"ఏరా అబ్బీ! రాజుగాడి ఫోటో పేపర్లో పడిందేం?" శాస్త్రి సహాధ్యాయుడు.
"అందులోనే వుందికా?"
"అయితేకాని సత్యగారు వూళ్ళో వుందా? లేకపోతే పిట్టలు లేచిపోయేయా?" ఆధునిక సరళిలో షెర్లాక్స్.
"వెళ్ళి అడిగిరాకపోయినావురా, నాన్నా?" బుజ్జగించినట్లే అన్నాడు.
"డామిట్!"
"లేదురా కథ అడ్డంగా తిరిగింది" అంటూనే నవ్వేసేడు.
వాడు బ్రిడ్జీ దాటేడు. తను చూస్తూనే నిల్చుండిపోయేడు.
ఏం చెయ్యాలి? ఎక్కడకు వెళ్ళాలి? ఓసారి రాజు గదికి వెళ్ళితే ఏం పోతుందనే బయల్దేరేడు. గవర్నరుపేట చివరకే ఉన్నా, నెలకు ముఫ్ఫై రూపాయలు ఇచ్చేవాడు. విశాలంగా చక్కగా ఉంటుంది. కిటికీలోంచి చూస్తే కాలవ కన్పిస్తూ ఉంటుంది. తనదగ్గర ఉన్న చెవితో తాళం తీస్తూనే లైటు వెలిగించేడు. పర్యవేక్షణలో 'ఎవరో ఇదంతా కెలికినట్లే చేసేరు' అన్న అర్ధం అయితే, 'ఎవరూ?' అనుకునే కుర్చీలో కూర్చున్నాడు.
రాజులో ఓ ప్రత్యేకత ఉండేది. ఏ అవసరాలకు ఆ అవసరాలు కన్పడేటట్లు సామాను సద్దేవాడు. అవన్నీ క్రమబద్దంగా, నిఘంటువుల్లా ఉండేవి.
అప్రయత్నంగానే పుస్తకాల బీరువామీద పడ్డాయి కళ్ళు. తెరిచేడు. వరుసల్లో వైశాల్యాలు క్రమంగానే నించుని ఉన్నాయి. చూచేడు. అన్నీ కాలేజీ సంబంధం అయినా, అనామికంగా వ్రాసిన నోటుపుస్తకం కనపడితే, తెరిచేడు.
"ఫిబ్రవరి మూడు:- భౌతికభావమే సున్నాస్థితిలోకి వస్తే, ఆత్మ అన్న స్థితి ఏమిటి? ఈ స్థితిని అనుభవించడం సాధ్యమా? ఆ ఆత్మ అన్నది ఉన్నదున్నట్లుగా ఉండగలదా? ఎందుకో ఈ ఆలోచన వస్తూంది.
నామీద ఎవరో ఎక్కడినుంచో రాళ్ళు విసురుతున్నారు. అలజడి కలగచేస్తూంది.
ఫిబ్రవరి పది:- జీవిత పరిణామాన్ని సూక్ష్మీకరించేట్టయితే కర్మకు గతం ఉంది. అది జీవిత గమనంలో వేగంపొంది, రూపొందుతుంది. దీనికి కర్త, ఓ క్రియ అన్నదాని మీదుగా కర్మ చెయ్యబడుతూంది. సూక్ష్మంగా పిపాస మీద కర్మ పతనంచెంది, పరిణమించిన రెండు కర్మల ఫలితం సృష్టికి పునాది అవుతూందా?
ఫిబ్రవరి 22:- గతం ముందర భావి నిలదొక్కుకోలేకపోతూంది. జరుగుతున్న గతంలో గతం అనే సముద్రానికి ఉన్న చరిత్ర; కలిసేది, కలవబోయేది అన్న ద్విసమ్మేళనమే కాలం అవుతూంది. కాలం అన్నది మానవుల కొలతలకు అనునాయంగా ఉన్న కొలమానమేమో!
మార్చి 7:- కర్మ సృష్టింపబడ్డప్పుడు, ఇది ఎక్కడ నిల్వ అవుతూంది? ఎవరు దాస్తారు? క్రియే శక్తి అయి, అవని అంతాకూడా శక్తి స్థానం అయితే గతం అన్నది కాపలావాడులా ఉంది."
గజిబిజిగా తట్టింది. తన పరిధికి అనుకున్నట్లు కన్పించలేదు. పేజీలు త్రిప్పేడు. ఆఖరు పేజీలోనే ఉంది. అది మార్చి పదిహేను క్రిందనే ఉంది.
"నాలోంచి నన్ను పలకరిస్తారు. సూచనగానే ప్రణవం పలుకుతుంది. ఈనాడు వారే అంటారు: 'నేను రావినూతలపాడు గ్రామంలో పుట్టేను. చదివేను. వివాహం శాంతతో అయ్యింది. కాని......' ఇక మాట్లాడరు. ఏమిటో ఇది? ఎవరాయన? రావినూతలపాడు వెళ్ళాలన్న అభిలాష."
తెల్లబోయేడు. మధు, సత్యకూడా ఆ ఊరే వెళ్ళారు. అక్కడ ఏదో రహస్యం ఉంది. దాన్ని శోధించి, నిర్ణయించుకోవడానికే వాళ్ళు వెళ్ళేరు-తనకు చెప్పకుండా, అదేమిటో సూచించకుండా.
పుస్తకం చంకను పెట్టే, తాళం వేసి బయట పడ్డాడు. నిద్ర వస్తూంది. చదివినకొద్దీ దిన చర్యలు భయంగా, వికృతంగా నించున్నాయి. త్వరగా అడుగులు వేసేడు. అలిసిన ప్రాణంలా దిగులుగానే, మెట్లు ఎక్కేడు.
"నీకోసం ఘంటనుండి కూర్చుని వున్నా." దశరథం అన్నాడు. చేతిలో సంచీ ఉంది.
"మీరా!"
"ఇందాకా బండిలో వచ్చేను. అన్ని విషయాలూ ముజ్జిడ్డుగా తయారవుతున్నాయి. రాజు వచ్చి రుక్మిణితో మాట్లాడేడు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయేడు. ఇక తప్పదన్నట్లు ఇక్కడే వుంటాడనుకొన్నా. పరుగెత్తుకు వచ్చే. వాడు కన్పడ్డాడా?"
"లేదు."
ఉస్సురన్నాడు దశరథం.
"ఒక్క రాత్రిలో అర్ధభాగం హోటల్లో వుండి, మళ్ళీ మాయమైపోయేడు. ఇవ్వాళ రైల్లో వెళ్ళుతున్నాడు సీతారామయ్య."
"ఆ! ఆ మహానుభావుడే, నాయినా, ఇంత దూరం తెచ్చినది. అతను రామచంద్రయ్యకు బావమరిది. ఇప్పుడు మామగారు. ఆస్తి, డబ్బు కోసం కూతురుకే ఉరిత్రాడు వేసేరు. సంసారం చెల్లాచెదరైనట్లే అయ్యింది.
"మా చెల్లెలు ఏ క్షణంలో కళ్ళుమూసిందో ఆ క్షణికం నుండి ఆ కుటుంబం నానా గోత్రాలూ అయ్యింది. ఆ పిల్లని రాజుకిచ్చి పెండ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు ఒకప్పుడు ఆ దంపతులు. కాని విధురుడవడం, దానికితోడు సీతారామయ్య, లక్ష్మిల పన్నాగంతో, రుక్మిణిని పెండ్లి చేసుకుని తీరుతానన్న మొరాయింపు. ఆ పెండ్లి ఎంతయినా త్వరగా చెయ్యాలన్న పట్టుదలలో పంచమినాడు అయిందనిపించేరు.
"వాడు వచ్చేడు. చాటుగానే రుక్మిణిని కలుసుకున్నాడు."
"ఏం జరిగింది?"
"అమ్మ ఆయన్ని సుఖపెట్టిందో లేదో నాకు తెలియదు. కర్మ అనుభవం తప్పదు. విధి బలీయం అన్నవతులో ఇప్పుడు నాకు మారుటి తల్లి వయ్యేవు. ఆయన వూహించుకున్న సుఖం నువ్వు ఇస్తాననుకుంటున్నా. అందుకు దేవుడు నీకు ధైర్యం ఇమ్మనే ప్రార్ధిస్తున్నా.
'ఖర్చు పెట్టలేనంత డబ్బువుంది. అది నీకు ఏవిధంగా ఉపకరిస్తుందో అల్లాగే వినియోగం చెయ్యి. మారిన పరిస్థితుల్లో నేను అడుగుతానేమో అన్న భయం నీకు వద్దు. నీ ఇష్టం. అది నిన్ను సుఖపెట్టిందని తెలిస్తే సంతోషిస్తా.
'ఎందుచేతనంటే, నాకు డబ్బు సుఖం ఇవ్వలేదు. నాకు కావలసింది వేరుగా వుంది' - అన్నాడుట. రుక్మిణి ఒక్క టేవిధంగా తల బాదుకు ఏడుస్తోంది." ఆగేడు.
వెనువెనుక ఆ రావినూతల పాడు విషయం గుర్తుకు వచ్చింది. తను చెప్పలేడు. అదో అసందర్భప్రభావం అవుతుంది. తలపంచుకునే ఉండిపోయేడు.
"వెళ్ళిపోయేముందరే; "ఏవమ్మా కాళ్ళు? ఓసారి నమస్కారం పెట్టనీ. ఇదేస్థితిలో పెట్టగలనో లేదో అంటూనే వంగేడు ట.
"పిన్నీ! ఒక్క విషయం నా భార్యని నేను చూసేను. కళ్ళకు పాదాలు అద్దుకుంటూనే ఏడ్చింది' - అనే వెళ్ళిపోయేడుట. ఇదే మాకందరికీ అర్ధం కాలేదు. అందుకే పరుగెత్తుకుని వచ్చే."
పరిస్థితులు ఎంత క్రూరంగా ఉంటాయో అన్న జాలే కలిగింది. తను ఏమీ చెయ్యలేడు. తృణమాత్రంగా తను, సంపాదించి, సేకరించిన ఆ వార్త, ఈ కబురు దశరధానికి చెప్పడంతప్ప.
"ఆయనో!"
"ఊ! కొత్త పెళ్ళికొడుకు. వాడి ధ్యాసలేని స్వార్ధం. అందులో రుక్మిణి మనస్సును ఏవిధంగా కొనగలనన్న ఎత్తులే. రవ్వల నెక్లేసు, రాళ్ళ గాజులు - ఇవి చేయిస్తే తనదే అనుకున్న ఆయత్తత. ఆ మొదటి కళత్రం తాలూకు వస్తువులన్నీ చెరిపించి కొత్తవి పురమాయించడంలో ములిగిపోయేడు.
"ఇదీ అతను." ఈసడించినట్లు అనేసేడు.
ఒకరు విరాగి, వయస్సుతో సంబంధంలేకుండా. అదే వయస్సు ముదిరించుకున్నవారు పరాగి. ఎంత విచిత్ర సమ్మేళనం ఆ తండ్రీ కొడుకులది! ఈ వైరుధ్య ప్రవృత్తుల మధ్య అందరూ నలుగుతున్నారు. అవి తీర్పు చెప్పబడి, ఒక కొలిక్కి వస్తాయా అన్న సంశయమే కలిగింది రావుకు. పైగా ఒకరంటే ఆందోళన, జాలి; రెండో వారంటే ద్వేషం బంధుకోటిలో, మిత్రుల్లో.
"మీరు గర్హించబట్టే వివాహం చేయించేరు. మళ్ళీ రంగు కళ్ళద్దాలు పెట్టి చదువుతా రెందుకు?"
"నేను మొదటినుండి విముఖున్నే. ఆ రాజే వివాహానికి పూర్వం వచ్చి రుక్మిణిని కలిసివుంటే, కథ ఇల్లా జరిగేది కాదు. జరిగిందాన్ని చూస్తూ కూర్చోడంకన్న సరిచేస్తే మంచిదేమో అన్న ఆవేదన. పైగా మీకు తెలియదేమో? నేను నిస్సంతువున్ని." బాధగా ఆగేడు.
మెరకనీరూ పల్లానికే; పల్లపునీరూ పల్లానికే అన్న నానుడి జ్ఞాపకం వచ్చింది. దాని క్రింద ఉన్న అర్ధంలో దశరథంగారి తర్వాత, ఆయన లకారాలు కూడా రాజునే. ఒక్కసారి కళ్ళల్లోకి చూచి తల దించుకున్నాడు.
"నా తర్వాత అన్న అడగలేని ప్రశ్న వుంటుంది. దానికి ఇప్పుడు సమాధానం చెప్పడం భావ్యం. నా భార్య సుభద్రమ్మకు దత్తత చేసుకోవాలని బలంగా వున్నా అధి సాధ్యంకాదు. పైగా రాజు పెండ్లి విషయంలో దానిభావాలు దానికి వున్నాయి. అవి కొంచెం విరుద్ధంగా వున్నా మా స్వార్ధం వుంది అందులో అందువల్ల నేను ఎక్కువగా విమర్శించడానికి తగను.
"ఇప్పటి పరిస్థితులు మళ్ళీ ఆ స్వార్ధాన్ని రేకెడుతున్నాయి. అందువల్ల నేను తచ్చాట పడుతున్నాను."
"ఆ తండ్రి మారుటి తల్లిని తెచ్చుకున్నాడు. రాజును వదిలివేసేడు అనే నిక్కచ్చి అభిప్రాయం."
"నిస్సందేహంగా ఆ తండ్రి ఇవ్వలేని ఆపేక్ష నేను ఇవ్వగలిగినది బలంగా నే వుందన్న నమ్మకమే."
"వాడికి మీమీద?"
"ఇదమిత్ధంగా చెప్పలేను. కాని గౌరవం వుంది."
"మీ భావనే ఇది."
"ఆ?" తెల్లబోయేడు.
"మీకు ఈ జన్మలు వుంటాయని, అవి ఓ క్రమబద్ధమైన అతీతశక్తి చేతుల్లో వుంటాయని ఈ నమ్మకం వుందా?"
