8
"నేను వెళ్ళాలి!" అంటూ లేచాడు రాజారావు.
"వద్దు రాజా... నువ్వు వెళ్ళద్దు...." అంటూ అతన్ని గట్టిగా కౌగలించుకుంది సౌగంధి.
"ఏ పరిస్థితుల్లోనూ యెవ్వరూ నన్నాపలేరు...." అంటూ మృదువుగానే అతనామెను విడిపించుకుందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె పట్టు చాలా బలంగా ఉంది.
అతనామే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ "సౌగంది! నాకూ జీవితం పై ఆశ వుంది. కానీ కొన్ని యెదురు దెబ్బలకు నా మనసు బండ బారిపోయింది. నాకై నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేను. కానీ నువ్విలా నన్ను బంధించి ఉంచినంత కాలం నేను బలవంతంగా ఇక్కన్నుంచి కదలను. నువ్వు నన్ను ఇచ్చ్చా పూర్వకంగా వదిలి పెడితేనే ఇక్కణ్ణించి కదుల్తాను...." అన్నాడు.
సౌగంధి కళ్ళు మెరిశాయి, "ఇప్పుడే కాదు....యెప్పటికీ నేను నిన్ను వదలను. ఈ రాత్రంతా నేను నీతోనే గడుపుతాను. ఆతర్వాత నువ్వు ఎప్పటికీ నావాడివి...."
రాజారావు తనలో తానూ అస్పష్టంగా ఏదో గొణుక్కున్నాడు. టైము చూసుకున్నాడు. ఒంటిగంట కావడానికి ఇరవై నిముషాల వ్యవధి వుంది. సౌగంధి ఇంటి నుంచి గోదావరి ఒడ్డు నున్న ఆ రావి చెట్టుకు చేరుకోవడానికి సరిగ్గా పదిహేను నిముషాలు చాలు. కానీ ఆమె తనని వదిలేలా లేదు.
నిముషాలు గడుస్తున్నాయి. సౌగంధి రాజారావు చుట్టూ చేతులు వేసి అలాగే కౌగాలించుకునే వుంది.
రాజారావు మనసులో ఉదయం రామభద్రయ్య కు చేసిన హెచ్చరిక మెదుల్తోంది -- "ఏదో బలీయమైన కారణం వల్ల నేను నిన్ను రెండు గంటలకు కలుసుకోలేక పొతే మళ్ళీ యెప్పుడూ నిన్ను కలుసుకొను. నీ జోలికి రాను..."
ఇదే బలీయమైన కారణమవుతుందా?" తను రామభద్రయ్య ను కలుసుకోలేడా?"
అయినా ఇదేం సెంటిమెంటు! ఏ శక్తి తనచేత ఆ మాట అనిపించింది.
సౌగంధి పక్క మీదకు వాలిపోయింది. ఇద్దరూ ఒకరికొకరు అంటుకుని పడుకుని వున్నారు. సౌగంధి మాత్రం అతడి చుట్టూ ఉన్న పట్టు సడలించడం లేదు.
రాజారావు దృడ సంకల్పంతో మెలకువగా వున్నాడు. ఏదో క్షణం లో సౌగంధి ని మత్తు అవహించక పోదని వెంటనే తను లేచి పోవచ్చుననీ అతనాశిస్తున్నాడు. మాట్లాడితే నిద్ర చేడిపోతుందన్న భయంతో అతను మౌనంగా వున్నాడు. సౌగంధి కూడా మాట్లాడించ బోతే ఆమెను వారించి "నేను ఆలోచనల్లో వున్నాను. నువ్వు మాట్లాడించడానికి ప్రయత్నించవద్దు ...." అన్నాడు.
మధ్యాహ్నం నుంచి సౌగంధికి విశ్రాంతి లేదు. అలసటతో ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. కానీ ఆమె బలవంతాన నిద్రను అపుకుంటోంది.
టైము పన్నెండూ ఏభై, యాభ్బై ఒకటి, యాభై రెండు.... యాభై అయిదు.....
రాజారావు వాచ్ వంకే చూస్తున్నాడు. సౌగంధి పట్టు సడలడం లేదు.
టైము ఒంటిగంట యింది. రాజారావులో అసహనం ప్రారంభమైంది. అర్ధం లేని సెంటిమెంటు వదిలిపెట్టి లేచి పోవాలనిపించింది. అయితే అప్పుడు తన మాటకు విలువే ముంటుంది ?.... ఇంతకాలం లోనూ అన్నమాట నిలబెట్టుకొని క్షణం లేదు. ఇప్పుడు మాత్రం అలా యెందుకు జరగాలి?
టైము ఒంటి గంటా ఒక నిముషం అయినప్పుడు గదిలో టెలిఫోన్ మ్రోగింది. మంచానికి ప్రక్కనే వున్న ఆ ఫోన్ ను చేతితో అందుకు నేతప్పుడు సౌగంధి కాళ్ళతో అతడికి బంధం వేసింది.
అయితే ఫోన్ వింటూనే ఆమె కలవరపడింది -- మినిస్టరు గారు తన కోసం కార్లో వచ్చాడు. మెట్ల దగ్గర ఎదురు చూస్తున్నాడు. కాదంటే పోలీసులు రావచ్చు, ఔనంటే రాజారావు వెళ్ళిపోతాడు.
ఎలాగూ తను రాజారావుని రక్షించుకోలేదని సౌగంధి కి అర్ధమైపోయింది.
"నేనే గనుక నీ అర్ధాంగి అయుంటే నిన్ను రక్షించుకోగలిగే దాన్ని -- ఆ జీవితం నువ్వు నాకు ప్రసాదించలేదు, ఇక ముందు ప్రసాదించే అదృష్టమూ వున్నట్లు లేదు...."
రాజారావామే మాటలు వినడం లేదు. ఇప్పుడతను ఆమె కౌగిట్లో లేడు, ఆమె కౌగిలి ఓ మినిష్టరు కోసం తనను వదిలి పెట్టింది. ఇదే తనకు అవకాశం.
అతను టైం చూసుకున్నాడు. బయలుదేరుతూ -- "మినిస్టరూ -- ఈవిధంగా నైనా నువ్వు కొంత దేశసేవ చేశావు" అనుకున్నాడు.
9
రామభద్రయ్య రాజారావు ఒకరినొకరు చూసుకున్నారు.
"ఇన్నాళ్ళూ నువ్వు చేసిన తప్పులన్నీ ఒక ఎత్తు ఈ రోజు చేసిన తప్పు ఒక ఎత్తు" అన్నాడు రాజారావు .
"ఏమిటది?"
"చావుకు సిద్దపడ్డ ఈ ఒక్కరోజైనా మాలతి అనే పేరును తల్చుకున్నావా?" అన్నాడు రాజారావు.
"మాలతెవరు?" అని ఆగిపోయాడు రామభద్రయ్య. ప్రశ్న సగంలో ఉండగానే ఆయనకు మాలతేవరో గుర్తుకు వచ్చింది. మాలతీని తను గుళ్ళో పెళ్ళి చేసుకున్నాడు. తర్వాత పెద్ద కట్నంతో పెళ్ళి సంబంధం రాగా మాలతిని వదిలి పెట్టేశాడు. ఆమె యెవరో తనకు తెలియదన్నాడు. ఆమె యెంత యేడ్చినా మొత్తుకున్నా వినకుండా నానా మాటలూ అని మరీ వదిలిపెట్టాడు"అప్పుడామే గర్భవతి.
'నేను మాలతి కొడుకుని!" అన్నాడు రాజారావు.
రామభద్రయ్య దెబ్బతిన్నట్లు రాజారావు ముఖం చూశాడు. అయన ముఖం లో భావాలు వర్ణనాతీతం.
'అమ్మ జీవితంలో నానా కష్టాలు పడింది. ఎన్నో అవమానాలు భరించింది. నన్ను మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచి పెద్దవాడ్ని చేసింది. అమ్మ కారణంగా నేనూ కొన్ని అవమానాలకూ గురయ్యాను. కానీ నాకు అమ్మ మీద కోపం రాలేదు. నీలాంటి వాడ్ని ఒక్కసారి నమ్మి జీవితంలో అన్నీ కోల్పోయిన అమ్మ చచ్చిపోయే ముందు వివాలిచ్చింది. అప్పుడే నిన్ను చంపాలన్న ఆవేశం వచ్చింది. కానీ ఓ చిన్న ప్రేమలో పడి అ ఆవేశాన్ని మరచిపోయాను.
అయితే చరిత్ర హీనుడినైనా ప్రేమ ఫలించలేదు. ప్రేమను నిలబెట్టుకునేందుకు ఏకైక సాధనమైన డబ్బు నాకు లభించలేదు. మళ్ళీ నా ఆవేశం తిరగదోడింది. ఒక ఆలంబనాన్ని వెతుక్కుని ఓ యేడాది పాటు నిన్నూ నీ కుటుంబాన్ని నీడలా వెన్నడి రహస్యాలు సంపాదించి నీ దగ్గరకు వచ్చాను. నువ్వెంత దుర్మార్గుడి వైనా నీనుంచి ఒక్క ప్రేమ ద్రుక్క కోసం ఎదురుచూస్తూనే వుంటుంది. అమ్మ స్వర్గం లో ఉంది. నా చేతిలో చస్తే నువ్వూ అక్కడికే వెడతావు -- అమ్మా.....నువ్వూ అక్కడ కలుసుకుందూరు గానీ ...." అంటూ రాజారావు జేబులోంచి కత్తి తీశాడు. చీకట్లో ఆ కత్తి తళుక్కుమని మెరిసింది.
రామభద్రయ్య కళ్ళలో ఇప్పుడు నీళ్ళు వర్షిస్తున్నాయి. అయన ముఖంలో దుఖం తప్ప భయం ఏ కోశానా లేదు. ఆ ప్రయత్నంగా -- "బాబూ!" అన్నాడు.
రాజారావు చేతులోని కత్తితో అయన వంకే క్రూరంగా చూస్తున్నాడు.
"ఈరోజు మాలతిని స్మరించ ని మాట నిజమే! నా పాపానికి నిష్కృతి లేదు. నన్ను చంపేయ్ బాబూ!" అన్నాడాయన ఆర్ద్ర కంఠంతో.
రాజారావు అదోరకంగా పిచ్చివాడిలా నవ్వి -- "రామభద్రయ్య ! ఇప్పటికిద్దర్ని చంపాను నేను. అయినా అమ్మ నన్ను ప్రేమిస్తుంది. కానీ నిన్ను చంపితే మాత్రం అమ్మ నన్ను క్షమించదు, స్వర్గంలో నా ముఖం చూడదు. నిన్ను చంపాలని నాకుంది. అయినా నిన్ను నేను చంపలేను. ఇంత వరకూ నువ్వనుభవించిన మనోవ్యధ చాలు. ఇకమీదట హాయిగా బ్రతుకు" అంటూ చటుక్కున ఆ కత్తిని తన గుండెల్లో దింపుకున్నాడు.
రామాభధ్రయ్య ఉలిక్కిపడి -- "బాబూ--" అని అరిచాడు.
రాజారావు తన కోడుకై ఉంటాడని అయన ఏ మాత్రమూ ఊహించలేదు . అతడు తన కొడుకని తెలియగానే ఆయనకు విచిత్రమైన అనుభూతులు కలిగాయి. అతన్ని పలకరించి ఓసారి దగ్గరగా తీసుకుని ఇంతకాలం అతడెలా జీవించాడో వివరంగా తెలుసుకోవాలని పించింది. మాలతీ గురించి ఏవేవో అడగాలనిపించింది. తనని చంపుతానని బెదిరించింది కన్న కొడుకు అని తెలియగానే మనసు తేలిక పడింది కూడా. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.
తను జీవితాన్నంతా డబ్బుతో ముడి పెట్టాడు. అందుకే మాలతిని పోగొట్టుకున్నాడు. హత్య చేశాడు. కన్న కొడుకును చంపుకున్నాడు. భార్యను తాగుబోతుగా మార్చాడు. పిల్లలకు చెడు నడతకు గురి చేశాడు. ఈరోజు కన్నకొడుకు తన కళ్ళముందే చనిపోయాడు.
జీవితంలో తను సాధించినదేమిటి? శరీర సౌఖ్యానికి గురించి ఆలోచించాడు కానీ మానసికాహ్లదం గురించి మరిచిపోయాడు.
రామభద్రయ్య రెండడుగులు ముందుకు వేసి కొడుకును సమీపించాడు. అప్పటికే రాజారావు కోన ప్రాణాలతో ఉన్నాడు. అయన చటుక్కున అతడి గుండెల్లోంచి కత్తిని బైట కు లాగి -- "ఇక్కడి ఈ జీవితానికీ రోజుతో స్వస్తి! నీ కోరిక ప్రకారం నేనూ ఈ క్షణంలోనే మాలతి దగ్గరకు బయలుదేరుతున్నాను" అంటూ రక్తసిక్తమైన ఆ కత్తిని తన గుండెల్లో పోడుచుకున్నాడు.
కొడుకు రక్తం తండ్రి రక్తంతో కలిసింది. రామభద్రయ్య నేల మీద పడిపోతుంటే ఆ దృశ్యం చూసేకనే రాజారావు కళ్ళు మూతలు పడ్డాయి. అక్కడ రామాదేవి తన మాట నిలబెట్టుకుందో లేదో తెలియదు.
----:అయిపొయింది ----
