"ఆయనిచ్చిన ఆ రెండురూపాయలు లక్షరూపాయల విలువచేస్తుంది బాబూ. ఏదీ ఆ రెండురూపాయల నోటు. అదే ఆ లక్షరూపాయల నోటు ఇలా తే బాబూ. పోపులడబ్బాలో భద్రంగా దాస్తాను."
గోపి దగ్గర్నుండి రెండురూపాయల నోటుని తీస్కుంది సరస్వతి.
రాయుడు కాలుకాలిన పిల్లలా అటూఇటూ అరగంటనుండి తిరగుతున్నాడు వరండాలో. అలా తిరుగుతూ తిరుగుతూ మధ్య మధ్య హూకరిస్తున్నాడు. అతని ముందు నలుగురు రౌడీలూ చేతులు కట్టుకుని దీనంగా నిల్చునివున్నారు.
"హు... నేనింక ఇట్టా తిరగలేను. నాకాళ్ళు సెప్పెడుతున్నాయ్" అంటూ అక్కడవున్న ఈజీచైర్ లో కూర్చున్నాడు రాయుడు.
రాయుడంటే ఆ ఏరియా మొత్తానికి ధనవంతుడు. అక్కడ రాయుడొక్కడికే పెద్ద బంగళావుంది. మిగతా అందరికీ పెంకిటిళ్ళూ, పూరిగుడిసెలే.
రాయుడంటే అందరికీ హడలే. ఆడవోళ్ళకైతే మరీ. ఏ ఆడదాని మీదైనా రాయుడి కన్ను పడిందంటే ఆ ఆడదాని శీలం పోవాల్సిందే.
రాయుడికి యాభై ఏళ్ళు ఉంటాయ్. మధ్యపాపిడి, క్రాపూ, కళ్ళకి కళ్ళద్దాలతో, గుబురు మీసాల్తో, లాల్చీ, పంచె ధరించి లావుగా పొట్టిగా ఉంటాడు.
తన ముందు దేభ్యం మొహాలేస్కుని నిల్చునివున్న రౌడీలనుచూసి రాయుడు మరోసారి మండిపడ్డాడు.
"వెధవల్లారా? ఏంట్రా ఆ షేపులు అవుటయిపోయిన అవతారాలు? పందికొక్కుల్లా తిని కండలు పెంచారు ఏం లాభం? నలుగురు కలిసి ఒక్కడిని తన్నలేకపోయారు."
"అసలు నేను ముందే చెప్పనండీ వాడిజోలికి వెళ్ళొద్దురా ఎట్టాగు మనం కాజాలు తినాల్సిందే ఎందుకొచ్చిన గొడవా అని! కానీ నా మాట వీళ్ళు వినలేదండి" అన్నాడు ఒక రౌడీ మిగతా రౌడీలను చూపిస్తూ.
"మేమెన్నెన్ని కాజాలు తిన్నామంటే వీడేమో రెండు డజన్లు... నేనేమో డజనున్నర వాడేమో మూడు డజన్లూ ఇంక వీడేమో..." లె "వాడే బాబూ. ఆరోజు మీకోసం సీతాలుని తేవాలని అనుకుంటే అడ్డుపడింది కూడా ఈ గోపీయే బాబూ."
"సన్నాసుల్లారా. మీరెందుకు పనికిస్తార్రా."
"మీకోసం ఓ మంచి విషయం ఉందండీ"
"ఏంట్రా అదీ?"
"ఆ గోపిగాడి పెళ్ళాం బంగారపు బొమ్మలా ఉంటుందండీ"
"ఆ నిజంగానా?" రాయుడు లొట్టలు వేశాడు. "అయితే దాన్ని ఓ చూపు చూడాల్సిందే" అన్నాడు చొంగకారుస్తూ.
12
ఆరోజు ఉదయమే రాధ నీళ్ళు తేడానికి చంకలో బిందె పట్టుకుని చెరువు దగ్గరికెళ్ళింది.
అప్పటికే అక్కడ డజనున్నర ఆడాళ్ళు చంకల్లో బిందెలు పెట్టుకుని ఉన్నారు.
"ఆ. వచ్చావా రాధా. నువ్వు ఇంక రాలేదేమా అని చంకల్లో బిందెలు అతికించేస్కుని ఇందాకట్నుంచి నీకోసం ఎదురుచూస్తున్నాం" అన్నాడు వాళ్ళు పట్టలేని ఆనందంతో.
"అబ్బో అబ్బో మీరంతా అప్పుడే వచ్చాశారే?" అంది రాధ కూడా వాళ్ళనిచూసి పట్టలేని ఆనందంతో.
వాళ్ళంతా రాధ జోకేదో వేసినట్టు కిలకిలా నవ్వారు.
"ఇది చెరువు కాబట్టి సరిపోయింది. ఇంతమందిమి ఒక్కసారి వచ్చినా ఫరవాలేదు.అందరం బిందెలు నీళ్ళలో ఒక్సారి ముంచుకోవచ్చు. అదే కొళాయి అయితే కొప్పులు ఊడేలా తన్నుకుని ఉండేవాళ్ళం. నీళ్ళు నేను ముందు పట్టుకుంటానంటే నేను ముందు పట్టుకుంటానని." అంది రాధ.
ఆ డజనున్నర మందీ మళ్ళీ ఒక్కసారిగా గిలగిల్లాడిపోతూ నవ్వారు.
ఇంతలో రాధకి ఏంపుట్టిందో ఏమో చంకలోని బిందెతీసి చెర్లోకి విసిరేసింది.
మిగతా అందరుకూడా "హెయ్ య్ య్ " అనరుస్తూ బిందెల్ని చెరువులోకి విసిరేశారు.
ఆ బిందెలన్నీ నీళ్ళమీద తెప్పలా తేల్తుండగా రాధ చెంగున ఒక్కగెంతు గెంతి చెరువుగట్టుమీద చతికిలబడింది. మిగతా అందరూ కూడా రాధప్రక్కన చతికిలబడ్డారు.
రాధ తనచీరను మోకాళ్ళపైదాకా లాక్కుని కాళ్ళని నీళ్ళలో పారేసింది.
వాళ్లుకూడా డిటో....
రాధ నీళ్ళు చిందేలా నీళ్ళలో కాళ్ళు ఊగిస్తూ "సా..." అంది.
వాళ్ళందరూ కూడా నీళ్ళలో కాళ్ళు ఊగిస్తూ కోరస్ గా "సా..." అన్నారు.
"సరిగమపా...." అంది రాధ చీర మరికాస్త పైకిగుంజుతూ.
"సరిగమపా." కోరస్... చీర కూడా పైకి డిటో.
"గమపనిసా..." రాధ.
"గమపనిసా..." కోరస్.
"ఆ..." రాధ.
"ఓ..." కోరస్.
అంతే...
రాధ పాటెత్తుకుంది.
"ఏందోనమ్మా ఈ యవ్వనం...
ఊపిరి సలపనివ్వనంటుంది....
నన్ను సంపుతా ఉంది...
".... నాప్రాణం తీస్తా ఉంది. హోయ్" అని పాడింది రాధ.
"అది అంతేనమ్మా యవ్వనం...
అది మాయదారి యవ్వనం. హోయ్" అంటూ వంతపాట పాడారు కోరస్.
చెర్లోని సగం చేపలు చచ్చేలా కాళ్ళు యమస్పీడుగా ఊపుతూ అలా పాట మొత్తం పాడేశాక అందరూ ఈజీగా కిలకిలా నవ్వేసి చెర్లో అంతదాకా తేల్తున్న బిందెల్ని ఎవరివివాళ్ళు అందుకుని నీళ్ళు ముంచుకున్నారు.
అందరూ నీళ్ళ బిందెల్ని చెంకలోకి ఎత్తుకుని మళ్ళీ ఎందుకో కిలకిలా నవ్వారు.
రాధ కూడా తన బిందె అందుకుని చెర్లో ముంచింది.
సరిగ్గా అప్పుడే ఆ డజనున్నర ఆడాళ్ళూ "కెవ్వు కెవ్వు" మని అరవడం మొదలు పెట్టారు.
రాధకి ఒళ్ళు మండింది.
"ఎందుకలా అరుస్తారు? మీరేమో నీళ్ళు ముంచుకోవచ్చా?... నేను ముంచుకుంటే కొంపలు మునిగేలా అరుస్తారేం...? నేనేమైనా మీకంటే ఒక బిందె నీళ్ళు ఎక్స్ ట్రాగా తీస్కెళ్తున్నానా? తీస్కెళ్తే ఈ చెరువెండిపోతుందా?" అంది.
"మేము అరిచింది అందుక్కాదు రాధా... అదిగో అటు చూడు... దూరంగా రాయుడు ఇటే వస్తున్నాడు" అంది ఒక అమ్మాయ్ కంగారుగా.
"వస్తేరానీ... అతను కూడా చెర్లో తన బిందె ముంచుకుంటాడు ... నీళ్ళు అవసరం లేనిది ఎవరికి?... పాపం అతన్ని కూడా తీస్కెళ్ళనీ. ఎంతమంది నీళ్ళు తాగినా చెరువు ఎండిపోదు." అంది రాధ.
"హయ్యో రాత.... రాయుడి సంగతి నీకు తెలియదులా ఉంది. అతను ఈ పేటకే డబ్బున్నవాడు. అతని కన్ను పడిన ఆడదాని శీలం పోవాల్సిందే. పద.... మనం పారిపోదాం..."
"నేను రాను.... ఆ రాయుడు నన్నేమీ చెయ్యలేడు. అయినా అతనికి నేనెందుకు భయడాలి? నేను పవిత్ర భారత నారిని. తెలుసా?" అంది రాధ పౌరుషంగా.
"ఏమో బాబూ... మేమైతే కాదు. నీ ఖర్మ. నువ్వు ఇక్కడే ఉండు. మేం పోతాం." అంటూ అందరూ బిందెలు చంకల్లో పెట్టుకుని పోలొమని పరుగుతీశారు.
రాధ రాయుడు అక్కడికి వచ్చేదాకా చంకలో బిందెతో ఎదురుచూసింది.
రాయుడు నోట్లో చుట్ట పొగలు చిమ్ముతుండగా తన అనుచరుడైన సంతానంతో అక్కడికి వచ్చాడు.
అతని కన్ను రాధమీద పడనే పడింది.
"ఎవర్రా సంతానం ఈ పిల్ల? పిటపిటలాడిపోతుంది?" అన్నాడు రాయుడు తడిచిన చీరలోని రాధ అందాలను పరిశీలించి చూస్తూ.
"ఇదా?.... ఆ గోపివాడు లేడండీ... అదేనండీ.... ఈ మధ్య మన రౌడీలను చితక బాదుతున్నడే .... ఆడి పెళ్ళాం..." రాయుడి చెవిలో చెప్పాడు సంతానం.
"మన రౌడీనాయాళ్ళకి మంచి టేస్టే ఉందిరేయ్. ఆళ్ళు చెప్పినట్టు ఇది అందగత్తే!..... ఇది గోపిగాడి పెళ్ళామన్నమాట. అయితే దీన్ని ఓ చూపు చూడాల్సిందే." అన్నాడు రాయుడు మీసాలు మెలేస్తూ.
"వద్దు మహాప్రభో.... అది నిప్పిలాంటి పిల్ల. దగ్గరికెళ్తే కాల్తుంది." అన్నాడు సంతానం.
"ఇలాంటి నిప్పుల్ని చాలా చూశాం. చాలా ఆర్పాం. ఇదొక లెక్కా?" అన్నాడు రాయుడు గర్వంగా.
అప్పటిదాకా బొమ్మలా నిల్చున్న రాధ ఇంటివైపు అడుగులు వేసింది.
