Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 14

 

    "ఈ ఇల్లు, తోట ఎంత బాగున్నాయి! జీవిత కాలం ఇట్టే గడిపివేయవచ్చు." సోఫియా అంది.
    "సోఫీ! డబ్బు, ఇల్లు, తోట మనిషికి ఆనందాన్ని ఇస్తాయంటే నేను నమ్మకంలెను. ఆనందం మనస్సులోనే ఉంది. మనస్సుకు తృప్తిగా ఉన్నప్పుడే పరిసరాలు ఆనందాన్నిస్తాయి. సోఫీ! లక్ష్మిగారు రాజీవ్ కి ఏమవుతాలో? మనకు పరిచయం చేసేటప్పుడు చెప్పనేలేదు!" అంది వీణ.
    లక్ష్మి అవ్వగారు విజయనగర సంస్థానంలో రాజనర్తకి. వంశపారంపర్యంగా వస్తున్న నాట్యాన్ని మానివివాహం చేసుకొంది సూర్యావతి, లక్ష్మీఅమ్మ. జమీందారీలు పోగా, ఉన్నది చేతపట్టుకొని మద్రాసు చేరారు. పక్కఇంటి బాలాజీ లక్ష్మిని ప్రేమించాడు. లక్ష్మికి బాలజీతో పెళ్ళిచేసి తృప్తిగా కన్ను మూసింది సూర్యావతి.
    అప్పటికే స్వతంత్రుడైన బాలాజీ లక్ష్మితో వేరింటి కాపురం పెట్టాడు.
    బాలాజీ తల్లిదండ్రులు అప్పటికి ఊరుకొన్నా పోనుపోను పోరు పెట్టి, "నీ ఆనందానికి అడ్డువచ్చామా! మా మాట మన్నించి మన కులంలో పిల్లని చేసుకో" మని నిర్బంధించసాగారు.
    ఆ ఒత్తిడికి మెత్తటి మనస్సు గల బాలాజీ తల వంచాడు. వారి ఆస్తిని చూసి అతడికి పిల్ల నిచ్చి బరువు దింపుకొన్నాడు జానకి తండ్రి.    
    అభిమాని అయిన లక్ష్మి ఏమీ మాట్లాడలేకపోయింది.
    ప్రేమించి ప్రాణసమానంగా చూచుకొనే భర్త, ఎవరి మాటలకైతేనేమి మరల పెళ్ళాడడానికి వెళ్ళిన భర్త మనోదౌర్భల్యానికి వగచింది. తను అతనిని కాక మరొకరి వైపు తమాషాకికూడా చూడగలదా? అని ప్రశ్నించుకొంది.
    పెళ్ళిబట్టలతో భర్త ఇంటికి ప్రయాణమైన జానకితో బాలాజీ అన్నాడు- "ఇంటి దగ్గర లక్ష్మి ఉంది" అని.  
    'తెలుసు' అన్నట్లు తల వంచుకొనే తల ఊపింది.
    ఈ స్త్రీ తనను ఏమాత్రం కదిలించనే దనుకొన్నాడు. కొత్త పెళ్ళికూతురు ఇంట్లో ఏ మూల ఉందో బాలాజీకి తెలియదు. పరుగున వెళ్ళి లక్ష్మి పక్కలో చేరాడు. భర్తను కరుచుకుపోయి ఏడ్చింది. ఓదారుస్తూనే ఆమెను ప్రేమించాడు.
    జానకిని పెళ్ళి చేసుకొన్నట్లే మరిచిపోయాడు. ఎదురొచ్చినా, పరస్త్రీని చూచినట్లే చూచేవాడు. లక్ష్మి గర్వపడినా, సాటి స్త్రీ కొరకు జాలిపడేది.
    కొన్ని నెలలు ఇట్టే గడిచిపోగా జానకికి భయం వేసింది. లక్ష్మి గదిలోకి వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. ఆమె నిరాదరిస్తే తనకు మరణమే శరణ్యమని వేడుకొంది.
    ఆ రోజంతా దైవధ్యానంలోనే గడిపింది, తనకు తగిన శక్తిని ఇవ్వమని లక్ష్మి. ఆ రాత్రి తనను చేరవచ్చిన భర్తను బుజ్జగించి, ఎన్నో చెప్పి ఒప్పించి జానకి గదిలో విడిచి వచ్చి తన తలుపులు బిగించుకొంది. ఆ నాటి నుండి ఈ నాటివరకు భర్తకు పడకలో భాగం ఇవ్వలేదు. అతనిని దూరం చేసినందుకు ఏడ్చాడు. తాగాడు. చివరికి ఆమెను కొట్టి కసి తీర్చుకోసాగాడు.
