రామం ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు.
హత్య నిజంగా జరిగింది. తన కళ్ళెదుటే జరిగింది. అందులో ఏ మోసమూ లేదు. ఇప్పుడు తనేం చేయాలి?
సుందరం నేలమీద పడివున్నాడు. రక్తం నేల మీద కూడా ప్రవహిస్తోంది. అతడి స్వరం కూడా హీనంగా ఉంది.
"సునందా -- నా ప్రేమ బలం తెలిసింది కదూ!" అన్నవి అతడి ఆఖరి మాటలు. అప్పుడు తల పక్కకు వాలిపోయింది.
"రామం -- ఇంక నువ్వు రంగంలోకి దిగాలి!" అంది సునంద అతడి వంకనే సునిశితంగా చూస్తూ.
రామం ఆమె వంకనే చూశాడు. ఆమె ముఖంలో ఎక్కడా భయం లేదు. జాలి లేదు. బాధ లేదు.
ఈమె మనిషా, రాక్షసా? అనుకున్నాడతను. నిలువునా హత్య చేసింది ఒక అమాయకుడ్ని. ఆ విషయమై ఏ మాత్రమూ ఆలోచించకుండా తనను హత్యా నేరం భరించ మంటోంది.
"ఇప్పుడు నేనేం చేయాలి?" అన్నాడు రామం.
"శవాన్ని మాయం చేయాలి!" అంది సునంద.
"ముందు బయట ఎవరైనా ఉన్నారేమో చూద్దాం"అన్నాడు రామం.
"ఇంట్లో ఎవ్వరూ లేరు. అంతా సినిమాకు పోయారు" అంది సునంద.
"బయటంటే వీధిలో అని నా ఉద్దేశ్యం -- " అంటూ రామం వీధిలోకి నడిచాడు.
సునంద అతడి కోసం ఎదురు చూస్తోంది. రామం ఎప్పటికీ రాలేదు.
4
"ఎవరు కావాలమ్మా!" వినయంగా అడిగాడు మేనేజర్.
"ఓనరు గారబ్బాయి ....-- పేరు రామం ...." అంది సునంద.
"ఆయనిప్పుడు దియేటర్లో పిక్చర్ చూస్తున్నారు..." అన్నాడు మేనేజర్.
సునంద అతణ్ణి వివరాలడిగింది. మేనేజర్ ఆమెకు రామం కూర్చున్న స్పెషల్ బాక్స్ సీట్లోకి తీసుకు వెళ్ళాడు. ఆమెను చూస్తూనే రామం కంగారు పడ్డాడు.
"మీ దియేటర్లో సినిమాయే గదా! ఎప్పుడైనా చూడొచ్చు. అర్జంటుగా నీతో మాట్లాడాలి....నాతొ వస్తావా?" అంది సునంద.
రామం మాట్లాడకుండా లేచి ఆమెతో బయటకు వచ్చాడు.
"గోప్పవాడివె నువ్వు ....మాటిచ్చి పారిపోతావా?' అంది సునంద.
"ఏదో నాటకం అనుకున్నాను. కానీ నిజంగా హత్య చేస్తావనుకోలేదు...."అన్నాడు రామం.
"నీ మాట నమ్ముకుని హత్య చేశాను. ఇప్పుడు నాకేది దారి?" శావాన్నింట్లోంచి ఎలా తప్పించాలో తెలియడం లేదు...."అంది సునంద.
"నువ్వు మనిషివా, రాక్షసి వా -- నిలువునా నిండు ప్రాణాన్ని తీసేశావు . మగాణ్ణి -- నేనే ఆ దృశ్యాన్ని తట్టుకోలేకుండా వున్నాను. నువ్వెలా తట్టుకున్నావో తెలియడం లేదు...."
'అంతా నీ ధైర్యం మీద చేశాను ...." అంది సునంద.
రామానికేం చెప్పాలో తెలియలేదు. ఈ హత్య తన ప్రోత్సాహం వల్లనే జరిగిందా? ఒక నిండు ప్రాణం పోవడానికి నేనే కారకుడయ్యాడా?
"ఏం చేశావు?"
"కాసేపు నీ కోసం ఎదురు చూశాను. తర్వాత నువ్వు పారిపోయావని గ్రహించాను. అప్పుడు నాకు భయం వేసింది. గదిలో చిందిన రక్తమంతా తుడిచి శుభ్రం చేశాను. నా గదిలో వీణ పెట్టె వుంది. అందులోంచి వీణ తీసి బైట పెట్టాను. కష్టపడి శవాన్ని పెట్టెలో పెట్టాను. మూత వేసి నీ కోసం దియేటర్ కి వచ్చాను. లక్కీగా దొరికావు...." అంది సునంద.
"ఇప్పుడు నేనేం చేయాలి?"
"ఆ హత్య చేసింది నువ్వు, ఎలా తప్పించుకుంటావో చూసుకో-" అంది సునంద.
"ఈ హత్యలో నాకే సంబంధమూ లేదు-" అన్నాడు రామం.
"ఇదేనా నీ ప్రేమ బలం !' అంది సునంద.
"ఒక హంతకురాల్ని నేను ప్రేమించలేను--" అన్నాడు రామం.
"నువ్వు మోసగాడివి. నీ మొహం చూస్తె పాపం -" అంది సునంద అక్కణ్ణించి వెళ్ళిపోతూ.
రామం ఇంక సినిమా చూడలేదు. అతడు తిన్నగా ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళగానే తల్లి పలకరించి -- "ఏరా రామం ! ... నువ్వు వీణ ఎప్పట్నించీ నేర్చుకుంటున్నావు ?" వ్యవహారం వీణ కొనుక్కునే దాకా వచ్చిందే!' అంది.
"వీణ నేర్చుకోవడమేమిటి?" కొనడమేమిటి?" అన్నాడతడు.
తల్లి చెప్పింది. ఓ రిక్షావాడు తీసుకొచ్చి రామం కోసం వచ్చానని ఓ వీణ పెట్టె ఇచ్చి వెళ్ళిపోయాడట....
"అది నీ గదిలో వుంది. పోయి చూసుకో--" అంది తల్లి.
రామం తన గదికి వెళ్ళాడు. అక్కడ నిజంగానే వీణ పెట్టె ఉన్నది. పెట్టెకు తాళం ఉన్నది.
రామానికి సునంద మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె తెలివిగా శవాన్ని తనకు అంటగట్టింది.
తనిప్పుడీ శవాన్నీ ఏం చేయాలి? రేపటి ఉదయానికి శవం వాసన రావడం ప్రారంభిస్తుంది. ఈలోగా ఈపెట్టేను వదుల్చుకోవాలి.
రామం ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు తనేం చేయాలి?
దొడ్లో పాతి పెడదామా అంటే తల్లికి ఆ పెట్టె గురించి తెలిసిపోతుంది. వివరాలడుగుతుంది. ఏదో వంక పెట్టి దాన్ని బైటకు తీసుకుని పోవాలి.
రామం పెట్టెను పరీక్షగా చూశాడు.
వెధవది ... చాలా పొడుగ్గా వుంది. కారు టాపు మీద వెయ్యాలి. అలా వేస్తె అందర్నీ ఆకర్షిస్తుంది.
అతనింకా అలోఛిస్తుండగానే తల్లి ఆ గదిలోకి వచ్చింది -- "ఒక సారి వీణ ను బైటకు తియ్యరా?" ఎలా ఉందొ చూస్తాను ...."
రామం తడబడుతూ -- "పెట్టెకు తాళం వుందమ్మా -- ఇదెవరు పంపారో కూడా నాకు తెలియడం లేదు. నేను వీణ నేర్చుకోవడం - అంతా అబద్దం ఈ వెధవ పెట్టెలో ఏముందో ఏమిటో -- ఎవడో కావాలని మనకు అంటగట్టారు...." అన్నాడు.
"అయితే ఏముందంటావ్ ?' అంది తల్లి కంగారుగా.
"ఏమో - ఏదైనా శవామున్నా ఉండవచ్చు. దీన్ని ఎవరికీ తెలీకుండా బయట వదిలిపెట్టాలి-" అన్నాడు రామం.
అతడి తల్లి కంగారు పడింది -- "అయితే తొందర పడకు. మీ నాన్న వచ్చేక పెట్టి తెరిచి చూసి ఏం చేయాలో అలోచిద్దువు గానీ--"
'అంతవరకూ ఆగడానికి లేదు. ఇందులో ఏ టైం బంబైనా ఉన్నదేమో -- అన్నాడు రామం. అతడి కిప్పుడు తల్లిని కంగారు పెట్టడమే మంచి ఉపాయమనిపించింది. అప్పుడావీడే ఏదో ఏర్పాట్లు చేస్తుంది.
రామం అనుకున్నట్లే అయింది. ఆవిడ ఇద్దరు పనివాళ్ళను పిలిచింది. పెట్టెను కాసేపు పక్క వాళ్ళింట్లో పెట్టి రమ్మంది. ఏ బంబైనా వుంటే అది వాళ్ళ ఇంట్లోనే పేలుతుందని ఆవిడ ఉద్దేశం.
'అప్పుడైనా నేరం మనమీదకు రాదూ?" అన్నాడు రామం.
"బాగుందిరా -- ఇంట్లో బాంబు పడి ఇల్లు కూలిపోతే అది మనవల్లే జరిగిందని చెప్పడానికా యింట్లో మనుషులు లెక్కడుంటారు?" అంది తల్లి.
అందులో వున్నది బాంబు కాదనీ, శవమనీ రామం కు తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాడు. తండ్రి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడతను.
5
సాయంత్రం ఆరున్నరకు వచ్చాడు రామం తండ్రి.
తండ్రికి రామం జరిగింది చెప్పాడు.
తండ్రి వెంటనే పెట్టెను వెనక్కి తెమ్మని చెప్పాడు.
పనివాళ్ళు వెళ్ళి ఉత్త చేతుల్తో తిరిగి వచ్చారు.
"వాళ్ళింట్లో పెట్టి లేదండి...."
"మీరే కదా మీ చేతుల్తో పెట్టి వచ్చారు...."
"అవునండి... కానీ ఇప్పుడు లేదంటున్నారు..."
"ఏమయిందిట?"
"వాళ్ళెం చెప్పడం లేదండి...."
రామం కంగారు పడ్డాడు. ఇప్పుడు తను పెట్టె పోయిందని సంబరపడాలా? లేక సమస్య మరింత జటిల మవుతుందా?
అసలు విషయం కనుక్కుందామని అతను పక్కింటి వాళ్ళింటికి వెళ్ళాడు. ఇంట్లో ఇద్దరబ్బాయిలున్నారు. అతణ్ణి మాములుగా పలకరించారు.
"మా పనివాళ్ళు మీ యింట్లో వీణపెట్టె ఒకటి ఉంచారు...."
వాళ్ళిద్దరూ నవ్వారు -" వాళ్ళసలు మా ఇంటికి రాలేదు. ఎందుకలా చెప్పారో తెలియదు--"
రామం ఎంత అడిగినా వారిద్దరూ అదే సమాధానం చెప్పారు. ఇంట్లో వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరట.
అబద్దం వాళ్ళు చెబుతున్నారో , పనివాళ్ళు చేతుతున్నారో రామానికి అర్ధం కాలేదు. అసలు పెట్టెని ఎవరు మాయం చేశారు? ఎందుకు మాయం చేశారు?"
విషయం తెలుసుకోవాలని రామం సునంద యింటికి బయల్దేరాడు. అతను వెళ్లేసరికి ఆమె అప్పుడే గేటు దగ్గర నిలబడి వుంది.
"నువ్వా-- అమ్మయ్యా -- వచ్చావా?' అన్నదామె.
"మా యింటికి వీణపెట్టె పంపింది నువ్వేనా?" అన్నాడతను.
"వీణ పెట్టి నేను పంపడమేమిటి? అదింకా యింట్లోనే వుంది. బయటి కేలా తీసుకు వెళదామా అని ఆలోచిస్తున్నాను...."అన్నదామె.
"ఏదీ ....వచ్చి చూస్తాను...." అన్నాడతను.
ఇద్దరూ లోపలకు వెళ్ళారు.
గదిలో పెట్టి ఉన్నది. ఈ పెట్టి తను చూసింది కాదు. ఇది ఇంకోవిధంగా వున్నది. అంటే అది ఎవరు పంపారు?
రామం ఆమెకు జరిగింది చెప్పాడు.
"కధలు చెప్పకు. ఈ పెట్టి తీసుకునిపో --" అంది సునంద.
రామం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. అతడికి అంతా గజిబిజిగా వున్నది.
తన యింటికి వచ్చిన రెండో వీణ పెట్టి ఎవరు పంపారు? అది పక్క వాళ్ళింట్లో నుంచి యెందుకు మాయమయింది?
రామం ఇల్లు చేరేసరికి తండ్రి చిందులు తొక్కుతున్నాడు. అంతకు కొద్ది క్షణాల క్రితం అయనకు ఫోన్ వచ్చిందట. -- ఆ వీణ పెట్టిలో అయన వ్యాపారానికి ముఖ్యమైన వస్తువు పంపబడిందిట. పంపిన అయన మిత్రుడట.
రామం ఆశ్చర్యపోయాడు. కధ ఇలా తిరిగిందేమిటి?
