"ఎవరు?" అంది సౌదామిని. అప్పటికే ఆమెకి అనుమానము వచ్చింది.
"నీకు బాగా తెలిసిన వాళ్ళే- బ్రహ్మానంద!"
చటుక్కున లేచి నిలబడింది సౌదామిని.
"ఆకలి అంటే ఏమిటో తెలియకుండా పెరిగావు. ఆశ్రయంయిస్తున్న కోట వదులుకుని వెళ్ళిపోయి ఆకలి అంటే ఏమిటో తెలుసుకున్నావు. నీకు మరొక్క ఛాన్సు యివ్వబడుతోంది సౌదామినీ! తిరిగి వచ్చెయ్!" అతడి మాటలు పూర్తవలేదు. తిరిగి చూడకుండా వచ్చేసింది సౌదామిని ఇంటికి.
....చెవులప్పగించి ఇదంతా విన్నాడు బాలు - సౌదామిని చెబుతూంటే సంకోచంగా. ఎవరో తలుపు కొట్టిన చప్పుడయింది
బయట అహమ్మద్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో సంచీ ఒకటి ఉంది.
తలుపు తీసిన బాలూ భుజంమీద నుంచి లోపలికి తొంగిచూస్తూ "బాగున్నావా బాబీ!" అని కుశల ప్రశ్న వేశాడు. నవ్వుతూ తల పంకించి "రండి" అంది సౌదామిని.
లోపలికి వచ్చేసి చనువుగా నేలమీద చతికిలపడ్డాడు అహమ్మద్. అతను తనని కావాలనే పలకరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని అర్ధమయింది బాలూకి.
"ఇవాళ నా బర్త్ డే బాబీ" అన్నాడు అహమ్మద్ సంతోషంగా. "అందుకని ప్రత్యేకంగా చేయించుకున్నాను. శీర్ మాల్ అనే పాల పూరీ, ఖివీరీ రోటియా అనే పులుపు రొట్టెలు, ఇది లక్నో స్పెషల్ బాబీ" గబగబా చెబుతున్నాడు అతను.
చిరునవ్వుతో వింటోంది.
"తినండి బాబీ, వాడికి కూడా ఒక ముక్క విదిలించండి." బాలూ పళ్ళు బిగించాడు.
సౌదామిని తటపటాయించింది.
అది గమనించాడు అహమ్మద్.
"తురకవాడు తెచ్చిన రొట్టెలు తినకూడదని పట్టింపు ఏదైనా ఉందా బాబీ!" అన్నాడు నెమ్మదిగా.
సరిగ్గా తగలవలసిన చోటే తగిలాయి ఆ మాటలు. "అయ్యో, లేదు లేదు" అని వెంటనే వాటిని అందుకుంది సౌదామిని.
"వెళ్ళొస్తా బాబీ" అని వెనక్కితిరిగాడు అహమ్మద్ - బాలూతో మాట్లాడకుండా.
అతని వెనకే నడిచాడు బాలు.
రోడ్డుమీదకి రాగానే కొరకొర లాడుతూ బాలూ వైపుకి తిరిగాడు అహమ్మద్. "ఏమ్ బే ఉల్లూక్ పఠ్ఠే, ఉద్యోగం ఊడితే కనీసం నాగ్గూడా చెప్పావా? వీధిలో పోయే ఎవడో చెప్తే నాకు తెలియాల్నా? అరే సైతాన్, అరే బేయిమాన్" అన్నాడు తిట్లు లంకించుకుంటూ.
గిల్టీగా చూశాడు బాలు. "ఈ సంగతులన్నీ అందరితోటీ చెప్పవద్దనుకున్నాం. మన సంతోషాన్ని ఎదుటి వాళ్ళతో పంచుకోవాలి. అంతేగాని మన విచారాన్ని అంటువ్యాధిలాగా అందరికీ అంటించకూడదు అని నిశ్చయించుకున్నాం" అన్నాడు.
విస్తుబోతూ చూసాడు అహమ్మద్.
"ఈ ఫిలాసఫీ నీ సొంత మనిపించడం లేదే."
"అవును, ఇది సౌదామిని సొంతం."
"వారెవా, అయితే అదే ఫిలాసఫీ నాకు ఉండొచ్చుగా మీ ఇబ్బందుల్ని నేను కాకపోతే మరెవరు పంచుకుంటార్రా బద్మాష్, కమీనే, ఉల్లూకే పఠ్ఠే."
"ఆ చివరితిట్టు ఇందాకే తిట్టావు. ఒకే తిట్టు రెండేసిసార్లు తిడుతూ హింసించకు. అయినా ఒరే నీ పుట్టినరోజు యివాళ కాదనుకుంటానే."
"ఇవాళ నేను చచ్చినరోజు కానందుకు సంతోషించు. నీ ఉద్యోగం వూడిన సంగతి ఊళ్ళో వాళ్ళెవరో చెబితే నాకు తెలియాలా? అసలేం జరిగింది?" అడిగాడు.
బార్ లో ఉద్యోగం పోవడమూ తను సత్యనారాయణ్ కాంట్రాక్టులో ఇరుక్కోవడమూ చెప్పి, "ఇంక ఆరు సంవత్సరాల దాకా గిటార్ తాకడానికి లేదు బాస్. సత్యనారాయణ్ తన బార్ లో ప్లే చెయ్యనివ్వడు. బయట యింకెక్కడా ప్లే చెయ్యడానికి వీల్లేదు" అన్నాడు.
"వాడు గట్లచేస్తే మనం ఏం చాతకాని వాళ్ళలాగా ఊరుకుంటామా, మక్కెలిరగదంతాం."
నవ్వాడు బాలూ "అవన్నీ అయ్యే పనులు కావులే". కొంచెం ఆగి వెళ్ళొస్తానన్నాడు అతడు.
"అహమ్మద్".
ఆగాడు అహమ్మద్!
"ఇంకెప్పుడు ఇలా మా కోసం ఫుడ్ మాత్రం పట్టుకురాకు, సౌదామిని ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సహాయం తీసుకోవడం అలవాటయితే సోమరిపోతులమైపోతాం అని ఆమె భయం అనుకుంటా."
అహమ్మద్ అస్పష్టంగా తలూపాడు.
* * *
లోపలికి వచ్చాడు బాలూ.
దీర్ఘంగా శ్వాస ఎగబీల్చి, అహమ్మద్ తెచ్చిన వంటకాల సువాసనలని ఆఘ్రాణిస్తూ "మూడు రోజులయిందా మనం కడుపు నిండా తిని...." అన్నాడు హుషారుగా.
నవ్వుతూ ప్లేట్లు తీసింది సౌదామిని.
వెంటనే బయట్నుంచి గొంతుకలు వినబడ్డాయి.
"నొమస్తే! నొమస్తే! మీరొచ్చి ఇణ్ణి దిణాలు అయిణా దీరికగా మాట్లాడుకొణేలేదు. ఇవాళ దీరికగా ఉందని వచ్చినాం, మీరు పణిలో ఉన్నారా ఓహో టిపిణ్ చేస్తున్నారా?"
పక్కింటి మలయాళీ, అతని భార్యా, పిల్లా బిలబిలమంటూ వచ్చారు.
"రండి! రండి!" అంది సౌదామిని మర్యాదగా మరో ప్లేటు కూడా తీసుకువచ్చి పాల పూరీలనూ, రొట్టెలనూ ఆ మూడిటిలో సర్ది ముగ్గురు అతిధులకి అందించింది. వాళ్ళు వాటిని తింటూ పొగడసాగారు.
బాలూకి సౌదామిని మీద అంతులేని జాలి, తనమీద తనకే చెప్పలేనంత కోపం కలిగాయి. కన్నీటిచుక్క చెంపమీద నిలచి నవ్వింది.
7
ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనూ నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు. ముగ్గురు సౌదామిని ఫ్రెండ్స్, నాలుగోవాడు సుబ్బారావు.
ఉన్నట్లుండి ఒకరోజున సుబ్బారావుకి వాళ్ళ ఊరినుండి అరటిపళ్ళ గెల వచ్చిందట. తనొక్కడే అన్నీ తినలేదు కాబట్టి, అవి నిలువ ఉండేవి కావు కాబట్టి తెలిసిన వాళ్ళందరికీ తలోరెండుడజన్లు ఇస్తున్నానని చెప్పి పళ్ళు పెట్టేసి వెళ్ళాడు. సౌదామిని స్నేహితురాలు తాలూకు బంధువులు మేడ్చల్ లో ఉంటున్నారట. వాళ్ళ గేదె యీనిందని జున్నుపాలు తెచ్చి యిచ్చారట. చేసుకున్న జున్ను మరీ ఎక్కువయి పోయిందని ఒక కారియర్ గిన్నెనిండా వీళ్ళకోసం తెచ్చేసింది ఆ అమ్మాయి.
నాలుగు రోజులు నవ్వుతూనే భరించి, తర్వాత తనకి ఇలాంటివి ఇష్టంలేదని స్నేహంగా - కానీ చాలా స్పష్టంగా - చెప్పేసింది సౌదామిని.
వాళ్ళు బాధపడ్డారు. కోప్పడ్డారు. తిట్టారు. అయినా మాట మీదే నిలబడింది ఆమె.
ఏం చేయలేక వాళ్ళు వెళ్ళిపోయారు. మరో పది రోజుల్లో ఉద్యోగం ఏదైనా దొరక్కపోతే కట్టు బట్టలతో బయటపడాలని ఇద్దరికీ తెలుసు. రోజురోజుకీ టెన్షన్ పెరుగుతోంది.
ఆ రోజు బాలూ ఊరంతా తిరిగి యిల్లు చేరేసరికి మూడీగా కూర్చుని వుంది సౌదామిని.
ఆమె అలా ఉండటం అతనెప్పుడూ చూడలేదు. ఆమె అలా వుంటే అతనికేం తోచలేదు. ఏం అడిగినా ముక్తసరిగా జవాబు చెబుతోంది. కారణం తెలీదు.
ఆమెని నవ్వించి, మామూలు మూడ్ లోకి తేవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు బాలు.
అతి జాగ్రత్తగా తన క్రాఫ్ లోని ఒక వెంట్రుకని పీకి, దాన్ని రెండు చేతులతోనూ పట్టుకుని, పెదిమలని ఆ చెవి దగ్గర నుంచి యీ చెవిదాకా సాగదీసి నవ్వుతూ ఆమెవైపు చూశాడు.
తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేస్తున్నట్లు బాగా వంగి, లేచి రెండుచేతుల మధ్య ఉన్న వెంట్రుకని సాగదీస్తున్నట్లు అభినయించాడు. తర్వాత మెడని ఒక వైపుకి వంచేసి, ఆ వెంట్రుకలు కింది చెవిలో దూర్చుకున్నట్లు యాక్షన్ చేశాడు. మెడ రెండోవైపు వంచి, దాని రెండో కొసని ఎడమ చెవిలో నుంచి బైటకు లాగాడు.
తరువాత దాన్ని బిగుతుగా లాగి పట్టుకున్నట్లు యాక్షన్ చేసి, ఒంటి తీగ వున్న గిటార్ ని వాయిస్తున్నట్లే అభినయిస్తూ పాడటం మొదలు పెట్టాడు.
"ముస్క్ రా అనార్ లే ముస్క్ రా...!" (నవ్వు... ఓ దానిమ్మ కొమ్మా-నవ్వు)
నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వేసింది సౌదామిని. తను చేస్తున్న మైమ్ ఆపేసి ఆమె దగ్గరికి నడిచాడు బాలు.
"లే!" అన్నాడు.
"ఎందుకు" అన్నట్లు అనుమానంగా చూస్తూ లేచి నిలబడింది సౌదామిని.
టవల్ తీసుకొచ్చి ఆమె నడుముచుట్టూ కట్టాడు బాలూ. తర్వాత చీర ఒకటి తీసుకువచ్చి, ఉండలాచేసి, ఆమె పొట్ట దగ్గర టవల్ లోకి పెట్టాడు. ఆమె పొట్ట ఎత్తుగా కనబడుతోంది యిప్పుడు.
రెండడుగులు వెనక్కినడిచి, పరిశీలనగా చూసి సంతృప్తిగా తల ఆడించాడు.
"కొన్ని సంవత్సరాలు పోయాక నువ్వు యిలా కనబడవలసి వస్తుంది" అన్నాడు నవ్వుతూ.
తల వంచుకుంది సౌదామిని. "సంవత్సరాలు అక్కరలేదు. అది నిజంగా జరగబోతోంది" అంది మెల్లగా.
అతను అప్రతిభుడై వుండిపోయాడు.
నెల తిరిగినా ఉద్యోగం దొరకలేదు. కానీ నెల తిరగక ముందే నెల తప్పింది సౌదామిని.
ఈ కష్టాలని భరించడానికి మరో ప్రాణి యీ లోకంలోకి వస్తోంది!!
చాలా చిత్రమైన పరిస్థితిలో పడిపోయాడు బాలు.
భార్య మొదటిసారిగా గర్భవతి అయిందనీ, తను తండ్రి కాబోతున్నాడనీ తెలియడం నిజానికి చాలా తియ్యటి వార్త.
కానీ, ఇంత కడుపుతీపి కబురు వినగానే చేదుగా అయిపోతోందేమిటి తన మనస్సు?
తీపి, చేదూ అనుకోగానే అతనికి ఇంకొక విషయం కూడా తట్టింది. తీపీ, చేదూ, వగరూ, పులుపూ - అలా పూటకొక రుచి మీద మనస్సు మళ్లే రోజులు సౌదామినికి.
కడుపులో పెరుగుతున్న శిశువుకీ తనకీ కూడా కలిపి కడుపు నిండా అన్నం తినవలసిన రోజులు సౌదామినికి.
ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలోకి ఆమెని లాక్కొచ్చాడు తను? రోజుల తరబడి అన్నం మొహం చూడలేని పరిస్థితిలో పడేశాడు. ఎలా? ఇప్పుడెలా? "మనిద్దరికి కాకపోయినా మూడో వ్యక్తినయినా తిండి పెట్టాలి కదా" స్వగతంలా పైకి అనేశాడు.
తను కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నట్టు "పోనీ నేను వీణ పాఠాలు చెబితేనో" అంది.
"ఎవరికి? నాకా?"

