Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 14


    అతను వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. కాసేపు ఆగి అన్నాడు.    
    "నా క్కావలసింది మా నాన్న సుఖమే. ఆయన నన్నెలా పెంచి పెద్ద జేశారో ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. నేను కృతఘ్నుడిని కాను మాష్టారూ! నా మనసు తెలుసుకోకుండా ఆయనే బాధపడి పోతున్నారు.
    అతను చెప్పినదంతా విని-
    "నీ మీద మండిపోతున్నాడని, నిన్ను అలక్ష్యం చేస్తూన్నాడనీ బెంగపడకు. ఈ వయస్సుకి తొందరపాటు ఉంటుంది. ప్రతిదానికీ చిరాకు పడటం సహజం. ఇక్కడే నీలాటి వాళ్ళు సహనం చూపించాలి. పెద్దవాళ్ళంతా అదొకరకమైన ఛాదస్తమని చెప్పి సర్దుకుపోవాలి. సాధ్యమైనంతవరకూ వాళ్ళ మనసు నొప్పించకుండా మీరు బాధపడకుండా తప్పించుక తిరగాలి. ఏ మంటావ్? నేనంటూన్న దాన్లో తప్పేమైనా ఉందా?"
    "లేదు. వాస్తవమే చెప్తూన్నారు."
    "సరే...... పనిమీద వెడుతున్నావ్ కాబోలు ఈ సాయంత్రమే వాడిని కలుసుకుంటాను. సరేనా."
    అతను జానకిరామయ్యగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత జానకిరామయ్యగారు అనుకున్నారు. పాపం, పిల్లలు గూడా ఎన్నో అవస్థలు అనుభవిస్తో కన్నవారి ఋణం తీర్చుకోవాలనే అనుకుంటారు. అలాంటప్పుడు వయసూ, అనుభవమూ రెండిలోనూ 'పెద్దవాళ్ళం' అనబడే తమలాటి వాళ్ళు పరిస్థితులను అర్ధం చేసుకుని తగిన విధంగా నడుచుకోడం కావాలి.

 

                     
    ఆ సాయంత్రం రిక్షా చేయించుకుని కోటయ్య పంతులింటికి వెళ్ళారు జానకిరామయ్య.
    రిక్షాదిగి ఇంట్లో కాలుపెట్టిన జానకిరామయ్య గారికి ఆ ఇల్లు కొత్తగా కనిపించింది. గజిబిజి గందరగోళంగా ఉంది. తన అడుగుల సవ్వడి అవతల గదిలో ఉన్న కోటయ్య పంతులు విన్నాడు కాబోలు.
    "ఇలారా నేనీ గదిలో ఉన్నాను" అన్నారు.
    జానకిరామయ్యగారు వెళ్లారు. మంచంపైన, మంచాన్ని అంటి పెట్టకున్నట్టు పడి ఉన్నారు కోటయ్య పంతులు. జానకిరామయ్య గార్ని చూస్తో-    
    "ఇవ్వేళైనా దయ తలచి వచ్చినందుకు సంతోషిస్తున్నా" అన్నారు.
    "ఇప్పుడైనా వచ్చేవాడినికాదు. మీ వాడు కబురు చెప్పకపోతే"
    "ఎందుకనిట. నేనింత పనికిమాలిన వెధవలా కనిపిస్తూన్నానా ఖర్మం."
    "అది కాదోయ్. ఈ మధ్య నాకూ వంట్లో బాగోడంలేదు. వీధి మొహం చూచి చాలా కాలమైయ్యింది. ఖబురంపావు కాబట్టి తప్పదన్నట్టు వచ్చాను గాని లేకపోతే ఆ ఇంట్లోనే పిచ్చెత్తే వరకూ ఆలోచిస్తూ కూర్చునుండేవాడిని."
    కోటయ్య పంతులి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన కన్నీటిని చూడగానే ఉలిక్కిపడ్డారు జానకిరామయ్య. కుర్చీని ఆయన మంచానికి దగ్గరగా లాక్కుని.
    "ఎందుకాకన్నీరు?" అడిగారు.
    "చాతగాక" కోటయ్యపంతులు దీనంగా అన్నారు.
    "చాలా పొరపాటు"
    "మరేం చెయ్యమంటావ్ జానీ! చిన్న తనమంతా నవ్వులతో గడిపాం. ఒకళ్ళని విడిచి మరొకళ్ళు ఒక్క క్షణమైనా ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు చూడు మన మధ్య ఉన్న కొద్దీ డూం వచ్చేస్తుంది. నా దగ్గరికి వచ్చి రెండు ముక్కలు మాటాడడానికి నీకు వోపికలేదు. నేనే నీ దగ్గర కొద్దామంటే ఈ దిక్కుమాలిన మంచం నన్నొదిలి పెట్టడంలేదు."
    "పిచ్చి పంతులూ గతాన్ని గుర్తు చేసుకునేందుకు బాధపడతావోయ్? నీకూ నాకూ బాధ్యతలు పెరిగాయి. మనం 'మన'కోసం బ్రతకడం లేదు. అసలా రోజులెప్పుడో గతించాయి. మన సరదాలూ మన స్నేహాలు  ఎప్పుడో చచ్చిపోయాయి పంతులూ!"
    "ఇప్పుడు గనక హాయిగా దీక్షితుల్లా కన్ను మూసేస్తే - హు.. అంత అదృష్టం గూడానా జానీ! బ్రతికి నన్నాళ్ళూ హంసలా బ్రతికి చచ్చే టప్పుడు నిద్రపోయినట్టు పోయాడు."
    జానకిరామయ్యగారేమీ మాటాడలేదు.
    "నావల్ల నా కుటుంబానికి ఒరిగేదేమీ లేక పోగా కలహాలు పుట్టుకొస్తున్నాయి జానీ! అవి న మనసుని మరింత పాడు చేస్తున్నాయి."
    "లేనిపోనిదాన్ని ఊహించుకుని మధనపడటం మనకు సహజం పంతులూ!"
    "ఊహాగానం కాదోయ్! పచ్చి నిజం! నా రోగానికి 'క్షయ' అని ఇరుగూ పొరుగూ అమ్మలక్కల పేరెట్టారు. కోడలు హడలిపోయింది. పాపం-చిన్న పిల్లాయె నిలువెల్లా వణికి పోయింది. క్షయ రోగికి సేవ చేయడం ప్రమాదమనీ, నన్ను శానిటోరియం కి పంపించమనీ వాడితో చెప్పింది. వాడు వినలేదు, 'నా బొందిలో ప్రాణ ముండగా మా నాన్నని ఎక్కడికీ పంపను. ఆయన నా దగ్గరే వుంటారు నీకిది ఇష్టం లేకపోతే నిశ్చింతగా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చని ఆ పిల్లని కసురు కున్నాడు. ఆ పిల్ల వెళ్ళిపోయింది. వీడేమో సెలవు పెట్టి నా దగ్గర కూర్చుంటున్నాడు. జానీ......ఇలా జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదోయ్. నా కారణంగా ఇంత రగడా? నేనంటే వాడికి పంచ ప్రాణాలు. వాడికి నేను తండ్రిని కానీ ఆ పిల్లకి నేనెవర్ని? ఎవరో ముసలాయనికి సేవలు చేసి చావు తప్పించాలనే కోరిక ఆ పిల్ల కెందుకుండాలి? అవును మరి, ఆ అమ్మాయి కోరకున్న జీవితం మరొకటి. ఇది మాత్రం కాదు. ఆమెకు సౌఖ్యం కావాలి, ఆదరణా అనురాగమూ కావాలి, జీవితంలో తీసి దనమూ కావాలి. అందరి ఆడపిల్లల్లా ఆ పిల్లకీ ఇలాటి కోరికలు ఉంటాయి మరి. ఇవేం మా వారు పట్టించుకోడు. వాడికి కావలసింది నేను. ఇదంతా చూస్తూంటే-నాకు శిక్షలా కనిపిస్తుంది జానీ. ఇదేమీ లేకుండా ఈ పాడు ప్రాణం పోతే ఎంత బావుండును?" అన్నారు కోటయ్య పంతులు భారంగా.
    "ఈ కలలు శాశ్వతంగా పంతులూ!"
    "నేనూ ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను. కానీ, ఒక్కోసారి ఇదంతా కేవలం భ్రమేనేమో, నన్ను నేను సమాధాన పరచుకునేందుకు నాకై నేను తయారు చేసుకున్న గాలి మూటేమో అని భయమేస్తుంది.... కాస్త....ఆ మందు అందుకో జానీ!" అన్నారు కోటయ్యపంతులు యాస పడుతూ.
    జానకిరామయ్యగారు మందు కలిపి కోటయ్య పంతులికిచ్చారు. ఆయన తాగారు. తర్వాత అన్నారు.
    "అధికంగా మాటాడితే ఆయాసం, దడాను. ఏమీ మాటాడకుండా కూర్చుంటే తోచి చావదు. మన ఉద్యోగాలు మనల్ని అలా తయారు చేశాయి మరి,"
    ఆ మాటకి జానకిరామయ్యగారు నవ్వేరు.
    "అబ్బాయి నా మందుల కోసం చాలా ఖర్చు చేస్తూన్నాడు. ఆ ఖర్చుని చూస్తూంటే నాకు జాలి కలుగుతోంది. మూడు రోజుల నా ముచ్చట కోసమే కదా ఈ ఖర్చంతా. నేనూ నా రోగమంటూ వాడి తలమీద ఎక్కి కూర్చోకపోతే ఈ డబ్బు కాస్తా వెనకేసుకునే వాడుగదా! ఛీ వెధవ జన్మ. నిజం జానీ, ఒకడి మీద ఆధారపడి, వాడి నెత్తురు తాగుతూ బ్రతికే దానికంటే ఆత్మహత్యా చేసుకోవటం చాలా మందిచి"
    "పంతులూ!" ఆత్మహత్య పేరు వినగానే జానకిరామయ్యగారు ఉలిక్కిపడ్డారు.
    "ఆ దరిద్రపు పేరెత్తకు, ఆ పని చేసేది పిరికి వెధవలూ, ఏమీ చాతకాని దద్దమ్మలూను" అన్నారు జానకిరామయ్య ఉద్రేకంగా.
    "మరి నే నెవ్వడి వనుకుంటున్నావ్?"
    "నిన్ను నువ్వు తక్కువ చేసుకుని మాటా డొద్దు. నువ్వు మీ వాడ్ని కన్నావ్, పెంచావ్, పెద్ద చేశావ్. వీటి వెనక నువ్వెన్నో త్యాగాలు చేశావ్. వీటికి ప్రతిఫలంగా వాడు నిన్ను కంటికి రెప్పలా ప్రాణప్రదంగా చూచుకోవాలి. కొడుకై పుట్టిన తర్వాత నీ ఋణం తీర్చుకోవాలి. ఇది ధర్మం. కాబట్టి ఈ విషయాలు అట్టే పట్టించుకోవద్దు"
    కోటయ్య పంతులు పేలవంగా నవ్వేరు.
    "ఈ ఇంటిది చేసుకున్నపాటి పుణ్యం నేను చేసుకోలేక పోయాను. పుణ్యవతి, ఏ బాదర బందీ లేకుండా నాకన్నా ముందే వెళ్ళిపోయింది. వంటరిగా, ఈ ప్రాయంలో నరక యాతన అనుభవిస్తున్నాను. ఇది ఏనాటి పాపమో మరి?" అన్నారు కోటయ్య పంతులు.
    "ఈ స్థితిలో నేనేకాదు ఎవరైనా నీకు చెప్పేది చెప్పగలిగేది ఒక్కటే, మనసుని అదుపులో పెట్టుకో-సమస్యని భూతద్దంతో చూచి భయపడొద్దు. నీకు నేను చెప్తున్నట్టే రేపు నాకు మరొకడు చెప్పక తప్పదు. జీవితంలో జరుగుతూన్న సర్వ సాధారణమైన విషయమిది పంతులూ! ఈ బ్రతుకూ, ఈ యాతనా, ఈ సంసారం, సకలమూ 'మాయ' అని వేదాంత పద్ధతిని సరిపెట్టుకుంటే చాలు. అదే మనశ్శాంతి" అన్నారు జానకిరామయ్య ఉద్వేగంగా.
    కోటయ్య పంతులు జానకిరామయ్య గారి వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆయన చెప్పిన దాంట్లో చాలా 'నిజం' ఉన్నదాయిరి.
    
                                     *    *    *

    శంకరం రాసిన 'చెదిరిన మనసులు'  అనే నవలని వచ్చే సంచిక మంచి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు ఒక పత్రిక వాళ్ళు. ఈ ప్రకటనని నాలుగు మాట్లు చదువుకుంది సుశీల.
    అన్నయ్య కథలు బావుంటాయని ఇటు పత్రికల వాళ్ళూ అటు పాఠకులూ మెచ్చుకొడం తనకి తెలుసు. అన్నయ్యకి మంచి పేరున్నది.
    అన్నయ్య రాసే కథల్లో వైవిధ్యం, ప్రాణం, వాస్తవికతా తప్పకుండా ఉంటాయి.
    ప్రతి కథా మచ్సుతునకలా ఉంటుంది. వాడి కింత చాకచాక్యమో, నేర్పూ ఎక్కడ్నుంచి వచ్చాయో మరి.
    నిత్య జీవితంలో జరిగే సంఘటనలు చాలా మందికి తెలుసు. తెలిసిన దాన్ని పదిమందిలో చెప్పడం అందులో అందరికీ తెలియదు. అలా చెప్పడం తెలిసిన 'బహు కొద్ది' మందీ చెప్పే విధానంలో కృత కృత్యులవడం అంత తేలికైన పనీ కాదు.
    కథలు రాయడమనే వ్యాపకాన్ని ఇలా భాగించి, ప్రతి అంశాన్నీ పరిశీలించి చూస్తే చిన్నన్నయ్య ఒక పద్ధతి కొచ్చినట్టు స్పష్టమవుతుంది. వాడు మంచి కధకుడు.
    జీవితాన్ని అంటి పెట్టుకుని కథ నడుస్తుంది. అలాంటప్పుడు ఒక జీవితాన్ని కాయితంలో పెట్టి పది మందిచేత సభాష్ అనిపించుకోవడంలో అందరికీ చాత కొచ్చేదికాదు. అందుకే మనుషులందరూ కథకులనిపించుకోవడం లేదు. ఇది సుశీల ఉద్దేశ్యం! ఆ పిల్లకి అన్నయ్యలాటి కథకులపైన గౌరవభావం హెచ్చు.
    బయట తలుపు చప్పుడవడం విని పుస్తకాన్ని మూసి తలుపు తీసింది. తనెదుట సుబ్బలక్ష్మి నవ్వుతూ నిలబడి ఉంది. అలాగే కన్నార్పకుండా చూస్తూవుండి పోయింది సుశీల.
    "ఏం పిల్ల! గుర్తు పట్టావా?" అడిగింది సుబ్బలక్ష్మి.
    "చాలా మారి పోయావోయ్ సుబ్బులూ!"
    "మా ఇంట్లో వాళ్ళందరూ ఈ రిమార్కుని ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నారు."
    "నీ మాటా మారింది. ఇంగ్లీషు ముక్కల్ని వాడుతున్నావ్. అవున్లే ఆఫీసరుగారి భార్యవాయె."
    "చాల్లే వూరుకో...అవును గానీ నీ యింటికి వచ్సినధాన్ని నన్నిలా వీధిలో నిలబెట్టి మాటాడటం ఏమైనా బావుందా?"
    "సరి పోయింది. దెప్పి పొడవటం గూడా ప్రారంభించావూ" అన్నది సుశీల నవ్వుతూ.
    ఇద్దరూ ఇంటికొచ్చి కూర్చున్నారు.
    "అవునూ...ఎప్పుడే రావడం?" అడిగింది సుశీల.
    "ఉదయం"
    "ఏమిటో విశేషం పుట్టింటి మీద బెంగ పోయిందేమిటి?"
    "అదీ ఒక కారణమే అనుకో శ్రీవారు పక్కఊళ్ళో కేంప్ వెళ్ళడం వల్ల, ఈ వారం రోజులూ నా ఒక్కర్తికీ ఏం తోచదని చెప్పి పుట్టింటికి వెళ్ళడానికి పెర్మిషన్ ఇచ్చారు. మనం వచ్చాం. మళ్ళా వారం రోజుల్లో వెళ్ళిపోతాం. ఆ...ఇంట్లో మాస్టారు లేనట్టుందే."
    "ఇప్పుడే అలా బయటికి వెళ్ళారు."
    "మాస్టారు కులాసానా?"
    "ఈ మధ్య మాత్రం కాస్త సుస్తీ చేసింది."
    "అన్నట్టు నువ్వెప్పుడోయ్ మాకు పప్పు అన్నం పెట్టేది?"
    సుశీల సిగ్గుపడిపోయి తల వంచేసుకుంది.
    "ఈ సిగ్గెంతకాలంలే ...... ఆ మూడుముళ్ళూ పడిన తర్వాత-"
    "అబ్బ...... వూరుకొనే నీకో నమస్కారం పెడుతాను."
    "కాదు. నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను. ఏమైనా సంబంధాలు చూస్తున్నారా?"
    "..........."
    "నిన్నడుగుతే నువ్వేం చెప్తావ్. సూటిగా మాస్టార్నే అడిగేస్తాను. నా తోటిపిల్ల, ఇంకా ఎన్నాళ్ళని-"
    "ఆ కబుర్లుకేం గాని మీ ఊరి విషయాలు చెపుతూ?"
    "చెప్పమంటావా ? గోదావరి జిల్లాలో ఏలూరుంది. ఏలూరులో దోమలకీ, నల్లులకీ"
    "చాలా మాటలు నేర్పావు సుబ్బులూ" అన్నది సుశీల ఆశ్చర్యపోతూ.
    "అయ్యో ఖర్మ. ఇంత మాత్రానికే ఇంత పెద్ద కామెంటా"
    "అది కాదే... నీకు పెళ్ళికాక మునుపు వట్టి బుద్ధావతారంలా అసలు నోరు విప్పేదానివి కావు."
    "ఇప్పుడు వడావడా వాగడ నేర్చుకున్నా!"
    "అవును."
    "చాల్లే ఎవరైనా వింటే నవ్వగలరు. ఇది ఈ మధ్యలో అబ్బిన గుణం కాదు. మొదట్నుంచీ నా పద్దతి అంతే. నువ్వు గమనించ లేకపోతే నాదా తప్పు?"
    "ఎలా ఉంది మీ సంసారం?"
    "బ్రహ్మాండంగా ఉంది. అమ్మా నాన్నని విడిచి అంత దూరంలో ఉన్నాననే గాని, అన్నివిధాలా హాయిగా ఉంది చాలా."
    "............."
    "ఇక్కడే మరొక విషయం సుశీలా! ఆడపుట్టుక అధ్వాన్నమని జవాబేమిటంటే - ఆడ పుట్టుకా మగపుట్టుకా అని భేదం చేసి చెప్పడ మెందులకూ, ఏ పుట్టుకైనా, అనుభవించాలంటే అదృష్టముండాలి అని. గత జన్మలో మనం చేసుకున్న పుణ్యం కొద్దీ ఈ జన్మలో సుఖదుఃఖాలూ వెలుగునీడలూ ఉంటాయనీ అంటాను."
    "వేదాంతమా ఇది?"
    "ఏ పేరుపెట్టి పిలిచినా నాకు అభ్యంతరం లేదు. కాని నా నమ్మకం నాది."
    "నిజం, నువ్వు చాలా మారి పోయావు."
    "ఇందులో మా శ్రీవారి ప్రభావమేమీ లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను." అన్నది సుబ్బు లక్ష్మి నవ్వుతో.
    "మనం కలిసి చదవుకున్నాం. మొన్న మొన్నటి వరకూ గచ్చంగాయాలూ, గవ్వలూ, వైకుంఠ పాళీ ఆడుకున్నాం. అప్పట్లో నువ్వింత మాట కారివి కానే కావు సుబ్బులూ!"
    "ఇదేమిటే బాబూ! మరి ఈ మార్పుకి కారణం ఏమిటో పోనీ నువ్వే చెప్పరాదూ?"
    "అదే నాకు బోడపడటంలేదు."
    "ఓసి పిచ్చిపిల్లా! మనం ఎదుగుతూన్న మాట మరిచిపోతున్నావ్ లాగుంది. అప్పట్లో బొమ్మలాటలే మనకి జీవితం. ఇప్పుడు జీవితం సెంట్ పర్సెంట్ లైఫ్. కాబట్టి, ఇంకా బొమ్మ లాట జీవితం తాలూకు అభిప్రాయాలూ అవీ అన్నీ వదిలి పెట్టేయాలి మరి. అలాంటప్పుడు, మనమూ, మన మాటతీరూ తప్పని సరిగా మారితీరుతాయి గదా.
    సుశీల కళ్ళింతని చేసుకుని సుబ్బలక్ష్మి వైపు చూస్తూండి పోయింది. సుబ్బలక్ష్మి లో ఇంతటి ఆలోచనలున్నాయని తెలియగానే సుశీల ఆశ్చర్యపోక తప్పిందికాదు.
    "లోపలికి రావచ్చా అని అడుగుతేనే గాని ఇంట్లో కాలు పెట్టనిచ్చావ్ గాదు. ఇప్పుడు కాఫీ కావాలని అడుగుతేనే గాని ఇవ్వవన్న మాట. ఏం చేస్తాం. అడిగేస్తాను. కాఫీలేకపోతే మానేగాని, కాసిని మంచినీళ్ళైనా తగలెద్దూ" అన్నది సుబ్బలక్ష్మి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS