"అరెస్టు అంటే చేతికి సంకెళ్ళు వేస్తారే, మరి నాకు వెయ్యలేదేం?"
"అన్ని అరెస్టులకీ వెయ్యరు. నేరస్తుడు పారిపోతాడని భయం వుంటే వేస్తారు."
"అంటే మేం చూసే సినిమాలన్నీ తప్పంటావా?"
అతడు విసుక్కుంటున్నట్టు "నేన్నిన్ను ఇక్కడకు తీసుకొచ్చింది- నేనడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పడానికి అంతేగానీ, నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడానికి కాదు" అన్నాడు.
"నాకు అన్నీ రివర్స్ లు ఇష్టం" కాలుమీద కాలు వేసుకుంటూ చెప్పింది.
"నువ్వు ఒక హత్యకేసులో సాక్ష్యం చెప్పావు గుర్తుందా?"
"అవును అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నేను కోర్టుకి వెళ్ళడం."
"గుడి గార్డుల హత్య విషయంలో?"
"అవును. గుర్తుంది."
"ఆ రోజు ఏం జరిగింది?"
"రామస్వామి అనే దొంగ, హత్యచేసి నా కారు క్రింద వచ్చి పడ్డాడు."
"ఆ టైమ్ లో నువ్వు అక్కడ ఎందుకున్నావు?"
"కాలేజీ చదువు పూర్తయింది. సామానంతా సర్దుకుని ఈ వూరొస్తున్నాను. బాగా వర్షంగా వుంది. రోడ్డుకడ్డంగా వచ్చి కారును ఢికొన్నాడు. నేను సడన్ బ్రేక్ వేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అక్కడే హరీ అనేవాడు."
"అతడే హంతకుడు అని ఎలా చెప్పగలవు?"
"కోర్టు శిక్ష వేసిందిగా-"
"అతడు హంతకుడు అని కోర్టు శిక్ష వేసింది. అంతేకానీ నువ్వన్నట్టు కోర్టు శిక్ష వేసింది కాబట్టి అతడు హంతకుడు అవలేదు."
"ఏమో బాబూ- ఆ లాజిక్ లన్నీ నాకు తెలీదు."
"నువ్వు కార్లో వూరివైపు వస్తూంటే రామస్వామి కారు క్రింద పడ్డాడన్నావు. అంటే అతడు రోడ్ క్రాస్ చేస్తూ పడ్డాడా?"
"అవును."
"నీ కారు లైట్లు అతను చూడటం కానీ, అతనిని నువ్వు చూడటం కానీ జరగలేదా?"
"అకస్మాత్తుగా రోడ్డుమీదికి వచ్చేశాడు. వచ్చేశాడు. పక్క తోపుల్లోంచి రావటంతో నేనా చీకట్లో చూసుకోలేదు."
"కుడివైపు నుంచి వచ్చాడా? ఎడమవైపు నుంచి వచ్చాడా?"
ఆమె ఒక క్షణం ఆలోచించి, "కారుకి కుడివైపు నుంచి వచ్చాడు. ఎడమవైపు తోపుల్లోకి పరుగెత్తాలని అతడి ప్రయత్నం. అందుకే నేను బ్రేక్ వేసినా లాభం లేకపోయింది."
"అంత చీకట్లో అర్దరాత్రి..... ఒకపక్క తోపుల్లోంచి, మరో పక్క తోపుల్లోకి, పరుగెత్తవలసిన అవసరం మనిషికి ఎందుకు వుంటుంది?"
"బహుశ హత్యచేసిన కంగారులో పరుగెత్తి వుంటాడు."
"అక్కడ నుంచి గుడి ఎంతదూరం?"
"కిలోమీటరు పైగా వుంటుంది."
"ఎంత హత్యచేసినా..... హత్య చేయడం అతడికి మొదటిసారే అయినా, ఏ హంతకుడూ కిలోమీటరు దూరం తోపుల్లో పరుగెత్తడు. రోడ్డుకడ్డంగా అసలు రాడు- అందులోనూ రోడ్డుమీద లైట్లకాంతితో కారు వస్తూ వుండగా."
"నేనంత దూరం ఆలోచించలేదు."
"అందులో తప్పులేదు. ఆక్సిడెంట్ జరగ్గానే సాధారణంగా ఇంకేమీ ఆలోచించలేం మనం."
"థాంక్స్ కరెక్ట్ గా వూహించావు. గాడ్..... ఇక్కడ ఎ.సి. లేదా వేడెక్కి పోతోంది."
అతడామె మాటలు పట్టించుకోలేదు. "రాత్రికి రాత్రే నువ్వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చావా?"
"స్వయంగా వెళ్ళలేదు, ఫోన్ చేసి చెప్పాను."
"ఆక్సిడెంట్ జరగ్గానే సాధారణంగా దాన్ని ఎంత తొందరగా మర్చిపోదామా అని ఆలోచిస్తారే తప్ప పోలీసులకి ఫోన్ చెయ్యరే."
ఆ పోలీస్ స్టేషన్ లో ఒక్కసారిగా నిశ్శబ్దం వ్యాపించింది.
యస్సై కర్రా, మిగతా కానిస్టేబుల్స్ అంతా ప్రేక్షకుల్లా చూస్తున్నారు. కారు స్పీడుగా నడిపిన నేరానికి తీసుకొచ్చి, ఇంకో కేసులో ప్రశ్నలడుగుతూ - ఈ పాయింటు దగ్గరికి లాక్కొచ్చిన రాణా వాళ్ళకి అర్ధంకాని వ్యక్తిగా మిగిలిపోతున్నాడు.
"చెప్పు మిస్ త్రిపురా- నా ప్రశ్నలో తప్పేమైనా వుందా? ఆక్సిడెంట్ లో ఎవరూ మరణించలేదు. గాయాలుకూడా తగల్లేదు. అయినా నువ్వెందుకు పనిగట్టుకు ఫోన్ చేశావ్?"
"నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ లో ఎవరో- ఈ విషయం ఎక్కడా చెప్పొద్దన్నారు. నా కసలే తలతిక్క అందుకే వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పాను."
యస్సై కర్రా ఉత్సుకతతో చూస్తున్నాడు.
"ఈ ఫోన్ సంగతి కోర్టులో చెప్పావా?"
"చెప్పలేదు."
"ఎందుకు చెప్పలేదు?"
"ఎవరూ అడగలేదు" సింపుల్ గా చెప్పింది.
రాణా కర్రా వైపు చూశాడు. కర్రా మొహం అయోమయంగా, బ్లాంక్ గా వుంది.
"ఫోన్ లో నిన్నేమని హెచ్చరించాడు?"
"....మర్డర్ చేసి నేను పారిపోతూ నీ కారుకి అడ్డొచ్చిన విషయం ఎక్కడ చెప్పినా ప్రాణాలు దక్కవన్నాడు."
"నువ్వేమన్నావ్?"
"....'ఆ విషయం అక్కడే మర్చిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్పొద్దన్నావ్ కాబట్టి తప్పక పోలీసులకి చెపుతాను'- అన్నాను."
"నీ కారుక్రింద పడ్డ వ్యక్తి అప్పుడే మర్డర్ చేసి పారిపోతూ వున్నాడన్న సంగతి నీ కెప్పుడు తెలిసింది?"
"అతనే ఫోన్ లో చెప్పాడుగా."
"ఎవడయినా తనకు థానే- 'నేనే హంతకుడిని- నీ కారు క్రింద పడ్డాను. ఈ విషయం ఎక్కడా చెప్పకు అని అంటాడా?"
"ఏమో - ఈ విషయాలన్నీ నేను ఆలోచించలేదు. కోర్టులో నన్నెవరూ అడగలేదు."
రాణా మొహంలోకి ఒక్కసారిగా రక్తం తన్నుకు వచ్చింది. విసురుగా కుర్చీ వెనక్కి తోసి లేచి నిలబడ్డాడు. "అడగరు. ఎందుకడుగుతారు? ముద్దాయి రామస్వామి తన తరఫున లాయర్ని పెట్టుకోలేనంత బీదవాడు. కోర్టు నియమించిన డిఫెన్స్ లాయర్, ఎమ్మెల్యే నాయుడి బావమరిది. ఇంకెవరు అడుగుతారు?" అని అరిచాడు. ఎవరూ మాట్లాడలేదు.
అతడు తనలో తనే అనుకుంటున్నట్టు అన్నాడు. "ఎంత సింపుల్ గా జరిగిపోతాయి విషయాలు. ఒక మర్డర్ జరిగింది. దానికి కొంతదూరంలో ఒకరు కారుక్రింద పడ్డారు. అతడు ఒకప్పుడు దొంగ అంతే.... రెండూ రెండూ కలిపితే నాలుగు. అతడు గుళ్ళో దొంగతనానికి ప్రయత్నించి, అడ్డొచ్చిన గార్డుని చంపి పారిపోతూ ఒక ప్రత్యక్ష సాక్షి కారు క్రింద పడ్డాడు. కాబట్టి అతడే హంతకుడు! కాదని వాదించడానికి డిఫెన్సు లాయరు లేడు. ప్రత్యక్షసాక్షిని ప్రశ్నించిన వాడు లేడు. ముద్దాయి ఏడుపు విన్నవాడు లేడు. హా పరమాత్మా..... రక్షించు నా పోలీస్ స్టేషన్ ని...."
ఆ గదిలో శ్మశాన నిశ్శబ్దం, నిశ్శబ్దపు వైరాగ్యం దన్ని చెదురుస్తూ కర్రా "సారీ! నేను కేసు సరీగ్గా ఇన్వెస్టిగేట్ చెయ్యలేదు. బెనిఫిట్ ఆఫ్ డవుట్ కూడా లేదు" అన్నాడు.
రాణా పేలవంగా నవ్వేడు. "సా.....రీ.....రెండక్షరాలు ప్రాణం..... అదీ రెండక్షరాలే."
అంతలో బయట కార్లు ఆగిన చప్పుడైంది. వరుసగా మూడుకార్లు వచ్చాయి. మొదటి కార్లోంచి ముగ్గురు వ్యక్తులు, మధ్యకారులోంచి ఒక వ్యక్తి దిగాడు. నియోరిచ్ కి ప్రతీకగా వున్నాడు. జోధ్ పూర్ కోటు, తెల్లఫాంటు, నిగనిగలాడే బూతు, పైకి దువ్విన జుట్టు, బంగారు రంగు కళ్ళజోడు అతడే పులిరాజు.
అతడు ముందు నడుస్తూ వుండగా, మిగిలిన ముగ్గురూ వెనుకగా వచ్చారు.
"హాయ్ డాడ్" అంది కంటి కుర్చీలోంచి లేస్తూ పులిరాజు కూతురివైపు చూడలేదు. రాణావైపు తీక్షణంగా చూస్తూ, "ఎంత ధైర్యం నీకు నా కూతురిని పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తావా" అన్నాడు.
మామూలుగా అయితే వదిలేసే వాడేగానీ, అవతలవ్యక్తి గీరగా మాట్లాడుతుంటే వళ్ళు మండింది రాణాకి.
"మీ అమ్మాయి ఒక కానిస్టేబుల్ చెంపమీద కొట్టింది" అన్నాడు.
రాజు దాన్ని వినిపించుకోలేదు. బ్లాంక్ గా రాణావైపు చూసి, "నీకు నిముషం టైమ్ ఇస్తున్నాను. మా అమ్మాయి చేతులు పట్టుకుని క్షమాపణ వేడుకో" అన్నాడు. "....లేకపోతే నిన్నిక్కడే సస్పెండ్ చేయిస్తాను."
బైట జీప్ ఆగిన శబ్దం వినిపించింది. డియస్పీ వగరుస్తూ వచ్చాడు.
"తెచ్చావా?" అన్నాడు రాజు డియస్పీ భయపడుతూ నమ్రతగా "తెచ్చాను సార్" అంటూ కాగితం, ఫైలులోంచి తీసి అందించాడు.
రాజు కాగితం అందుకుని, రాణావైపు తిరిగి, "ఏమిటి అలా చూస్తున్నావు? నీ సస్పెన్షన్ ఆర్డర్" అన్నాడు.
డబ్బుతో మదమెక్కి పదవితో పొగరెక్కిన ఆ ప్రజానాయకుని వైపు రాణా నిర్లిప్తంగా చూశాడు. తన కూతుర్ని ఒక ఇన్ స్పెక్టర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాడని తెలియగానే, పై అధికారికి ఫోన్ చేసి క్షణాల్లో తన సస్పెన్షన్ ఆర్డర్ తయారు చేయించగల్గిన ఆ రాజకీయ నాయకుడివైపు భయంగా చూడాలో, గౌరవంగా చూడాలో, అసహ్యంగా చూడాలో తెలియని స్థితి. "మీ అమ్మాయి ఆక్సిడెంట్ చేసి, పైగా ఒక పోలీస్ ని కొట్టింది సార్. ముగ్గురం సాక్ష్యం వున్నాం దానికి?" అన్నాడు.
"ఎవరా ముగ్గురు?"
"నేనూ, అలక్ నంద, కానిస్టేబుల్."
"కొట్టలేదని మా అమ్మాయి అంటే?"
"అయినా కూడా 1:3 యే కదా!"
"ఓహో నిష్పత్తులు మాట్లాడుతున్నావా?" అని కానిస్టేబుల్ వైపు తిరిగి-
"ఏరా! మా అమ్మాయి నిన్ను కొట్టిందా" అన్నాడు.
అతడు తడబడుతూ "కా.... లేద్సార్" అన్నాడు.
"సో..... 2:2 నిష్పత్తి సరిపోయింది. కేసు లేదు. ఇప్పుడు చెప్పు, క్షమాపన చెప్పుకుంటావా? ఉద్యోగం వదిలిపెట్టి పోతావా?"
రాణా షాక్ నించి ఇంకా తేరుకోలేదు.
"మహిళా పోలీసు పక్కన లేకుండా ఒక ఆడపిల్లని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినందుకు నిన్ను సస్పెండ్ చేస్తున్నారు" అని డియస్పీవైపు తిరిగి, "అంతేకదా డియస్పీ" అన్నాడు.
డియస్పీ గుటకమింగి, 'అంతే' అన్నట్టు తలూపాడు.
"ఇంకా పది సెకన్ లు టైముంది."
ఆ గదిలో సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం. త్రిపుర కూడా తన అల్లరి మర్చిపోయి చూస్తోంది.
"ఇంకా అయిదు సెకన్లు."
రాణా చిన్నగా దగ్గి, "ఒక ఆడపిల్లకి క్షమాపన చెప్పుకోలేను సార్! మీరు వప్పుకుంటే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటాను" అన్నాడు.
"కుదర్దు."
"ఇంతమందిలో కాకుండా, పక్కగా అటొస్తే మీ చేతులు కాదు - కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుంటాను."
