నా కోడలు ఎలా వుంది?
ఇక్కడ అరుణ్ ఎప్పుడూ సంధ్య జపం చేస్తుంటాడు. ఒకరోజు 'సంధ్యా' అంటూ పెద్దగా కేకవేస్తూ నిగ్రలోంచి హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. ఏమిట్రా అని అడిగితే, "సంధ్యని ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోతున్నాడు" అంటూ చెప్పాడు. "నీ ముఖం! రాక్షసుడేమిటి? ఎత్తుకుపోవడం ఏమిటి?" అని కసిరి పడుకోబెట్టాను. బావ బావంటూ కలవరిస్తూండాలి సంధ్య.
ఇప్పటికింతే సంగతులు.
అన్నయ్యగారికి నమస్కారాలు చెప్పు!
సంధ్యకి ముద్దులు. జాబు వ్రాయి.
" ఇట్లు
జానకి.
మరో నెలరోజులకేమో, అరుణ్ వ్రాశాడు సంధ్యకు, దసరా శుభాకాంక్షలు తెలుపుతూ.
"ప్రియమైన సంధ్యకు,
దసరా శుభాకాంక్షలు, ఈ దసరాకి మేం అక్కడ లేంగా? పండక్కి ఏమేం స్వీట్స్ తిన్నావ్? నీకు స్వీట్సంటే చాలా ఇష్టంగా నాకోసం స్వీట్స్ దాచావా? దాచే ఉంటావు. ఏయ్, మొద్దూ! నేనిక్కడ! స్వీట్స్ అక్కడ! ఎలా తింటాననుకొన్నావు?
నాకు బడిలో క్రొత్త స్నేహితులు చాలా అయ్యారు. ముఖ్యంగా సీను అనే అబ్బాయితో, ప్రతిమ అనే అమ్మాయితో నాకు మంచి స్నేహం ఏర్పడింది. ప్రతిమా వాళ్ళు మాకు బంధువులేనట. వాళ్ళ మమ్మీ, డాడీ మా ఇంటికి వస్తూ ఉంటారు.
ఇంకేం రాయాలబ్బా?
ఆఁ, అమ్మ సమ్మర్ సెలవుల్లో రాజానగరం వెడదాం అంది. నేను నీకోసం వింత వింత బొమ్మలూ, బొమ్మల పుస్తకాలూ కలెక్ట్ చేస్తున్నాను. నేను వచ్చేటప్పుడు తెస్తాను. ఒక పిలక బ్రాహ్మడు మంత్రాలు చదువుతూంటే, ఒక ముత్తయిదు పెళ్ళిపాటలు పాడుతుంటే, భజంత్రీవు నాగస్వరం పాడుతూంటే, ఆ బొమ్మలసెట్టు ఎంత బాగుందో? ఇంక ఉంటాను. నువ్వూ ఉత్తరం వ్రాయి.
ఇట్లు
___"నీ అరుణ్ బావ."
జానకి చెప్పి వ్రాయించినట్టుగా ఉంది. సరిగా వ్రాయడం చేతగానట్టుగా ఉన్న అక్షరాలు. ఒక్కో అక్షరం కూడబలుక్కుని చదివింది మూడో తరగతికి వచ్చిన సంధ్య.
* * *
రాకపోకలు అసలే లేవు.
క్రమంగా ఉత్తరాలు కూడా అదృశ్యమైపోయాయి!
పన్నెండు సంవత్సరాలు కాలగర్భంలో కలసిపోయేసరికి రుక్మిణి భర్తను పోగొట్టుకొని ఈడొచ్చిన కూతురితో మిగిలిపోయింది.
ఇన్నేళ్ళయినా ఇరుగుపొరుగులతో స్నేహ సంబంధాలులేవు. పలకరించే తోడు లేదు. ఉన్న కాస్త పొలం కౌలుకిచ్చేసింది. వచ్చే ధాన్యంతో దినచర్య అతి పొదుపుగా గడుస్తూంది. ఒకరోజు పరమాన్నం కాచుకొంటే మరురోజు ఉపవాసం చేయాల్సిన పరిస్థితి. కూతురి పెళ్ళి ఎలా చేయగలదు? డబ్బులేదు. కులం లేదు, సంప్రదాయం లేదు. ఒక అందం తప్ప ఇంకే అర్హతలేని తన కూతుర్ని ఎవరు చేసుకొంటారు?
ఒకరోజు పొలనికి సంబంధించిన కాగితాలకోసం పెట్టెలో వెదుకుతూంటే, పది పన్నెండేళ్ళ క్రితం జానకివ్రాసిన ఉత్తరం చేతికి వచ్చింది రుక్మిణికి. కావలసిన కాగితం విషయం మరిచిపోయి, ఆ ఉత్తరం చదువుతూ కూర్చొంది.
చీకటిలో చిన్న మెరుపు మెరిసినట్టుగా, చిన్న ఆశ తళుక్కుమంది, రుక్మిణి మనసులో. గతంలో తమ స్నేహానుబంధం ఏ కాస్త జ్ఞాపకమున్నా, సంధ్యని తన కోడల్ని చేసుకోదూ జానకి? ఒకసారి జానకిని కదిపి చూస్తే? ఆనాటి వాగ్దానం గుర్తుచేస్తే?
కాగితం సంగతి ప్రక్కకుపెట్టి ఉత్తరం వ్రాయడానికి కూర్చొంది రుక్మిణి.
"ప్రియమైన జానకి వదినకు,
ఈ మధ్య నీ క్షేమసమాచారములు బొత్తిగా తెలియడం లేదు. ఉత్తరాలు కూడా వ్రాయడం మానేశావుకదా? నాకూ మొదటినుండీ ఉత్తరాలు వ్రాసే ఓపిక లేదు! ఇప్పుడు సంధ్యకోసం ఓపిక తెచ్చుకోక తప్పడంలేదు. సంధ్య అంటే ఇంక ఫ్రాకుల్లోనే ఉందనుకొన్నావా, ఏం? ఇప్పుడు దానికెన్నేళ్ళో తెలుసా? ఇరవయ్యేళ్ళు.
