Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 15


    
    అప్పటికి కరెంట్ రావడంతో అతను మోటారు వేసి మడవలు తిప్పడానికి పొలంలోకి వెళ్ళిపోయాడు.
    
    ఆమె మరో అయిదు నిమిషాలకి ఇంటికి బయల్దేరింది. గట్టు మీద నడుస్తుంటే దూరంగా అతను కన్పించాడు.
    
    అతను చాలా తాపీగా నీళ్ళు కడుతుండడం చూసి ఆశ్చర్యపోయింది.
    
    అయితే అతను తాపీగా ఏం నీళ్ళు కట్టడం లేదు. యాంత్రికంగా చేతులు నీళ్ళు కడుతున్నాయిగానీ మనసు మాత్రం లక్ష రూపాయల చుట్టే తిరుగుతోంది.
    
    ఈ పల్లెటూర్లో - అదీ పదిరోజులలో లక్షరూపాయలు సంపాదించడం ఎలా?
    
    నీళ్ళు  పారేటప్పటికి సాయంకాలం ఏడు గంటలైంది. ఇంటి కొచ్చాడు గానీ దేనిమీదా ధ్యాసపోవడం లేదు.
    
    దేవాలయం దగ్గర ఓ పదినిముషాల పాటు కూర్చుని తిరిగి ఇంటికి వచ్చేశాడు.
    
    ఏదో తిన్నాడనిపించి లేచాడు.
    
    ఎనిమిది గంటలకల్లా తన చాపా, దిండు పట్టుకుని పశువుల పాకలో చేరాడు.
    
    అది పశువుల పాకే అయినా చాలా విశాలంగా వుంటుంది. ఓ మూల చాపా, దిండు పరుచుకుని పడుకున్నాడు.
    
    కళ్ళు మూసినా తెరిచినా లక్ష రూపాయలే కనపడుతున్నాయి.
    
    తన జేబులో చిల్లిగవ్వ లేదు. మిగిలిన ఎనిమిది వందల రూపాయలకు బట్టలు కొనుక్కున్నాడు. ఒప్పందం ప్రకారం తిండి పెడతారు తప్ప చిన్నస్వామి జీతం ఏమీ ఇవ్వడు. కాబట్టి మిగుల్చుకున్నది ఏమీ లేదు. తమ పూర్వాశ్రమంలో లాగా బంగారం వ్యాపారం చేసినా పది రోజులలో లక్షరూపాయలు రావు ఇప్పుడేమిటి చేయడం? తను ఈ పదిరోజులలో ఆ డబ్బు సంపాదించకపోతే పదకొండో రోజు తను వూరొదిలి పెట్టాలి. కానీ ఆమెను చూడకుండా ఏం బతకడం?
    
    పైన చూరులోంచి చందమామ వెన్నముద్దలా కనిపిస్తోంది. గాలి ఆ టెన్షన్ తగ్గించడానికా అన్నట్టు చల్లగా తగుల్తోంది. పేడ వాసనా, నైట్ క్వీన్ పరిమళం రెండూ కలిసి, బరువుగా అతని ముక్కుపుటాల వరకు పాకుతున్నాయి.    

    అతను పక్కకి తిరిగి పడుకున్నాడు.
    
    గోడ పక్కనున్న పశువుల దాణా మీద అతని చూపు పడింది. ఉలవలు, శనగపిండి, సజ్జలు మూటలుగా కట్టి అక్కడ స్టాక్ చేశారు. రోజూ వాటిని దించి ఆవులకు పెడతారు.
    
    ఆ బస్తాలను అలా చూస్తున్న అతనికి ఫ్లాష్ లాగా ఓ ఐడియా తట్టింది.
    
    అతను ఠక్కున లేచి కూర్చున్నాడు.
    
    తనను తనే అభినందించుకున్నాడు.
    
    నిజానికి అతనికి వచ్చిన ఐడియా చాలా చిన్నది. అది వర్క్ అవుట్ అవుతుందో కాదో కూడా తెలియదు. కానీ చుట్టూ గాడాంధకారం అలుముకున్నప్పుడు చిన్న వెలుగుకే మనం పొంగిపోయినట్టు అతను ఎగ్జయిట్ అవుతున్నాడు.
    
    ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు.
    
    స్ప్రింగ్ లా పైకి లేచి చిన్నస్వామి దగ్గరికి వెళ్ళాడు.
    
    ఆ సమయంలో ఆయన వీధి అరుగుమీద కూర్చుని నింపాదిగా చుట్టకాల్చుకుంటున్నాడు. వెళ్ళి పక్కన కూర్చున్నాడు.
    
    "ఏమిటోయ్ ఇలా వచ్చావ్?" ఆయన చుట్ట పొగతో మాట్లాడుతున్నట్టు అడిగాడు.
    
    "మీరు నాకో పెద్ద సాయం చేయాలి"
    
    "ఏమిటోయ్ అది?"
    
    "నాకు రేపు పదివేలుకావాలి"
    
    "రూపాయలే" అప్పటికి ఆయన దృష్టి మరల్చాడు.
    
    "ఆ"
    
    "నిద్రలో ఏమైనా కలగన్నావా? పదివేలు అడగడానికి నీకెలా నోరొచ్చింది! అది డబ్బనుకున్నావా? చిల్లపెంకులనుకున్నావా?"
    
    "అది కాదు- చాలా అర్జెంట్ పదకొండో రోజు మీ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను"
    
    "ఏదో పోనీలే పాపం కదా అని ఇంట్లో పెట్టుకుంటే పదివేలు అప్పడుగుతావా? ఇలా అయితే వెంటనే ఇంట్లోంచి జెండా ఎత్తేయాల్సి వస్తుంది జాగ్రత్త. ఇంకెప్పుడూ ఇలాంటి వూసులు ఎత్తుకు రాకు" కఠినంగా చెప్పాడాయన.
    
    ఇక అడగడం దండగ. ఎక్కడలేని నిస్సత్తువ శరీరాన్ని లాగుతుండగా బలవంతంగా పైకి లేచాడు.
    
    ఉన్న ఒకే ద్వారం మూసుకుపోయింది. పదివేలు పెట్టుబడి వుంటే లక్షరూపాయలు సంపాదించే మార్గం అదే. మరి పదివేలు ఎలా పుట్టించడం?
    
    అతను తిరిగి పశువుల పాకలో దూరాడు.
    
    టైమ్ గడుస్తున్నా నిద్ర రావడం లేదు. కన్రెప్పలను పైకెత్తి అతికించేసినట్టు కళ్ళు మూతఃలు పడడం లేదు.
    
    అంతలో ఏదో శబ్ధమైనట్టయింది.
    
    చప్పుడు వచ్చిన వైపుకి చూశాడు.
    
    ఎవరో తన దగ్గరకే వస్తున్నారు.
    
    "ఎవరూ?" మెల్లగా అడుగుతూ లేచి కూర్చున్నాడు.
    
    "నేను - సబితను" ఆమె అంతకంటే మెల్లగా చెప్పింది.
    
    పదివేలు ఈమెని అడిగితే అన్న ఆలోచన వచ్చింది అతనికి. కారణం అతను ఆ ధ్యాసలోనే వున్నాడు కాబట్టి.
    
    "ఏమిటి సబితా- ఇంత రాత్రిపూట"
    
    "నీతో పనుంది"
    
    అంత రాత్రిపూట వచ్చిందంటే ఏదో అత్యవసరం అయిన పనే అయి వుంటుంది. పగలు వీలవుతుందో కాదో- తనూ ఇప్పుడే అడిగెయ్యాలి.
    
    "నాకూ నీతో పనుంది సబితా"
    
    "ఏమిటో చెప్పు?"
    
    "లేడీస్ ఫస్ట్ అన్నది పగటికే పరిమితం రాత్రయితే జంట్స్ ఫస్ట్. కాబట్టి ముందు నువ్వే చెప్పు.
    
    "ఓ పదివేలు కావాలి. పదకొండో రోజు ఇచ్చేస్తాను"
    
    "పదివేలే" ఆమె అచ్చం తన తండ్రిలాగే ఆశ్చర్యపోయింది.
    
    "ఆ"
    
    "డబ్బుగా లేదు నా వడ్డాణం వుంది. ఎవరికీ తెలియకుండా ఇస్తాను కుదవ పెట్టుకో. పదకొండో రోజుకి తిరిగి రిలీజ్ చేసి ఇచ్చెయ్"
    
    అతనికి తన అత్తమ్మ గుర్తొచ్చింది. ఎక్కడైనా స్త్రీ ఒక్కటే ఆత్మీయులు అన్నవారిని ఆదుకోవడం కోసం తను ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్దపడిపోతుంది.
    
    అతనికి చప్పున కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    
    "రేపు మధ్యాహ్నం భోజనం తీసుకొస్తా కదా అప్పుడిస్తాను సరేనా?"
    
    "అలానే- ఇంతకీ నువ్వు ఏం పనిమీద వచ్చావ్?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS