"ఆ సత్యనారాయణ్ నీకు బాగా తెలుసా!" అంది.
"ఏ మనిషీ ఏ మనిషికీ పూర్తిగా తెలియదు. ఒకే మనిషిని ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క యాంగిల్ నుంచి చూస్తాం. నేను చూసిన యాంగిల్ లో సత్యనారాయణ్ గట్టివాడు. కానీ చెడ్డవాడు కాదు. అయితే సత్యనారాయణ్ ఉత్తలుచ్చా అనుకునేవాళ్ళు కూడా నాకు తెలుసు. "కాసేపు ఆలోచిస్తూ వుండిపోయింది సౌదామిని. "పోన్లెండి ఇదంతా మన అనుమానమేగా! నిజంగా అతనికి అలాంటి ఉద్దేశ్యం లేదేమో! లెటజ్ హోప్ ఫర్ ద బెస్ట్."
సత్యనారాయణ లాంటి వాడిమీద ఆశ పెట్టుకోవడం అడియాశే అని మర్నాడు సాయంత్రానికి తేలిపోయింది. జరగబోయే దానికి మానసికంగా సిద్దపడే బార్ కి వెళ్ళాడు బాలూ గిటార్ తో సహా డైస్ దగ్గరికి నడవబోయాడు. అప్పటికే సీట్లన్నీ నిండిపోయి వున్నాయి కస్టమర్స్ తో.
బలంగా వున్న చేతిని దూలంలా ముందుకి చాపి అతన్ని అడ్డగించాడు సత్యనారాయణ్.
"ఇయ్యాల్టినుంచీ ఆరేళ్ళదంక యింక గిటార్ తాకొద్దుతమ్మీ! కావాలంటే రోజూ వచ్చి ఒక బాటిల్ రమ్ము తాగు. గుర్రం లెక్క ఫ్రీగా పోస్త!"
పళ్ళు గిట్టకరిచి పట్టుకున్నాడు బాలూ. వీలయితే తాగుడు కూడా అలవాటు చేద్దామని చూస్తున్నారు తనకి.
అంత కోపంలోనూ, అతనికి సౌదామిని గుర్తుకొచ్చింది. పరిస్థితిని అంత ముందుగానే, అంత కరెక్టుగా ఊహించి చెప్పిన ఆమె మాటలు గుర్తొచ్చాయి.
"సౌదామినీ యూ ఆర్ గ్రేట్" అనుకున్నాడు చిత్రంగా అతనికి భయం పోయింది. సౌదామిని పక్కన ఉంటే ఏమైనా చేసెయ్యగలనన్న ధైర్యం తిరిగి వచ్చింది.
"సత్యనారాయణ్ నువ్వలా బాలానందం నాటకాల లెవెలుకి దిగజారిపోతా వనుకోలేదు" అన్నాడు పెద్దగా నవ్వుతూ అతని మనసు మాత్రం 'ఎత్తుకి పై ఎత్తు' ఏమిటా అని తీవ్రంగా ఆలోచిస్తోంది.
"ట్రాప్ అయిపోయినవ్ తమ్మీ! ఇక చప్పుడు చెయ్యకు" అన్నాడు సత్యనారాయణ్.
బోర్ గా చూశాడు బాలూ. "నేను కోర్టు కెళితే నీ కాంట్రాక్టుకి అది ప్రింటు చేసిన కాయితమ్ముక్క అంత విలువ కూడా వుండదు."
"కోర్టు కెట్లెక్కుతవే! కోర్టు కెళ్ళాలంటే బాంబే ఎల్లాల నువ్వు."
"ఒక ఫైవ్ స్టార్ హోటల్లో గిటార్ వాయించడానికి బాంబేనే వెళుతున్నాను. ఏ హోటల్ లో నేను ఇదంతా ఎలా మేనేజ్ చేశానో తెలుసుకోవడం మీకంత కష్టం కాదు. ప్రయత్నించండి" అని సరదాగా ఫ్రెండ్సు ఒకరికొకరు కొట్టుకుంటూ, గుద్దుకుంటూ పరాచిక మాడుకున్నట్లు సత్యనారాయణ్ కడుపువైపు పిడికిలి జాపాడు బాలూ.
ఉలిక్కిపడ్డాడు సత్యనారాయణ్. అప్రయత్నంగానే అతని బొజ్జ లోపలి ముడుచుకుపోయింది. అతను కొరకొరా చూశాడు.
బార్ లలో, నైట్ క్లబ్బులలో, అల్లరి చేసే కస్టమర్లని బయటకు గెంటేసే వస్తాదులుంటారు.
ఇద్దరు వస్తాదులు వచ్చి రెడీగా నిలబడ్డారు.
"టేకిట్ ఈజీ! టేకిట్ ఈజీ" అని రెండు చేతులూ పైకి ఎత్తాడు బాలూ అనుమానంగా చూస్తుండిపోయారు.
రెండు చేతులూ అలా వుంచి సన్నగా విజిలేస్తూ బయటికి వెళ్ళిపోయాడు.
బయటికి రాగానే రెండు చేతులూ ఫ్యాంటు జేబులో పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు.
సో! సౌదామిని ఊహించింది కరక్టే అయింది. ఉచ్చులో ఇరుక్కున్నారు. తను ఎలాగూ బాంబే వెళ్ళలేడు. వెళ్ళినా కోర్టుకి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చెయ్యలేడు.
సినిమాల్లోలా, ఏదో క్లబ్బుఫైట్ లోనో, స్ట్రీట్ ఫైట్ లోనో విలనాసురుల నందరినీ చితకబాధి జయించేసినట్లు ఊహించుకోవడం థ్రిల్లింగ్ గానే ఉంటుందిగానీ, అల నిజంగా జరుగుతుందని నమ్మెయ్యడం కంటే పెద్ద జోకు వేరే వుండదు.
కాని వాళ్ళని తికమక పెట్టటానికి కాస్త ఉప్పు అందించి వచ్చాడు తను అది కేవలం 'బ్లఫ్' అని వాళ్ళు గ్రహించడానికి ఎంతో సమయం పట్టదు.
ఈలోగా వాళ్ళ మెదడుని తినేస్తాయి తన మాటలు.
అది చాలు ప్రస్తుతానికి.
"యూ ఆర్ వెరీ కరెక్ట్ డార్లింగ్" అన్నాడు ఇంటికి రాగానే.
"అయామ్ వెరీ సారీ!" అంది సౌదామిని సానుభూతిగా చూస్తూ.
"రెండుసార్లు మనచేత సారీ ఫేస్ పెట్టించారు వాళ్ళు. ఈసారి వాళ్ళ మొహం మాడిపోయేటట్లు చేయాలి మనం."
"అలా ఉండాలి!" అంది చిరునవ్వుతో.
"రాత్రికి టీ పెట్టుకుని తాగి మరీ మేలుకుని అమోఘమైన ప్లాను వేద్దాం" అన్నాడు ఉత్సాహంగా.
6
రాత్రికి నిజంగానే టీ పెట్టుకుని - కిటికీ దగ్గర కూర్చుని, పక్కింటి డాబామీద వున్న ఓవర్ హెడ్ టాంక్ మీద కూర్చుని వున్నట్లు కనపడుతున్న చంద్రుణ్ణి చూస్తూ ఆలోచనలు మొదలు పెట్టారు.
"ఇది మనం తాగుతున్న చివరికప్పు టీ, మళ్ళీ మనం ఈ ఊబిలో నుండి బయటపడి, గట్టి నేలమీద రెండు కాళ్ళమీదా నిలబడేవరకూ కాఫీ, టీలూ, టిఫిన్లూ బంద్."
పంచదార లేని కాఫీ తాగుతున్నట్లు మొహం చేదుగా పెట్టాడు బాలూ.
"కాఫీ, టీలు మానేసే బదులు మనమే ఒక బండిమీద మొబైల్ కాఫీ షాపుపెట్టి జనతా కాఫీతో జనానికి సేవచేస్తూ మధ్యమధ్యలో మనమూ ఒక గుక్కో, చుక్కో తాగుతూ తరించవచ్చుగా" అన్నాడు తమాషాగా.
కానీ ఆ అమాయి ఏ విషయాన్నీ తమాషాగా తీసుకునే మనిషికాదు. పెదిమలు కొద్దిగా బిగించి అతని ప్రతిపాదనని ఆలోచించి చూసి "తప్పులేదు. జయప్రకాష్ నారాయణ్ చదువుకునే రోజుల్లో కాఫీ కప్పులు కడిగి డబ్బులు సంపాదించుకునేవారట. కానీ తప్పనిసరి అయితేనే ఆ పని చెయ్యాలి మనం. ఈలోగా మీరు గిటార్ వాయించటం తప్ప మరేం చేయలేరా?" అనడిగింది.
"అత్యవసర పరిస్థితుల్లో డ్రమ్ వాయించగలనూ, సింథిసైజర్ ప్లే చేయగలను. మరీ ప్రాణాలమీదకు వచ్చినప్పుడు మాండొలిన్." నవ్వింది సౌదామిని.
"మ్యూజిక్ సంగతి సరే. అదికాకుండా మరేదన్నా!"
నవ్వాడు బాలూ. "కూలిపని చెయ్యగలనేమో! ప్రయత్నిస్తే రిక్షా తొక్కచ్చు" వాక్యం సగంలో అతని గొంతు సీరియస్ గా అయిపోయింది. "మ్యూజిక్ తప్ప నాకు యింకేమీ రాదు సౌదామినీ! ఇంటరెస్టు లేదు నేర్చుకోలేదు. అవును. నా గ్రాడ్యుయేషన్ కి ఉద్యోగం దొరక్కపోదేమో! కానీ డెస్కు వర్కూ, పేపర్ వర్కూ అంటే నాకు విసుగు. అలర్జీ... లెక్కలూ, కూడికలూ, రూల్సూ, రెడ్ టేపూ, ఇవన్నీ నాకు అసహ్యం. అలాగని ప్రతివాడూ ఆర్టిస్టుగానే పుట్టాలనీ, డెస్క్ వర్క్ చేసే వాళ్ళందరూ "వాజమ్మలనీ" నా ఉద్దేశ్యం కాదు. అందరూ పల్లకీ లెక్కితే మోసేవాళ్ళెవరుంటారు సౌదామినీ! ఎవరికి చేతనయిన పని, ఎవరికీ అభిరుచి వున్న పని వాళ్ళు చేయాలి. కానీ నీ కోసం ఏదైనా చేస్తాను. మన పాత కథల్లో బీదహీరోలు కొట్లో పద్దులురాసే ఉద్యోగాలు చేస్తూంటారే అవి కూడా చేస్తాను నీకోసం...."
"అయితే నేను ఊరికే కూర్చుని ఉండాలని మీ ఉద్దేశ్యం. నేనూ ఎక్కడో ఒకచోట వర్క్ చేయగలను. సందర్భం రాక మీతో చెప్పలేదు. నేను పి.యం.బి. ఎక్స్ ఆపరేషన్ లో ట్రైనింగ్ అయ్యాను."
"అంటే టెలిఫోన్ ఆపరేటర్ గానా?"
"ప్రైవేట్ టెలిఫోన్ ఆపరేటర్ గా".
"ఎందుకు? వీణ నీ ఇంటరెస్ట్ కాదా?"
"అది అభిరుచి ఇది అవసరం. అన్నిటికీ సిద్దంగా ఉండాలి లైఫ్ లో."
ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు ఆశ్చర్యంగా ఆమెని చూస్తూ ఉండిపోయాడు బాలూ.
"రేపటినుండీ ట్రయల్స్ మొదలుపెడదాం" అన్నాడు బాలు. నవ్వింది సౌదామిని.
ఆలోచ్సితూ కాసేపు అటు యిటూ పచార్లు చేశాడు. ఉన్నట్లుండి ఏదో గుర్తుకు వచ్చినట్లు క్రిందికి ఆమె దగ్గరికి వెళ్ళాడు.
ఏమిటన్నట్లు చూసింది.
"నాకు ఉద్యోగం పోయినట్లు ఎవరికి తెలిసినా ఫర్వాలేదు కానీ పక్కపోర్షను వాళ్ళకి మాత్రం తెలియకూడదు. తెలిస్తే యిక్కడ వుండనివ్వరేమో మనల్ని."
తల ఊపింది ఆమె.
ఎటు చూసినా నీళ్ళే కాని తాగటానికి ఒక్క చుక్కలేవు అనుకున్నాడట - సముద్రంలో పయనిస్తున్న నావికుడెవరో.
ఉద్యోగాల విషయం కూడా అంతే. ఎక్కడ చూసినా, ఎటుచూసినా ఉద్యోగాలూ ఖాళీలూ వున్నట్లే వుంటాయి. చేరదల్చుకుంటే అంత త్వరగా అవకాశాలు రావు. ముఖ్యంగా నాన్ టెక్నికల్ ఉద్యోగాల విషయంలో ఇది మరీ నిజమనిపిస్తుంది.
పదిహేను రోజుల తర్వాత మొదటిసారిగా ఒక ఇంటర్వ్యూ వచ్చింది సౌదామినికి.
ఇంటర్వ్యూ బోర్డులో ఒకే పెద్దమనిషి వున్నాడు. వెళ్ళగానే పొగలు చిమ్ముతున్న కాఫీ యిచ్చారు.
ఒకసారి దానివైపు నుండి మొహం తిప్పేసుకుంది. నిజానికి తనకి చాలా ఆకలిగా వుంది. రోజూ ఒక్కపూటే భోజనం చేస్తున్నారు. నిన్న రాత్రి అన్నం తినలేదు. ప్రొద్దున కూడా భోజనం చెయ్యకుండానే వచ్చింది. కాఫీ, టీలు తాగకూడదని తాము చేసుకున్న ఒప్పందం గుర్తుకు వచ్చింది.
"నో థాంక్స్!" అంది.
"కాఫీ తాగరా! డ్రింకింగ్ చాక్లెట్ తెప్పించుకుంటారా!"
"వద్దు -" అని తల తిప్పింది సౌదామిని. బాలూనే గుర్తుకు వస్తున్నాడు ఆమెకి. భోజనం తయారు చేసి అతన్ని తినమని చెప్పి వచ్చింది తను. అతను తిని బయటకు వెళ్ళాడో లేదో! లేకపోతే కాసేపు బయట తిరిగి వచ్చి ఫ్రెండ్సుతో కలిసి భోజనం చేసి వచ్చామని అబద్దమాడతాడు!
"నీకు ఆకలి అంటే ఏమిటో తెలుసా అమ్మా!" అన్నాడాయన అకస్మాత్తుగా.
ఉలిక్కిపడి ఆయన మొహంలోకి చూసింది సౌదామిని.
ఆయన కళ్ళు దయగా నవ్వుతున్నాయి. ఎందుకు? ఎందుకు??
"తెలుసు".
బాలూ గుర్తుకు వచ్చాడు మళ్ళీ.
"ఎలా తెలుసమ్మా?"
"చిన్నప్పటినుండీ బీదరికంలో పెరిగాను."
ఆయన తల వెనక్కి వాల్చి నవ్వాడు ఆ నవ్వు తెర ఒక పట్టాన తగ్గలేదు. నవ్వి నవ్వి కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి. కర్చీఫ్ తో తుడుచుకుంటూ అన్నాడు, "నీకు అబద్దాలు చెప్పడం చాతకాదమ్మా ఓ.కే! అది కూడా మాకు కావలసిన క్వాలిఫీకేషన్లలో ఒకటనుకో. ఆకలి దప్పులంటే ఏమిటో, కష్టసుఖాలంటే ఏమిటో తెలిసిన నిజాయితీ పరురాలైన అమ్మాయి కోసం వెదుకుతున్నాం. మేము ఒక కొత్త సేవాసంస్థ పెడుతున్నామమ్మా!"

