Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 14


    క్రింద హాలులో కూర్చొని శ్రీపతిగారు నీరజ అతని విషయం ఆలోచిస్తూ ఉంటే పైన గదిలో రోజా, ప్రభాకరం ఇద్దరూ కబుర్లలో మునిగి తేలుతున్నారు.
    'డియర్....! క్రింద హాలులో కూర్చున్న ఆ అమ్మాయెవరు?'
    'మా మేనగోడలు. ఆ పాచి పీనుగ శారదను ఒదిలించుకుంటే యిప్పుడు ఈ పిల్లొకటి నా ప్రాణానికి. మొన్న ఏవో నీతులు చెప్పాలని ప్రయత్నించింది. మళ్ళీ ఈ జన్మలో నా జోలికి రాకుండా కుక్కకాటుకి చెప్పుదెబ్బలా తిప్పికొట్టాను. అంతే! ఇక నా ఊసెత్తడంలేదు.'
    'భలే! నాకు తెలుసు. నీ వటువంటి వాడినని. అందుకేనా కోపం ఎంతోమంది అర్రులు చాస్తున్నా నా హృదయంలో నీకు ప్రధమస్థానముంచాను' కళ్ళు విచిత్రంగా తిప్పుతూ అంది రోజా ఆమె మాటలలోని యదార్ధాన్ని గ్రహించలేని ప్రభాకరం. 'థాంక్సు రోజా .... నేను ధన్యుణ్ణి' అని రోజా కుడిచేతిని సున్నితంగా ముద్దాడాడు.
    'ప్రభాకరం మన పరిచయం కలిగి కొన్ని వసంతాలు గడిచాయి. అయినా మన ప్రేమచిహ్నంగా నాకు బహుమానమేదీ యివ్వలేదు.' ఆశగా ప్రభాకరం కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది రోజా.
    'నన్ను మించిన బహుమానమింకేం ఉంటుంది రోజా....! నన్ను నేనే నీకు సమర్పించుకున్నాను.' చిలిపిగా రోజా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ప్రభాకరం.
    'అది నిజమే ప్రభాకర్...! నేను కాదనను. కాని నీవు దగ్గరలేనప్పుడు కూడా నా హృదయంలో నీవే మెదలాలంటే నీ ప్రేమ చిహ్నమొకటి నా దగ్గర ఉండొద్దూ...?' అని ప్రభాకరం కళ్ళల్లోకి మత్తెక్కించేలా చూస్తూ అతనిని రెచ్చగొట్టసాగింది.
    రోజాను ఆ స్థితిలో చూసిన ప్రభాకరం ఉక్కిరి బిక్కిరయ్యాడు. 'అలాగే రోజా. ఏం కావాలో కోరుకో?'
    'తప్పకుండా నా కోరిక తీరుస్తావా?'
    'ఏం...? ఎందుకొచ్చిందా సందేహం?'
    'ఏం లేదు. ఆ తర్వాత వెనుకకు పోకూ డదు. నా చేతిలో చేయివేసి మాటయివ్వు. చేతిని ముందుకు చాస్తూ అంది రోజా.
    'రోజా మాట తప్పడం ఈ ప్రభాకరం జీవితంలోనే జరగని పని. అయినా నీ తృప్తి కోసం అలాగే చేస్తాను' అని ముందుకు చాచిన ఆమె చేతిలో తన చేతినివేసి మృదువుగా నొక్కాడు. మత్తుగా రెప్పలు ఆర్చింది రోజా.
    'డియర్! మొన్న ఒక నెక్లెసు ను చూశాను. ఎంత బాగుందనుకున్నావ్ ....! జీవితంలోపెట్టుకుంటే అటువంటి నెక్లేసే పెట్టుకోవాలి! దాన్ని మూసినప్పటినుండి మన ప్రేమ చిహ్నం అదైతే బాగుంటుందనే ఊహ నాకు కలిగింది. ఏమంటావ్? సోఫాలో వాలుగా కూర్చున్న ప్రభాకరం షర్టు కాలరును సరిజేస్తూ లేనీ ఆప్యాయతను ఒలకబోస్తూ అంది.
    'దాని వెల ఎంతేమిటి?' మత్తుగా ఆమె అందాన్నీ తనకళ్ళతో జుర్రు కుంటూ అన్నాడు ప్రభాకరం.

                               
    'ఆఁ... ఎంతోలేదు. రెండు వేలు మాత్రమే!' నిర్లక్ష్యంతో అంది రోజా.
    ఉలికి పడ్డాడు ప్రభాకరం. మత్తు వదిలింది. సరీగా కూర్చున్నాడు. రెండు వేలే...!' అతని ప్రమేయం లేకుండానే అతని పెదవుల నుండి ఆ మాటలు వెలువడ్డాయి. ముఖం వ్రేలాడేసుకున్నాడు.
    'అంతడబ్బు ఏ వంకతో నాన్నగారిని అడగమంటావ్...? ఇప్పటికే ఆయనగారు నామీద కారాలు మిరియలు నూరు తున్నారు. రెండువేలు అడిగితే యింకేమైనా ఉందా? మంచి ఉంగరం ఒకటి ప్రజంట్ చేస్తాను అదే మన ప్రేమ చిహ్నం. సాధారణంగా ప్రేమచిహ్నాలుగా ఉంగరాలే యిస్తూ ఉంటారుగదా!' నచ్చ జెప్పేధోరణిలో అన్నాడు ప్రభాకరం.
    'బోడి ఉంగరం ఎవరికి కావాలి? మన ప్రేమ అసాధారణమైనది. అటువంటప్పుడు సాధారణ బహుమతికి అర్ధం ఉండదు. పోనీలే ప్రభాకర్! నా కోసం మీ నాన్నగారితో పేచీ ఎందుకు తెచ్చి పెట్టుకుంటావ్? నాకు ఉంగరమూ వద్దు నెక్లెసూ వద్దు. నీవుంటే చాలు.' ముఖం మాడ్చుకొని, చిరుకోసం నటిస్తూ, బుంగమూతి పెడుతూ అంది.
    'రోజా! నీవలిగితే నే భరించగలనా? అలాగే! నీవు కోరినది తల తాకట్టు పెట్టయినా యిస్తాగా!' గుండె గుబగుబ కుంటున్నా పెదవులపై నుండి వచ్చాయి మాటలు.
    'వద్దులే ప్రభాకర్! నాకోసం నీవు యిబ్బంది పడడం సహించలేను. జీవి తాంతం నీవు, నేను యిలా కలిసి ఉండ కలగడమే నాకు ముఖ్యం.' బలమైన తన కోరికను నివురుగప్పిన నిప్పులా అణిచి పెట్టుతూ అంది రోజా.
    'లేదు. నీకోరిక తీర్చి, నిన్ను సంతోష పెట్టలేక పోయిననాడు నా యీ జీవితమే వృధా....! నీ సంతోషమే నా సంతోషం! నీకోసం ఏమైనా చేస్తాను. రోజా....! నారోజా....!' తన దృఢ నిర్ణయాన్ని తెలియపరిచాడు.
    అకస్మాత్తుగా తన వాచీ చూసుకున్న రోజా అదిరిపడి 'ప్రభాకర్! చాలా ప్రొద్దుపోయింది. మమ్మీకి ఏం సంజాయిషీ చెప్పుకోను? వెళ్ళొస్తాను. ఎల్లుండి నా పుట్టిన రోజు. నీకోసం వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాను. నే కోరినది యివ్వలేకపోతే బాధపడకు. నీవు మాత్రం తప్పకుండా రావాలి. నెక్లెసు కోసం లేని యిబ్బందులు తెచ్చిపెట్టుకోకు' అని ప్రభాకరం నుదురుపై పడిన కాఫ్రును ఉంగరాలలా మెలివేస్తూ, వయ్యారం ఒలి కిస్తూ క్రిందికి దిగింది రోజా. సాగనంపడానికి ఆమెననుసరించాడు ప్రభాకరం. ఇదంతా నీరజ ఒక కంట కని పెడుతూనే ఉంది.

                            *    *    *

    'అమ్మా! నీరజ నేను, మీ నాన్న అలా బయటికి వెళుతున్నాం. జాగ్ర్రత్తమ్మా!' సుందరరామయ్యగారితో బయటికి వెడుతూ అన్నారు శ్రీపతిగారు.
    'అలాగే మామయ్యా!' అని లోపల ఎక్కడో ఉన్న నీరజ బయటికి వచ్చి హాలులో సోఫాలో కూర్చుంది. ఆ రోజు కాలేజీకి ఏదో శలవు. ప్రభాకరం పైన తన గదిలో కూర్చొని ఆలోచనలో పడ్డాడు. ఉదయం పది దాటింది. రోజా బర్త్ డే ఆరోజే! ఆమె కోరిన నెక్లెసు విషయమై ఆలోచిస్తూ ఉన్నాడు. 'ఏమిటి చేయడం? ఒక గంటముందుగా వెడితే తప్ప ఆ నెక్లెసు కొనడానికి వీలు పడదు. సాయంత్రం ఐదింటికి పార్టీ. ఈలోగా రెండువేలు ఎలా సాధించడం? ఎటూ పాలుపోవడం లేదు. నెక్లెసు తీసుకు వెళ్ళకపోతే రోజా బాధ పడుతుంది. అబ్బ! రోజాను బాధపెట్టి నేను సంతోషంగా ఎలా ఉండగలను? ఎక్కడైనా అప్పుచేస్తే? నాకెవరిస్తారు? వంద, రెండొందలైతే ఎలాగో బాధపడవచ్చు. రెండువేలంటే మాటలా? ఏమిటబ్బా చేయటం? చూస్తాను. ఒక్కొక్కసారి నాన్న గారు మతిమరుపుతో తాళాలు యినప్పెట్టెకే ఉంచి వెడుతూంటారు. ఈరోజు అలా జరుగుతే బాగుంటుంది. అలా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ జరిగినా రెండువేల రూపాయలు తీస్తే తెలియకుండా ఉంటుందా? తెలిస్తే తెలిసింది. రెండు రోజులు వోర్చుకుంటే చాలు. ఆ తర్వాత ఆయనగారే మరచిపోతారు. అయినా మాకు రెండువేలు ఒక లెక్కలోవా? చూస్తాను. తాళం చేతులు ఉంటే నేనదృష్ట వంతుడనే!' అని ఆలోచిస్తూ మెల్లిగా లేచి క్రిందికి దిగివచ్చాడు. నీరజ సోఫాలో కూర్చొని ఉంది. ఏదో ఆలోచనలో ఉండడంవల్ల ప్రభాకరం దిగివచ్చిన సంగతి ఆమె వెంటనే గుర్తించలేక పోయింది. అన్నపూర్ణమ్మగారు వంట గదిలో ఉన్నారు. చడీ, చప్పుడు కాకుండా మెల్లిగా శ్రీపతిగారి గదిలోపలికి వెళ్ళాడు ప్రభాకరం. లోగా శారద ఉన్న గదినే నీరజ ఉండడానికి ఏర్పాటు చేశారు. కొద్దిసేపైన తర్వాత తన గదినుండి ఏదైనా నవల తెచ్చుకోవాలనే ఉద్దేశంతో లేచింది నీరజ. సవ్వడి విని తలుపుచాటున నక్కాడు ప్రభాకరం. నీరజ తన గదిలోపలికి వెళ్ళింది. అప్పుడే ఆమె బయటికి రాదనుకున్న ప్రభాకరం యినప్పెట్టెవైపు చూస్తూ అడుగులు ముందుకు వేశాడు. అతని సంతోషానికి అవధులు లేవు. తాళం చెవులు యినప్పెట్టెకే ఉన్నాయి. సంతోషంతో, వణుకుతూన్న చేతులలో పెట్టె తెరిచాడు. రెండుకట్టలు పది రూపాయలవి తీసుకున్నాడు. ఇనప్పెట్టె తలుపు యధాప్రకారం వేశాడు. ఆ కట్టలు రెండూ తనకు వెనుక ప్రక్కగా పెట్టుకొని బయటికి వస్తున్నాడు. నవల చేతిలో పట్టుకొని నీరజకూడా అప్పుడే బయటికి వస్తూ ప్రభాకరం చేసినదంతా చూసింది. కాని ఏమీ ఎరగనట్లు ఊరుకుంది. ఆ సమయంలో ఏదైనా గొడవ చేస్తే పరిస్థితి విషమిస్తుందని నీరజకు తెలుసు. ప్రభాకరం దొంగగా నిరూపించబడతాడు. అయినా ఊరుకోకుండా 'ఏం బావా? మామయ్య గదిలో ఏం చేస్తున్నావు?' సూటిగా ప్రభాకరం కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు తడబడ్డాడు. ఒళ్లంతా ముచ్చెమటలు పోశాయి. వణుకుతూన్న స్వరంతో 'నీరజా! నీవా? ఇక్కడేం చేస్తున్నావు? నేను నాన్నగారున్నారేమోనని వారి గదిలోకి వెళ్లాను కాని వారు అక్కడ లేరు, ఎక్కడికి వెళ్ళారు?' కంగారు పడుతూ నీరజను ప్రశ్నించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS