'నీ సంగతి తెలియదా రామస్వామి...' మనసులో అనుకున్నాడు.
ఇప్పుడు తను వెళ్ళకపోతే బామ్మ ఊళ్ళోనే కాదు, జిల్లాలోకూడా మీటింగ్ పెడుతుంది. లాభంలేదు అనుకున్నాడు.
ఇప్పుడు తను వెళ్ళకపోతే బామ్మ ఊళ్ళోనే కాదు, జిల్లాలో కూడా మీటింగ్ పెడుతుంది. లాభం లేదు అనుకున్నాడు.
'సర్లే నేను వెంటనే బయల్దేరుతున్నాను. బ్యాంక్ కు వెళ్ళి కాస్త డబ్బు డ్రా చేసుకుని వస్తాను. ఈలోగా నువ్వెళ్ళి "ఉరేసుకోవద్దని చెప్పు ఆ ఉరి ఏదో నాకే వేయమను..." కోపంగా అన్నాడు.
"బ్యాంకుకు వెళ్ళక్కర్లేదు చినబాబూ....బామ్మగారు మీకు వెయ్యి రూపాయలు పంపించారు, దారి ఖర్చులకు..."
'ఎంత ముందుచూపే ముసలి బామ్మా మనసులో అనుకోకుండా వుండలేకపోయాడు. వెంటనే బామ్మ దగ్గరికి బయల్దేరాడు.
శ్రీచరణ్ వూళ్ళోకి అడుగుపెట్టేసరికి అంతవూహించిన డామేజీ జరగనే జరుగుతుంది.
రచ్చబండ దగ్గర బామ్మ ఓ స్టూలుమీద కూచుంది. చుట్టూ జనం, ఆవిడ చేతిలో ఓ తాడుముక్క.
'మీకు తెలుసా వాడు.....యింత....వేలడెంత వున్నప్పుడు వాడమ్మ, నాన్న పోయారు. వాడిని కళ్ళల్లో వత్తులు వేసుకుని కాపాడాను. అయినా వాడుచూడు...నాకు సీరియస్ గా వుందని టెలిగ్రామ్ ఇచ్చినా రాలేదు ఇదేమైనా న్యాయమేనా?" అడుగుతోంది.
శ్రీచరణ్ కు తల తీసేసినట్టయింది.
వెంటనే స్లోమోషన్ పరుగెడుతూ..."బామ్మా..నేనొచ్చాశానే...." అని అరిచి పరిగెత్తాడు. బామ్మలేచి, తనూ స్లోమోషన్ లో పరుగెత్తుతూ...
"ఏమయ్యా శ్రీచరణూ...నీకేమైనా బుద్ది వుందా? పాపం...ముసలావిడ...ఒంట్లో బాగోలేదని టెలిగ్రామ్ ఇచ్చినా రాకుండా వుంటావా? అసలు నీకు మనసెలా ఒప్పిందయ్యా..." ఓ పెద్ద మనిషి అన్నాడు.
"తప్పు కదా బాబూ..." ఓ ముసలావిడ మందలించింది.
'అవునవును...." మరీ ఇద్దరు ముగ్గురు గొంతులు కలిపారు.
బామ్మ ఒక్కసరిగా వీరావేశంతో వాళ్ళ మధ్యకు చొచ్చుకుపోయి....
"ఏంటర్రా యిందాకట్నుంచి చూస్తున్నాను. నా మనవడిని అలా ఆడిపోసుకుంటారు. మీ చేతులు పడిపోను. మీ కాళ్ళు పక్షవాతం వచ్చి చచ్చుపడిపోనూ.... వూర్నించి వచ్చిన బిడ్డను చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటారా?" అంటూ తిట్ల వర్షం మొదలెట్టింది.
వూళ్ళోని జనం నోరు తెరిస్తే ఒట్టు.
'పోనీలే బామ్మా....ఈ ఒక్కసారికి వాళ్ళ అజ్ఞానాన్ని క్షమించు..."అన్నాడు విశాల హృదయంతో శ్రీచరణ్.
'నా బంగారుకొండ చెప్పాడని, వదిలేస్తున్నా..." అంటూ మనవడ్ని తీసుకొని తన యింటివైపు కదిలింది.
"ఇంతకీ....యింతర్జంటుగా....ఎందుకు రప్పించావే?"
'నీకొక చక్కని చుక్కనిచ్చి పెళ్ళి చేద్దామని"
,నాకు చుక్కలు, గీతలు ఎందుకే ముసలి...శుభ్రంగా జీన్స్ వేసుకున్న అమ్మాయి, చుడీదార్ వేసుకునే పట్నం దొరసాని కావాలి గానీ..." అన్నాడు బామ్మ ఒడిలో తలపెట్టి.
'అన్నీ...మీ తాతయ్య బుద్దులే. మీ తాతయ్యా అంతే....ఎవరైనా ఎర్రగా, బుర్రగా హైహీల్స్ వేసుకొని వెళ్తోంటే వెనకే పడేవాడు"
"హైహీల్స్ కాదు బామ్మా హైహీల్స్..." సర్దిచెప్పాడు.
