Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 15

   
    
    "నేను నీ దగ్గరికి రాకపోవడానికి భయపడుతున్నానని ఎందుకు అనుకుంటున్నావ్?"

 

    నవ్వింది యింపుగా కెంపుల్ని అధరంపై తురిమిన ఆడదానిలా, "ఇంతకు పూర్వంలా నువ్వు నా దగ్గరికి రాలేవనిపించింది ధన్వి."

 

    "ఎందుకో" వ్యంగ్యంగా అడిగాడు మళ్ళీ.

 

    "సింపుల్....ఒకప్పుడు మనం స్నేహితుల్లా మాటాడుకునే వాళ్ళం. ఇప్పుడలా కాదుగా, నువ్వు మగాడిగా నేను ఆడదానిలా నిర్వచనాలు చెప్పేసుకున్నాం. అంటే మన మధ్య వున్న సన్నని పొరని మొన్న మన పందెంలో తిసిపారేశం."

 

    "అది నీ అభిప్రాయం....."

 

    "నిజమా....." సముద్రంలోకి నిరంతరం ప్రవహిస్తూ కూడా విసుగు చెందని నదిలా వుంది ఆమె పరిస్థితి. "నీకు యిప్పుడు నేను మాములుగానే కనిపిస్తున్నానా!" "మొన్న నేను పచ్చిగా ఓ కోరిక కోరానే" "దానికి నేను సిద్దపడ్డాను."

 

    "పందెంలో ఓడిపోవన్న నమ్మకంతో కదూ?"

 

    అదే విషయం పదే పదే గుర్తు చేయడం ఆమెకి ఆనందంగా వుంది.

 

    "కానీ ఓడిపోతావనిపిస్తుంది ధన్వి."

 

    "నేను ఓడిపోవటాన్నే నువ్వు కోరుకుంటున్నావని నాకూ అనిపిస్తోంది" అల్లరిగా కాదు. మోగులు గుండెల్లో వెలిగించుకున్నది ఆరని దివ్వెలా నమ్మకంగా అన్నాడు ధన్వి.

 


    "ఎందుకు సామ్రాజ్యం?.....మీరంతా ఎందుకు మనసులో ఆలోచనల్ని దాచుకుని మరోలా మాట్లాడుతుంటారు. నిర్భయంగా నిజం మాట్లాడాలని ఎందుకు ప్రయత్నించరు?"

 

    అతడి వాక్యాలు తగలకూడని చోట తగిలినట్టనిపించడంతో , ఉక్రోషంతో సరిహద్దులు చేరిపెసుకుంది. "నీ మీద కోరిగ్గా వుందని ఏ ఆడది సిగ్గు వదిలి చెప్పలేదు."

 

    "చెబితే ఏమవుతుంది?" టక్కున అడిగాడు.

 

    "నువ్వు నన్ను అసహ్యించుకోవచ్చు" తలవంచుకుంది బిడియంగా. "అసలు జన్మలో నువ్వు నా మొహం చూడవని నా స్నేహాన్ని విడిచేయొచ్చు."

 

    "అది పిరికివాళ్ళు చేసేపని."

 

    "విస్మయంగా చూసింది.

 

    "అవును సామ్రాజ్యం! ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి తన అభిప్రాయాన్ని స్వేచ్చగా వ్యక్తం చేసే హక్కుంది. నువ్వు ఒకవేళ నన్ను కావాలని అడిగే స్వేచ్చ నికున్నట్లే, ఇషం లేనప్పుడు తిరస్కరించే స్వేచ్చ నాకు వుంది. ఈ మాత్రం దానికి స్నేహం దూరం చేసుకునే అవసరేముంది? నేను అతిశయోక్తి చేయడం లేదు సామ్రాజ్యం. నీ కిష్టమైన బోర్నవిటాని నాకు ఆఫర్ చేయబోతే నేను తిరస్కరించలేదు! ఇది అంతే....."

 

    ఎంత సునాయాసంగా విశ్లేషించాడు.

 

    సాలోచనగా అంది సామ్రాజ్యం - "ఒకవేళ మన పందెంతో పని లేకుండా , నేను ముందే నీ మీద కోరిగ్గా వుందని అని వుంటే?"

 

    "అప్పటి నా మూడ్ ని బట్టి జవాబు చెప్పేవాడ్ని."

 

    ఎందుకో ఈ జవాబు నచ్చలేదు సామ్రాజ్యనికి.

 

    "అలాంటి సమయంలో మూడ్ ని బట్టి అవును కాదూ అంటావ్ తప్ప నైతిక విలువల గురించి ఆలోచించవన్నమాట!"

 

    నవ్వేశాడు ధన్వి. "నేను హిపోక్రట్ లా మాట్లాడటం లేదు సామ్రాజ్యం....నైతిక విలువల నిర్వచనాలు వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి మారిపోతుంటాయి.

 

    క్షణం ఆగాడు.....

 

    "నీ భర్త తాగుబోతు, తిరుగుబోతు కాబట్టే నువ్వు సహించలేక పోయావ్.....ఆయనకి విడాకులిచ్చి దూరమయ్యావ్.....విలువలే నీకు ముఖ్యమనిపిస్తే అలాగే రాజీ పడిపోతూ అతడితోనే బ్రతికేదానివిగా! కానీ నీ వ్యక్తిగత జీవితం నిన్ను రాజీ పడకుండా చేసింది. ఏ విలువలూ పాటించని భర్తకన్నా, నువ్వు నమ్మిన జీవితం విలువ నిన్నీ ఒంటరితనం వేపు నడిపించింది.

 

    అతడి ఆలోచనల్లో ఎక్కడో ఏదో పరస్పర విరుద్దం వున్నట్టనిపించినా, అదేమిటో ఖచ్చితంగా చెప్పలేకపోయింది. "వుద్దేశ్యంలో నైతిక విలువలూ సాంఘిక ధర్మాలు సంఘాన్ని లాక్కుపోయే రెండు చక్రాలు సామ్రాజ్యం. నువ్వు నీతి అయితే అది ఆచరణలో ధర్మం అవుతుంది."

 

    "టాపిక్ గాడి తప్పిందా?"   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS