వీరమ్మ నవ్వి "పోండమ్మా మీదంతా సోద్యం! అదేమైనా కష్టమా ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారూ.....నువ్వెళ్ళు తల్లీ అబ్బాయి ఎదురుచూస్తున్నాడు" అని గదిలోకి పంపించేసింది.
వర్షని సంజయ్ చంద్రబింబాన్ని ఆవరించే మేఘంలా చుట్టుకున్నాడు. ఆమెకి ఒక్కక్షణం కూడా ఏమీ ఆలోచించే వ్యవధి ఇవ్వలేదు! ప్రతి అనువునీ ఆత్రంగా ముద్దాడుతూ ఆమెకి అనుభవించడం ఏమిటో నేర్పే గురువయ్యాడు!
అమ్మ ప్రేమకన్నా తియ్యనిసృష్టిలో ఇంకొకటి ఉందని వర్షకి ఆ రాత్రి తెలిసింది.
"వర్ష.....మన హనీమూన్ మెడ్రాస్, ఊటీ, కొడైవెళ్తున్నాం. ఇదిగో టికెట్స్ కూడా తెప్పించాను." సంజయ్ టికెట్స్ తో వచ్చి చెప్పాడు.
"హాయ్.......వెరీగుడ్!" వర్ష చిన్నపిల్లలా సంబరపడిపోయింది. అంతలోనే "ఎన్ని రోజులుంటాం" అడిగింది.
"పదిహేను రోజులు లీవ్ పెట్టాను" చెప్పాడు సంజయ్.
"పదిహేనురోజులా......మరి మనతో అమ్మ కూడా వస్తోందా?" అమాయకంగా అడిగింది.
అతను ఆమె చెవి పట్టుకుని "మనం వెళ్తున్నది హనీమూన్ కి! దానికి నవదంపతులు ఇద్దరే వెళ్ళాలి మొద్దూ!" అన్నాడు వర్ష చిరుకోపంగా "అలా అని రూలా? శాస్త్రాల్లో ఎక్కడైనా వ్రాసి పెట్టి ఉందా?" అని అడిగింది.
"అవును శాస్త్రం పేరూ..." అని చుట్టూచూసి "దగ్గరికి రా చెవిలో చెప్తాను." అని ఆమె చెవిలో "వాత్స్యాయనకామశాస్త్రం!" అన్నాడు.
"ఛీ పో?" వర్ష దూరంగా జరిగింది.
సంజయ్ ఆమెని దగ్గరగా లాక్కుంటూ "దూరంపోవడానికా పెళ్ళిచేసుకున్నదీ" అన్నాడు.
"అదికాదు సంజయ్......అమ్మాని విడిచి నేను పదిరోజులు......అమ్మో ఉండలేను!" బుంగమూతి పెట్టి అంది.
"మరిపించడానికి నేనున్నాగా! ఎత్తుకుని తిప్పి గోరుముద్దలకి బదులు తీపి ముద్దులు పెడ్తాగా!" ఆమెని ముద్దుపెట్టుకుంటూ అన్నాడు.
అప్పుడే అటుగా వెళ్తూ గదిలోకి తొంగిచూసిన విద్యకి ఈ మాటలూ, చేతలూ చెవినబడ్డాయి. 'మరిపించడానికి నేనున్నాగా.....' అన్నమాటలు ఆమె గుండెకి సూటిగా తాకాయి!
"ఉష్.....అమ్మ.....అమ్మ" దూరంగా జరుగుతూ సైగలు చేసింది వర్ష.
"అందుకేమరి కొత్తదంపతులకి ఈ హనీమూన్ అవసరం అయ్యేది!" వర్షని వదులుతూ అన్నాడు సంజయ్.
"నేను వాళ్ళ మధ్యలో అడ్డుగా ఉన్నాననా ఇతని ఉద్దేశం?" పక్కకి తొలుగుతూ అనుకుంది విద్య. వర్షా సంజయ్ హనీమూన్ కి వెళ్ళిపోయారు. విద్య ఒక్కతే బావురుమంటున్న ఇంట్లో మిగిలిపోయింది.
ప్రొద్దుట లేచిన దగ్గర్నుంచీ 'అమ్మా......అమ్మా' అనే వర్ష పిలుపే ఆమెకి ఆలాపనగా ఉంది.
"వర్షమ్మా......వర్ష తల్లి వెళ్ళి రెండురోజులు అయిందికదూ...... ఇంకా పదమూడురోజులు....ప్చ్ .....ఎప్పుడుగడుస్తాయి!" అని పిచ్చిగా తనలో తనే అనుకోసాగింది.
"ఏమిటమ్మా విడ్డూరం? అన్నం తినరూ.....ఏపనీ శ్రద్దపెట్టి చెయ్యరూ......ఇలా అయితే ఒకవేళ అబ్బాయి ఉద్యోగరీత్యా అమ్మాయిని ఏ దూరరాష్ట్రానీకో తీసుకుపోతేనో?" అంది వరమ్మ.
"అమ్మో! అలా కూడా చేస్తాడా?" గాభరాగా అడిగింది విద్య.
"చేస్తే మీరేం చెయ్యగలరమ్మా? ఆడపిల్ల పెళ్ళయ్యాక ఆళ్ళ పిల్లేగా!" అంది.
"నో.....అలా జరగడానికి వీల్లేదు! అయినా నా బిజినెస్ అంతా వాళ్ళదేగా.....అతను ఇంకో చోట ఉద్యోగం చెయ్యడం ఏమిటీ? రాగానే ఆ ఉద్యోగం మానిపించేస్తాను. చక్కగా నా కళ్ళముందే ఉండేటట్లు చేస్తాను!" అంది.
అయినా ఆమెకి భయంగానే ఉంది. మరో రెండు రోజుల్లోనే బెంగతో మంచంపట్టింది. చూడడానికి వచ్చిన వసుంధరతో సంజయ్ ఉద్యోగం మానిపించే విషయం మాట్లాడింది.
వసుంధర తేలిగ్గా "దీనికి మీరింతగా ఆలోచించి మనసు పాడు చేసుకోవాల్సిందేం లేదు! అలాగే జరుగుతుంది!" అని హామీ ఇచ్చింది.
అప్పటికిగాని విద్య మనసు తేలికపడలేదు.
డాక్టర్ వచ్చి చూసి "అన్నీ బాగానే ఉన్నాయి. మీరు మనసులో ఏదో పెత్తుకుఇ బాధపడ్తున్నారు. ముందు అది తీసెయ్యండి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది" అన్నాడు.
విద్య కూతురికోసం రోజులు లెక్కపెట్టుకుంటూ కూర్చుంది.
వర్షహనీమూన్ నుండి వస్తూనే "అమ్మా! నీకోసం ఏం తెచ్చానోచూడు!" అంటూ తనుకొన్న పట్టుచీరలూ, బొమ్మలూ తల్లికి అందించింది.
"అవన్నీ నాకెందుకమ్మా నువ్వు క్షేమంగా నాకళ్ళముందుకొచ్చావుఅంతే చాలు" అంది.
వర్ష సంజయ్ తో "చూడు అమ్మ నాకోసం బెంగపడి ఎలా చిక్కిపోయిందో......ఇన్నిరోజులు వద్దంటే నా మాట విన్లేదు నువ్వు!" అంది.
"మీదంతా విపరీతంగా ఉందే! కొట్టగా పెళ్ళయిన అమ్మాయి అనాల్సిన మాటేనా ఇదీ!" కాస్త విసుగ్గా అన్నాడు సంజయ్.
"సంజయ్......నీకు పెళ్ళికి ముందే తెలుసుగా మేం ఇద్దరం కలిసి తప్ప విడివిడిగా బ్రతకలేం, మా బ్రతుకులు అలా ముడిపడిపోయి వున్నాయి అనీ....." కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది.
"వర్షా......ఛీ......దీనికేకన్నీళ్ళా......సారీ........ఇంకెప్పుడూ నిన్ను హర్ట్ చెయ్యను. బీఎ గుడ్ గర్ల్......ఛీర్ అప్ బేబీ.....నవ్వు, అదీ అలా నవ్వాలి!" వర్షని అమాంతం పైకెత్తిగాలిలో గిరగిర తిప్పుతూ నవ్వించాడు.
మరునాడు సంజయ్ ఆఫీస్ కి వెళ్ళాలి అంటూ హడావుడి పడ్తున్నాడు.
"వర్షా.....నాటై ఏదీ? వర్షా.......ఓ వర్షా ఎక్కడున్నావు? అని గదిలోంచి అరిచాడు.
అతనికోసం బ్రేక్ ఫాస్ట్ రెడీచేస్తున్న వర్ష.
"వస్తున్నా......ఒన్ మినిట్!" అంటూ గబగబాపైకి పరిగెత్తి "ఏంటీ?" అంది.
"టైకావాలి!" అంటూ ఆమెని దగ్గరగా లాక్కున్నాడు.
"మెడలోనే ఉందిగా!" అంది.
"కాని నాట్ వెయ్యాలి" అంటూ ఆమె పెదవులు ముద్దాడాడు.
"ఊ.....అన్నీ వంకలు......" ముచ్చటగా మూతి బిగిస్తూ టైనాట్ వేసింది వర్ష.
"బ్రేక్ ఫాస్ట్ కి ఏం పెడ్తున్నావు?"
"పెసరట్టూ, ఉప్మా......నీకు ఇష్టమేనా?" అడిగింది.
