Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 15

 

                        మహారాణి - వీణ పెట్టె
                
                                                                                          వసుంధర
    ఆమె బీచి వద్ద కూర్చుని వుంది. గాలికి కదలాడే కురులను ఒక్కసారి కూడా సవరించుకోవడం లేదు. ఆమె దీర్ఘాలోచనలో వున్నదనడం లో ఏమాత్రం సందేహం లేదు.
    అతను కొంతదూరం వుండి ఆమెనే పరిశీలిస్తున్నాడు. అతడామెను యధాలాపంగా చూడడం లేదు. అతడి కళ్ళు ఆమెలోని ఎత్తు పల్లాల్ని నిశిత దృష్టి తో పరికిస్తున్నప్పటికి వాటిలో కోర్కె కు మించి ఆశ ప్రతిఫలిస్తోంది.
    కొంతసేపయ్యాక అతడామెను సమీపించాడు.
    ఆమె అతడిని పట్టించుకోలేదు.
    "నమస్కారం మేడమ్!'అన్నాడతను.
    ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగింది. అతడి వంక అదోలా చూసింది. అందమైన ఆడవాళ్ళు పలికితే బంగారమవుతుంది. అందుకని వాళ్ళట్టె మాట్లాడరు. ఆమె అతడి వంక నువ్వెవరు -- అన్నట్లు చూసింది. నాపేరు రామం. నాకు మీ పేరు సునంద అని కూడా తెలుసు. మిమ్మల్ని రెండు రోజుల క్రితం బజార్లో చూశాను. అప్పట్నించి ఓసారి కలుసుకుని మాట్లాడాలని ప్రయత్నం. ఇప్పటికి సిద్దించింది --"అన్నాడతను.
    ఆమె ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడతానన్నట్లు చూసింది.
    "కూర్చోమంటారా?" అన్నాడు రామం.
    ఆమె కూర్చోమనలేదు. కానీ అతడు కూర్చున్నాడు.
    సునంద ఇబ్బందిగా ముఖం పెట్టింది.
    "మీరు బియ్యే సెకండియర్ చదువుతున్నారు. నేను బియ్యే ప్యాసై మూడేళ్ళ యింది. ఈ ఊళ్ళో నే దియేటర్ కల్యాణి మాదే!"
    అప్పుడామే కళ్ళలో రవంత కుతూహలం కనబడింది.
    "నాన్న నాకా దియేటర్ వదిలేస్తానంటున్నాడు. మా అన్నయ్యకు రాజమండ్రిలో క్రూసిబుల్ ప్యాక్టరీ వుంది. మాకింకా చాలా వ్యాపారాలున్నాయి. దియేటర్ చూసుకుందామా , మరేదైనా వ్యాపారం చేసుకుందామా అని ఆలోచిస్తూ ఇంకా ఏదీ తేల్చుకోలేదు. ఎందుకంటె ఈ విషయంలో కాబోయే భార్య సలహా తీసుకుందామని ఆగాను. అన్నట్లు నాకింకా పెళ్ళి కాలేదు...."
    సునంద ఇంకా నోరు విప్పలేదు. ఇంకా చెప్పమన్నట్లు చూసింది.
    "పెళ్ళి చేసుకోమని నాన్నా బలవంత పెడుతున్నారు. ఎందరో ఆడపిల్లల తండ్రులూ బలవంత పెడుతున్నారు. కానీ నేనే ఒప్పుకోవడం లేదు. నాకు నచ్చిన పిల్లను నేనే వెతుక్కుంటానని బయల్దేరాను....అయితే పని గట్టుకుని ఇదే చూడడం లేదు. రెండ్రోజుల క్రితం మిమ్మల్ని బజార్లో చూశాను.
    అప్పటికి సునంద నోరు విప్పింది --" అయితే ఏమంటారు?"
    "మీరిష్టపడితే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను-- ఆహా అలా కోపంగా చూడకండి -- మీ పెద్దవాళ్ళు, మా పెద్దవాళ్ళు మాట్లాడుకున్నాకనే అన్నీ అవుతాయి. అన్నింటికంటే ముందు నాక్కావలసింది మీ అభీష్టం తెలుసుకోవడం , మీ కిష్ట పడ్డానని ఒక్కమాట చెబితే -- పెళ్ళయ్యే వరకూ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోనని హామీ కూడా యిస్తాను ...." అన్నాడు రామం.
    "మీరు చెప్పడం అయింది గదా -- ఇంక నేను చెప్పవలసింది కూడా వుంది. వింటారా?' అంది సునంద.
    "చెప్పండి!" అన్నాడు రామం ఉత్సాహంగా.
    "నేను మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. సాధారణంగా ఆడవాళ్ళ ఎదుట పడి ఇలా చెప్పగల ధైర్యం ఎంతోమంది మగవారికుండదు. ఆధైర్యానికి కారణం మా ప్రేమ బలమే అయిండవచ్చును. నేనంటే ఇష్టపడే వాడికి బలమైన ప్రేమ వుండాలన్నది నా అబీష్టం --" అంది సునంద.
    "థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్!' అన్నాడు రామం.
    "నేను నా అభీష్టం చెప్పాను తప్పితే మిమ్మల్ని మెచ్చుకోలేదు. మీకు బలమైన ప్రేమ వున్నదో లేదో తెలుసుకోడం కోసం నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు నన్నెంత సూటిగా అడిగారో నేనూ మమ్మల్ని అంత సూటిగా అడుగుతాను. ఏమీ అనుకోరు కదా!"అందిసునంద.
    "అడగండి -- " హుషారుగా అడిగాడు రామం.
    "నాకోసం మీరు ఏమైనా చేయగలరా?"
    "చేయగలను...."
    "బాగా ఆలోచించుకుని మరీ చెప్పండి!' అందామె.
    "మీ విషయంలో ఇంకా ఆలోచన లేదు -" అన్నాడు రామం.
    "నేను సముద్రంలో దూకమంటాను ...."
    "దూకేస్తాను...."
    "మంచు పర్వతాల్లో ఉన్ని బట్టలు లేకుండా తిరిగమంటాను....."
    "తిరుగుతాను...."
    "సింహంతో వట్టి చేతుల్తో పోరాడాలంటాను ...."
    "పోరాడతాను....."
    "నేను సీరియస్ గా చెబుతున్నాను. బాగా ఆలోచించే మాట్లాడుతున్నారా?"
    "నేనూ సీరియస్ గానే చెబుతున్నాను...."
    "అయితే నేను చేసిన హత్యకు మీరు హంతకుడినని  చెబుతారా?" అన్నదామె.
    రామం ఉలిక్కిపడ్డాడు. అతడికి బదులు దొరకలేదు.
    "ప్రశ్న మరోసారి అడుగుతాను. హత్య నేను చేస్తాను. హంతకుడు మీరని చెప్పాలి..."అంది సునంద.
    రామం ఏమనాలో తెలియక ఊరుకున్నాడు.
    "తొందరేం లేదు. బాగా ఆలోచించుకుని నెమ్మదిగా జవాబివ్వండి. నేను రేపు మళ్ళీ బీచికి వస్తాను--' అంటూ లేచి నిలబడిందామె.
    రామం దీర్ఘాలోచనలో పడ్డాడు.
    
                                     2

    మర్నాడు సరిగ్గా అదే సమయంలో రామం, సునంద బీచి వద్ద కలుసుకున్నారు. ఆమె ఆశ్చర్యం గా -- "వచ్చారే?" అంది.
    "మీరు చెప్పిన హత్య గురించిన వివరాలు తెలుసుకోవాలను కుంటున్నాను -"అన్నాడు రామం గంబీరంగా.
    "హత్య ఇంకా జరగనిదే వివరాలెం చెప్పగలను?" అందామె.
    "కానీ నిన్న మీరు హత్య ప్రసక్తి తీసుకుని వచ్చారు?' అన్నాడతను.
    "అవును, నేనొక హత్య చేయవలసి ఉంది --"అందామె.
    "మీ బదులు అ హత్య నేను చేస్తాను ...." అన్నాడు రామం.
    'అలా కుదరదు. హత్య నా చేతుల్తోనే జరగాలి. నేరం మాత్రం నా మీదకు రాకూడదు--" అంది సునంద.
    'అలా ఎందుకు? మీకే ఇబ్బంది లేకుండా పకడ్బందీగా పధకం వేసి నేను వాడ్ని చంపేస్తాను!" అన్నాడు రామం.
    "కానీ అతడికి నా చేతుల్లో చావాలన్నది కోరిక!"
    "అదేం కోరిక ?' అన్నాడు రామం ఆశ్చర్యంగా.
    సునంద వివరించింది.
    రామానికిలాగే మరొక సుందరం ఆమెను ప్రేమించాడు. ఆమె కోసం ఏమైనా చేస్తానన్నాడు. అయితే చస్రావా అనడిగింది సునంద. నీ చేతుల్లో అయితే చావడానికి కూడా సిద్దమే అన్నాడు సుందరం. సునంద అతడి ప్రేమ బలాన్ని పరీక్షించాలనే నిర్ణయించుకుంది. అయితే ఆ హత్యా నేరం భరించే మరో ప్రేమికుడు దొరక్కపోతాడా అనామే ఎదురు చూస్తోంది. ఇప్పుడు రామం దొరకనే దొరికాడు.
    "ఆ సుందరాన్ని మరిచిపో -- నన్నే ప్రేమించు--" అన్నాడు రామం.
    "నాకోసం చస్తాననే అ సుందరం బ్రతికుండగా మరో వ్యక్తీ నేలా ప్రేమించగలను?" అంది సునంద.
    "అయితే అతడినే ప్రేమిస్తున్నావా?" అన్నాడు రామం.
    "నాకోసం చస్తాననే అతడి మాటలు నిజమని నిరూపితం కాకుండా అతడినేలా ప్రేమించగలను?" అంది సునంద.
    రామం తృప్తిగా నిట్టూర్చి -- "అయితే నువ్వు వాడిని ప్రేమించడం లేదన్న మాట. నువ్వేం చెబితే అది చేస్తాను ...." అన్నాడు.
    "హత్య ఎక్కడ చెయ్యాలో చెప్పు " అంది సునంద.
    రామం కంగారుగా ఆమె వంక చూసి -- "అయితే హత్య జరిగి తీరాలంటావా?' అన్నాడు.
    "రామాయణమంతా  విని ఏదో అడిగినట్లుంది....."
    హత్య మా ఇంట్లోనే జరుగుతుంది" అన్నాడు రామం.
    "అలా  వద్దు. చివరి క్షణాల్లో నీ బుద్ది మారిపోవచ్చు. హత్య మా ఇంట్లోనే జరుగనీ....." అంది సునంద.
    'అంతా నీ యిష్టం...." అన్నాడు రామం.
    "రేపు మధ్యాహ్నం మూడింటికి మా ఇంటికి రా-" అంటూ చిరునామా ఇచ్చిందామే.
    
                                      3
    సునంద ఇంట్లోని గది. సమయం మధ్యాహ్నం మూడు గంటలు. గదిలో ముగ్గురున్నారు. రామం, సునంద సుందరం.
    సునంద చేతికి గ్లవ్స్ వున్నాయి. చేతిలో కత్తి వుంది.
    సుందరం మనిషి చాలా నిబ్బరంగా వున్నాడు.
    రామం ఆమె చేతిలోని కత్తి వంక చూస్తున్నాడు.
    సునంద కత్తిని రామం చేతికిచ్చి పిడి వద్ద జాగ్రత్తగా పట్టుకోమ్మంది. అలా చేశాక మళ్ళీ కత్తిని తీసుకుంది.
    "సుందరం -- చావడానికి సిద్దమేనా?' అన్నదామె.
    "నీ చేతుల్లో అయితే చావడానికి ఎప్పుడూ సిద్దమే!" అన్నాడతను ఏమాత్రమూ కంగారు లేకుండా.
    "రామం -- నువ్వూ సిద్దమేనా?" అన్నది సునంద .
    "దేనికి?"
    "కొద్ది క్షణాల్లో సుందరం చచ్చిపోతాడు. ఆ శవాన్నేలా మాయం చేస్తావో అది పూర్తిగా నీ పూచీ. ఈ హత్యతో నాకింకే సంబంధమూ ఉండదు. ఉరికంబమే ఎక్కుతావో - తప్పించుకుని బయటపడతావో -- అంతా నీ సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది...." అంది సునంద.
    'అన్నిటికి సిద్దమే నేను!" అన్నాడు రామం.
    "కత్తి సూటిగా నీ శరీరాన్ని తాకాలి. చొక్కా విప్పు...." అంది సునంద.
    సుందరం చొక్కా విప్పాడు. ఆమె చెప్పకపోయినా అతని బనియన్ కూడా విప్పాడు.
    నిండైన మనిషి అతను. పచ్చని మేనిచాయ.
    రామం సుందరం వంకే చూస్తున్నాడు.
    అతడి కళ్ళలో మృత్యు భయం కనబడదేం? ఇదంతా నాటకమా? ఈ నాటకంతో వీరేం సాధించాలనుకుంటున్నారు? వెచి చూస్తె అంతా తనకే తెలుస్తుంది.
    సునంద చేతిలోని కత్తిని ఓసారి అటూ యిటూ తిప్పింది. సుందరాన్ని సమీపించింది.
    అతడు రెండు చేతులు పైకి ఎత్తాడు.
    "సుందరం -- బాగా ఆలోచించుకో! నేను నిన్ను చంపడం లేదు. నీ ప్రేమ బలాన్ని పరీక్షిస్తున్నాను. పరీక్ష అనవసరమనుకుంటే నిన్ను వదిలిపెట్టేస్తాను....." అంది సునంద.
    "నీ చేతుల్లో చావడమే నా కిష్టం--" అన్నాడు సుందరం.
    "నీ ఆఖరి కోరిక చెప్పు!" అంది సునంద.
    "నీ చేతుల్లో చచ్చిపోతున్నాను. నాకింకా కోరికలు లేవు...."
    సునంద రామం వంక తిరిగింది --"ఈ హత్యా నేరం స్వీకరించడానికి నువ్వు సిద్దంగా వున్నావు గదా!"
    "ఉన్నాను -- " అన్నాడు రామం. సుందరానికున్న నిబ్బరం అతడికి లేదు. మాట కాస్త వణుకుతోంది. ఇదంతా నాటకమని ఏమూలో అతడికి అనిపిస్తున్నప్పటికీ హత్య జరుగుతుందేమో నని భయమూ పుడుతోంది.
    సునంద చేయి గాలిలోకి విసురుగా లేచింది. వేగంగా బలంగా సుందరం పొట్టలోకి కత్తి దిగింది.
    బూస్ మని పొంగింది రక్తం!
    రామం తెల్లబోయాడు.
    సుందరం కుప్పలా కూలిపోయాడు. అతణ్ణి వెల్లకిలా పడుకోబెట్టింది సునంద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS