ఒకసారి చూడాలని ఉంది.
ఐతే పదండి. ఈ వేళకి చిన్న కాలువ దగ్గరుంటాడు... టైం అయింది ఆసుపత్రి మూసేద్దామా!
కుమార్ చుట్టూ కలియజూచాడు రోగులు ఒక్కరూలేరు ఆరుగంటలౌతోంది, సరేనని డిస్పెన్సరీ మూసి బయలుదేరాడు.
ఆసుపత్రి ఎలైకు దూరంగా ఉంటుంది అక్కడి నించి చిన్న కాలువ రెండు రెండున్నర ఫర్లాంగులుంటుంది. ఇద్దరు అక్కడికి వెళ్ళేలోపల పెళ్ళి కొడుకు రామస్వామి కాళ్ళు కడుక్కుంటున్నాడు. ఏమి ఎరుగనట్లు ఇద్దరు వెళ్ళి కాలువ గట్టు మీద కూర్చున్నారు.
వారిని గుర్తించి నమస్కారం చేశాడు.
"ఏం రామయ్యా- మేము గుర్తులేమా-వీరన్న అప్పుడే పెళ్ళికి రమ్మని చెప్పటమైంది నువ్వింకా"
అతను సిగ్గుపడ్తున్నట్టు ముసిముసిగా నవ్వేశాడు... మూడో పెళ్ళికంత డాబుదేనికి లెండయ్యా ఏదోగుట్టుగా. అతన్ని పూర్తి చెయ్యనివ్వకుండానే కుమార్ అన్నాడు "మూడో పెళ్ళా ఏమి ఎరుగనట్టే టూకీగా విషయాన్ని విడమర్చి చెప్పాడు కంపౌండరు.
"రామయ్యా ఇద్దరికి పుట్టలేదు మూడోభార్యకు పుస్తారన్న నమ్మకమేమిటి? డాక్టరుగా సలహా ఇస్తున్నాను ఏమి అనుకోవుగదా-
"అబ్బే- లేదండిబాబూ చెప్పండి" అతను దగ్గరగా వచ్చి క్రింద కూర్చున్నాడు. ఆ మసకచీకట్లో అతని ముఖకవళిక లెలా వున్నాయో తెలిసికొనటం కష్టమైంది. కానీ అతనిలోని అనిశ్చింత తెలుసుకోటానికెంతసేపో పట్టలేదు.
"నువ్వొకసారి పరీక్ష చేయించుకుని మందు తీసికొంటే నీకు తప్పక సంతానం కల్గుతుంది...పరీక్ష ఫలితం నువ్వాసించినట్లు, లేకపోతే ఖచ్చితంగా సంతానం కల్గదని తేలిపోతుంది. ఈ మూడో పెళ్ళి తప్పిపోతుంది. లేదా పిల్లలు పుట్టారంటే-అందులో ఇద్దరికీ పుడితే అంతకన్నా సంతోషం ఇంకేముంది..."
నోట్లో చుట్టను తీసి తదేకంగా చూస్తూ అన్నాడు" నన్ను పరీక్ష చేయించుకో మంటారా డాక్టర్ బాబూ...." ఎంత విడ్డూరం అన్నట్లుగా ఉందా ధోరణి.

"ఔను సంతాన హీనులైతే స్త్రీ పురుషులిద్దరు కారకులౌతారు. ఒక్క స్త్రీ లోపమే కాదు. మందులకు లొంగని స్త్రీ సిసలైన గొడ్డుమోత్తనం చాలా చాలా అరుదు. అందుకే ఓ మాటు..."
అతను చటుక్కున అన్నాడు" నాకేం బాబూ లక్షణంగా ఉన్నాను. ఏం రోగంలేదు ఏ పాడు బుద్దులు లేపు పురుషుడిగా నా కుండవలసిన గుణాలన్నీ ఉన్నాయి. నాలో ఏం లోపం ఉంటాదేంటి? అతను మనసు నొచ్చుకున్నట్లుగా మాట్లాడాడు.
"నీకు అన్నీ ఉండొచ్చు. మంచి ఆరోగ్యం-పుష్టిగలవాడిని కావచ్చు. కానీ గర్భధారణ ప్రసాదించే శక్తి లేకపోవచ్చు.
కాంపౌండరు అతనికేసి పరీక్షగా చూస్తున్నాడు. బాగా చీకటి పడింది. పక్షులు రొదలు మాని గూళ్ళలో నిశ్చింతగా విశ్రాంతి తీసుకొంటున్నాయి. చీకటి నలుమూలల వ్యాపిస్తూ సన్నని సువాసనను తెస్తోంది. వాతపోతము ఆకులతో సయ్యాట లాడుతూ సవ్వడి చేస్తోంది.
చీకట్లో అతని ముఖం అగుపించటంలేదు.
కుమారీ మాట మార్చేశాడు. "అన్నట్లు-సుబ్బమ్మకు ఆన్నం ఎవరు పెడ్తారు? రోజుకొకరింట్లో భోం చేస్తుందా?"
"లేదు బాబూ - అడుక్కుతినదు. ఎవరైనా జాలిపడి పెట్టాల్సిందే. ఒద్ధన్నా- ఈ పరిసరాలన్నీ శుభ్రంగా ఊడుస్తుంది. దేవాలయం చుట్టూరా ఎంతో శ్రద్ధతో ఊడుస్తుంది. వచ్చే పోయే వారు ఏదో దానం చేస్తుంటారు...
ఇద్దరు లేచారు. అతనుకూడా లేచాడు. రామస్వామి తుదినిర్ణయం తెలిసికోవాలని ఇద్దరు ఉబలాటపడినా సాహసించి అడగలేకపోయారు.
ముగ్గురు ఇంటిమొగం పట్టారు. అందరూ మౌనంగా నడుస్తున్నారు. రహదారి చీలింది.
రామస్వామి తటపటాయిస్తూ మెల్లగా అన్నాడు" వాళ్ళిద్దరూ పట్టుబట్టారు బాబూ. చూస్తాను.....చెప్పి చూస్తాను. ఉంటానండయ్యా. అతను సాగిపోయాడు.
ఇద్దరు మిగిలారు.
నాలుగడుగులు వేశాక కాంపౌండర్ అన్నాడు. "తండ్రేమో - మాట ఇచ్చానని జారుకున్నాడు. పెళ్ళికొడుకేమో భార్యలు పట్టుబట్టారని. తనపూచీ ఏమీలేదన్నట్లు మాట్లాడాడు....ఇంతకూ డాక్టర్ బాబూ అతడు మానేస్తాడా? పరీక్ష చేయించు కుంటాడా?"
కుమార్ దీర్ఘంగా విశ్వసించాడు "మానుకో టానిక్ అతనికేమైన పిచ్చా మూడోపెళ్ళి-హాయిగా చేసుకుంటాడు. క్రొత్త భార్యతో అదొకమోజు-ఆనందం పిల్లలు పుట్టరని తెలిసినా ఇదొహ తంతు. అరటిపండొలిచి చేతిలో పెడ్తే తినకుండా ఉంటారూ! పడుచు పెళ్ళాంతో ఇంకా ఆనందం-తనదేం లేనట్లు భార్యలమీద చెప్పేశాడు. ప్చ్ - పాపం- ఆ పిల్లగతి తలంచుకుంటే బాధగా వుంటుంది. మొన్నరాత్రి చూచాను జున్నుపాలు తెచ్చింది. చాలాచిన్న పిల్లలా ఉంటుంది."
"చిన్నపిల్లేగాని....అబ్బో అన్నీ తెలుసు...ఈ పెళ్ళొద్దని నానా గొడవచేసి చస్తానందిట నువ్వు చావకముందే-ముందు నే దూకుతా నూతిలో అన్నాడుట తండ్రి. తండ్రిపై మహాగురి. ఆపేక్ష తల్లి పురిట్లో పోయినప్పటినించి సాకి పెద్ద చేశాడు. ఇక ఏమీ అనలేక నోరుమూసుకుంది...పాపం-"
కుమార్ అనుకున్నట్లే పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. వీరన్న హృదయం తేలిక పడింది.
వధూవరులు ప్రక్క ప్రక్కన నుంచుంటే తండ్రీకూతుళ్ళలా ఉన్నారు. ఆ పిల్ల ముఖంలో పెళ్ళికళ రేఖా మాత్రంగా నైనాలేదు.
పందిట్లో పెద్దవాళ్ళిద్దరు పెద్ద ముత్తయిదువలే అయి పెళ్ళి జరిపించారు?
* * *
ఆ ఊరి పెద్దల ఇండ్లకువెళ్ళి పలుకరించ లేదని వాళ్ళకు కొంచెం లోలోపల కష్టంగా ఉంది. కాని ఏం చేస్తారు? ఇంకొక్క వారం పోతే వెళ్ళిపోతాడు. తమపాటకు తాళంవేసే డాక్టరు రానే వస్తాడు - అనుకున్నారు.
మధ్యాహ్నం పండ్రెండు గంటలైంది. మంజు భోజనం సిద్ధం చేసింది. భర్తకోసం ఎదురు చూస్తోంది.
పనిపిల్ల సిద్దమ్మ ఏన్నర్ధం పిల్లాడిని చంకలో వేసుకొచ్చింది. వాడు రాగాలుతీస్తూ ఏడుస్తున్నాడు.
* * *
"అయ్యగారు రాలేదా అమ్మా?" అంది
ఆదుర్దాగా సిద్దమ్మ.
"లేదే...ఏమైంది" మంజు దగ్గరగా వెళ్ళి అడిగింది.
మంజును చూచి వాడు మరికాస్త రాగం హెచ్చించాడు.
"ఆడుకుంటాడు కదా-అని అయిదు పైసా లిచ్చానమ్మా. నోట్లో వేసుకుని మింగి కూర్చున్నాడు"
"నువ్వు చూచావా?"
"మాయమ్మ చూచింది."
అప్పటికే నలుగురైదుగు రమ్మలక్కలు చేరారు.
ఏదో ఒక నెపంతో డాక్టర్ గారి డాక్టరమ్మ గార్ని చూడాలని వాళ్ళ కోరిక. ఇదొహ సందుదొరికింది. ఎదురింటి ప్రక్కింటి వెనుక ఇంటి స్త్రీలు నెమ్మదిగా వచ్చి చేరారు.
"అయ్యో-పాపం.....దొడ్డికి వెళ్తే వస్తుంది లేవే"
"జడుసుకున్నాడు-అంతే..."
"ఇంటికి తీసుకెళ్ళి - విరోచనాలకి మందు తీసుకెళ్ళి పోసేస్తే దొడ్లో వస్తుంది....మరేం భయం లేదు' ఒకామె సలహా ఇచ్చింది.
మంజు ఆతృతతో అంది "ఒద్దు-ఒద్దు విరోచనానికి మందువేయకూడదు. విరోచనం అయితే మలం పలుచబడి బిళ్ళను నెట్టుకు రాలేదు. గట్టిగా వుంటే బిళ్ళ మలంకు అంటుకుపోయి వచ్చేస్తుంది."
ఇదేదో క్రొత్తగావుంది. ఎంత డాక్టరమ్మ యినా అందరూ అనుసరిస్తున్న పద్ధతులకు వ్యతిరేకంగా ఏదో చెబుతోంది. మీ క్రొత్తవాళ్ళంతా ఇంతే వాళ్ళేం చెబుతున్నారో వాళ్ళకే తెలీదు.
మంజు లోపలికి వెళ్ళి డబుల్ రొట్టి కొంచెం-నాల్గు బిస్కెట్టు తెచ్చి వాడి చేతుల్లోపెట్టింది. వాడు ఏడ్పుకు స్వస్తి చెప్పి ఇచ్చిన వాటిని బుద్ధిగా అందుకుని తినటం మొదలెట్టాడు.
సిద్దమ్మ మంజు చెప్పినట్లు చేయటానికి నిర్ణయించుకుని ఇంటి కెళ్ళింది.
ఒంటిగంట కావస్తోంది.
ఎవరో తలుపు తట్టారు. మంజు తలుపు తెరిచింది. ఒక ముసలతను నుంచుని వున్నాడు. ప్రెసిడెంటుగారి కారుకింద ఎవరో పడ్డారమ్మా. అయ్యగారు రారు. చెప్పిరమ్మన్నారు."
మంజు తలుపువేసి లోపలి కెళ్ళింది. కుమార్ వస్తేగాని తనకు అన్ని వివరాలు తెలియవు. భోంచేసి ఏదో పుస్తకం పట్టుకుని కూచుందామె.
పన్నెండు గంటలకు డిస్పెన్సరీ మూసేసి ఇంటికి బయలుదేర బోతూండగా కరణంగారి పాలేరు పరుగుల మీద వచ్చాడు.
జిలా బోరు ప్రెసిడెంటుగారి కారుక్రింద ఎవరో పడ్డారు-అని. కుమార్ కాంపౌండర్ ఇద్దరూ కలిసి ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్ళారు. వారక్కడ చూచింది ముందు చక్రం దాపున పడివున్న శవాన్ని. అది శవమని తెలిసుంటే ఇంత దూరం వచ్చేవారు కారు. రక్తపు మడుగులో పడిఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోలేక పోయారు.
అంతలోకే పోలీసు వాళ్ళొచ్చారు ఫోటోలు తీసి శవాన్ని ముందు చక్రాలనించి ఇవతలికి తీశారు.
ఒక్క క్షణం కుమార్ గుండె కొట్టుకోవటం మానేసింది. కళ్ళు మూసుకుని మళ్ళీ తెరచి చూశాడు సందేహం లేదు. అది నూటికి నూరు పాళ్ళు రామస్వామి శవం.
కాంపౌండరు "అయ్యో" అని బిగ్గరగానే అన్నాడు.
గుంపు కూడిన జనం తలో మాట అంటున్నారు "ముఖం క్రిందికుంటే తెలియలేదు-రక్తపు మడుగులో ముఖం స్పష్టంగా తెలీలేదు...పాపం-వెంటనే చనిపోయినట్లున్నాడు...పాపం ఆ పిల్ల పసుపు కుంకుమ ఇంతటితో సరి...నుదుట రాత.ఎవరు తప్పించగలరు? ఆ పిల్ల కెవరేమని చెబుతారు....ఆ ముసలాడు భరించగలడా?"
కుమార్ నవనాడులు బిగుసుకుపోయాయి. ఎంతటి దారుణం? ఇంతఘోరం జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా? ఆ పిల్ల వైధవ్యంలో ఇక కృంగి కృశించి పోవలసిందేనా? ఈ పెళ్ళి వల్లనే ఇంత కీడు సంభవించిందని ఆ పిల్లను రాచి రంపాన పెడ్తారు కాబోలు.
శవ పరీక్షకు శవాన్ని హాస్పిటల్ కు తీసికొని వెళ్ళారు.
కుమార్ గౌను తొడుక్కుని శవం దగ్గర కెళ్ళాడు. వార్డు బాయ్ తో చెప్పి శవాన్ని కోయిస్తూ పరీక్షించే సమయంలో కంపౌండరు వచ్చి ఊరి "పెద్దలు" పిలుస్తున్నట్లు చెప్పాడు.
పరీక్ష మొదలైందని అయిపోగానే వస్తానని చెప్పమన్నాడు. కానీ కంపౌండర్ కదల్లేదు. అలాగే నుంచుని చూస్తున్నాడు.
కుమార్ తన పనిలో నిమగ్నమై అతడిని గమనించలేదు. పరీక్షచేస్తూ నోట్సు - రిపోర్టు రాస్తున్నాడు.
