Previous Page Next Page 
లోకం పోకడ పేజి 14


    రాఘవరావు చాప మీద కూర్చున్నాడు. అతని ప్రక్కనే రాయుడు గారు కూర్చున్నాడు.
    "మీకు తెలీని విషయాలేమున్నా యండి? అంతా కులసానే."
    "ఊ. ఏమిటి కబుర్లు ? మా ఇంటికి వచ్చావని తెలిస్తే రామయ్య గారు వూరు కుంటారా?" అన్నాడు రాయుడు గారు నవ్వి.
    "ఆ. దాందే ముందండీ? మీ బావగారేగా? సరే, దానికేం లెండి. మా వూరి పంచాయితీ ఎలెక్షన్లు రాబోతున్నాయి. ప్రెసిడెంటు గిరీకి నేను పోటీ చేస్తున్నాను" అన్నాడు రాఘవరావు. రాయుడు గారి ముఖ కవళికలు గమనిస్తూ.
    'అందులో నా ప్రమేయం ఏముందోయ్? మీ పార్టీ వాడు, పెద్దవాడు రామయ్య గారున్నారుగా?" అన్నాడు రాయుడు గారు ఆరిపోయిన చుట్ట అవతల పారేస్తూ.
    "ఆ విషయాలు అట్లా ఉంచండి. నాగభూషణం తెలుసుగా మీకు? మీరంటే అతనికి ఎంతో గౌరవం."
    "ఏదోలే పాపం! పెద్దవాడై పోయాడు." అన్నాడు రాయుడు గారు సానుభూతి కనపరుస్తూ,.
    "అయన మూడో కొడుకు రమేష్ తెలుసుగా?"
    "తెలీకేం? మా మేనల్లుడు సురేంద్రా, అతను ఒక్క గదిలోనే ఉంటున్నారు."
    "ఏదో నాకు కొన్ని కొన్ని సంగాతిలు చెవిని బడ్డవి చెప్పుతున్నా, అతనే మీ మేనల్లుడి మతులు విరిచి మీ అమ్మాయి పొట్టిగా, గుమ్మటం లా పొట్టి బుడం కాయలా ఉంటుందని చెప్పి, పెళ్ళికి ఒప్పుకోకుండా చేశాడు. ఈ విషయాలన్నీ నాగభూషణానికి తెలిసే వూరుకున్నాడు. మీ మేనల్లుడి మనసు ఆ రమేష్ గాడే పాడు చేశాడు. వాడు మాత్రం చక్కని చుక్కాని ప్రేమించాడు. అందునా ఇందునా కాకుండా మీ కుటుంబాల నే అంతా కలిపి వంచించాడు" అన్నాడు మెల్లిగా రాఘవరావు. రాయుడు గారి ముఖ కవళికల్లో కొంచెం మార్పు కనిపించింది.
    "నాగభూషణం అంతటి వాడయినాడా?' అన్నాడు ఆశ్చర్యపోతూ రాయుడు గారు.
    "అవునండీ . నాగభూషణం అంతమారిపోయినా ఆయనంటే మా వూరు పడి చస్తుంది. ఏం చూశో మరి? అంతా అయన చెప్పు చేతుల్లోనే ఉంటారు" అన్నాడు రాఘవరావు.
    రాయుడు గారు అంతా ఒక్క నిమిషం లో అర్ధం చేసుకున్నాడు. నాగభూషణం విషయం తర్వాత తెలుసుకోవచ్చు. అసలు రాఘవరావు ఎత్తిన ఎత్తెమిటో లీలగా అర్ధం చేసుకున్నాడు రాయుడు గారు.
    "అయితే పంచాయితీ ప్రెసిడెంటు గా నువ్వు పోటీ చేయబోతున్నావా? మంచిదే నాగభూషణం నీ అభ్యర్ధిత్వాన్ని బలపరచడుగా?అదేనా నీ సందేహం?"
    "అదేనండీ . మీరు కాస్త నాగభూషణాన్ని అణిచి పెట్టాలి. మీమాటంటే ఆయనకు గురి."
    రాయుడు గారికి వీపు మీద చరిచి నట్లని పించింది. రాఘవరావు వేసిన పాచికను ఇట్టే కనిపెట్టాడు రాయుడు గారు.
    "రాఘవరావు, నా సంగతి నీకు తెలుసుగా?" అన్నాడు తీక్షణంగా రాఘవరావు వైపు చూస్తూ. రాఘవరావు గుండె దడదడలాడింది.
    "బురఖా రాజకీయాలు, ఊసర వెల్లి వేషాలు నాకు గిట్టవు, రాఘవరావ్. నా నియోజక వర్గం లో నేను ఏం చేశానో, ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. వాళ్ళ మంచి చెడ్డలు నాకు తెలుసు. నీ కుయుక్తు లూ నాకు తెలుసు. ఈ విషయం లో నీవు నా దగ్గరకు రావడం అర్ధం లేని పని. నేను నమ్మింది ఒక పార్టీ . ఒక పార్టీ టికెట్టు మీద ఎన్నికయ్యాను. అదే పార్టీ టికెట్టు మీద పోటీ చేస్తున్నాను. నువ్వు ఆ పార్టీ సభ్యుడ వై ఉండి నన్ను అభ్యర్ధించడం లో ఏమాత్రం అర్ధం లేదు. నా కూతురు పెళ్లి విషయం లో నాగభూషణం నిజంగా కలుగ జేసుకొని ఉన్నట్లయితే ఆ విషయాలు నేను కనుక్కొంటాను. నువ్వు వెళ్ళవచ్చు." అన్నాడు రాయుడు గారు రాఘవరావు ను మందలిస్తూ.
    మారు మాట్లాడకుండా రాఘవరావు వెళ్ళిపోయాడు.

                            *    *    *    *
    అటు రాయుడుగారూ, ఇటు రామయ్య గారూ ఎన్నికల ప్రచారం లోకి దిగారు. రాయుడు గారు తన నియోజక వర్గమంతా ఎన్నికల కార్యాలయాలు స్థాపించారు. రెండు వందలకు పైగా వాలంటీర్ల ను , కార్యకర్తల నూ తాయారు చేశారు. ఆయనకు పని తల మున్క లుగా ఉన్నది. అన్ని ఊళ్ళ లోనూ సభలు పెట్టి ఉపన్యాసాలు ప్రారంభించారు. ఏ ఊరు చూసినా ఎన్నికల కార్యాలయాలతో, జెండాలతో , కార్యకర్తలతో నిండిపోయింది. రాయుడు గారికి పోటీ వ్యతిరేకత పార్టీ అభ్యర్ధి ఒక్కడే. అంటే పోటీ ఇద్దరి మధ్యనే. ముఖాముఖి పోటీ.
    ఇటు రామయ్య గారి నియోజక వర్గం లోనూ, ఎన్నికల ప్రచారం బాగానే సాగుతుంది. రామయ్య గారికి కార్మికుల అండదండలు బలంగా ఉన్నాయి. కార్మికుల్లో పలుకుబడి బాగా ఉన్నది. డబ్బు బాగా ఖర్చు పెట్టుతున్నాడు.
    రామన్న పాలెం లో ని కార్మికుల ఓట్లన్నీ సామాన్యంగా రామయ్య గారికే పడతాయి. కానీ ఒక మహమ్మదీయుల ఓట్లే దాదాపు వెయ్యి ఉంటాయి. ప్రసాద పురం సివారు నే మహమ్మదీయుల పల్లె ఒకటి ఉంది. అక్కడ అంతా మహామ్మ్దీయులే. అంతా కూలి నాలి చేసుకొని బ్రతికే వారే. వాళ్లకు కొన్ని సంవత్సరాల నుంచీ ఒక కోరిక ఉంది. ఎన్నికల ప్రమేయం వచ్చి నప్పుడల్లా అంతా కలిసి ఆ విషయాన్ని బయటికి లాగుతారు. గడచిన రెండు ఎన్నికల్లో వాగ్దానాలతో మోసపోయారు. ఈసారి గట్టిగా పట్టు పట్టారు. వారందరి కోరిక ఒక్కటే.
    ఆ పల్లెలో తాతల నాటి మసీదు ఒకటి ఉన్నది. అది శిధిలావస్థలో ఉండి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నమాజు చేసుకోవాలన్న పరిస్థితికి వచ్చింది. అది పునరుద్దరించాలంటే కనీసం మూడు వేల రూపాయలు కావాలి. అది ఏ పార్టీ వాళ్ళయితే పునరుద్దరించీ ఆ మసీదు ను బాగు చేస్తారో ఆ పార్టీ అభ్యర్ధికే తమ పల్లె ఓట్లన్నీ ఇస్తామని అంటారు. క్రిందటి రెండు ఎన్నికల్లో కొంచెం మోస పోయామనే అనుకున్నారు. ఈసారి తమ పట్టు వదల్లేదు.
    రామయ్య గారు ఎన్నికల ప్రచారానికి ఆ పల్లె వెళ్ళాడు. పెద్దలంతా సమావేశ మై తమ కోరికను వెలిబుచ్చారు. మసీదు పునరుద్దరింప బడితే వెయ్యి ఓట్లు బీరుపోకుండా మీవేనన్నారు.
    రామయ్య గారు తెలివి తక్కువ వారు కాదు. "కులతత్వాలు, మత తత్వాలూ మత దురభిమానాలూ మనస్సులో పెట్టుకుని ఎన్నికలకు ముడి పెట్టకండి. ఇలాంటి పల్లెలూ, ఊళ్లూ మన రాష్రంలో , దేశం లో ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర శ్రేయస్సు , దేశ శ్రేయస్సు దృష్టి లో పెట్టుకుని అందరూ ఏ పార్టీ సమర్ధనీయంగా చక్కగా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పనిచేసి , ప్రభుత్వాన్ని నడుప గాలుగుతుందో అదే ఆలోచించాలి గాని మసీదులూ, గుళ్ళూ, గోపురాలతో మీ కోరికల్ని బయలు పెట్టడం తగని పని" అన్నాడు. అయన మాటలను ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. అయన ప్రచారం పూర్తీ చేసుకొని వెళ్ళిపోయాడు. రెండో రాజకీయ పార్టీ అభ్యర్ధి అసలా పల్లె వైపే రాలేదు. కార్యకర్తలే వచ్చి ప్రచారం చేసి వెళ్ళారు.
    రాయుడి గారికి భోజనం చెయ్యడాని క్కూడా తీరుబడి కావడం లేదు. ఎన్నికల ప్రచారానికి గాను అయన ఒక చిన్న కారు కొన్నాడు. ప్రతి ఊరు వెళ్లి ఊళ్ళో అందర్నీ దర్శించి తమ పార్టీ ప్రయోజనాలూ, ఇదివరకు ప్రజలకు తను ఎంత సేవ చేసిందీ, ఇప్పుడు ఎంత సేవ చేయ్యబోయేది విపులంగా చెప్పి, తన అభ్యర్ధి త్వాన్ని బలపరిచి ఒటివ్వమని అడిగేవాడు. రాయుడు గారు ఊళ్ళో కి వస్తున్నారన గానే ప్రజలు ఆయనకు ఎదురేగి ఇష్టాగోష్టి గా ఆయనతో ముచ్చటించే వారు. ఆయనకు బాగా సన్నిహితులైన కొంతమంది "ఎందుకండీ మీకు అనుమానం? లోగడ ఎన్నికయినట్లుగానే ఈసారీ మీరే ఎన్నికవుతారు. డంకా బజాయించి చెపుతాం.' అనేవారు. అందుకాయన నవ్వి ఈ విధంగా అనేవారు.' సినిమా తీసిన తర్వాత అది విడుదలయిన మొదటి రోజున ఆ నిర్మాత కు ఎంత గుండె దడగా, ఆదుర్దాగా ఉంటుందో రాజకీయ వాదులకూ అంతే. తన హ్సిత్రం బాక్సాఫీసు హిట్టవుతుందని ఆ నిర్మాతకు తెలుసు. అదే విషయం అంతా చెబుతారు. కాని నిర్మాతకు కావలసింది ప్రజాభిప్రాయం. ప్రేక్షకులు కళకళలాడుతూ చిత్రం చూడగానే ఆయనకు పరమానందంగా ఉంటుంది. అట్లాగే ఎన్నికల అభ్యర్ధుల విషయం లో కూడా అంతే. ప్రజాభిప్రాయం ఎట్లా ఉందొ తెలుసుకోవడం మన విధి కదా. క్రితం సారి గెలిస్తే ఈసారి గెలుస్తామని కళ్ళు మూసుకుంటామా? ఒళ్ళు వంచి పని చెయ్యాలి. అందరికీ నచ్చ చెప్పాలి. అందరి చేతా అవునని పించుకోవాలి."
    అయన మాటలకు అంతా నవ్వుకునేవారు. రాయుడు గారన్నట్లు పార్టీ అభ్యర్ధుల కయినా గెలిచేవరకూ దడగానే ఉంటుంది. గెలిచిన తరువాత ధీమా అధికమవుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS