడీదార్ వేసుకో.... కంఫర్ట్ గా వుంటుంది".
"అలాగే...." అంటూ అతని ముందే చీర విప్పేసి చుడీదార్ వేసుకుంది.
డార్క్ బ్లూకలర్ పైన అద్దాలు కుట్టిన ఆ చుడీదార్ విరజకి ఎంతో నప్పింది.
ఆమెనలాగే చూస్తూ "నా ముందే డ్రెస్ మార్చుకోవడానికి సిగ్గనిపించలేదా?"
"సిగ్గా.... అదెలా ఉంటుందయ్యా?! మనకసలు 'అది' వుంటేగా...."
"అలా అనకే"
"అబ్బ.... ఎంత బాగా అన్నావయ్యా.... 'ఆనకే' అని" అంది విరజ.
"అది సరే కానీ.... నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నా ముందే బట్టలు మార్చుకున్నావు. ఇబ్బందిగా అనిపించలేదా?"
"ఇబ్బందా? నాకు లేదే.... నీకేమైనా ఇబ్బందిగా వుందా?"
"లేదు.... కానీ...."
"అభీ.... బాత్రూంలో స్నానం చేస్తూ కళ్ళు మూసుకుంటామా? కళ్ళు మూసుకునే సబ్బు రాసుకుంటామా?"
"లేదు..."
"ఎందుకలా?"
"నా శరీరానికి నేను సబ్బు రాసుకునేప్పుడు కళ్ళు మూసుకోవడమెందుకు?"
"దట్సాల్.... అలాగే ఈ బాడీ నాది కాదు. ఈ బాడీ, ఈ మనసు నీది...."
డబుల్ కాట్ ని కారులో తీసుకువెళ్ళడం కుదరకపోతే, కాట్ విప్పి, ఏ పార్ట్ కాపార్ట్ చేసి తీసుకువెళ్తాం. అవునా...." అలాగే మన రెండు శరీరాలు కలిసి సృష్టించడం చేతగాని బ్రహ్మ.... రెండు భాగాలు చేసి సృష్టించాడు.
ఒక భాగాన్ని స్త్రీగా, మరో భాగాన్ని పురుషుడిగా మార్చాడు. కానీ ఒకే మనసును ఇచ్చాడు. ఆ రెండు భాగాల్లోని ఒక భాగం నువ్వయితే, మరో భాగాన్ని నేను. అందుకే నీ ముందు నాకు సిగ్గు అనిపించదు. ఈ మనసే కాదు.... శరీరంలోనూ ఏ దాపరికం వుండకూడదు".
ఒక్క క్షణం.... లిప్తకాలం.... అభినయ్ ఒళ్ళు జలదరించింది. ప్రపంచంలొ ఇంత గొప్ప భార్య ఏ మగాడికైనా వుంటుందా?
"విరూ..." తనకు దగ్గరగా లాక్కొని ఆమె మెడదగ్గర తలపెట్టి అలాగనే వుండిపోయాడొక్క క్షణం.
"వెళ్దామా?" అడిగింది విరజ.
"వెళ్దాం... విరూ మరో విషయం చెప్పు? నీకు చుడీదార్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదా..."
"అయితే..."
"మరెందుకు వేసుకున్నావు? నేను కంఫర్ట్ గా వుంటుందన్నాననా?"
"ఊహూ... నువ్వు వేసుకోమన్నావని.... వేసుకున్నాను. నీకిష్టమైన ప్రతీదీ నా కిష్టమే" అంది అతని చేతిని తన పెదవులకు ఆన్చుకుంటూ...
* * *
విశాఖపట్నానికి దగ్గరలొ ఉన్న అరుకు, బుర్రాకేవ్స్ చాలా ఫేమస్. అరుకు అందాలు చూసి తీరాల్సిందే. రెండో ఊటీగా కూడా చెప్తారు.
చారిత్రకమైన ఘనత కలిగి బుర్రాకేవ్స్ చూడాలంటే భలే థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఒకటిగా వుండే ఆ గుహలు భయాన్ని కలిగిస్తుంటాయి. ఎందరో టూరిస్టులు వచ్చి చూసి వెళ్తుంటారు.
అందుకే ఈసారి విరజ ఆ ప్లేస్ ను సెలక్ట్ చేసింది. ట్రావెలింగ్ ఓ హాబీ విరజకు. ముందుగా ఇండియా మొత్తం చుట్టిరావాలని, తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలూ చూసి రావాలని కోరిక. అదీ అభినయ్ తో ఏదయినా అభినయ్ తో పంచుకోవడం ఆమెకు ఆనందం. అభినయ్ తో కలిసి ప్రయాణం ఓ అందమైన మజిలీ.... అందుకే ఈ ప్రయాణం.
* * *