    ఏకపత్నీవ్రతుడైన రాముని ధ్యానంలో తన జీవితం గడపసాగింది లక్ష్మి.
    ఊయల ఊగుతూ నిద్రలో పడింది సోఫియా.
    పూలమొక్కలను చూస్తూ వీణ మరి కాస్త దూరం పోయింది. నేలలో కట్టిన ఫిష్ పాండ్ లో రంగు రంగుల చేపలు ఎగురుతున్నాయి. దగ్గరలో ఉన్న ఎర్రగులాబీ పూర్తిగా విచ్చుకొని ఉంది. తను ధరించిన ఎర్ర దుస్తులకు సరిపోతుందని వెళ్ళి కోయబోయి, అలికిడి అయితే ఆగి అటు చూచింది. తన వైపే చూస్తూ ఉంది అల్సేషియన్. పువ్వు తుంచితే పైన పడుతుందేమోనని మానుకొంది, భయంగా దానివైపే చూస్తూ. పొదల మాటునుండి నవ్వుతూ వచ్చాడు రాజీవ్.
    "మీరు వచ్చారు. అమ్మయ్య! దీన్ని చూస్తే భయంగా ఉంది. పంపివేయండి."
    "యువరాజ్! వీణ నీకు నచ్చిందా?" అన్నాడు.
    వీణ దగ్గరగా వచ్చి వాసన చూడసాగింది.
    వీణ భయానికి నవ్వుతూ, "యువరాజ్!" అన్నాడు. అది వెనక్కి వెళ్ళింది.
    రాజీవ్ పువ్వు కోసి వీణకు ఇవ్వబోయాడు.
    "థాంక్స్" అని అందుకొంటున్న వీణ జబ్బపట్టుకొని దగ్గరకు లాక్కొన్నాడు.
    అనుకోని సంఘటనకు నివ్వెరపోయినా, వెంటనే అతణ్ణి తోసేసింది.    
    తన ఇంట్లో, ఈ తోటలో వీణ తిరుగుతూ ఉంటే అతని కెలాగో ఉంది. ఏవేవో భావాలు- మనస్సు పరవశించిపోతూ ఉంది.
    "వీణా! నిన్ను పెళ్ళి చేసుకుంటాను."
    జవాబు చెప్పటమే తప్పుగా భావించిన వీణ తిరిగి ఇంటివైపు మళ్ళింది.    
    "యువరాజ్!" అని రాజీవ్ అరవగానే వీణ కెదురుగా వచ్చింది.
    దాదాపు నడుము పైవరకు వచ్చిన యువరాజ్ ను చూడగానే పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించివెనక్కి వస్తూ వీణ రాజీవ్ ని ఢీకొంది. ముందు కుక్క, వెనక రాజీవ్.
    రాజీవ్ ఏదో సైగ చేయగానే "భౌ" మంది.
    అరుస్తూ రాజీవ్ ఛాతీకి అతుక్కొని పోయింది! రెండు చేతులతో అలాగే అదిమి పట్టాడు వీణను. "నిన్ను ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు" అంటూ బలాత్కారంగా వీణను దగ్గరకు తీసుకో సాగాడు. అందిన చోట కనుక్కుమని కొరికింది.
    "అబ్బా!" అన్నాడు. తనేమీ చేస్తున్నాడో తెలియదు. ముఖాన్ని పైకెత్తి బలంగా పెదాలపై ముద్దు పెట్టాడు. అందిన చోటల్లా కరుస్తూ, రక్కుతూ చొక్కాని చింపివేసింది.
    యువరాజ్ వీణ పైకి దుముకబోయింది. అరుస్తూ వీణను వదిలి యువరాజ్ ను పట్టుకొన్నాడు నిమురుతూ.
    నిలువెల్లా వణుకుతూ, "యు బ్రూట్! యు అనిమల్! థూ!" అని పరుగుతీసింది.
    గుండె పై భాగాన రూపాయంత గుండ్రంగా ఎర్రనైన కొరికిన గాట్లు. పిల్లి గీకినట్లు పొట్టంతా రక్కిన దగ్గర మంట పుట్టసాగింది. చినిగిన చొక్కాతో పిచ్చివాడిలా వీణ పోయిన వైపు చూడసాగాడు రాజీవ్!

                               *    *    *

    హాస్టల్ గదిలో వీణను చూస్తూ, "ఎన్నిసార్లు! ముఖాన్ని కడుగుతావు ఏదో అంటినట్లు" అని సోఫియా అంది.
    "ఆ బ్రూట్! ఇంటికి తీసుకొని వెళ్ళి ఎంగిలి చేస్తాడా! మేనర్ లెస్ క్రీచర్! లై సాబ్ తో కడుగుదామనిపిస్తున్నది." పడకమీద అటు ఇటు పొర్లసాగింది. "సోఫీ! నిన్నెవరైనా ఎంగిలి చేశారా!"
    సోఫీ మౌనంగా ఉండిపోయింది. ఎవర్నని చెప్పగలదు?
    "ఇక్కడ ఉండలేను. ఎటైనా పారిపోదామని పిస్తున్నది. సోఫీ! ఎక్కడికైనా తీసుకొనిపో!"
    "................."
    "ప్లీజ్!"
    "ఫోర్తు ఇయర్స్ మహాబలిపురం పోతున్నారు రేపు తెల్లవారుఝామున" అంది సోఫియా.
    మహాబలిపురం వెళ్ళే బస్సు సందడిగా ఉంది. బస్సులో ఎక్కి కూర్చున్నారు. అల్లరితో నర్సరీ స్కూలు బస్సులా ఉంది. గూడూరుకి చేరింది బస్సు. కొందరు ఆకలి వేస్తున్న దన్నారు. కొంతమంది తల నొప్పిగా ఉందన్నారు.
    అందరికీ ఒకటే మందైన కాఫీ తాగటానికి దిగారు. చివరగా వీణ, సోఫియాలు దిగారు. ఇద్దరి మనస్సులు సంతోషంగా లేవు. హోటల్లోకి పోతూండగా వీణ గ్రామంవాళ్ళు ఎదురైనారు.
    "అమ్మలూ! ఇక్కడ ఉన్నావేం?" అంటూ ఒక వృద్దురాలు పలకరించింది.

                                    
    తన ఊరివాళ్ళు కనపడగానే తన గ్రామం చూసి నంతగా సంతోషించి అందరినీ వరసలు పెట్టి బాబాయ్, పిన్నీ, మామ్మా అంటూ ఒక్కొక్కరిని పలకరించింది. ఆప్యాయంగా వీణను పట్టుకొని మాట్లాడారు. ఒక వాన్ లో యాత్రకి బయలుదేరి, దక్షిణ తీర్ధయాత్ర అంతా చూచుకొని తిరిగి పోతూ సోమశిల ఆశ్రమంలో చేరిన కరణంగారి అబ్బాయిని చూచి ఊరికి వెళ్ళిపోదామని అనుకొంటున్నామని చెప్పారు.
    మునుపే ఆ ఆశ్రమం గురించి విని ఉంది వీణ. కరణంగా రబ్బాయి సన్యాసం పుచ్చుకొని ఆశ్రమం చేరినప్పుడు వాళ్ళ గ్రామమేగాక చుట్టూ పక్కల వాళ్ళు వింతగా చెప్పుకొన్నారు.    
    ఆ క్షణంలోనే ప్రోగ్రామ్ మార్చివేసింది వీణ. వాళ్ళు మహాబలిపురం వెళ్ళినట్లు ఎలాగైనా రాజీవ్ తెలుసుకొని అక్కడికే వస్తాడు. ఈ టూరిస్ట్ వాన్ లో వెళ్ళి, దూరంగా ప్రశాంతంగా ఉన్న ఆ ఆశ్రమానికి వెళ్ళి వీళ్ళతోపాటు అడ్డొచ్చే దేవుళ్ళకు మొక్కుకొందామని తలచింది వీణ.
    సోఫియా బస్సు డ్రైవరుతో మాట్లాడింది. వెంట వచ్చిన మాస్టార్లకేదో చెప్పి వాన్ లోకి మకాం మార్చి వేశారు.

                              *    *    *

    నెల్లూరుకు సుమారు ఏభై మైళ్ళ దూరం ప్రయాణం చేశారు.
    ఈ ప్రయాణంలో ఊరి కబుర్లు అన్నీ వింది. భోజనం వేళ దాటిపోయింది. ఫలహారాలతో ఆ పూట కాలక్షేపం చేసారు.
    ఆశ్రమానికి చేరుకొనే ముందు రెండు మూడు గుడిసెలున్నాయి. తప్పితే తరవాత ఫారెస్టు బంగళా దాటుకొని మరికొంత దూరంలో పరమానందాశ్రమం ఉంది. కొండల్లో ఉన్న ఆ ఆశ్రమం మనోహరంగా కనిపించింది. తృణకుటీరాలలో స్వాములవారు, మిగతా సన్యాసులు ఉన్నారు.    
    సన్యాసులంటే పొడుగాటి గడ్డాలతో కమండలాలు చేబూని ఉంటారనుకొన్నారు. మామూలు సామాన్యుల్లా ఉన్నారు. ప్ర్రార్ధన మందిరానికి వెళ్ళారు. ఒక మఠానికి సంబంధించినది కాదు. ఏ మతస్థులైనా అక్కడికి వెళ్ళి వారి వారి మతానుసారంగా దైవాన్ని ధ్యానించుకోవచ్చు. మందిరం ఆవరణం అంతా అతి శుభ్రంగా ఉంది. అక్కడ ఆన్న సన్యాసులే శుభ్రపరుస్తారు.
    "వీణా! మన రూము సర్వమత నమ్మేళనం. ఈ మందిరం కూడా అలాగే ఉంది. మనతో జుబేదా ఉంటే బాగుండేది!" అంది సోఫీ.
    ముందే గుట్టపై చక్కగా కట్టిన నరసింహస్వామి దేవాలయం ఉంది. చెయ్యి చెయ్యి పట్టుకొని పెద్ద పెద్ద విశాలమైన మెట్లెక్కి వెళ్ళారు. అక్కడక్కడ భక్తులు ధ్యానంలో ఉన్నారు. ఇటు తిరిగి మందిరం వైపు చూశారు. తన్మయత్వంతో చూస్తూ అలాగే ఉండిపోయారు. నీలి ఆకాశం క్రింద రెండు కొండల నడుమ పలచగా ప్రవహిస్తున్న పెన్నా నది! సూర్య కిరణాల తాకిడికి బంగారువదిలా ఉంది. నూతనోత్సాహంతో క్రిందికి వచ్చారు, కొబ్బరిముక్కలు కొరుకుతూ.
    వెదురు గుబుర్ల మధ్య వెదుర్లు తీసి, ఆకులు చెక్కి చిన్న చిన్న వెదురు కుటీరాల్లా చేశారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS