Previous Page Next Page 
మమత పేజి 16

రోజూ ఈ టైముకి లంచ్ కని వచ్చేస్తాడు మాధవరావు. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాడు. ఏ నాలుగు గంటలకో మళ్ళీ వెడతాడు. అదీ రోజూ అతని అలవాటు.
మూడయింది. ఇంకా ఇంటికి రాడేం? జానకికంపెనీకి ఫోను చేసింది. ఇప్పుడే బయల్దేరారు వాళ్ళు. జానకికి ఎందుకో చాలా భయమేసింది. మమత నిద్రపోతోంది. పనిమనిషి రాజమ్మ రాలేదు. ఇంట్లో తనూ, మమత... అలా అలా గంటలు గడిచిపోయాయి.
జానకికి అలసటగా అనిపించింది. మనసెందుకో కలతగా వుంది.
'మాధవరావు ఎక్కడికెళ్ళినట్టు..?'
ఏ పనీ చేయబుద్ది పుట్టలేదు. మాధవరావు ఎక్కడికెళ్ళాడూ..? - బిక్కు బిక్కుమంటూ తలుపులేసుకు పడుకుంది.
పదకొండు గంటలు దాటింది. వీధిలో కారు ఆగింది. జానకి గబుక్కున లేచి తలుపు తీసింది.
తూలిపోతూ ఇంట్లోకొచ్చిన భర్తని చూసి భయపడిపోయింది జానకి.
నెమ్మదిగా చేయి పట్టుకుని పడగ్గదిలోకి తెచ్చింది. ఆ మంచం మీద అలా వాలిపోయాడు మాధవరావు.
మాధవరావు క్లబ్బుకెళ్ళటం, పార్టీలలో పాల్గోటం, స్నేహితులకి పార్టీలివ్వటం జానకికి తెలిసిందే. కానీ, ఇలా తూలిపోతూ ఏనాడూ రాలేదు ఇంటికి!
ఇంకానయం- కారు ఎలా డ్రైవ్ చేసారో?... అని భయపడుతూ దేవుని పటానికి దణ్ణం పెట్టింది.
ఆ రాత్రంతా నిద్రపట్టలేదు జానకికి.
మాధవరావు రోజులాగే లేచాడు. మామూలుగానే వున్నాడు.
"దీన్ని చూడండి, ఎలా నవ్వుతోందో" అంది జానకి.
"ఊ..." అన్నాడు గుడ్లురిమి.
"తీసుకోండి!" ఒళ్ళో పెట్టబోయింది మమతని జానకి.
"కింద పడుకోపెట్టు" అన్నాడు.
అర్ధంకాలేదు జానకికి. "దీనికి డైపర్ వేశాను" అంది వెంటనే.
మాధవరావు గబుక్కున మమతని ఎత్తుకుని, "రండి లోపలికి" అన్నాడు. మాధవరావు చేతిలోంచి మమతని అందుకున్నాడు రాజీవ్.... జానకి లోపల్నుంచి బయటకొచ్చింది.
"దీనికోసం నిన్న మా ఆవిడ బ్రహ్మాండంగా షాపింగ్ చేసింది.... ఎన్ని గౌన్లో, ఎన్ని బొమ్మలో" అన్నాడు.
జానకి మౌనంగా వుండిపోయింది. తనేమీ కొనలేదు- షాపింగ్ కి వెళ్ళలేదు- మరి, మాధవరావు మాటలు?
"మరీ తొందరపడి ఉత్సాహంగా కొనేయకండి గౌన్లు!" ఇంకా ఏదో అనబోయాడు.
"ఏం... మీరు తీసుకెళ్ళిపోతారా మళ్ళీ!" అన్నాడు మాధవరావు.
జానకికి షాక్ తగిలినట్టయింది.
"అబ్బే... పిల్ల బాగా పెరిగితే పొట్టి అయిపోతాయనీ!" అన్నాడు రాజీవ్.
మాధవరావు లోపలకెళ్ళాడు.
మమతతో చాలాసేపు ఆడుకున్నాడు రాజీవ్.
పన్నెండు గంటలైంది. 'భోంచేసి వెళ్ళండి" అంది జానకి.
మాధవరావు వినిపించుకోనట్టు క్షణం ఆగి, "అవును భోంచేసి వెళ్ళండి" అన్నాడు.
 రాజీవ్, మాధవరావు భోజనాలు చేస్తున్నంతసేపూ నిశ్శబ్దమే! ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ- "దీనికాళ్ళకి చిన్న గజ్జెలు కొంటాను రేపు!" అంది ఏదో మాట్లాడాలికదాని!
ఓ అరగంట కూచుని రాజీవ్ వెళ్ళిపోయాడు. జానకికి ఎందుకో చిరాగ్గా వుంది.
"అతనితో సరిగ్గా మాట్లాడరేం..?" అంది భర్తతో.
"సరిగ్గా అంటే?" అన్నాడు.
"అదే..."
"బాగానే మాట్లాడాను... చాలు!" మాధవరావు గదిలో కెళ్ళిపోయాడు.
జానకి మమతని ఒళ్ళో కూచోపెట్టుకుంది. 'స్కూల్లో వేసేప్పుడు ఈ పేరు మార్చేయాలి. 'మమత' పేరు బాగాలేదు' అనుకుంటూ గుమ్మంలోకి చూసింది.
రాజీవ్ మళ్ళీ వచ్చాడు. కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ- "రండి" అంది.
రాజీవ్- "నా భార్య సినిమాకెళ్ళింది. తాళం పక్కయింట్లో ఇవ్వటం మరిచిపోయింది" అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.
"ఐతే ఇంకేం... దీంతో ఆడుకోండి!" అని మమతని అప్పగించి లోపలకెళ్ళింది.
ఓ గంట అయ్యేసరికి నిద్రపోతున్న మమతని ఓ చాపమీద పడుకోబెట్టాడు.... ఇంట్లో ఎవరూ లేరే- అలా రాజీవ్ ఆ సోఫాలోనే నిద్రలోకి జారుకున్నాడు.
బెడ్ రూమ్ లో భార్యా భర్త ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా పైనున్న సీలింగ్ ఫాన్ వంక చూస్తున్నారు.
"ఉన్నాడా..... వెళ్ళాడా?" మాధవరావు లేస్తూ అన్నాడు.
జానకి మాట్లాడలేదు. ముందు గదిలో సోఫాలో నిద్రపోతున్న రాజీవ్ కనిపించగానే ఒళ్ళుమండిపోయింది మాధవరావుకి. ఏం చేస్తాడూ!! కోపంగా లోపలికొచ్చి బెడ్ రూమ్ తలుపేశాడు.
గదిలో అటూఇటూ తిరుగుతున్నాడు. జానకి చూస్తూ, ఏమీ ప్రశ్నంచకుండా వూరుకుంది. గబగబా డ్రెస్ చేసుకుని కారులో బయటకెళ్ళిపోయాడు మాధవరావు!   
                                  *    *    *
చావుబతుకుల్లో వుంది తులసమ్మ.
దగ్గర చంద్రయ్య, లీల, ఆశ్రమంలో వున్న కొందరు ఆడవాళ్ళూ వున్నారు.
లీల పిచ్చిచూపులు చూస్తోంది. డాక్టరమ్మ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతోంది. ఏమవుతుందో ఎవరికీ అర్ధంకావడం లేదు.
చంద్రయ్య అటూఇటూ చూసాడు. నర్సు దగ్గరకెళ్ళాడు-"ఏమైందీ..?" అన్నాడు ఖంగారుగా..!
నర్సు చాలా తేలిగ్గా ఆ మాటలు తీసుకుని-
"ఆ ఇంజక్షను ఇవ్వగానే ఇలా అయిపోయింది. రియాక్షనిచ్చింది....మళ్ళీ విరుగుడికి ఇంకో ఇంజక్షనిచ్చాగా- ఏం భయం లేదు" అంటూనే నడిచి వెళ్ళిపోయింది.
"హమ్మయ్య... బతికిందిలే!" అనుకున్నాడు చంద్రయ్య.
"పిన్ని చచ్చిపోలేదా..?" అంది లీల.
వారంరోజులయేసరికి తులసమ్మ కోలుకుంది.
నర్సింగ్ హోమ్ నించి ఇంటికొచ్చింది, రోజులు యధాప్రకారంగా గడిచిపోతున్నాయి.
లీల ఆశ్రమంలో అందరికీ సాయంగా వుంటూ భక్తిమార్గంవైపు తిరిగిపోతోంది. అందరితోపాటు ఆశ్రమంలో భజనలు చేయటం మొదలుపెట్టింది. దేవుడికి పెద్ద పూలమాల కట్టడం, ప్రసాదాలు పంచటం మొదలైనవాటిల్లో మహా ఉత్సాహాన్ని చూపిస్తోంది. దిక్కులేని వాళ్ళకు దేముడే దిక్కు అంటుంది అందరితో. లీల అంటే మొదట్లో మంచి అభిప్రాయం లేని వాళ్ళందరి మనసులూ మెల్లగా ఆమెపై ప్రేమానురాగాలతో నిండిపోయాయి. లీల ఒక్కక్షణం కనిపించకపోతే ఎలాగా....అనే స్థితికి వాళ్ళు వచ్చేసారు. లీల ఆ ఆడవాళ్ళందరికీ తల్లో నాలుకలా అయిపోయింది.
"అమ్మాయీ... కాస్త ఈ చీర పిండిపెట్టవే!" అంటే,
"అదెంతపని పెద్దమ్మా..." అంటూ క్షణాల్లో చీర పిండి ఆరేస్తుంది.
"లీలమ్మా, వంట మనిషి రాలేదు మరి!" అంటే చాలు....
గబగబా ఆ జడ ముడిపెట్టి, చీర కుచ్చెళ్లు దోపి వంటింట్లోకి వచ్చేస్తుంది. శరీరాన్ని దాచుకుందామనే ఆలోచన పోయింది. "ఈ శరీరం పరోపకారానికేగా!" అంటుంది నవ్వి.
లీలలో ఈ తాత్త్వికత ఏ క్షణంలో, ఎలా ప్రవేశించిందో కానీ- ఇటు భక్తి, అటు సేవ... రెండూ ఆమెకి రెండు కళ్ళయిపోయాయి.
లీలని చూస్తుంటే తులసమ్మ కళ్ళు చెమర్చినా, మంచి మార్గం లోకొచ్చేసిందనే తృప్తి కూడా కలుగుతోంది.
"ఏమే...ఒక్కసారి అటు వెళ్ళొద్దామా?" అంది తులసమ్మ మనసు వుండబట్టలేక.
లీల నవ్వింది- "ఎటూ వద్దు- నాదికాని దానికోసం నాకెందుకీ తాపత్రయం! నాకు కావలసిందేదో నాకు తెలిసిపోయింది. అందుకే ఎటూ రాను" అంది-దేవుడి మాలకట్టి పటాకికివేస్తూ.
తులసమ్మ తలూపింది.
"నేనే యశోదని, ఈ బాలకృష్ణుడు నా కొడుకే... అంతే!" అంది తులసిమాల దేవుడికి వేస్తూ లీల.
ఆశ్రమంలో ఆరోజు కృష్ణాష్టమి పండగ చేసుకుంటున్నారు.
పొద్దుటినించీ ఒక్కక్షణం తీరికలేదు లీలకి! వాకిలి అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టింది. ఎన్నోరకాల పూలు తెచ్చి మాలలు కట్టింది. వంటింట్లో కూచుని రకరకాల పిండి వంటలు చేసింది. చిన్న చేగోడీలు, పాలకోవాలు, గవ్వలూ, చిన్న గారెలు ఎన్నెన్నో...ఆశ్రమమంతా సందడి! ఏనాడూ ఆశ్రమానికి లేని కళ ఒక్కసారి వచ్చినట్టే వుంది ఆరోజు. ఆశ్రమవాసులు కృష్ణభజనలు చేస్తున్నారు.
లీల అందరికీ మంచినీళ్ళు అందించింది... తర్వాత ఫలహారాలు అందించింది. ఆ తర్వాత పాటలు అందరూ పాడుతుంటే అందరితో గొంతు కలిపింది. ఆశ్రమంలో ఉన్న చిన్న బాలకృష్ణుని విగ్రహాన్ని చూడటానికి ఎందరో ఎప్పుడూ వస్తారు.
ఈమాటు తండోపతండాలుగా వచ్చారు.
అందరూ లీలని మెచ్చుకున్నవాళ్ళే! 'ఎంత బాగా ముగ్గులేసింది..!' అని ఒకళ్ళంటే, 'ఎంత ఓపిగ్గా ఎన్ని పిండివంటలు చేసిందో..!' అని ఒకరన్నారు. 'తులసమ్మ అక్క కూతురటగా..!' అని ఒకరు, 'పాపం.... తల్లి ఈమధ్యే పోయిందట. అందుకే పిన్నీ... అంటూ ఇక్కడే వుండిపోయిందిట!' అనేవారొకరూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS