Previous Page Next Page 
మమత పేజి 15

తులసమ్మ మాట్లాడలేదు. కానీ లోపల భయం పట్టుకుంది. నిజంగా తను మంచాన పడితే ఎవరు చేస్తారు తనకీ! ఈ లీల మనసు పాడాయిపోయి, పిచ్చిదయిపోతోంది. తను అప్పుడే ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా, ఈ వృద్దాశ్రమాన్ని ఎవరు నడుపుతారూ..?
తులసమ్మకి అంతకుముందు చంద్రయ్య మీదున్న అభిప్రాయాలు అన్నీ ఒక్కసారి మాయమయ్యాయి. తనకి దిక్కెవరూ..? -తన కొడుకు అమెరికా నుంచి వస్తాడా- ఇది వట్టి మాట! తను మరణిస్తే ఆఖరికి కర్మ చేయటానికైనా వస్తాడా? ఏమో..!
తులసమ్మ చంద్రయ్య వంట చూసింది. ఆ క్షణం ఆపద్బాంధవునిలా కనిపించాడు చంద్రయ్య.
"సరే... నువ్వు చెప్పినట్టే చేద్దాం. నర్సింగ్ హోమ్ లో చేర్పించు" అంది నీరసంగా తులసమ్మ.
చంద్రయ్య ఆ సాయంత్రం దగ్గర్లోవున్న నర్సింగ్ హోమ్ లో తులసమ్మని చేర్పించాడు. లీల తులసమ్మ సేవలో మునిగిపోయింది. రెండు రోజులు సెలైన్ బాటిల్స్ ఎక్కించారు ఆస్పత్రిలో.
లీల చెప్పే మాటలు ఏవీ చంద్రయ్య మనసుకి పట్టించుకోవటం లేదు.
"అంతేలేవే తులసమ్మా! నువ్వు ఈ లీల మాటలు పట్టించుకోకు. ఆ పిల్లకి ఋణానుబంధం అయిపోయింది. ఎవరైనా విన్నా నమ్ముతారా చెప్పు- పిల్లని ఎవరో దాచుకున్నారంటే - దీని మైండ్ పాడయిపోయింది. అంతే!" అన్నాడు.
తులసమ్మకీ ఆ మాటలు నిజమేననిపించాయి.
"పోనీ.... ఆ సుధాకర్ ని వచ్చి తీసికెళ్ళిపోమను" అంది మంచంలో పడుకుని.
చంద్రయ్య నవ్వి "చాల్లే, ఈ పిచ్చిది వాడికెందుకూ? చూసినంత కాలం నీ దగ్గర, లేకపోతే న దగ్గర దాని బతుకు గడిచిపోతుంది- అంతే కొందరి జీవితాలు!" అన్నాడు.
"తులసమ్మా, అసలు విషయం మరచిపోయాను- సుధాకర్ చెప్పాడు- ఆ ఇల్లు త్వరగా అమ్మేయమని! ఎందుకంటే, విజయవాడలో ఏదో కొనుక్కుంటాడుట".
తులసమ్మ ఈ మాటకి చాలా కోపమొచ్చింది.
అంటే, దీన్ని తీసికెళ్ళడు, ఇల్లు అమ్మేసి వెళ్ళిపోతాడు. లీల బతుకేం కానూ? తను శాశ్వతమా- ఈ రోగం తగ్గి ఇంటికెళ్ళినా వచ్చే వయసే కానీ ఇంకేముంది? - ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది తన బతుక్కు ఏ ఆధారం లేకుండా లీల ఎలా బతుకుతుంది?
తను ఇంటి కెళ్ళగానే లీలని వెంట బెట్టుకుని ఆ ఇంటికెళ్ళి, అటో, ఇటో తేల్చేస్తా - పిల్ల ఏదీ అని నిలదీస్తా - ఎందుకు చెప్పరో చూస్తా -
తులసమ్మ కళ్ళు మూసుకుంది- తలనొప్పిగా వుంది. "చంద్రయ్యా... ఆ మంచి నీళ్లియ్యి" అంది నీరసంగా.
చంద్రయ్య మంచి నీళ్ళందించాడు.
"చూడయ్యా, మనం చేసే పనులు కొన్నైనా ధర్మంగా వుండాలి - ఆ తల్లీ పిల్లల్ని ఒకచోట చేరిస్తే ఎంతో పుణ్యం. ఆ పని ఎలాగైనా చేయాలి మనం - ఇంక ఆ సుధాకర్ కి చెప్పి ఇక్కడే ఓ చిన్నపని ఏదన్నా చేసుకోమను. వాడింట్లో వాడుంటాడు. వాడు, భార్య సంసారం చూడాలి. మనం ఆ పెళ్ళి మనిద్దరం కలిసి చేసాం- మహాలక్ష్మికి నేను మాట యిచ్చాను, లీల సంసారం కుదుట పడుతుంది బెంగపడకని! ఈరోజు నాకేమీ పట్టనట్టు ఊరుకోనా?" - తులసమ్మ గొంతు గాద్గదికమైంది.... ఆయాసం ఎక్కువైంది.
"అలాగే, నువ్వు చెప్పినట్టే చేద్దాం -ముందు విశ్రాంతి తీసుకో! సుధాకర్ కి ఫోను చేసా- వస్తాడు నాలుగు రోజుల్లో!" అన్నాడు తులసమ్మ వైపు చూస్తూ.
అన్నం తెచ్చిన కారియర్ బల్ల మీద పెట్టి లీల పక్కన నిల్చుంది.
"వచ్చావే తల్లీ..!" అంది తులసమ్మ.
మంచంమీద కూచుంది లీల.
"మా వారొచ్చారు" అంది ముసిముసిగా నవ్వుతూ లీల.
"మీవారా..?" ఆశ్చర్యంగా చంద్రయ్యా, తులసమ్మ లీలవైపు చూసారు....
ఇప్పుడేగా... 'నాలుగు రోజుల తర్వాత వస్తాడు సుధాకర్' అని తను ఫోన్ చేసానని చెప్పాడు చంద్రయ్య- అనుకుంటూ గుమ్మంలోకి చూసేసరికి సుధాకర్ ఎదురుగా నించున్నాడు.
"అమ్మమ్మా... ఎలా వున్నావు?" అన్నాడు దగ్గర కూచుని సుధాకర్. తులసమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
'ఇప్పుడే చెప్పాలా, వద్దా...' అని సంకోచిస్తూ చాలాసేపు కూచున్నాడు అలానే.... మనిషిలో చాలా మార్పు కనిపిస్తోంది తులసమ్మకి.
"ఆరోగ్యంగా వుంటున్నావా?" అంది నెమ్మదిగా.
ఉలిక్కిపడ్డాడు సుధాకర్. ఈ అమ్మమ్మ కనిపెట్టేసిందా- తను ఆపకుండా సిగరెట్లు కాల్చేస్తున్న సంగతి?
"బాగానే వున్నాగా..!" అన్నాడు.
చంద్రయ్య బయటకెళ్ళాడు పని వుందని!
"ఓ మాట చెప్పాలని వచ్చా - ఇల్లు కొంటానని నేనుండే ఇల్లుగలాయన అంటున్నాడు - నీకీ విషయం చెప్దామని" అన్నాడు.
"సరే! మరి లీల సంగతి ఏమిటీ..? - అయినా నువ్వు ఇక్కడ కొచ్చేయ్! ఈ ఇంట్లో ఇద్దరూ హాయిగా వుండండి? దానికీ ఓ పిల్లా, పాపా బయల్దేరితే..?"
తులసమ్మ మాటలు ఏ ఒక్కటీ నచ్చలేదు సుధాకర్ కి.
'ఈ ఇల్లు అమ్మేయాలి..... తనుండే ఇల్లుగలాయన చాలా డబ్బున్న వాడు. ఆయన వ్యాపారంలోనే తనకీ ఏదో ఉద్యోగమిస్తానన్నాడు..... అంతేకాదు, ఆయనకున్న ఒక్క కూతురూ వితంతువైపోయింది. ఆ బాధ ఆయనకెలాగూ వుంది - ఏ విధంగా ఆలోచించినా ఇల్లు అమ్మేసి వెళ్ళిపొవటమే దారి!' -సుధాకర్ తులసమ్మకేసి చూసాడు.... మగతగా పడుకుంది.
ఇల్లు అమ్మాలి, ఏదో కొంత లీలకి ఇచ్చేయాలి - ఆ తర్వాత సంగతి తర్వాతే - సుధాకర్ ఊపిరి గట్టిగా పీల్చాడు! ఇవన్నీ ఎప్పటికి తేలాలి - తన బతుకు ఎప్పటికి ఓ దారిలో పడాలీ - ఏమో!!   
సుధాకర్ వెళ్ళిపోయాడు.
లీల తులసమ్మ మంచం పక్కన కూచుంది.   
                                    *    *    *
సుమతి పిల్లాడు ఇంటికి రాగానే రాజీవ్ కి ఎంతో హాయిగా అనిపించింది.
"పనిమనిషి రావటం లేదా?" అంది గదుల వంక, వంటింటి వైపు చూస్తూ సుమతి.
"ఆ... నేనే వద్దన్నా... అది ఏ టైముకొస్తుందో- నేనంటే రెండు రోజులు హోటల్లో తినేస్తా - దాని కోసం ఎవరు కనిపెట్టుకునుంటారూ?" అన్నాడు రాజీవ్.
"మీ చెల్లెలింట్లో తినలేకపోయారా, హోటల్లో ఎందుకూ?" అంది- దండెం మీద ఆరివున్న బట్టలు తెచ్చి మడతపెడుతూ.
"నీకు చెప్పలేదు కదూ, రవికి ట్రాన్స్ ఫరయింది, వెళ్ళిపోయారు" అన్నాడు.
సుమతి చాలా కోపంగా "నాకు తెలుసు, మీరు ఆ పిల్లని ఎక్కడ పెట్టారో కూడా నాకు తెలుసు" అంది.
రాజీవ్ ఉలిక్కిపడ్డాడు, ముఖం వెలవెలపోయింది.
"ఏమిటీ... నీకు తెలియదు నువ్వేం మాట్లాడుతున్నావో!" అన్నాడు ఖంగారుగా.
"మీరెన్ని అబద్దాలు చెప్పినా మీ గారాల చెల్లెలి భర్త రవి నాకూ దూరపు చుట్టం, ఆ పెళ్ళి సంబంధం కుదిర్చింది నేనేనని మర్చిపోకండి"
"ఐతే..." - ఇంకా ఏమేమి చెపుతుందోనని భయపడిపోతున్నాడు రాజీవ్.
రవి చెల్లెలిది సుమతిది ఒక ఊరే! సుమతి తల్లికి సుస్తీగా వుందని వెళ్ళినపుడు రవి చెల్లెలు కనిపించి, "నువ్వు చూడనన్నావుటగా సుమతీ- మా అన్నయ్య చెప్పాడు. మా అన్నయ్యకి పిల్లలంటే చాలా ప్రేమ! -అందులోనూ తల్లీతండ్రీ లేని పిల్ల కదా అని, మీ ఆడబిడ్డ కూడా వద్దుకాక వద్దందిట - చాలా విషయాలు చెప్పింది లెండి" అంది మూతి తిప్పుతూ సుమతి.
"చెప్పు, ఇంకేం చెప్పిందో!" అన్నాడు రాజీవ్.
"ఇంకేం చెప్పింది- రవికి ట్రాన్స్ ఫరయిందని, ఆ పిల్లని కూడా తీసుకుని విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారనీ, ఇంకా, నేను వచ్చే రోజు కలుద్దామనుకున్నా అది ఢిల్లీ వెళ్ళిపోయింది" అంది సుమతి చీర మడత పెడుతూ.
విశాఖపట్నం తీసికెళ్ళిపోదామనుకుంటున్నాడని చెప్పింది కదా! రాజీవ్ కి చాలా హాయిగా వుంది సుమతికి- పూర్తి నిజం తెలియనందుకు.
"అయినా సుమతీ, నువ్వు తీసుకురావటానికి వీల్లేదన్నావు - ఎక్కడ పెడతాను ఆ పిల్లనీ..? - అందుకే మా చెల్లెలు, బావగారికి ఇచ్చా, వాళ్ళు పెంచుకుంటారు- గొప్ప ఆఫీసరు కూతురిలా పెరుగుతుంది- నీకేం బాధ?" అన్నాడు.
"ఆరోజు మీరు- 'ఎక్కడో వదిలేసా పిల్లని' అన్నప్పుడే అనుకున్నా.... ఇలాంటిదేదో చేసి వుంటారని - మీరెందుకు దింపుతారు దాన్ని అనాధాశ్రమంలో? - మీ కున్న బంధాలు ఎందుకు తెంపుకుంటారూ" అంది కోపంగా.
"ఏదో పిచ్చి వాగుడు - ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుందో తెలిసిందిగా నీకు!" అన్నాడు.
"ఆ - విశాఖపట్నంలో మీ చెల్లెలిదగ్గర, సరేనా..!"
"సరే..!" రాజీవ్ వంటింట్లోకెళ్ళి కాఫీ కప్పులో పోసుకొచ్చాడు.
                                     *    *    *
జానకి పిల్లని తీసుకుని కారు దిగింది.
మమతని పడగ్గదిలో మంచం మీద పడుకోపెట్టింది. టైము చూసింది.... 'ఇంకా రాలేదే..!' అనుకుంది మనసులో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS