అతడికి విస్మయం కలిగింది. ఆమె నిజంగా అంటోందో, తనకు ధైర్యం చెప్పటానికి వూరికే అలా మాట్లాడుతోందో అర్ధంకాలేదు. ఆమె గొంతులో ఛాయా మాత్రంగానైనా తిరస్కారభావం గోచరించకపోవడం అతనికి నిబ్బరం కలిగించింది. నెమ్మదిగా తల కొంచెం ఎత్తి ఆమె మొహంలోకి చూశాడు.
మనోహరంగా వుంది ఆ దృశ్యం రెండు కొండల మధ్య నుంచి చల్లని వెన్నెల కురిపిస్తున్న చందమామలా కనబడుతోంది ఆ భంగిమలో ఆమె మొహం
"నిన్ను సుఖపెడతానని చెప్పి లాక్కొచ్చేసి కష్టాల్లోకి నెట్టేస్తున్నాను సౌదామినీ!" గాద్గదికంగా అన్నాడు.
"ఇదే కష్టమనుకుంటే అక్కడ ఆశ్రమంలో నేను అనుభవించిన నరకయాతనని ఏమనాలి? ఇప్పుడే నయంకాదూ! ఒకరికొకళ్ళం తోడున్నామన్న ధీమా వుంది."
సరిగ్గా అలాంటి భావమే మెదిలింది బాలూ మదిలో కూడా ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగిలి జీవితాన్ని ఎదుర్కోగలననే ధైర్యం చచ్చిపోతున్నప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా, వెక్కిళ్ళుపెడుతూ ఏడవాలన్నంత దిగులు కలిగినా దాన్ని దిగమింగివుండిపోవాల్సి వచ్చేది.
ఇప్పుడు-
తన మనసులోని ఆరాటాన్ని మనస్ఫూర్తిగా పంచుకోవటానికి మరో మనసు.
"ఎందుకు అంత వర్రీ అయిపోవడం? ఇంకో జాబ్ సంపాదించుకోలేమా?" అంది సౌదామిని.
"మామూలు పరిస్థితులలో అయితే వర్రీ అయ్యేవాడిని కాదు. కానీ ఇప్పుడు నాతోబాటు నిన్నుకూడా కష్టపెట్టాలనే బాధ ఒకటి, అంతకుమించింది మరొకటి వుంది."
"ఏమిటి?"
"ఇవాళ జరిగిన గొడవంతా చేయించింది బ్రహ్మానంద."
ఆమె వెన్ను చప్పున నిటారుగా బిగుసుకుపోవడం అతడికి స్పష్టంగా తెలిసింది.
"బ్రహ్మానందా!"
"బార్ లో జాతీయగీతం వాయించమని అడిగాడు ఎవడో గూండా. కుదరదని చెప్పేశాను. గొడవ జరిగింది. అందరూ వెళ్ళిపోయారు కానీ చివరిదాకా కూర్చుని తమాషాగా చూసింది ఆంజనేయులు..."
"మరి బాధపడతారెందుకు? మీరు చేసింది సెంట్ పర్సెంట్ కరెక్ట్. వాళ్ళు బెదిరింపులు మొదలెడితే బెదిరిపోవడానికి మనమేం పిరికిపందలమా!" ఆమె మాట్లాడుతున్న మాటలలోని ఒక్కొక్క అక్షరం టానిక్ బాటిల్లా పనిచేస్తుంటే ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు బాలూ.
"కాదు సౌదామినీ! మనం పిరికిపందలం కాదు. వాళ్ళే పిరికిపందలు."
"భోజనం చెయ్యండి. చారు వెచ్చబెట్టనా!"
వద్దన్నట్టు తల ఊపి, అన్నం కలిపి మొదటి ముద్ద సౌదామినికి పెట్టబోయాడు బాలూ.
తల పక్కకి తిప్పింది సౌదామిని.
"ఒక ప్రామిస్ చేస్తేనే తింటాను."
"ఏమిటి?"
"ఇంకెప్పుడూ మీరు తాగకూడదు. మనసు మరీ బాగున్నా, మనసు బాగలేకపోయినా సరే!"
"సరే!"
చెయ్యి జాపింది.
అతను ఆమె అరచేతిలో ముద్దా, బుగ్గమీద ముద్దు పెట్టాడు.
ఒక చక్కటి భావం అతడి మనసులో కదలాడింది.
నిజమైన భార్య.
నిన్ను నవ్విస్తుంది, పాడిస్తుంది, ఏడిపిస్తుంది!
ఏడిస్తే దగ్గరై ఓదారుస్తుంది.
గుండె గది ఒంటరితనాన్ని తన జ్ఞాపకాలతో పోగొడుతుంది. వర్షం చినుకుల శబ్దాన్ని కూడా కలిసి వింటుంది.
ఇస్తుంది. తీసుకుంటుంది.
అన్నిటికంటే ముఖ్యంగా.
బ్రతకటం ఎందుకో నేర్పుతుంది.
* * *
పనికోసం పనిగట్టుకుని తిరగటం మొదలు పెట్టాడు బాలూ రెండు బార్లలో వెళ్ళి విచారించిన తర్వాత తనని వాళ్ళెవరూ మనస్ఫూర్తిగా ఆహ్వానించటం లేదని అతనికి అర్దమైపోయింది. ఏం జరిగింది అసలు.
తిరిగి తిరిగి సాయంత్రం అయ్యాక ఒక బార్ చేరుకున్నాడు బాలూ. బ్యాండ్ ఉన్న బార్ లలో అది యింక చివరిది. ఇక్కడ అప్పాయింట్ మెంట్ దొరక్కపోతే ఇంకెక్కడా దొరకనట్లే లెక్క.
బాలూ రాకకోసమే ఎదురు చూస్తున్నంత సంతోషంగా లేచి వచ్చాడు బార్ ఓనర్ సత్యనారయణ్.
"రా! బాస్! రా! ఏమి వెస్టేండ్ హోటల్లో తగాదా జరిగిందట?"
ఏమీ దాచకుండా జరిగినదంతా చెప్పాడు బాలూ. శ్రద్దగా విని నాలుగు రకాల శబ్దాలు కలిపి నములుతున్న పాన్ ని, ప్రక్కనే ఉన్న ఇత్తడి గిన్నెలో ఉమ్మేశాడు. సత్యనారాయణ్.
"నేను విన్న కథా యిట్లలేదు. వేరేగా వుంది" అన్నాడు పెద్దగా నవ్వుతూ.
"ఏం విన్నావ్?"
"నువ్వు కస్టమర్లను కొట్టి పైసలెత్తుక పారిపోయినావంట!"
పని కట్టుకుని ఆ కథని ఎవరో ప్రచారం చేస్తున్నారని అన్పించింది బాలూకి. అందుకేనన్నమాట తనని ఎవరూ సరిగా పలకరించడానికి కూడా ఇష్టపడలేదు.
"నువ్వు నమ్మావా?"
"నమ్మితే నేను నీతో యిట్ల మంచిగ మాట్లాడుతుంటినా! నీ కోసం ఈ కాంట్రాక్టు తయారుగ ఉంచుతుంటినా!"
"ఏం కాంట్రాక్టు?"
కాంట్రాక్టు కాయితాలు కప్ బోర్డులో నుండి తీసి ఇచ్చాడు సత్యనారాయణ్. మంచిరకం బాండ్ పేపర్ మీద అందంగా ఫ్రింట్ చేసి వుంది.
గబగబా చదివాడు బాలూ. ఆ హోటల్లో చేరే స్టాఫ్ అందరికీ అది కంపల్సరీలాగుంది. ఎంత జీతం ఇచ్చేదీ, ఏమేమి వసతులు, సదుపాయాలూ కలుగజేసేదీ, ఆర్టిస్టుల బాధ్యత లేమిటీ, మేనేజ్ మెంట్ జవాబుదారీ ఎంతవరకూ.....
షరా మామూలే నన్నట్లు పడికట్టు పదాలతో, రొటీన్ వాక్యాలతో ఉన్న కాంట్రాక్టు అది. ఆరు సంవత్సరాలపాటు బాలూ వాళ్ళ బార్ లో పని చేసేటట్టు ఒప్పందం - జీతం రోజుకి ముఫ్ఫయి రూపాయల చొప్పున.
అంటే నెలకి తొమ్మిది వందలు.
సంతోషంతో సత్యనారాయణ్ ని కావలించుకోవాలనిపించింది. సంతోషంతో గిరగిరా తిప్పెయ్యాలన్పించింది.
"థాంక్యూ బాస్" అన్నాడు కృతజ్ఞత అంతా గొంతులో పలికిస్తూ తన పాన్ బాక్స్ తెరిచి ఒక్కొక్క అరలో విడిగా ఉన్న శివాజీ ప్రభాత్, రాజరతన్, బాబా జర్దాలు, మాటుగా వుండే పెద్ద సైజు కలకత్తా తమలపాకుల్లో వేసుకుని సున్నం, కానూ రాసి, కాశ్మీర్ ఖిమామ్, రాంప్యారీ మసాల తగిలించి, ధారాళంగా పాన్ పరాక్ వంపుకుని ఆ నిర్మాణాన్ని తన నోట్లో కుక్కుకుని అప్పుడు తల ఎత్తాడు సత్యనారాయణ్.
"ఏమన్నావూ?"
ఇన్ని రకాల దినుసులు కలిపిన పాన్ నోట్లో పెట్టుకోగానే లాలాజలం తగిలి పేలుతుందేమో అన్నట్లు కళ్ళప్పగించి చూస్తున్న బాలూ తేరుకుని "థాంక్స్" అన్నాడు.
దవడలని యిటునుండి అటు ఆడించాడు సత్యనారాయణ్. "ఇందులో థాంక్స్ చెప్పేదేముంది తమ్మీ! నాకు నీతో అవసరం ఉన్నది. నీకు నాతో జరూరత్ ఉన్నది అంతే!" అన్నాడు తేలిగ్గా.
లావుగా బెలూన్ లా వుండే సత్యనారాయణ్ చాలా ముద్దొచ్చాడు బాలూకి.
"సరే! నే వెళ్ళొస్తా ఎప్పుడు రానూ! డ్యూటీకి?"
"నీ ఇష్టం నీ ఓపిక లేకుంటే ఇవాళ రెస్టు తీసుకుని రేపటి నుండి శురూ చెయ్యి! రేయ్ ఖదీర్!" అని కేకపెట్టి, "ఏం తాగుతవు" అన్నాడు సత్యనారాయణ్.
"ఏమీ తాగను" అన్నాడు అప్పటికే గుమ్మంలోనుంచి బయటకు అడుగుపెట్టిన బాలూ.
* * *
"అబ్బఏమిటి? ఏమిటిది?" అని సౌదామిని సిగ్గుగా అతని చేతుల్లో నుంచి తప్పించుకోవాలని చూస్తూ - ఆమె కిటికీలోనుండి బయటికి చూస్తోంది పక్కిల్ల వాళ్లెవరైనా తమని గమనిస్తున్నారేమోనని.
అతికష్టంమీద అతన్ని విడిపించుకుని, తొలగిన పవిట నొకసారి పూర్తిగా తీసేసి, మళ్ళీ సరిగ్గా వేసుకుంది సౌదామిని. ఆ కొద్దిక్షణాలు అతను అద్భుత దృశ్యం ఏదో చూస్తున్నట్లు రెప్పలేయడం మర్చిపోయినట్లు వుండిపోయాడు. శబ్ద నిశ్శబ్దాల మధ్య టపటపా రెక్కలు కొట్టుకునే రెండు పావురాలు గుర్తొచ్చాయి అతడికి.
"మీరు కళ్ళు మూసుకుని, నోరు తెరిచి, జరిగింది ఏమిటో చెపితే బాగుంటుంది."
"కాంట్రాక్టు... తొమ్మిదివందలు.... ఆరేళ్ళపాటు" అన్నాడు. అతని చేతుల్లోంచి కాంట్రాక్టుని లాక్కుని చదివింది సౌదామిని. చివరిదాకా వచ్చాక "ఇదేమిటి?" అంది చివుక్కున తలెత్తుతూ.
చీమ తలకాయంత అక్షరాలతో పేజీకి అడుగున ప్రింట్ చేసి వున్న మేటర్ ని యిందాకటి ఉత్సాహంతో గమనించలేదు బాలూ.
కాంట్రాక్టు పీరియడ్ లో పనిచేసిన ప్రతిరోజుకీ జీతం చెల్లించబడుతుంది. వసతులూ, సదుపాయాలూ కల్పించబడతాయి. కానీ కాంట్రాక్టు సమయంలో ప్రతిరోజూ పని చూపించబడుతుందని అర్ధంకాదు. ఈ కాంట్రాక్టువల్ల ఉత్పన్నమయ్యే వివాదాలు ఏమన్నా వుంటే అవి బొంబాయి కోర్టులోనే పరిష్కరించుకోవాలి." ఆదుర్దాగా చదివాడు. సందిగ్ధంగా చూస్తూ "ఇవి రొటీన్ షరతులేనను కుంటాను" అన్నాడు. కానీ దృఢంగా లేదు అతని గొంతు.
"కానీ ఇప్పుడు మనం వున్నది రొటీన్ పరిస్థితి కాదు కదా! పవర్ ఫుల్ ఎనీమీతో తలపడుతున్నాం మనం ప్రతి విషయం- జాగ్రత్తగా చూస్తూండాలి. నిన్న బ్రహ్మానంద వేసిన ఎత్తుకి దెబ్బతిన్నాం. ఇవాళ కూడా అతడు పన్నిన ఊబిలో చిక్కుకున్నామేమోనని నా డౌటు!"
ఉన్నట్లుండి గుండె జారిపోయింది బాలూకి.
"నీకు కాంచనమాల కేసు తెలుసా!" అంది సౌదామిని.
"ఏ కాంచనమాల?"
"మనిద్దరం పుట్టకముందే ఆమె హీరోయిన్. ఒక పెద్ద ప్రొడ్యూసర్ తో పేచీ వచ్చింది తనకి. అది మనసులో పెట్టుకున్నాడు ఆయన. పైకి మాత్రం ఏమీ అనకుండా, అయిదేళ్ళకో ఎంతకో ఎక్స్ క్లూజివ్ కాంట్రాక్టు రాయించుకున్నాడు. తనకి తప్ప మరెవరికీ పనిచేయకూడదని, ఆ అయిదేళ్ళలో ఎన్నో సినిమాలని తీశాడు ఆయన. కానీ ఒక్క పిక్చరులో కూడా ఆమెకి అవకాశం యివ్వలేదు కావాలనే. అయిదేళ్ళు గడిచాయి. కాంట్రాక్టు కాలం ముగిసింది. కానీ కాంచనమాలకు బుక్కింగులు రాలేదు. అప్పటికే ఆమెని మర్చిపోయారు జనం. ఒక ఆర్టిస్టుని పంపెయ్యాలంటే అతన్ని ప్రజలకు దూరం చేస్తే చాలనుకుంటాను. ఇప్పుడు మన విషయంలో అది జరిగిందా అని నా అనుమానం" చెవుల్లోకి హోరుమని వేడిగాలి వీచినట్లయింది బాలూకి.
