Previous Page Next Page 
పగటికలలు పేజి 15


    
    మళ్ళీ తన అహం మేల్కొంది -
    "ఏమిటీ అన్యాయం? తనెవరు? వాళ్ళెవరు? మాట మాత్రంగా నయినా తన అభిప్రాయం లేకుండా ఏమిటి నిర్ణయం! అంతా అతని యిష్ట ప్రకారమేనా? పూర్వం అంటే వాళ్ళ కొంపలో వుండేవాడు కాబట్టి అతనెంత "బోరు"కొట్టినా విధిలేక సహించేవాడు - ఇప్పుడు తను స్వతంత్రుడు ఈ విషయంలో కూడా నిర్భంధిస్తే వింటాడనేనా అతగాడి ఉద్దేశ్యం! తన తల్లి, బంధువులూ ఎవరికీ తెలియకుండానే, ఎవరూ లేకుండానే తను పెళ్ళిచేసుకుంటాడనేనా అతని ధైర్యం! ఇవన్నీ అలావుంచి - అందరితోబాటు పెళ్ళికొడుక్కి కూడా ఒక శుభలేఖ పంపిస్తాడా? ఇదేనా మర్యాద? పెళ్ళికొడుకంటే - ఒక నగా? అలంకారమా? అప్పటి కప్పుడు తీసుకుపోయి కట్టపెట్టడానికి! అన్ని విషయాలు మాటాడిన వాడు ఆనాడే అడగలేకపోయినాడా? గౌరవంగా .....ఆనాడేమన్నాడు! "నీ కళ్ళముందే నా కూతురికి పెళ్ళిచేస్తాను చూడు నీ కదేశిక్ష" అని పెద్ద కబుర్లాడాడే....దాని కిదేరా ఏమిటీ అర్ధం? ఏది ఏమయినా సరే వెళ్ళకూడదు" అని కోపంతో అనుకుని మళ్ళీ తనలో తనే నవ్వుకున్నాడు .... ఈ ఆలోచనకి.
    గిరిజ కోసం ఇన్నాళ్ళూ అంత తపించి, దేని కయినా తెగించి తీరా. ఆమెనే పెళ్ళి చేస్తానంటే ఇట్లా అనుకోవడం ఏమిటి? -నయమే తన అదృష్టం బావుండబట్టి ఎలా ప్రవర్తించినాగిరిజతోనే పెళ్ళి జరుగుతూంది. అలాంటప్పుడా తను మూర్ఖంగా బెట్టుచేయడం?
    ఇలాగ్గానిచేస్తే మళ్ళీ ఎట్నుంచి ఏది వచ్చినా ఈ పెళ్ళి కాస్తా ఆగి ఊరుకుంటుంది. అయ్యాబాబోయ్! కిం అనకూడదు వాళ్ళెలా అంటే అలాగే ప్రస్తుతానికి నడుచుకోవాలి నాలుగు తన్ని పెళ్ళి చేస్తామన్నా గిరిజ కోసం పడాలి.....అని మళ్ళీ అనుకున్నాడు ....
    ఇది వాస్తవమో కాదో? దాసుగారు ఈ విధంగా చేయడం అవమానకారంగానే తోచింది.  తను పెళ్ళికొడుకుగా అతని దగ్గరికి వెళ్ళడానికి పరుపు తక్కువనిపించింది. తను మామ్మూలుగావీధిలోకి వెళ్ళినపుడు నలుగురయిదుగురు ఏ వివాహం గురించి ప్రస్తావించారు. అంచేత నిజమే నని కూడా నమ్మకం కుదిరింది. కాని తన దగ్గరికి ఎవరూ రానందుకూ, కనీసం, కబురయినా లేనందుకూ, కుమిలి పోతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. గిరి వద్దకి మాత్రం ఎవరూ వచ్చి పిలవలేదు. ఇదంతా, నిజమో అబద్ధమో తెలియక తన వాళ్ళెవళ్ళకీ ఉత్తరాలయినా వ్రాసుకోలేదు. ఒక మూల నుండి, ఆతృత, తొందర, కోపం అన్నీ కలుగుతున్నాయి, ఏమీ చెయ్యలేక నిమిత్తమాత్రంగా వూరుకున్నాడు.     
    ఇంక ముహూర్తం రేపనగా ఆ రాత్రి తనదగ్గరికి కారు వచ్చింది. దాసుగారు స్వయంగా దిగి నవ్వుతూ పలకరించాడు. ఆయనను చూసే సరికి గిరికి ఒళ్ళుమండింది! కాని నోరు మాత్రం పెగిలిందికాదు, వినయంగా తనూ నమస్కారం చేసి నవ్వేడు!
    తన ప్రవర్తనకి తనే సిగ్గుపడుతున్నాడు గిరి. ఏం చేత్తో ఆ దాసుగారు ఏంచేసినా అతనికి ఎదురు చెప్పలేకపోతున్నాడు.
    "కొన్ని కారణాలవల్ల యింతవరకూ కలుసుకోలేక చెప్పలేకపోయినాను ఏమీ అనుకోకు! నాకు తెలుసుగా, నువ్వలాటి వాడివికాదని. పద యింటికి పోదాం!" అని అన్నాడు దాసు,
    "ఇంకా ముహూర్తం రేపుకదండీ యింత తొందరగా ఎందుకు?" అన్నాడు నర్మగర్భంగా గిరి లోలోన ఉడికిపోతో-    
    "చాల్లేవోయ్! అల్లుడిగారి టెక్కు చెలాయించకు పద!" అని లాక్కెళ్ళిపోతూంటే- వెనకాలే వెళ్ళిపోయాడు గిరి మారుమాటాడలేక...
    "మరి ముందుగా నాకేమి చెప్పేరు కాదు! మా అమ్మా, చుట్టాలూ అందరూ........' అని ఉండబట్టలేక అంటూండగానే..... దాసుగారు అందుకొని.
    "అన్నీ నేను చూసుగుంటాగా! పెళ్ళి వేళకి మీ అమ్మగారూ. బంధువులూ వస్తే చాలు కదా?" అని అన్నాడు.
    తిన్నగా తీసుకువచ్చి గిరి పూర్వం అద్దెకున్న వాటాలోనే దింపేసేడు. అక్కడ అతను తప్ప మరెవ్వరూ లేరు. ఒంటరిగా- కనీసం మర్యాద కయినా తన యింటికి తీసుకు వెళ్ళలేదు.
    అక్కడ దింపి- "రాత్రికి సుఖంగా పడుకో ప్రొద్దున్నే లేపేస్తారు! నీకేద కావలసిన పని మనిషి వున్నాడు. వాడు చూసుకుంటాడు!" అని మాత్రం అనేసి వెళ్ళిపోయాడు. ఇదంతా ఏమిటో అర్ధం గాకపోయినా అతని జబర్ధస్థికి, తన చేత గానితనానికి, అసహ్యించుకున్నాడు. తన బంధువులెలాగూ లేకపోయినా, వాళ్ళ వాళ్ళుగాని, స్నేహితులుగని ఎవరూ చూడ్డానికయినా రాలేదు! పలకరించలేదు! అందరూ దాసుగారింట్లోనే సందడిగా కోలాహలంగా వున్నారు. తనని వెలివేసినట్టూ, చెరలో పెట్టినట్లూ, చూస్తున్నారు. ఆ రాత్రి నిజంగా, ఒంటరిగా వివిధ భావోద్వేగంతో, భయంతో, బెంగతో సంతోషంతో నమ్మకంలేని ఆశతో - ఏదో నిరీక్షణతో మనసంతా అల్లకల్లోలంగా, తీయ తీయని కలలతో గడిపే సేడు.
    తెల్లారకుండానే ఎవరో వచ్చి లేపడం-స్నానాలు చేయించడం యిలాటివన్నీ జరిగి పోతున్నాయి. కార్యక్రమాలన్నీ పెళ్ళి వారెవరూ లేకుండానే ఒంటరిగానే జరిగిపోతున్నాయి. అంతా ఏదో రహస్యంగా జరుగుతున్నట్టు గ్రహించాడు. రాను రాను అయిష్టత కలుగుతూంది. తనవాళ్ళు ఎవరూలేని లోటు. ఏదో లోన్లీనెస్ ఫీలయిపోతున్నాడు. ఇదంతా వద్దని చెప్పి లేచిపోదామా అనుకున్నాడు ఉద్రేకంతో. కాని, గిరిజని తలంచుకొంటే, అవన్నీ చంపుకొని ఏమీ చేయలేకపోతున్నాడు.
    పెళ్ళికొడుకును ముస్తాబు చేసి పెళ్ళి పందిట్లోకి తీసుకువెళ్ళేరు.
    ఓహ్! మహా వైభవంగా వుంది ఊళ్ళో పెద్దలూ, పిన్నలూ దాసుగారి స్నేహితులూ అప్పుడప్పుడే వస్తున్నారు. వారిలో దాసుగారి స్నేహితులెవరో - చుట్టాలెవరో, తెలియటం లేదు, స్త్రీలు కూడా వున్నారుగాని.....ఆ రోజు పేరంటానికి వచ్చిన ముఖాల్లో కొన్ని వున్నాయి. అంతమందిలోనూ తన వాళ్ళనే వాళ్ళు ఒకళ్ళూ కూడా లేకపోవడం తనకి ఏడుపు వచ్చినంత పని అయింది. తనకి తోడుగాని, తనకో మాటాడేవారుగాని లేకపోవడంవల్ల ఏకాకి అయిపోయాడు గిరి.
    "తన వాళ్ళెవళ్ళూ రాలేదేం?" అని మరోసారి దాసుగారితో చెప్పేడు..." ఇంకా టయిమయిందిగా.....ఆ వేళకి మీవాళ్ళు రాకపోతే పెళ్ళి మానేద్ధురుగానిలే! అని వెక్కిరింపుగా అనేసేడు దాసు. ఏమిటో, అంత ధీమా!
    ఇంతవరకూ వచ్చిన తర్వాత మానివేయడం తనకే అమర్యాద! అగౌరవం! .... అంచేత కాబోలు! అతనికీ ఈ ధైర్యం! మర్యాదకి ఆలోచించి వూరుకోవడమే యింతవరకూ తీసుకువచ్చింది! అని లోపలే అనుకొని వూరుకున్నాడు.
    పీటలమీద కూర్చున్నాడు.....పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. పెళ్ళికూతుర్ని తెమ్మన్నారు..... కొంత సేపటికి మేడమీద నుండి నలుగురాడవాళ్ళు పెళ్ళికూతుర్ని తీసుకువచ్చేరు- .... కాని పెళ్ళికూతురికి హిందుస్థానీ వాళ్ళలా పూర్తిగా ముఖం మించి ముసుగువేశారు .... పెళ్ళికళలో - గిరిజ మొహం ఎలా వెలిగి పోతూందో చూద్దామనుకున్న గిరి నిరాశ పడ్డాడు. అప్పుడప్పుడు నడుస్తూంటే కుచ్చిళ్ళు మీదకు పోయి పాదాలు మాత్రం కనబడుతున్నాయి .... ఇదేం సంప్రదాయం? ఆ ముసుగెందుకూ మనకి? అని గిరి అనుమానపడ్డాడు. కాని దాసు గారితో మాత్రం ఆ ముక్క అనలేదు. ఏం అన్నా అతను ఇంకోటి ఏదో చెబుతాడు. అదీ కాక యిలాటి విషయాలలో గిరికి అట్టే అనుభవం కూడా లేదు. ఆమె వచ్చి ప్రక్కన కూర్చున్నాక తనివితీరా చూసుకుందామని - ప్రక్కకు తిరిగి ఓరగా చూసేడు. అయినా ఏమీ లాభం లేక పోయింది. ముసుగులో సిగ్గుతో మోకాలు మీద తలవంచుకు కూర్చుంది!
    గిరిజ తన ప్రకనే కూర్చోడం! తనకి భార్య కాబోతూండడం- యివన్నీ కలా నిజమా? ఏమి విశేషం! ఏమి అదృష్టం! అని ఆలోచనల్లో పడిపోయాడు గిరి.
    తన వాళ్ళెవళ్ళూ అప్పటికి కూడా రాక పోయేసరికి దాసుగారిని పిలిచి అడిగేడు!
    "వస్తున్నాం అని టెలిగ్రాం యిచ్చారు? ట్రయిను ఆలస్యం అయిందో ఏమో మరి! ఈపాటికి వచ్చేస్తూనే వుంటారు! మళ్ళీ మనిషిని పంపుతున్నాను స్టేషనుకి, - అవన్నీ నాకు తగిలేయి. ముహూర్తం దగ్గిరవుతూంది. ముందు అవన్నీ కానీండి! మరేం ఫరవాలేదు!" అని సర్ది చెప్పేసేడు దాసు.
    "కానీండి, కానీండి, వస్తున్నవాళ్ళు ఎలాగు వచ్చేస్తాడు ఘడియ ఇటో - అటో ముహూర్తం మించిపోతే వస్తుందా? ఆశీర్వచనానికి అంది పోతారులెండి ముందు తంతు కానివ్వండి!" అని పందిరిలో పెద్ధలందరూ శాసించారు,
    ఇహ గిరి ఏం చేయగలడు? అంతవరకూ ఏం చేయగలిగేడు! యింక పీటలమీదికి వచ్చే వరకూ తెచ్చుకోని అంతమందిలో కాదనగలిగే ధైర్యం ఎక్కడుంది! అంచేత విధిలేక గురువు గారు చెప్పినట్టు చెయ్యక తప్పిందికాదు గిరికి.
    అనుకున్న శుభముహూర్తం దగ్గిరపడింది. సూత్రధారణ సమయం వచ్చింది. గురువుగారు మంత్రోచ్చారణ చేస్తూ ఆజ్ఞాపించారు- మంగళ వాయిద్యాలు మారుమ్రోగిపోతున్నాయి. ఏదో మత్తులో లేచాడు గిరి మంగళ సూత్రాలు పట్టుకొని. కొందరు స్త్రీలు ముసుగు తొలగించారు బరువయిన జడని పట్టుకు పక్కకి తప్పించారు ఆమెకి తల క్రిందికి వంచడం, తన దృష్టి శిరస్సు మీదే వుండడంవల్ల మొహం ఇంకా కనుబడనే లేదు గిరికి.
    మెడ చుట్టూ సూత్రం త్రిప్పబోయాడు.
    "నేన్రా గిరీ!.....నేన్రా గిరీ!" అని మెల్లగా అరుస్తున్నట్టు వినిపించింది?.... తలవంచుకు కూర్చున్న వ్యక్తి మొహం మీదకు లేచింది- ఆశ్చర్యపోయాడు ఆ మొహం చూసి గిరి!....ఎవరోకాదు? ఆడవేషంలో వున్న మణి!
    "నువ్వా మణీ! ఏఁ విటిదంతా!" అని విస్తుపోయాడు గిరి. మణి నవ్వుతూ దూరంగా లేచి నుంచున్నాడు. బిక్కు బిక్కు చూస్తూ సభికులూ, ప్రేక్షకులూ, అందరూ గొల్లున నవ్వుకున్నారు, ఆడవాళ్ళ దగ్గర్నుండి!
    గిరికి తల తీసినంత పని అయింది? ఆనాడు మయసభలో దుర్యోధనుడికి జరిగిన పరాభవం గుర్తుకొచ్చింది. ఏ కోశాన్నా సహనంలేదు! ఓర్పు అంతకన్నా చచ్చిపోయింది. శరీరం అంతా కోపంతో భగ్గుమంది. అవమానంతో ఒణికి పోయాడు. మొఖం అనేక భావాలతో, ఎర్రగా కందిపోయి, భీకరంగా మారిపోయింది.
    "ఏమిటి నాటకం? ఏమిటీ మోసం! అందరూ ముందు నుంచి అనుకుని పన్నినట్టుంది! పిల్లనిస్తానని చెప్పి తీసుకువచ్చి మగవాడికి వేషం వేయించి నాకు పెళ్ళి చేద్దామనుకున్నారా!" అని గట్టిగా అరిచాడు.
    దాసుగారు రంగంలోకి వచ్చారు-
    "ఏం నాయనా? ఇప్పుడిదంతా నీకు నాటకం, మోసం, దగా క్రింద తోచిందా? ఇదే నాటకం, నువ్వాడి మమ్మల్నందర్నీ వెధవాయిలను చేసిన ప్పుడు లేదా!....అదే నేనూ అడుగుతున్నాను! చెప్పు- జవాబు చెప్పు! మొన్న మొన్నటి వరకూ మా యింట్లో నువ్వుచేసిన పని ఏమిటి? అమాయకురాలిని, ఆడపిల్లని-నీ వలలో వేసుగో దలిచావు పెళ్ళి అయిందని బుకాయించి యింట్లో వుండి యింటి వాసాలనే లెక్కపెట్టేవు. ఇది ఎంత  సాహసమో! ఎంత నమ్మక ద్రోహమో చెప్పు! యిదేనా నీ నిజాయితీ, యిదేనా మంచిపని.....నేను చేసినదేనా తప్పుపని? ... చెప్పు! ఎవరి నయితే భార్య క్రింద ఉపయోగించి నన్ను మోసం చేశావో అతనినే యిప్పుడు నీకు పెళ్ళి చేస్తున్నాను .... అట్లాగే సరిపుచ్చుకోండి..."
    ఆ మాటలకి పెళ్ళిపందిరంతా నిశ్శబ్దం అయిపోయింది.
    గిరి ఏమీ జవాబు చెప్పలేక తడబడుతూ-ఆఖరికి "అయితే మాత్రం దానికి. అందరిలోనూ అవమానిస్తారా? నే సహించలేను .... కానివ్వండి- యింత మందిలో చేసిన ఈ అవమానానికి సాక్ష్యం వుండకపోదు!.... ఛీ.... ఇంత అమర్యాదస్తులని అనుకోలేదు? ఏదో పెద్దలని యిన్నాళ్ళూ గౌరవం యిచ్చాను.... అని యింకా ఏమేమో అంటూ మండపం దిగి వెళ్ళిపోతూ వుండగా-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS