Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 15

 

    విష్ణు కంఠం అతిమధురమై, గంభీరమైన శ్రోతలను సమ్మోహితులను చేస్తున్నది.
    అయన వాణిలో వున్న మహిమ అలాంటిది.....
    మంత్ర ముగ్ధులను చేసే స్వరంతో , స్పష్టతతో అయన సందేశంలో వినిపించే జీవిత సత్యాలు ఎన్నెన్నో!
    అంతటితో స్వస్తి చెప్పి ఆవేళకి ప్రసంగాన్ని ముగించాడు విష్ణు.
    భక్తులు ఒక్కరొక్కరుగా ఆ మందిరం నుంచి నిష్క్రమిస్తున్నారు.
    కలెక్టర్ ధీరజ.....విష్ణు చూపులు నిర్ని మేషం పాటు కలుసుకున్నాయి.
    అతని కళ్ళల్లో చిరునగవు.......ఆమె కళ్ళల్లో తడబాటు!
    ఉన్నట్టుండి ఏమనుకున్నదో ఏమో, చివాలున తల తిప్పుకుని భక్తులతో కలిసి బయటకు నడిచింది ధీరజ.
    అంతవరకూ దూరంగా నిలిచి వున్న భారతి అప్పుడు అతనిని సమీపించింది.
    "స్వామీజీ ......నా మీద మీకు కోపం లేదుగా?"
    'కోపమా ........నా కెందుకు?"
    'అదే .....మీ ప్రసంగానికి మద్యలో అడ్డు నిలిచినందుకు అంత మందిలో మిమ్ము ప్రశ్నించినందుకు"
    "ఇంతవరకూ నా భోధనలకు అందరూ తలలు వూపేవారే కానీ తమ సందేహాలను నీలా ధైర్యంగా నా ఎదుట గొంతు విప్పి అడిగే ప్రయత్నం ఏ శిష్యుడూ చేయలేదు. అందుకే ఒక విధంగా నీ సాహసాన్ని మెచ్చుకుంటున్నాను. ఏదయునా ప్రశ్న ఉదయిస్తేనే సమాధానం వస్తుంది. ఎందరో ఎన్నో సందేహాలు భయం చేతనో, ఆత్మన్యూనతా భావంతోనో మనసులోనే వుంచుకుని సతమతమవుతుంటారే కానీ ఎవరూ నీలా ధైర్యంగా బయట పెట్టరు. ఇప్పుడే కాదు.....ఇక ముందు కూడా నీకు ఏ ధర్మ సందేహం వచ్చినా నిరభ్యంతరంగా అడగవచ్చు" అని చెప్పి మందిర అంతర్భాగంలోకి వెళ్ళిపోయాడు.
    కనుమరుగు అవుతున్న అతన్ని రూపాన్నే నిశ్చలంగా చూస్తుండి పోయింది భరతి!
    ఆమె మనోనేత్రం ముందు తను వచ్చిన పని......ఇక్కడకు వచ్చాక ఇంతవరకూ ఎదురయిన తన అనుభవాలు.......ప్రస్తుతం చేస్తున్నదీ ఒక్కసారి పునరాలోచించుకోవడంతో భారతి మనసు బరువెక్కిపోయింది.
    ఒక నిట్టుర్పూ విడిచి , తనకు కేటాయించిన గది వైపు అడుగులు వేసింది.
    ఆమె కళ్ళ ముందు నుంచి మాత్రం విష్ణు రూపం చెరిగిపోలేదు.
    అడుగులు వేస్తున్నా, గదిలోకి ప్రవేశించినా, చాపపై పడుకున్నా ....ఎటు చూసినా , ఏ శబ్దం విన్నా అన్నింటా ఆజానుబాహుడైనా విష్ణు సమ్మోహన రూపమే గోచరిస్తున్నడామెకు!    
    తన మనసు మొదటి సారిగా తన అదుపు తప్పుతున్నది.
    విష్ణు పై తనకు తెలియని అనురాగాన్ని పెంచుకుంటున్నది. తను ఎంత కాదనుకున్నా అది ముక్తి మార్గానికి అనుకునే కంటే ప్రేమ మార్గానికి అని నిస్సందేహంగా భావించవచ్చు.
    ఇప్పుడు తన వయసు ఆనందాల వైపు పరుగు తీస్తుంది తప్ప ఆధ్యాత్మిక చింత వైపు కాదు. అసలు తను వచ్చిన పని మరచిపోయి విష్ణు ఆకర్షణలో పడిపోవడమేమిటి?
    అంటే, తను వ్యక్తిత్వాన్ని కోల్పోతుందన్న మాట..
    ఆ క్షణంలోనే విష్ణుకు దూరంగా పారిపోవాలనుకుంది కాని ఆమెకు సాధ్యపడటం లేదు.
    లేచి గదిలో అసహనంగా పచార్లు చేస్తుంది.
    ఇప్పుడు ఆమె మనస్సులో సంఘర్షణ పోటెత్తిన సముద్రంలా ఎగసిపడుతున్నది.

    
                                                *    *    *    *

    కాలింగ్ బేల్ మ్రోగింది.
    ఉలిక్కిపడి నిద్రలేచాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
    కళ్ళు తెరచి చూస్తూనే వాల్ క్లాక్ వైపు మరలింది అతని దృష్టి.
    సమయం రెండు గంటలు కావొస్తోంది!
    ఇంత రాత్రి వేళ తనకోసం వచ్చింది ఎవరై వుంటారో ననుకుంటూనే తలుపు తీశాడు.
    బయట కానిస్టేబుల్ వున్నాడు.
    ఇన్ స్పెక్టర్ ను చూడగానే టక్కున సెల్యూట్ కొట్టాడు.
    "ఏమిటి రాందాస్..........ఎనీ థింగ్ రాంగ్"
    "సర్! విష్ణు మందిరం వద్ద తమరు కావలి వుంచిన కానిస్టేబుల్స్ మెసేజ్ పంపారు సర్"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS