Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 15

 

    "ప్రస్తుతానికి లేవు బావా పోదాం పద.....దార్లో వేరుశనక్కాయలు కనిపిస్తే అపు, కొనుక్కుందాం" అంది జయంతి.

    "ఏం ఇందాక పట్నంలో తిన్నవి చాల్లేదా? అందుకే శరీరం అంతగాపెంచావు- కాస్త తిండి తగ్గించు" అన్నాడు సురేంద్ర నవ్వుతూ.

    "అబ్బో నీ పెళ్ళాంకంటే సన్నగానే వున్నాన్లే సార్..." అంది సీరియస్ గా.

    "గిరిజ మళ్ళి జయంతి తొడపైన గిచ్చింది.

    "అబ్బా నికిదెం రోగమే? ఇలా గిచ్చి చస్తున్నావ్. చిన్నపిన్ని నువ్వు దీని పక్కకురా, నేను అటు వస్తాను అంది" జయంతి.

    "అంతేగాని నీ వాగుడు మాత్రం మననంటావ్" అంది శివపార్వతి నవ్వుతూ.

    "వాగుడు మానితే ఎలా పిన్ని? మీ అందరికి కాలక్షేపం ఎలా అవుతుంది చెప్పు?" అంది జయంతి.

    "అది నిజమేలే, నువ్వు లేకపోతే మాకు మజా రాదు...." అంది దాక్షాయణి.

    "అవునే అమ్మా! పెళ్ళి మనింట్లోనేనా?" అడిగింది జయంతి.

    "అవునే వెయ్యిమంది హాయిగా సరిపోతారు. వచ్చేవారం పందిళ్ళు వేయిస్తున్నారు మీ నాన్నగారు" చెప్పింది కస్తూరి.

    "అబ్బో! ఇక పెళ్ళయ్యేవరకు భలే కాలక్షేపం" అంది జయంతి.

    "పార్వతీ! నువ్వెన్ని చీరెలు తీసుకున్నావ్?" అడిగింది దాక్షాయణి
    "మూడు, రెండు పట్టుచిరెలు తీసుకోకపోయావా....?" అంది దాక్షాయణి.

    మళ్ళి తిరిగి డబ్బులు కట్టొద్దు తల్లీ! నీకేం షాపు మీ ఆయనదే ఎన్నయినా తీసుకుంటావు" అంది పార్వతి నవ్వుతూ.

    "ఛ....డబ్బులుదేముందే. రేపు ఆ చీరే ఇవ్వు. మీ బావగారికి ఇచ్చి పట్టుచీరే తెమ్మంటాను" అంది దాక్షాయణి.

    "వద్దులే అక్కా! రెండు పట్టుచీరెలు చాలు. ఇప్పటికే బోలెడు చీరెలు వున్నాయి. మనం ఎక్కడికెళుతున్నామని, ఏదో మొన్న జయంతి పుణ్యమా అని సినిమాకెళ్ళాం" అంది నవ్వుతూ.

    "అరె! నువ్వేం దిగులుపడకు చిన్నపిన్ని నెలకు రెండు సినిమా ప్రోగ్రాంలు వేద్దాం. గిరిజక్కకు పెళ్లయిపోతుంది కదా. వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా ఒక బండిలో వెళతారు. మనందరం ఎంచక్కా మరో బండిలో వెళదాం. నేను బండి తోల్తాను" అంది జయంతి.

    ఆ మాటలకు అంతా నవ్వారు.

    "అమ్మా తల్లీ! ఆ పూలను అంత అపురూపంగా చూసుకొనక్కర్లేదు, అవేమంతా గొప్ప విషయంకాదు. చెరువులోకి దిగి పూలు తెంపటం నేనే తెచ్చేదాన్ని. ఏదోలే పాపం కాబోయే మొగుడుకదా అతను తెస్తే నీకు తృప్తిగా వుంటుందని బావను తెమ్మన్నాను...." అంది గిరిజని చూసి సీరియస్ గా.

    గిరిజ వెంటనే చేయి ఎత్తింది. జయంతి తప్పుకుంది.

    జయంతి పక్కనే ఉన్న శివపార్వతి తొడపైన గిచ్చింది.

    "అమ్మో! ఏంటే నన్ను గిచ్చావు?" అంది శివపార్వతి తొడపైన చేత్తో రాసుకుంటూ.

    "అయ్యో! సారీ పిన్ని! జయంతి కాలనుకున్నాను" అంది గిరిజ.

    ఆ మాటలకు అందరూ పెద్దగా నవ్వారు.
                                          *    *    *    *

    అరేయ్ చంటి! ఇదిగో నీకు జిలేబి తెచ్చాను తీసుకో. అన్నయ్య ఏడి? వాడ్ని పిలుచుకురా, వాడికేప్పుడు ఆటలే" అంది దాక్షాయణి చిన్నకొడుకుతో.

    వాడు జిలేబి పొట్లం చేత్తో పట్టుకుని బయటకు పరుగెత్తాడు.

    "వనజా! ఇటురా. ఇందా నీకు పట్టులంగా, జాకెట్టు, ఏది ఇలా నిలబడు చూద్దాం. అబ్బ! నీ వంటిరంగులో కలిసిపోయిందే పసుపుపచ్చరంగు" అంది కస్తూరి.

    "ఈ రెండూ నాకేనా పిన్ని?" అంది వనజ ఆనందంగా.

    "నికేనమ్మా! పెళ్ళికూతురు చెల్లెలివి కదా ఆమాత్రం లేకపోతే ఎలా?" అంది కస్తూరి.

    "వనజా! ఇదిగో ఎ జిలేబి తీసుకో. చేతులు కడుక్కునిరా శుభ్రంగా అంది దాక్షాయణి.

    "అమ్మా! నాకు జిలేబి" అన్నాడు చిన్న శివపార్వతితో.

    "నీకు లేదురా నీకు ఇవ్వను" అంది నవ్వుతూ దాక్షాయణి.

    "అమ్మా! చూడవే పెద్దమ్మ నాకివ్వదట" అన్నాడు ఏడుస్తూ.

    "ఇస్తుంది నాన్నా! పెద్దమ్మా నాకు ఇవ్వవా అనడుగు" అంది శివపార్వతి.

    వాడు ఏమి మాట్లాడకుండా అలాగే దాక్షాయణి వేపు గుర్రుగా చూస్తున్నాడు.

    "ఏంట్రా అలా చూస్తున్నావు? నాకేమైనా భయమా....?" అంది నవ్వుతూ దాక్షాయణి.

    "అమ్మా! చూడవే పెద్దమ్మ నాకు ఇవ్వట్లేదు" అన్నాడు మళ్ళి ఏడుస్తూ.

    "నాకో ముద్దు పెట్టు అప్పుడిస్తాను" అంది దాక్షాయణి.

    వాడు ఏడుపు ఆపి దాక్షాయణి దగ్గరకు వచ్చి బుగ్గమీద ముద్దు పెట్టాడు. నా బంగారుకొండ! అని వాడి రెండు బుగ్గలమీద ముద్దులు పెట్టి జిలేబిపొట్లాం వాడి చేతికి అందించి "తీసుకో! చొక్కాకు రాసుకోకు. తిన్న తర్వాత చేతులు కడుక్కో." అంది దాక్షాయణి. ఆ పొట్లాం తీసుకుని వాడు తుర్రుమని బయటకు పరుగుతీశాడు.

    "ఏంటే పట్నంలో సరుకంతా కొనుక్కొచ్చినట్లున్నారు?" అంది భ్రమరాంబ అప్పుడే అక్కడికొచ్చి.

    "మరి నీ కొడుకు పెళ్ళికి ఆ మాత్రం కొనకపోతే మళ్ళి మమ్మల్ని అంటావుకదా. చూశారా కామాక్షి వదినా! నా కొడుకు పెళ్ళి తూతూమంత్రంగా చేశారు అని దెప్పిపొడుస్తారని ఇవన్నీ తెచ్చాం తల్లి. ఏం చేస్తాం పెళ్ళి పెద్దలంటే అన్నీ బాగా చూడాలికదా....?" అంది జయంతి అరిందలా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS