తను శబ్దం కాకుండా అడిలోకి వెళ్ళి వెనక నుంచి కళ్ళు మూస్తే థ్రిల్లింగ్ గా వుంటుంది. కాని కళ్ళు మూయాలంటే సుజన తప్పకుండా బోర్లా పడుకుని వుండాలి. ఆడపిల్లలు ఎలా బోర్లా పడుకుంటారో అతనికి అర్ధం కాలేదు. మగాళ్ళ ముందు భాగమంతా ఫ్లాట్ గా వుంటుంది గనుక బోర్లా పడుకోవడానికి ఇబ్బంది వుండదు. కానీ ఆడపిల్లకు అలాకాదుగా ఎత్తులు, పల్లాలు వుంటాయి గనుక అలా పడుకోవడానికి సాధ్యపడదని అనిపించి కళ్ళు మూసే ప్రతిపాదన విరమించుకున్నాడు.
టైమ్ పదవుతుండగా అక్కడి నుంచి కదిలాడు. వెన్నెల వీధుల్లో కాలవలు కట్టి పారుతున్నట్లుంది.
ఓ ఇంటి వసారా నున్న కుక్క అతన్ని చూసి మొరగబోయి, అంతలో తమాయించుకు తిరిగి పడుకుండి పోయింది. ఇదంతా గమనించిన అతను కుక్కకు మనసులోనే థాంక్స్ చెప్పాడు.
సుజన ఇల్లు సమీపిస్తుంటే గుండె వేగం హెచ్చింది. ఏదో తెలియని జలదరింపు ఒంట్లో పాకింది. కాళ్ళు తడబడుతున్నాయి.
ఇంటిపక్కనుంచి వెళ్లి దొడ్లోకి చేరుకున్నాడు. వెన్నెల పడినంత వరకూ తెల్లగా వుండి, వరండా మాత్రం చీకటిగా వుంది.
తలుపును మెల్లగా నెట్టాడు.
కిర్రుమంటూ తెరుచుకుంది. ఒక్కసారిగా ఆనందం గుండెలోంచి చిమ్మింది. తను చెప్పినట్లు సుజన తలుపు తెరిచి వుంచడం సగం గెలుపులా ఫీలయ్యాడు.
లోపలికి అడుగుపెట్టాడు. హాల్లో ఎవరో పడుకుని వున్నట్లనిపించగానే మరింత మెల్లగా అడుగులు వేయడం ప్రారంభించాడు.
హాల్లోంచి ముందు గదిలోకి వచ్చి అక్కడి నుండి డాబా మీదకు వున్న మెట్లెక్కడం ప్ర్రారంభించాడు.
నాలుగయిదు మెట్లెక్కాడో లేదో పైన మొదట్లో ఎవరో కూర్చున్నట్లనిపించింది కళ్ళు చిలుకరించి చూశాడు.
గోడనీడ పడడం వల్ల ఎవరో సరిగా తెలియడంలేదు మరో రెండు మెట్లెక్కాడు.
సుజనే తన కోసం వెయిట్ చేస్తూ తనను ఆట పట్టించడానికి మౌనంగా వుందనుకుని "హాయ్" అంటూ పలకరించాడు.
"ఎవరదీ?" ఆ ఆకారం నోరు విప్పింది.
అతను షాక్ తిన్నట్లు అలా ఆగిపోయాడు ఆమె సుజన బామ్మ.
ఒక్కసారిగా మెట్ల నుంచి దూకి పారిపోవాలనిపించింది అతనికి కానీ శరీరం తన స్పృహ లేనట్లు మొద్దుబారిపోయింది.
"నేను... వం....శీ...ని....." కాసేపు తమాయించుకున్నాక చెప్పాడు.
"నువ్వా! ఈ వేళప్పుడు ఇలా వచ్చావేమిటి?" అనుమానంగా అడిగింది.
"అదీ... అదీ... అమ్మ తలనొప్పి మందు పట్రామంటే ఇలా వచ్చాను. కింద అందరూ నిద్రపోతుంటే సుజన పైనుంటుంది కదా మందు అడుగుదామని వచ్చాను" ఫరవాలేదు..... నమ్మే అబద్దమే చెప్పాననుకుంటూ మరో రెండు మెట్లెక్కాడు.
"తలనొప్పి మందుకేనా! ఇంకా మా మనవరాలి కోసం వచ్చావేమో ననుకున్నాను. కాదన్న మాట. కానీ ఈ కాలం పిల్లలు ఎందుకూ పనికిరారని నువ్వూ నిరూపించావ్. శోభనం నెలరోజుల తరువాత అంటే ఎలా ఒప్పుకున్నావ్ నువ్వు? అదంతా నాకు తెలియద్బు. శోభనం జరిగితీరాల్సిందేనని మీ మామయ్యతో ఖచ్చితంగా చెప్పి వుండాల్సింది. ఇలాంటి సమస్య మాకూ ఎదురయింది కాని సుజన తాతయ్య ముహూర్తం వచ్చేవరకు ఆగలేదే. మరేం చేశాడని అడగవేం? అదంతా పెద్ద కథ రా! ఇలా వచ్చి కూర్చో" అంటూ ఆహ్వానించింది.
ఇదెక్కడి ఖర్మరా బాబూ! తన ఫస్ట్ నైట్ జరక్కపోగా, ముసలామె చెప్పే ఫస్ట్ నైట్ గురించి వినాల్సి రావడమ కన్నా నరకం మరోకటి వుండదనుకుంటూ ఇక తప్పదని మెట్లన్నీ ఎక్కి ఆమెకు కాస్త దూరంలో కూర్చున్నాడు.
వంశీ వచ్చాక టైమ్ ఎందుకు వేస్ట్ అని సుజన అన్ని తలుపులు కిటికీలు మూసివేయడం వల్ల వాళ్ళ మాటలు ఆమెకు వినిపించకుండా ఫ్యాన్ సౌండ్ బయటి శబ్దాలను లోపలికి రానివ్వడం లేదు.
వంశీ బుద్దిగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాక సుజన బామ్మ చెప్పడం ప్ర్రారంభించింది.
"నాకూ, సుజన తాతయ్య వీరభద్రరావుకీ పెళ్ళయింది. పెళ్ళి పీటలమీద ఆయన్ను చూసి జడుసుకున్నాను చెయ్యెత్తు మనిషి - గుబురు మీసాలు తలపాగా చుట్టుకుని కూర్చున్న ఆయన్ని కళ్ళు పైకెత్తి చూడాల్సి వచ్చింది.
ఆయన సంస్కృతాంద్ర భాషల్లో పండితుడు. హైస్కూల్లో టీచరు ఉద్యోగం.
మా కాలంలో పెళ్ళంటే మూడురోజుల ముచ్చట. పెళ్ళి ఇంకా పదిరోజులు వుందనగా బంధువులు రావడం ప్రారంభించే వారు. పెళ్ళయ్యాక కూడా మరో వారమో, పదిరోజులో వుండేవారు.
పెళ్ళి తంతంతా ఇప్పుడు గంటలో ముగించేస్తున్నారు. మా కాలంలో అలా కాదు. అన్నీ పద్దతి ప్రకారం జరిగేవి. ముందురోజు నుంచీ హడావుడి ప్రారంభమయ్యేది. ఊరులోని దేవుళ్ళకంతా మొక్కేవాళ్ళం.
ఇక అప్పుడు ఒంటిపూట భోజనమే. పెళ్ళి జరిగే మూడు రోజులూ నియమ నిష్ఠలతో వుండేవాళ్ళం. కళ్ళు మండిపోతున్నా, కాళ్ళు పీకుతున్నా అన్నీ పద్దతి ప్రకారం జరిపేవారు.
వివాహం అయిపోయింది.
ఆ రాత్రి శోభనమని అమ్మలక్కలు అనుకుంటూ వుండగా విన్నాను.
ఏదో తెలియని గుబులు గుండెల్లో బయల్దేరింది. ఆరోజు పగలు ఎలా రాత్రిలోకి మారిందో నాకు గుర్తులేదు.
రాత్రి ఏడుగంటల నుంచే ఆ కార్యక్రమం మొదలయింది. పురోహితుడు గర్భాధానం మంత్రాలు చదువుతున్నాడు. నేను ముత్తయిదువుల మధ్య కూర్చుని వున్నాను. తొమ్మిదిగంటలకి పురోహితుడు మంత్రాలు చదవడం ముగించాడు. నాకు తెల్లచీర కట్టారు. పూలజడ కుట్టారు.
నన్ను గదిలోకి తోసేందుకు సిద్దపడుతుండగా మానాన్న మా మేనత్తని పక్కకి పిలిచి ఏదో చెప్పాడు.
ఆమె మా దగ్గరికి వచ్చి "ఈరోజు శోభనం లేదట పెళ్ళి కొడుక్కి జ్వరం తగిలిందట" అని చెప్పింది.
ఆయనకు జ్వరం అనగానే కంగారుపడిపోయాను. పెళ్ళి జరిగి నిండా పదిగంటలు కాకపోయినా అప్పటికి ఆయన నావాడన్న భావన నాటుకుపోయింది. ఆ రాత్రంతా ఆయన ఆరోగ్యం భాగవ్వాలని దేవుళ్ళందరినీ పేరు పేరునా పిలిచి ప్రార్దించాను.
మరో మూడురోజులు గడిచాయి.
కానీ ఆయనకు జ్వరం తగ్గలేదు. మరుసటి రోజే ఆదినెల ప్రవేశిస్తోంది. ఆది నెలలో భార్యాభర్తలిద్దరూ ఒకచోట వుండకూడదు.