"ఏవో ఒక ఫైల్స్..." అంది బామ్మ.
"అబ్బా.....ఫైల్స్ కాదే.....బ్యాడ్ మీనింగొస్తుంది" అన్నాడు శ్రీచరణ్ తలబాదుకొని!
"ఏదో ఒకటిలే గానీ రేపే మనం విజయవాడ వెళ్తున్నాం. శర్మగారిని నీకు మామ వరస అవుతారు. వాళ్ళమ్మాయి అందంగా, బుద్దిగా వుంటుంది. నా పెళ్ళప్పుడు నేనెంత అందంగా వున్నానో...అంతందంగా వుంటుంది, బుద్దిమంతురాలు....నువ్వుచూసి "ఊ" అంటే లగ్నాలు పెట్టించి, వెంటనే పెళ్ళి చేసేస్తా..." అంది.
'బామ్మా....నాకిప్పుడే పెళ్లెందుకే...అయినా నీ అంత అందమున్న ఆ అమ్మాయిని, తాతయ్యంత అందంగా వున్నవాడు పెళ్ళిచేసుకోవాలిగానీ, నేనెందుకే?" అన్నాడు శ్రీచరణ్.
'అంటే పెళ్ళి చేసుకోవా?" అడిగింది బామ్మ కోపంగా.
"అదికాదే...."
'నువ్వా అమ్మాయిని చూడు...తర్వాత సంగతి తర్వాత..." అంది బామ్మ ఓ నిర్ణయానికివచ్చేస్తూ.
"నాకిష్టం లేదే బామ్మా..."
"నాకిష్టముందిరా మనవడా..."
"నాకిష్టం లేదని చెప్పానా..."
"నాకిష్టం అని చెప్పానా?"
"అయితే నువ్వే చేసుకోవే..."
'రామస్వామీ....' పెద్దగా కేకేసి పిలిచింది.
'వస్తున్నా అమ్మగోరూ..."
"ఏంటే...రామస్వామిని చేసుకోమంటావా? బావోదేమో..." అన్నాడు శ్రీచరణ్.
బామ్మ మాత్రం ఆ మాటలేం పట్టించుకోకుండా...
'రామస్వామీ....నా కర్మకాండలకి ఎంతవుతుందో లెక్కచూడమని చెప్పానుగా...'
"చిత్తం..."
'హాలులోని చూరు బావుందా చూడు అలాగే ఆ తాడు పట్రా...దానిక్కాస్త వెన్న రాయి...ఊర్లో వాళ్ళందరికీ చెప్పు. ఈ ముసల్ది ఉరేసుకుని చస్తుందని..."
"అదేంటే...ఒక్కసరి అంత షాకిస్తున్నావు" శ్రీచరణ్ కంగారుగా అటిగాడు.
"అవున్రా...నీకు ఈ బామ్మచేదయిందిగా......యింత వేలెడంత వున్నప్పుడు...."
"అ... బ్బా..." గట్టిగా అరిచాడు శ్రీచరణ్, బామ్మ ఆపేసింది.
"వేలెడు నేను వేలెడంత వున్నప్పుడు, నా అబ్బ నాయమ్మ, నా ఖర్మకాలి చచ్చిపోతే, నువ్వే పెంచావు. నాకు విశ్వాసం లేదు. నువ్వంటే ప్రేమ లేదు....యింతే కదా....నువ్వు అనేది"
"అదేంట్రా...నీకెలా తెలుసు?"
"నాకెలా తెలుసా....నేను వేలెడంత వున్నప్పట్నుంచీ, యివే సెంటిమెంటు డైలాగులతో నన్ను ఆయింట్ మెంట్ లేకుండా దెబ్బకొడుతున్నావు కదే. ముసలి బామ్మా కానీ ఒక్క షరతు...ఆ అమ్మాయితో ప్రైవేటుగా మాట్లాడతాను ఆ అమ్మాయికి ఇష్టం లేదంటే మాత్రం చేసుకోను..."
'ఛ.... ఛ... ఆ అమ్మాయికి యిష్టం లేకపోతే నిన్నెందుకు చేసుకోమంటాన్రా వెర్రి సన్నాసి."
"యిదే వద్దు ప్రతి మాటకు ముందు వెర్రి సన్నాసి, వెర్రి నాగన్న...బంగారు కొండ, వెండి శిఖరం...లాంటి పేర్లొద్దు..."
"సరే లేరా పిచ్చికొండా..."
"బామ్మా..." అంటూ జట్టు పీక్కున్నాడు శ్రీచరణ్. బామ్మ మాత్రం ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది. తెల్లవారే పెళ్ళిచూపులకు విజయవాడ కు ప్రయాణం. ఆ రాత్రే శ్రీచరణ్ ఓ నిర్ణయానికి వచ్చాడు.