ఇరుకున పడ్డాడు దశరథం. దీన్నిగూర్చి తనెప్పుడూ తర్జన భర్జన చెయ్యలేదు. ఆ అవసరం రాలేదు. రావు ఈ వేదాంత పంథాలో ప్రశ్నించడం చికాగ్గా ఉంది. ఎందుకో?
"వాట్లగురించి నాకేమీ తెలియదు."
"పోనీ, నమ్మకం వుందా?"
"ఎందుకిదంతా ఇప్పుడు? ఆ నమ్మకాలు మనల్ని చిన్నమెత్తు ముందరికి పోనియ్యవు ఈ పరిస్థితుల్లో."
ఇక సాగతీయడం భావ్యంకాదనే, తను ఇంత వరకూ తెలిసిన విషయాలు ఏకరువు పెట్టేడు. అవన్నీ చిత్రకారుడు కుంచెతో రాజును చిత్రిస్తున్నట్లే ఉన్నాయి. తన సమీక్ష అన్నది లేదు. ఉన్న రూఢి అయిన పరిస్థితులే చెప్పేడు.
"ఇదీ రాజు" అని ఊరుకున్నాడు,
అవిచ్చిన్నంగా పదిహేనేళ్ళు ఇరవైమంది పైగా జడ్జీలవద్ద బల్లగుద్ది కేసులు గెల్పించుకున్నాడు. డబ్బు ఆర్జించి దర్జా నేర్చుకున్నాడు. ఏ కోశంలోనూ, ఏ న్యాయశాస్త్రంలోనూ కూడా నమ్మదగినదని చెప్పే సంబంధాలు గోచరించలేదు. సంభవమా అన్న జవాబు చెప్పలేని సమస్యగానే అది రూపొందింది. వకీలు వృత్తి ధర్మం నరనరాలు పట్టిందన్న దృఢతలోనే-
"మీరు నమ్మగలరా?" అన్నాడు.
"ఇందులో నా జవాబు అనవసరం. రాజుని, రాజుగానే చూడ్డం అలవాటు నాకు. అయినా ఒక్కటి చెప్పగలను, ఏ విషమ, అసందర్భ, సందిగ్ధ పరిస్థితుల్లో రాజువున్నా రాజుని నేను ప్రేమించగలను. కావాలంటే ఆదుకోగలను కూడా."
"సత్య నమ్మిందా?"
"నాకు తెలియదు. అయినా వాళ్ళిద్దరూ రావినూతలపాడు వెళ్ళేరు."
కళ్ళు తేలేసినంత పనైంది. తనకన్న ముందరే వాళ్ళు గుండెలు బాదుకుంటున్న బాధతో కృంగి పోతున్నారు.
"అవధానులు నాకు మిత్రులు. ఆయనే దగ్గరుండి రుక్మిణి వివాహం చేయించేరు."
తల ఊపేడు చిన్నగా రావు.
"మనంకూడా అక్కడికి వెళితే బావుంటుందేమో!"
ఆ శాంతను చూడడంలోతప్పేముంది? పైగా దశరథంగారి మాటల్లో రాజు, రుక్మిణి తో అన్న ఆఖరి మాటలు విచిత్రంగా ఉన్నాయి. అని కుతూహలాన్ని రేకొడుతున్నాయి. ఆవిడను చూడాలి. అదే కోర్కె ప్రబలమైంది. "సరే" అని ప్రక్కలు వేసేడు.
గడియారం రెండూ చూపించింది. నిద్ర దూరమైనా బలవత్తరంగా, మనస్సు ఊహిస్తూంది.ఊహలు ఎంత వికృతంగా వస్తాయో అన్నట్లే-
చితి. నివురు కప్పకున్నదే. స్థలనిర్దేశం చెయ్యలేని తెలివిలో మైకం. కపాలమోక్షం అయ్యిందన్న నిరుకులో, వాళ్ళు స్నానాలుచేసి వెళ్ళేరు. తనొక్కడే చూస్తూ ఉన్నట్లు, అడుగు కదల్పలేని ఆకర్షణ. లోపల హృదయం పిడచకట్టే భయం. చెమటల్లో ప్రతిఫలిస్తున్న చితి.
"ఎందుకూ అల్లా చూస్తావు?" ప్రక్కగా దొర్లిన ఎముకల మధ్య పుర్ర్రె.
"ఏమో!"
"నే చెప్పనా?"
తల ఊపుతున్నాడు.
"నీ కర్మ తోస్తోంది."
"అదెక్కడుంది?"
"నుదుటని వ్రాసి."
"ఠార్!"
పుర్రె వికృతంగా నవ్వింది.
ఒంట్లో దడ పుట్టింది. భయంలో "అమ్మో!" అన్నాడు.
* * *
