Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 14

                                 

    సుధాకర్ ఎడం చెయ్యి ఫాంట్ జేబులో పెట్టుకుని రెండో చేత్తో షోగ్గా సిగరెట్లు దమ్ము లాగుతూ రోడ్డు మీద వచ్చే పోయే కార్లను చూస్తున్నాడు మధ్య మధ్య మోహన్ మాటలకు ఊ కొడుతూ....
    సడన్ గా సుధాకర్ గాభరా పడటం చూసి "ఏమొచ్చిందిరా భాయ్! అలా గాభరా పడతావ్?' అనడిగాడు మోహన్.
    సుధాకర్ చేతిలోని సిగరెట్టు ను హడావుడి గా రోడ్డు మీద పారేసి "కళ...!' అన్నాడు.
    "వోరి నీ ఇల్లు బంగారం కాను! కళే కదా? కాళికాదేవిని చూసినంత కంగారు పడిపోతావేమిటి?"
    "నా చేతిలో సిగరెట్టూ చూసిందంటే సాక్షాత్తూ కాళికాదేవే....! అదీగాక ఆవిడ కోసం సిగరెట్లు మానేసినట్టు కూడా చెప్పాను... కళ్ళారా చూసిందంటే మళ్ళా మా కధ మొదటి కొస్తుంది...."
    "మీ ఇద్దరి మధ్యా రాజీ కుదిరింది కదా?.... ట్రాన్సి స్టర్ పుచ్చుకోమంటావా? ఆ ముసలాడున్నాడే దేవాంతకుడురా....చూస్తె అమాంతం పీక నొక్కుతాడు...."
    "నొక్కే దాకా నువ్వెక్కడుంటావ్ ? రయ్యి మంటూ గాలిలో దూసుకుపోవూ? నాలుగు మంచి మాటలాడి మెల్లిగా ఆ ట్రాన్సి స్టర్ తీసుకుందూ.... ఏ కళ నున్నదో ఇప్పుడు మాట్లాడిందనుకో. అయినా మళ్ళా ఏ క్షణం లో కళకు కోపమొస్తుందో ఎవరు చెప్పగలరు?.... ఆ ట్రాన్సి స్టర్ గీత దగ్గర ఉన్నంత వరకు నాకు మనస్థిమితం ఉండదు. నీ పుణ్యమా అని గీత ఇప్పుడు రేడియో ధ్యాసలో లేదనుకో.... అన్నట్టు మర్చిపోయానురా.-- వాళ్ళు రెండు, మూడు రోజుల్లో వూరి కేళ్తున్నారు... నువ్వొచ్చి తీసుకో పోయావంటే ఆ ట్రాన్సి స్టర్ నాకింకా దక్కదు.... ఆ పిల్ల నా మాటే మర్చిపోయి తనతో పట్టుకు పోతుంది...."
    కళ సరాసరి అక్కడికే వచ్చింది.
    "ఇక్కడేం చేస్తున్నారు--?' కెవ్వుమంటూ కాలు పట్టుకుంది.
    "మీ మగవాళ్ళ కి ఇదేం పోయేకాలం? నడి రోడ్డు మీద కాలుతున్న సిగరెట్లు కాస్తా గిరవాటేస్తారు కదా ఎవరైనా చూడకుండా అడుగేస్తారంటే.... అబ్బా...' అంటూ కళ కాలు చేత్తో పట్టుకుని వూదుకున్నది సుధాకర్ కేసి కొరకొరా చూస్తూ.
    సుధాకర్ దిగులుగా చూశాడు.
    మోహన్ "అబ్బే! అది వాడు కాల్చందే? ఆ సిగరెట్టూ పీక ఎవరు పారేశారో , ఏమో? వాడు సిగరెట్లు కాల్చటం మానేశాడు.... ఇంక నేనంటారా ? నాకసలు సిగరెట్లు వాసనే గిట్టదు." అన్నాడు సుధాకర్ తరపున సాక్ష్యమిస్తూ..
    "పీకేమిటి? అంతుంటేను? ,మీరు కాకపొతే మరొకడు... క్రిందా , మీదా తెలియని వెధవ. ఇలా అంటించి అలా అవతల పారేశాడు....' అంది కళ మధ్య మధ్యలో బాధగా 'ఉస్, 'ఉస్' అనుకుంటూ.
    సుధాకర్ కి చెవులు మూసుకో బుద్ది వేసింది.
    "పాపం! ఎందుకలా తిడతారు? నిండు సిగరెట్టు అలా పారేశాడంటే ఏదో కారణం ఉండక పోదు...." అన్నాడు.
    "కొవ్వేక్కిన వెధవ కి కారణమేమిటి? టపాకాయలా ఇలా అంటించి అలా పారేస్తే ఎవరికైనా కాలు చుర్రు మంటుందనే జ్ఞానం ఉండక్కర్లే....!"
    "చెప్పులు వేసుకోకుండా ఉత్త కాళ్ళతో నడవటం మీ తప్పు...."
    "నా చెప్పులు ఇప్పుడే తెగిపోయాయి.... అందుకే భద్రంగా కాయితం లో చుట్టి బుట్టలో పడేశాను... నా మాట వదిలెయ్యండి. ప్రపంచంలో సగానికి సగం మంది తిండి లేక పస్తులుంటున్నారట.... వాళ్ళు చెప్పులు వేసుకుని తిరగ్గలరా మీరిలా రోడ్డు మీద కాలు కాస్తున్న సిగరెట్లు పారేస్తారని....?"
    సుధాకర్ తేలిగ్గా శ్వాస విడిచాడు.
    "అమ్మయ్య! వాళ్ళ కోసమా మీరు విచారిస్తున్నది? మీ కోసమే కాబోలనుకుని కంగారు పడ్డాను.... డబ్బు లేని వాళ్ళను గురించి మీరు ఆలోచించకండి. వాళ్ళు ఈ నడి రోడ్డంట నడిచి వెళ్ళరు. ఈ రోడ్డంట సినిమా వాళ్ళ కార్లు వాయు వేగంతో పరుగు లెట్టి వెళ్తుంటాయి.  అందుకని వాళ్ళు మరో త్రోవంట నడిచి వెళ్తారు. ఒక వేళ ఏ దరిద్ర గొట్టు వెధవో ఉత్త కాళ్ళతో నడిచి వెళ్ళినా వాడి కాళ్ళు మీ అంత సున్నితంగా ఉండవు లెండి. వాడు మిలా 'కుయ్యో మంటూ కాలు పట్టుకోడు....పాపం? బాగా కాలిందా? చూడనివ్వండి?" అంటూ సుధాకర్ వంగి కళ కాలు పట్టుకుని చూశాడు.
    ఎర్రగా బొబ్బ ఎక్కిన చోట చేత్తో తడమబోయేసరికి "అమ్మో!" అంటూ కళ కాలు వెనక్కు తీసుకున్నది.
    "కాలు కట్ట మంటారా?"
    "దేనితో.....?"
    సుధాకర్ ఆలోచిస్తున్నట్టుగా చూస్తూ అన్నాడు.
    "మరే! ఆడవాళ్ళయితే పమిట చెంగు పరపరా చింపి యిట్టె కట్టు కట్టేస్తారు....మేమైతే నోటితో జాలి పడాల్సిందే కాని క్రియలో చూపిడ్డామంటే చిన్న గుడ్డ ముక్క కూడా దగ్గిరుండదు...."
    "రుమాలుందిగా?" అని జ్ఞాపకం చేశాడు. మోహన్ రుమాలు తో ముక్కు తుడుచుకుంటున్న సుధాకర్ ను చూసి.
    "ఆ ముక్క చీడుకునే గుడ్డతో నాకేం మీరు ఉపచారాలు చేయనక్కరలేదు..... ' అంటూ కంగారు పడింది కళ.
    సుధాకర్ కాస్సేపాగి షర్టు రెండు చేతులతో సాగదీసి పట్టుకుని "ఈ షర్టు చింపి కట్టనా....?" అన్నాడు.
    కళ నవ్వింది.
    "కృష్ణుడు చెరుకు గడ చీల్చుకు తింటూ చెయ్యి కోసుకున్నాడట.... రక్తం కారుతూ ఉంటె సత్యభామది భామలు ఏం చెయ్యాలో తోచక కంగారు పడుతుంటే ద్రౌపది మీరన్నట్టు పమిట చెంగు పరపరా చింపి రక్తం తుడిచి కట్టు కట్టిందట. కృష్ణుడు ఎంతో సంతోషించి ఆ పేలికలో ఎన్ని పోగులున్నవో అన్ని చీర లిస్తానని దౌపది కి వర మిచ్చాడట. అందుకే ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో అక్షయంగా వరాలులిచ్చాడట... అలా మీరు కూడా అక్షయంగా షర్టు లివగలననుకుంటున్నారా! నిష్కారణంగా గట్టి షర్టు ను పట్టుకుని బలవంతంగా చింపకండి... అక్షయం కాకపోగా ఉన్నది కూడా క్షవరమై పోతుంది...."
    "మరేం చేద్దాం?"
    "ఏం చేయనక్కర లేదు.... మందూ, మాకూ లేకుండా అనవసరంగా కట్టేందుకు? అదే నేనిందాక అడిగింది! మీరు మరోలా అర్ధం చేసుకుని ఇంతసేపూ తికమక పడిపోయారు...."
    "సరే ఏదో ఒకటి కానివ్వండి! ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నట్టు....?"
    కళ నీరసంగా జవాబిచ్చింది.
    "మరెక్కడికి లేదు తిన్నగా ఇంటికే.... మా స్నేహితురాలింటికి వస్తే అది కాస్తా వూళ్ళో లేదు....అందుకని ఉసూరమని తిరిగి వెళ్తున్నాను...."
    సుధాకర్ సానుభూతి చూపించాడు.
    "ఇంతటి మహా నగరం లో మీరు ఎక్కడి కన్నా అకస్మాత్తుగా వెళ్తే ఇలాంటి ఆశా భంగాలు తప్పవు.... ముందుగా మీరు ఒక ఉత్తరం ముక్క రాసి పడేసే మీకీ శ్రమ తప్పేది....."
    కళ మూతి ముడుచుకుంది.
    "అవున్లెండి....! ఇవ్వాళ నేను చేస్తున్న వన్నీ తప్పులే! ఇందాక ఉత్త కాలుతో కాలుతున్న సిగరెట్టు మీద అడుగు వేయటం ఒక తప్పన్నారు. ఇప్పుడు చెప్పకుండా రావటం మరో తప్పంటున్నారు."
    సుధాకర్ గాభరాగా "మీ చెప్పులు తెగిపోయాయన్నారు.... ఇలా కాస్త దూరం నడిస్తే చెప్పులు కుట్టే తెలుగు వాడున్నాడు. వాడి దగ్గర కెళ్దాం రండి....' అంటూ ముందుకు నడిచారు.
    "కళ, మోహన్ సుధాకర్ వెంట నడిచారు.
    సుధాకర్ ఉన్నట్టుండి" మీ కాలు గొడవలో పడి మావాడిని పరిచయం చేయటమే మర్చి పోయాను....వీడు మోహన్ అని నా ఫ్రెండ్ -- నేటి సామాన్యుడు , రేపటి మేటి నటుడు ...." అని చెప్పాడు.
    "ఇది వరకో మాటు చూశాను లెండి..." అని నోరు జారి కళ సుధాకర్ కు కనబడకుండా నాలుక కొరుక్కుంది.
    ఈలోగానే "ఎప్పుడు చూశారు?" అని అడగనే అడిగాడు సుధాకర్ ఆశ్చర్యంగా చూస్తూ.
    "ఎక్కడో చూసినట్టు గుర్తు!" అని తప్పించుకున్నది కళ.
    మోహన్ కళ కేసి చూస్తున్నాడు.. కళ ముఖం తిప్పుకున్నది.. ఎక్కడో ఏమిటి? గీత, గీత పక్కన మోహన్..... సినిమా హల్లో.... అసలు అప్పటి నుంచేగా తన మనస్సు తేలిక పడింది...!
    ఒక చెట్టు నీడన చెప్పులు కొట్టేవాడు చిరిగి పోయిన పాత చెప్పులన్నీ పరుచుకుని కూర్చున్నాడు. కళ చేతికి తగిలించుకున్న ప్లాస్టిక్ బుట్టలో నుంచి చెప్పులు బైటికి తీసింది. ఒక చెప్పుకు తాడు తెగి పోయింది. చెప్పులు కుట్టేవాడు చెప్పు చేతిలోకి తీసుకుని కుట్టబోతుంటే కళ "ముందు ఎంత కావాలో చెప్పు!' అంది. వాడు "బేడ డబ్బు లివ్వండమ్మా!" అన్నాడు. బేడకు బేరమాడేదేమటని సరే కుట్టమంది కళ. తీరా ఒకటి బాగయ్యే సరికి రెండోది వూడోస్తుందేమోనని అనుమానం వేసి అది కూడా గట్టిగా కుట్టమంది. రెండు చెప్పులూ కుట్టటం అయ్యాక వేసుకు చూసింది.
    "బాగున్నాయండి?' అనడిగింది కళ, సుధాకార్ మోహన్ ల నుద్దేశిస్తూ.
    ఒకళ్ళు ఫస్టు అంటే మరొకళ్ళు బెస్టు అన్నారు.
    కళ సంతృప్తి గా వాడి చేతిలో పావలా పెట్టబోయేసరికి వాడు "పావలా కాదు, రూపాయి రావాలి -- " అన్నాడు.
    "ఇదేమిటి? ఇందాక చెప్పుకు రెండణాలే అన్నావుగా?" అనడిగింది విస్తుబోతూ కళ.
    "బటన్ పది నయా పైసలమ్మా, పాడైన చెప్పుకు ఆరు, రెండో దానికి నాలుగు ఏశాను.... మీకు కాబట్టి పావలా తగ్గిస్తున్నాను. మూడు పావలాలు చేసుకుని ఇచ్చెయ్యండి..." అంటూ చిరచిర లాడాడు.
    "నిన్ను బటన్ ఎవడేయ్యమన్నాడోయ్? కావాలంటే తీసేసుకో!" అని బెదిరించాడు సుధాకర్.
    "తీయడానికి ఇప్పుడెలా వస్తది?.... మిగతా అర్ధరూపాయి ఇలా పడెయ్యండి...." అంటూ పేచీ పెట్టాడు.
    "వీడితో మాట్లాడి ప్రయోజనం లేదు.... మాట్లాడకుండా మనదారిని మనం పోదాం పదండి." అని మోహన్ వాడికి తెలియకుండా ఇంగ్లీష్ లో అన్నాడు."    
    వాడేమో ఎర్రగా చూస్తున్నాడు. మరో రెండణాలు వాడి ముఖాన పారేస్తే గొడవ తీరిపోతుందనుకుని కళ రెండణాలు క్రింద పడేసి కదిలింది. సుధాకర్ , మోహన్ కూడా బయల్దేరారు. చెప్పులు కుట్టేవాడు పెద్ద పెద్ద కేక లేసుకుంటూ "మీ ఎత్తులు నాకాడ కాదు.... ఆ డబ్బు లిక్కడ పెట్టీ మరీ కదలండి..." అంటూ వెంట బడ్డాడు.
    "ఏమిటోయ్ నీ దబాయింపు....! పెద్ద పెద్ద కేకేలేస్తే దడిసి పోతారనుకున్నావు కాబోలు!" అంటూ మోహన్ వాడి కేసి కోపంగా చూశాడు.
    "ఎర్రగా చూస్తున్నాడు.... ఏం కొడతావా? కొట్టు! నీ వంట్లో , బొమికలుంటాయేమో చూద్దాం.... తెలుగోళ్ళు కదా అని అభిమాన పడితే మరీ తెగనీలుగు....!" అంటూ ముందు కొచ్చాడు వాడు.
    మోహన్ షర్టు చేతులు పైకి ముడిచాడు. సుధాకర్ మోహాన్ రెక్క పట్టుకుని ఇవతలకు లాగాడు. కళ కంగారుగా వాడిని వదుల్చుకోవడానికి పర్సు తీసింది.
    "మీరు ఒక్క నయా పైస కూడా బైటికి తీయకండి... వీడి అంతేమిటో కనుక్కుంటాను" అన్నాడు మోహన్.
    అయినా కళ మోహన్ మాట వినిపించుకోకుండా మిగతా అరణాలు వాడి ముఖన పడేసింది. వాడు సణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
    "వాడి నోటిలో నోరు పెడితే మనకే పరువు తక్కువ ..... మీ మాట వినలేదని మీకు కోపం వచ్చిందేమో...." అని క్షమాపణ చెప్పుకున్నది కళ.
    "మీ డబ్బు మీరిచ్చుకున్నారు. మధ్య నా సొమ్మేం పోయింది లెండి?" అని జవాబిచ్చాడు మోహన్ ఘాటుగా.
    కళ ఎమనటానికి తోచక వూరుకున్నది. నాలుగడుగులు నడవక ముందే కళ ఇబ్బంది పడుతూ ఆగిపోయింది.
    "అరె! కంటుతున్నారే? ఇంకా కాలు...."
    సుధాకర్ మాట పూర్తీ కాకముందే కళ చెప్పు కాలి నుండి తీసి ఇవతల పడేసింది. స్ట్రాపు వదులుగా వ్రేలాడుతుంది--
    "భలే టోపీ వేశాడే వీడి దుంప తెగా?" అని ఆశ్చర్య పోయాడు సుధాకర్.
    "ఆ చెప్పిలా ఇవ్వండి! దాంతోటి నాలుగు వడ్డించి వస్తాను...." అన్నాడు మోహన్ చురుగ్గా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS