Previous Page
పగటికలలు పేజి 16


    "ఆగరా! గిరీ, ఆగు" అని అంటూ శాంతమ్మ ఆప్రక్క గదిలోంచి వచ్చింది- ఆమెను చూసి గిరి.
    "అమ్మా! నువ్వా! యిక్కడా!" అని తల్లిని అప్రయత్నంగా అక్కడ చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ చెప్పాచెయ్యకుండా యింత పని చేసినందుకు సిగ్గుతో తలవంచుకున్నాడు?
    "అవున్నాయనా! దాసు ఎవరనుకున్నావు. మా అన్నయ్య! .... నీకు మావయ్య ! .... గిరిజ నీకు హక్కుగల భార్యరా!" అంది నవ్వుతూ.
    "ఆఁ" అని తెల్లమొహం వేశాడు గిరి.    
    శాంతమ్మ వెనకాలే, చుట్టాలూ, బంధువులూ. సినీమా వదిలేక గేటులోంచి, వచ్చే ప్రవాహంలా ఆ గదిలోంచి ఒక్కొక్కళ్ళు నవ్వుతూ, హాస్యం చేస్తూ రావడం చూశాడు.
    "అమ్మ! ఎంత నాటకం ఆడాడు దాసుగారు" అనుకొని ఆనందం పట్టలేకపోయాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు సంతోషంలో,
    దాసుగారు నవ్వుతూ -
    "అవున్నాయనా నువ్వు నా మేనల్లుడివే! నాకీ సంగతి ముందు తెలిస్తే ఇంత వరకూ వచ్చేదికాదు? నువ్వెళ్ళిపోయాక - మీ అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది! అప్పుడు తెలిసింది సంగతంతా? అయితే నువ్వు చేసిన పనికి జవాబుగా ఈ చిన్న నాటకం ఆడ్డానికే ఇంత వరకూ "ఎవ్వరూ నీ కంట పడకుండా వుండడానికే ఒప్పించాను. మణిని కూడా స్పెషల్ రిక్వెస్ట్ మీద-ఒప్పించాను, ముఖ్యంగా ఇందులో అతను సహకరించకపోతే ఈ నాటకం ఇంత రక్తికట్టేది కాదు! ..... ఆఖర్ని మరో విషయం.
    చిన్న తనంలో వింతయిన కోర్కెలుంటాయి. తెలిసో తెలియకో వాటిని ఎలాగయినా తీర్చు కోవాలని అనుకుంటూ వుంటాం - కాని అవి తీరడం కోసం ..... ఏ గడ్డయినా కరవడం, చెడు పన్నాగాలూ, డొంకతిరుగుడు మార్గాలూ పట్టడం, ఒకరి జీవితాలతో ఆడడం - ఒకరిని మోసపుచ్చి దగాచేయడం మాత్రం కూడదు! కోరికల్లోనూ తారతమ్యాలున్నాయి, మంచి చెడ్డ లున్నాయి! మంచి కోర్కెలయితే ఎంత సాహసించి అయినా తీర్చుకోడం మెచ్చ తగ్గ విషయమే! కాని ఇలాటి పిచ్చి, పిచ్చి, కోర్కెలూ హానికరమయిన కోర్కెలూ తీర్చుకుందికి .... చెడు త్రోవలు తొక్కే కన్నా ..... వాటినే సూటిగా, తిన్నగా, గౌరావంగా, సాధించే మార్గాలు కూడా వున్నాయి! ఆ విధంగా ఎప్రోచ్ అయితేనే మంచిది, ఎవరికీ కష్టం, నష్టం వుండదు!
    ప్రేమ, పెళ్ళి అన్నది, విడివిడిగా తీసుకో కూడదు. ఒక ఆట క్రిందా, హాబీ క్రిందా అంత కన్నా తీసుకోకూడదు! ప్రేమ అన్నది పూల మాలలో పూలను కలిసివుంచే మాత్రం లాటిది. పెళ్ళి అన్నది రెండు కొసలనూ ముడివేసి బంధించేది.... రెండూ కలిస్తేనే బ్రతుకు పంట! జీవితమంతా సంబరం. అది ఇద్దరి వ్యక్తుల ఉజ్వల భవిష్యత్తుకు నాంది. అటువంటి పవిత్ర మయిన దానిలో- అపోహలకి, అపవిత్రతకి, నాటకాలకీ, మోసాలకీ తావుండకూడదు.
    ఒకరు చేసిన పని మోసం. దగా అంటూ ఆ పనే మనంచేసి సమర్ధించుకోడం చాలా తప్పు!" మనం ఒకరిని విమర్శించినపుడు మన లని లోకం కూడా విమర్శించింది. మనం మంచి తలబెడితే మనకి మంచే జరిగే అవకాశం వుంది; చెడు తలపెడితే అదే జరిగినపుడు తప్పు ఎవరిది? అది తెలుసుకుంటావనే యింత డ్రమెటిక్ గా చేయవలసి వచ్చింది!..........."
    అని యింకా ఉపన్యాసం కొనసాగించ బోతూంటే-
    "అయ్యా.... అసలు శుభముహూర్తానికి అరగంటే టయిముంది, యింక తెమలండి తొందరగా" అని పౌరోహితులు జ్ఞాపకం చేశారు...అప్పటికి దాసుగారు ప్రసంగం ఆపి ప్రపంచంలో పడ్డాడు.
    శుభలేఖలో ముహూర్తం టయిము పది గంటలని అందరికీ అప్పటికి తెలిసింది. అప్పటికింకా తొమ్మిదిన్నరే అయింది!
    "అయితే ఈ ముహూర్తం ఉత్తుత్తి ముహూర్తమే నన్నమాట బ్రతికించాడు" అని అనుకున్నాడు గిరి.
    మళ్ళీ ఆగిపోయిన తంతు ఆరంభమయింది. మంత్రోచ్చారణలు ప్రతి ధ్వనించాయి. మంగళ వాయిద్యాలు మరొకసారి మారుమ్రోగాయి. ఈమారు కోలాహలం, నవ్వులూ, హాస్యాలూ, అన్నీ రెండింతలయినాయి, గిరిచుట్టూ కావలసిన వాళ్ళందరూ మూగి  ఉడికించటం మొదలెట్టేరు. లాంఛనప్రాయంగా అందరికీ మర్యాదలు జరిగేయి. పన్నీరు సెంట్లు, కర్పూరం, వీటితో ఆ ప్రదేశమంతా గుబాళించి పోతోంది! అసలు ముహూర్తం వేళకి పందిరంతా క్రిక్కిరిసి చూడముచ్చటగా వుంది. నిజమయిన పెళ్ళికళ అప్పుడు వచ్చింది.
    గిరిజని తీసుకు వచ్చారు. ఠీవిగా, మెల్లగా, అందంగా నడిచి వచ్చింది! దించిన మొహం ఎత్తలేనంత సిగ్గు బరువు కనిపించింది. ఇప్పుడా ముసుగులూ, మోసాలూ, లేవు. త్రాచులాటి జడ వక్షంమీద నుండి వయ్యారంగా వ్రేలాడుతోవుంటే అజంతా కన్యలాగుంది "ఆనాడు లెంప కాయ కొట్టిన గిరిజేనా! ఈమె?" అని అనుకున్నాడు. తనని చూసి సిగ్గుపడుతూన్న గిరిజని చూసి..... తన్మయత్వంలో యిద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు.
    "అయం ముహూర్తమస్తు సుముహూర్త మస్తు" అని మంత్రాలు చదువుతూండగా, సూత్ర ధారణ జరిగిపోయింది...
    మహావైభవంగా గిరిజాకల్యాణం జరిగిపోయింది...
    మంగళ వాయిద్యాలు "హోరు" మంటూ .... చెవులు.....గింగిర్లు పెడుతూండగా.... గిరికి....తెలివి వచ్చేసింది...... కల కరిగిపోయింది.... లేచి కిటికీలోంచి చూడగా ..... వీధిలోంచి ఏదో పెళ్ళి వూరేగింపు బాజా భజంత్రీలతో, బంధుమిత్ర పరివారంతో సాగిపోతూంది.... పెళ్ళి పల్లకీలో పెళ్ళికూతురూ పెళ్ళికొడుకూ.....ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ క్రీగంట చూసుకుంటున్నారు!
    అది చూసి గిరి వేడి నిట్టూర్పు ఒకటి విడిచి లేచాడు..... యథాప్రకారం గృహాన్వేషణార్ధం బయలుదేర బోతూంటే- పోస్టు మాన్ వుత్తరం యిచ్చాడు..... విప్పి చూసేసరికి.....అది తన తల్లి దగ్గరనుండి.....అందులో విశేషం ఏమిటంటే చాలాకాలం నుండి రాకపోకలు లేని తన మేనమామా వచ్చాడట! ఏవో అర్జంటు విషయాలు మాట్లాడా.....ఉన్నపళంగా బయలుదేరి రమ్మని వ్రాసి వున్నది.
    ఏమిటో ఆ అర్జంటు పని-? ఎప్పుడూ లేనిది..... తన మేనమామ తన యింటికి రావడం ఏమిటి?....
    ఒకవేళ తన పగటి కల నిజమయిపోదు కదా?.... అని అనుకుంటూ ఆ సాయంత్రం ట్రయినుకి ఎయిర్ బాగ్ సర్దుకున్నాడు.

        

                                         ........సమాప్తం........   


 Previous Page

WRITERS
PUBLICATIONS