8
చైతన్య రహితమైన విజయను తను స్పృశించాలో స్పృశించకూడదో తెలియలేదు నాగేశ్వరరావు కు. సాయంత్రం ఏడు గంటల వేళ అతను చూడాలని వచ్చేసరికి విజయ స్మృతి లేకుండా పడి వుంది. ఆమెను లేవదీసి కారులో పడుకో బెట్టడానికి చుట్టూ ఎవరూ లేరు.
డాక్టర్ నే ఇక్కడికి తెద్దామంటే -- ఈమెను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళటానికి మనసొప్ప లేదు. తీరా చూస్తె ఉదయం నుంచీ ఆమె దగ్గర ఎవరూ లేనట్లుగానే ఉంది.
ఒకానొక కాలంలో తనచేయ్యి తగిలితే కాల్చుకుంది. మొన్న నొక రోజున మెదలకుండా ఊరుకుంది. ఈరోజు ఆమెను తను లేవదేయ్యాలి. ఏ ఆత్మహత్య అయినా చేసుకుంటే.....తన తప్పుకు శిక్ష ఆమె అనుభవిస్తే........
నాగేశ్వర్రావు కు భయం వేసింది. కాని ఈ పరిస్థితిలో ఎలా వదలటమో అదీ తెలియలేదు. ఈ పరిస్థితిలో ఉన్న భార్యను వదిలి జయప్రదరావు ఎటు వెళ్లాడో అదీ అర్ధం కాలేదు. చివరికీ ఏమైతే అది కానిమ్మని ఆమెను లేవదీసి పడుకో పెట్టాడు.
ఆ అగ్ని శిఖను స్పృశించబోతూ వేయి మంది దేవతల్ని ప్రార్ధించాడతను. చీకటి వ్యాపించింది. రోడ్ల పక్క దీపాల వెలుగు మృత్యు సమీపంలో వున్న విజయ అచేతన వదనం మీద తెరలు తెరలుగా పడుతున్నది. అప్పుడు కూడా ఉజ్జ్వల దీప్తి అణుమాత్రం తగ్గని ఆమె సౌందర్యాన్ని చూసి చకితుడయ్యాడు అతను.
ఇంతవరకూ తను ఎంతో మంది ఆడవాళ్ళ ను చూశాడు. ఎంతమంది తోనో దైహిక వాంచలు కూడా తీర్చుకున్నాడు. ఇంతమంది ఆడవాళ్ళతో వున్న అధిక పరిచయం వలన స్త్రీని పరికించి చూడాలనే ఆసక్తి అతనికి బొత్తిగా లేదు. కాని ఆ నిర్జీవ ప్రతిమ సౌందర్య రక్తిమలో అతనికి యుగాయిగాల స్త్రీత్వం కనిపించింది. నిజమైన అందం అది.
ఇరవై తొమ్మిదేళ్ళ విజయ -- ఒక్క నగ కూడా లేని అతి లోక సుందరి -- దరిద్రంలో శుష్కించిపోయినా పల్లెత్తి పలుకని మహా ఇల్లాలు-- ఈ బంగారు బొమ్మ ఏ లోకం నుంచి దిగి వచ్చిందో ఆ లోకంలో వెన్నెలా, దీపాలూ పుణ్య ఫలాలూ తప్ప మరేం ఉండి ఉండవు.
తనకు ఓపినంత వరకూ ఆ పుణ్య మూర్తి కి సేవ చేసి తన తప్పులకు నిష్కృతి కలిగించు కోవాలనుకున్నాడు నాగేశ్వర్రావు. కాని ఈమె నుంచి అంగీకృతి దొరకదు. అతని కళ్ళలో నీరు తిరిగింది. ఆమె యీ పరిస్థితి కి తనే కారకుడు. సుఖంగా సాగిపోతున్న సంసారంలో తనే విషం పోశాడు.
నాగేశ్వర్రావు సహాయంతో విజయను లోపలికి తీసుకెళ్ళాడు డాక్టర్. ఆమె పరిస్థితి ఏమీ బాగాలేదు. జయప్రదరావు ను తీసుకు రమ్మన్నాడు డాక్టర్. ఎంత తిరిగినా అతని అంతూ పొంతూ దొరకలేదు. విజయ పరిస్థితి చాలా విషమంగా వుంది. ఆహార లోపం వల్లా, దిగులు వల్లా, ఫ్లూరసీ ప్రవేశించింది. ఊపిరి తిత్తులలో చేరిన నీటిని గొట్టం వేసి తియ్యాలన్నాడు డాక్టర్. డానికి విజయవాడ తీసుకెళ్ళాలి. జయప్రదరావు కోసం ఆలస్యం చేస్తే ఆమె ప్రాణానికే ముప్పు రావచ్చును.
నాగేశ్వరరావు యిక ఆలోచించలేదు. ఏమైతే అది కానీమని ధైర్యం చేసి డాక్టరు సహాయంతో విజయను విజయవాడ చేర్చాడు.
* * * *
బ్రతుకు మహా చిత్రమైనది. సుఖాలు కష్టాలు కూడా ఒంటరిగా రావు. ముసలి వసుంధర ఇంట్లో చట్ట విరుద్దమైన పనులు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. కాని ఎవ్వరూ పట్టుకోలేక పోయినారు యిన్నాళ్ళూ.
ఆచూకీ ఎవరిచ్చారో తెలియదు గాని జయప్రదరావు తో సహా ఆరుగుర్ని అరెస్టు చేశారు పోలీసులు. పశ్చాత్తాప పడటానికి కూడా ఓపిక లేక పోయింది జయప్రదరావుకు. ఏదయితే అదే కానీ దీని కోసం విచారిస్తూ కూర్చుని ప్రయోజనం ఏమిటి? ఎవరి నుదుట ఏది లఖింప బడితే అది జరుగుతుంది. తన నుదుట ఐశ్వర్యమూ, అందమైన భార్యా, ఆత్మీయతా లిఖింపబడటం మాత్రమే కాదు, దరిద్రము, వియోగము, పద భ్రష్టత కూడా వ్రాసి పెట్టి ఉన్నాయి. తన నేరాలకు యిప్పుడు శిక్ష అనుభవించ బోతున్నాడు.
విజయ చెప్పినట్లు తప్పు నిప్పు లాటిది. తెలిసి చేసినా, తెలియక చేసినా అదికాలి తీరుతుంది. ఔద్దత్యం, అభిమానం ఉన్న విజయ శాపం తనకు ఈ శిక్ష విధించింది. జ్వరంతో పడి వున్న విజయకు తనేమైంది కూడా తెలియదు. గ్రుక్కెడు మంచినీళ్ళు కూడా ఎవ్వరూ యివ్వరు. బహుశా విజయ తన కిహ కనిపించక పోవచ్చును.
అతని రెండు కన్నులూ అశ్రుపూరితాలాయినయ్. అంతర్యంలోనే ఆ సర్వేశ్వరు ని మనసారా ప్రార్ధించాడు. నేరస్తుడుగా ఆ పవిత్రమూర్తి ఎదుట తను నిలబడ లేడు. తనకంటే మహోన్నత స్థానంలో ఉన్న ఆ దేవీ మూర్తి కి తను అనర్హుడు. ఆమె చనిపోవటమే మంచిది. ఆమెకు ముక్తి నియ్యి అని రెండు చేతులూ జోడించి ఆక్రోశించాడతను. ఒకవేళ దిక్కు లేకుండా ప్రాణా లోదిలితే -----ఏం చెప్పిందో ఎవరూ తనకు చెప్పక పొతే? ఏనాడో విజయ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది అతనికి--- "మీకు తెలియదు . ప్రతి రోజూ వెంకటేశ్వర స్వామిని నేను ప్రర్ధించేది ఒకందుకే. మీ ఒడిలోనే నా ప్రాణాలు పోవాలని....."

భయం కలిగింది అతనికి. విజయ అన్న మాట నిలబెట్టు కుంటుంది. ఎన్నాళ్ళ కు కలుసుకున్నా సరే తన ఒడిలోనే ఆమె చనిపోతుంది. కాని ఇప్పుడా పవిత్రకు విలువ తగ్గలేదు గద? భయంతో కంపించి పోయాడు జయప్రదరావు. లేదు. విజయ పవిత్రత సూర్యకాంతి లాంటిది. మబ్బు లడ్డం రావచ్చు నెమో-- అంతే. విజయ చనిపోవాలనే కోరిక, చనిపోకూడదనే కోరిక కూడా అతనిలో ఎక్కువగా వున్నాయి. ఆమెకు ఎదురు దెబ్బ తగిలితే విలవిలలాడి పోయేతను , ఆమె మృత్యువును కోరుతున్నాడు. ఆమె భోజనం చెయ్యకపోతే తెల్లవార్లూ నిద్ర పోనితను, "మీరు పక్క నుంటే అన్నీ తగ్గిపోతాయి" అని ప్రార్ధించిన అసహయురాల్ని ఒంటరిగా వదిలేసి వచ్చాడు. తనకు శిక్ష తప్పదు. ఆ శిక్షానంతరం తిరిగీ మరొకసారి పునీతుడవుతాడు. అప్పుడయినా క్షమిస్తుందా విజయ?
జయప్రదరావు యిక ఆలోచించలేదు. కఠినమూ దుర్గంధయుతమూ అయినా ఈ జైలు రాళ్ళ మీద, నల్లులూ, దుమ్మూ నిండిన కంబళి పరిచి, హంతకులూ, దొంగలు , జూదగాళ్ళూ అయిన తన సహా ఖైదీల మధ్య పడుకుని బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు.
జయప్రదరావు త్రాగుబోతూ, జూడగాడూ అవటానికి కారణం అతని దరిద్రం. కేవలం ఆ కారణం వల్లనే జయప్రదరావు చెడిపోయి నాడు. అయినా అతని సంస్కారం యింకా మిగిలే ఉంది. అతని మీద అమితమైన సానుభూతి కలుగుతుంది. ఇంకోటి ఏమిటంటే జయప్రదరావు విజయ అనుకున్నంత మహా పురుషుడు కాడు సాధారణుడు. తన ప్రేమ బలం చేత విజయే అతడిని కొంత ఉన్నతుడి ని చేసింది. కొందరి దృష్టి లో అతడు హీనుడు కూడా. అయినా ప్రతి వాడూ అతనితో తదాత్మానుభవం పొందే స్థితి ఉంటుంది. ప్రతి వ్యక్తీ అతని లాగానే పతనంలోని దుఃఖాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. అతనిలో పతనం తాలుకూ విశ్వజనీనత , ఆవేదన ఉన్నవి. అందుకే అతనంటే అమితమైన సానుభూతి.
కాని విచారించాల్సింది ఏమిటంటే -- ప్రతి వాడూ అల్పమైన తన అనుభవాల ఆధారంతోనే లోకాన్ని తలవటానికి ప్రయత్నిస్తాడు. ఈ విశాల జగతిలో వ్యక్తుల జీవితాలు కూడా భిన్న భిన్న సంస్కారాలతో ఉంటాయనే విషయం గ్రహించరు. జయప్రదరావు వారి దృష్టి లో నేరస్తుడే కావచ్చును. అయినా అతను అకర్మన్యుడూ ద్రోహీ కాడు. ఎప్పటికో ఒకనాటికి తప్పకుండా క్షమింపబడతాడు. ఆ క్షమలోనుంచే నూతన జీవితాన్ని పునః ప్రారంభిస్తాడు.
మనిషి ఎంత అపారాది అయినా, సర్వేశ్వరుడు అతనికి విధించే శిక్ష ఎలా వున్నా, తోటి మానవుడి నుంచి ఏదైతే పొందుతాడో అదే అతని జీవన మార్గాన్ని చివరికి తీర్చి దిద్దుతుంది. అది శిక్ష అయినా కావచ్చును. క్షమ అయినా కావచ్చును. పాపం చేసిన వాడిని క్షమించి పాపాన్ని ద్వేషించడమే మానవుడు నేర్చుకోవలసిన మొదటి ధర్మం.
యద్బూతహితం తత్సత్యం-- అదే జీవిత పరమావధి.
* * * *
