Previous Page Next Page 
మనిషి పేజి 14


    
                                    12
    మర్నాడు లింగరాజు ఇంటికి వెళ్లాను సారధిని తీసుకు రావాలని. ఉదయం ఏడు గంట లయింది. సారధికి కొంచెం తేలికగా ఉన్నట్టుంది. అంతా కులాసాగా కూర్చొని కాఫీలు తాగుతున్నారు. నన్ను ఆదరంతో ఆహ్వానించాడు లింగరాజు.
    కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్న తర్వాత, "లింగరాజు , సారధి ని మా యింటికి తీసుకు వెళదా మను కుంటున్నాను ఇవాళ" అన్నాను.
    "తప్పకుండా తీసుకెళ్ళు పద్యం పెట్టాక" అన్నాడు భరోసా గా లింగరాజు.
    "పద్యం పెట్టాక కాదు, ఇవాళే తీసుకేల్దామని...."
    "ఎందుకని?'
    "ఊరికినే."
    అంత ఉపద్రవం ఏమి వచ్చిందని?"
    "ఉపద్రవమని కాదు. నాలుగు రోజులు మీ ఇంట్లో ఉన్నాడు కనక నాలుగు రోజులు మా ఇంట్లో ఉంటాడని."
    "కాస్త కోలుకున్నాక తీసుకు వెళ్లి నాలుగు రోజులు కాదు, నాలుగు నెలలు అట్టే పెట్టుకో."
    "కోలుకుంటే మళ్ళీ గాంధీ నగరం రూం కి పోతాడు గానీ మా ఇంటికి కెందుకు వస్తాడు?"
    "ఆయన్ని మీ ఇంటికి తీసుకు వెళ్లాలని మీరను కుంటున్నారా? లేక ఇక్కణ్ణించి పారిపోవాలని ఆయనకే అనిపించిందా?' అంది కల్యాణి.
    "నేనే వెళ్లి పోవాలను కుంటున్నాను." అన్నాడు సారధి.
    "మావల్ల నీకేమన్నా కష్టం కలిగిందా?' అన్నాడు లింగరాజు నివ్వెర పోయి.
    "కష్టం కాదురా. ఎందుకనో ఇక్కడ నాకు బాగుండలేదు." అన్నాడు సారధి మరో జవాబు చెప్పలేక.
    "ఎందుకు బాగుండలేదో నాకు తెలుసు" అంది కల్యాణి.
    నేనూ, లింగరాజూ ప్రశ్నార్ధకంగా కల్యాణి ముఖం లోకి చూశాం. కల్యాణి తెగింపు, చొరవ నన్ను ఆశ్చర్య చకితుణ్ణి చేశాయి.
    "లింగరాజూ , నన్ను అపార్ధం చేసుకోబోకు. నా మనస్సీమీ బాగుండలేదు. ఇప్పటికే నీకు చాలా ఋణ పడిపోయాను. ఇంకా ఋణపడితే నరకానికి పోయినా నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను వెళ్ళనీ."
    సారధి నిశ్చయాన్ని మార్చటం ఎంత అసంభవమో లింగరాజు కీ తెలుసు. కారులో ఎక్కి నేనూ, సారధి వస్తుంటే లింగరాజు కళ్ళు చెమ్మగిల్లాయి. కల్యాణి "వెళ్ళదల్చు కున్న వాళ్ళని పట్టుకుంటే ఆగుతారా? ఆయనకి దయ కలిగినప్పుడే మళ్ళీ వస్తారు వెళ్ళ నీండి" అంది.
    లింగరాజు కళ్ళ నుంచి నీరు పొంగటం సారధి చూశాడు. "ఈ అతిలోక స్నేహనురాగాలకి లింగరాజు కి నేనే మియ్య గలను రా? నాకు చావంటే భయం లేదు. బ్రతుకు మీద పెద్ద బ్రాంతి లేదు. కాని ఇలాటి కొన్ని క్షణాల్లో బ్రతుకు మీద వెర్రి మమకారం పుట్టుకు వస్తుంది." అంటూ ఆలోచనలో మునిగిపోయాడు సారధి.
    పది రోజులు మా ఇంట్లో ఉన్నాడు సారధి. రోజూ లింగరాజు వచ్చి చూచి పోతుండే వాడు. రెండు మూడు సార్లు కల్యాణి వచ్చింది. లింగారాజుతో కలిసి ఒకసారీ ఒంటరిగా రెండు సార్లూ వచ్చింది.
    ఒకనాడు నేను కాలేజీ నుంచి వచ్చేసరికి కల్యాణి ఎదురు పడింది మా ఇంటి గుమ్మం దగ్గిర! అప్పుడే సారధిని చూసి వెళ్లి పోతుంది. ముఖమంతా ఎర్రబడి కంద కద్దలా ఉంది. బుసలు కొడుతున్న నాగులా ఉంది. నన్ను పలకరించకుండా వెళ్ళిపోయింది.
    ఏదో జరిగి ఉంటుందనుకున్నను.
    లోపలికి వెళ్లి సారధిని చూశాను.
    మంచం మీద పడుకొని 'చివరకు మిగిలేది" నవల చదువు తున్నాడు.
    "బావుందా నవల?' అని అడిగాను, కల్యాణి ఏమంది అని అడగటానికి ప్రాణం ఒప్పక.
    "ఈ నవల నువ్వు చదివావా?"
    "చదివాను, మూడు సార్లు."
    "నీకెలా ఉంది?'
    "జీవితం నిరర్ధకమనీ, నిస్సార మనీ, చివరకు మిగిలేది శూన్యమనీ కొందరు అనుకుంటారు. మరికొందరు జీవితం నందన వనమనీ, రసాత్మక మనీ , వరమని అనుకొంటారు. ఇంకొందరు కష్ట సుఖాలు, వెలుగు నీడలు, మొదలైన ద్వంద్వాలు కలిపింది జీవితం , అని వేదాంత ధోరణి లో రాజీ పడతారు. పాఠకుడి తత్త్వాన్ని బట్టి, ఒకోసారి రచన విలవ కట్టుకోవటం జరుగుతుంది."
    "రచయిత ఇచ్చే సందేశం, లేక వివరించే జీవిన తత్ర్వం పాఠకుడి కి నచ్చినా, నచ్చకపోయినా , రచనలో పట్తుందా లేదా అని ప్రశ్నిస్తే జవాబు వచ్చి తీరాలి గదా?"
    "రావాలి.'
    "ఇంకో సంగతి. జీవితాన్ని ఏదో బ్రహ్మాండమనుకుని తల బ్రద్దలు కొట్టుకొని, జీవితానికి అర్ధం లేని విలవలు అంటగట్టి , సుఖ శాంతుల్ని దూరం చేసుకునే కంటే, అది ఎలా నడిస్తే అలాగే నడిచి , ప్రవాహం తో పాటు సాగిపోవటం సుఖం కాదూ?"
    "కాని కొందరు దుఃఖం అనుభవించటానికే పుడతారు."
    సారధి నవ్వి ఊరుకున్నాడు. అలా అందరూ నవ్వలేరు. కల్యాణి జీవితం సుఖంగా, సాఫీగా సాగిపోతుంది. పట్టాలు తప్పకుండా గమ్యం చేరవలసిన బండి అది. కాని.......
    కొందరు మనుష్యులు నిష్కారణం గా తప్పు చేస్తారు. కొందరు నిష్కారణంగా పాపం చేస్తారు. మరికొందరు నిష్కారణంగా ఎదట వారికి అపకారం చేస్తారు.
    వారం పది రోజులకి సారధి జబ్బు తగ్గిపోయింది. ఆనాడు ఆదివారం . పిక్చర్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. నేనూ మా శ్రీమతీ, లింగరాజు, కల్యాణి, సారధి బయలుదేరాం. అదొక హిందీ సినిమా . అందరికీ ముందే లింగరాజు టిక్కెట్లు కొని తెప్పించాడు. అట ఇంకా మొదలు పెట్టలేదు గానీ, ఏదో ట్రెయిలర్ నడుస్తుంది.
    కల్యాణి వచ్చి సారధి పక్క కూర్చుంది. సినిమాలో కల్యాణి ప్రవర్తన నాకు బాధ కలిగించింది. లింగరాజు ఎంతటి ఉదాత్తుడైన , చాలా నొచ్చుకుంటాడని భయం వేసింది. ఇంకా ఇంటర్వెల్ కాకముందే సారధి లేచి తల నొప్పి గా ఉందని వెళ్ళిపోయాడు. సారధి వెళ్ళిన పది నిమిషాలకి "నాకూ తలనొప్పిగా ఉంది. నేనూ వెళతాను" అంటూ కల్యాణి లేచింది.
    "అందరం పోదాం , పదండి " అన్నాడు లింగరాజు.
    "మీరు సినిమా చూసి రండి. టిక్కెట్టు దండగ" అంది కల్యాణి.
    "ఈ సినిమా చూడకపోతే కొంప మునిగేదే ముంది?" అంటూ లింగరాజు లేచాడు.
    అందరం లేచి ఇంటికి వచ్చేశాం.
    కల్యాణి తన మనస్సులోని అభిప్రాయాలను దాచుకుంటానికి ప్రయత్నించటం లేదు. సినిమా నుంచి ఇంటికి వస్తున్నాం కారులో. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. లింగరాజు కారు డ్రైవ్ చేస్తున్నాడు. కల్యాణి ని ఇంటి దగ్గిర దిగబెట్టి, మా ఇంటికి వచ్చాడు. ఆ ఆవిడ దిగింది కారు.
    "అలా బారేజీ కి పోదాం రారా' అన్నాడు లింగరాజు.
    సిమెంటు రోడ్డు మీద తాచు పాములా జారిపోతుంది కారు. కాలవ వెనక్కి నడుస్తుంది . లైటు స్తంభాలు వెనక్కి పరుగెత్తుతున్నాయి. లింగరాజు ముఖం కవళికలు ఆ చీకట్లో కూడా స్పష్టంగా మారటం గమనించాను.
    బారేజీ పక్కన చిన్న పార్కు ఉంది. అందులో ఒక సిమెంటు బెంచీ మీద కూర్చున్నాం. లింగరాజు ఏదో చెప్పలేని సంగతి చెప్పటానికే ప్రయత్నం చేస్తున్నట్టు న్నాడు.
    "ఈ ఊరి నుంచి వెళ్లి పోదామను కుంటున్నాను." అన్నాడు లింగరాజు నిశ్చలంగా. అణుచుకుంటున్న ఉద్రేకాన్ని తోసుకుంటూ బైటికి వచ్చాయి ఆ మాటలు.
    లింగరాజు బెజవాడ వదిలి వెళ్ళిపోవాలని ఎందు కనుకుంటున్నాడో నాకు తెలుసు.
    "ఎందుకు వెళ్లి పోవాలను కుంతున్నానో నీకు తెలియదేమో. సారధి నామీద పగ తీర్చు కుంటున్నాడని నీకు చెపితే నువ్వు నమ్మవు. వాడికి నేను చేసిన అపకారం లేదు. చేసింది ఏమన్నా ఉంటె ఉపకారమే. ఒక కడుపున రక్తం పంచుకు పుట్టిన సోదరుణ్ణి ప్రేమించినట్లు వాడిని అభిమానించాను. ఆదరించాను. జబ్బు పడితే ఇంట్లో పెట్టుకుని సేవలు చేశాను. ఎన్నడూ వాడిని అనుమానించలేదు. వాడింత నీచుడని, దుర్మార్గుడని ఎన్నడూ భావించలేదు. వాడెంత పాపం తలపెట్టాడో చెబితే నువ్వు ఆశ్చర్య పోతావు!"
    లింగరాజు నా ముఖంలోకి చూశాడు. నేను తల ఎత్తలేదు. పచ్చిక పై పరుగెత్తుతున్న మిణుగురు పురుగును చూస్తూ , కృష్ణానది హోరు వింటున్నాను.
    "సారధి చివరికి ఎంతకు సాహసించాడో తెలుసా! కల్యాణి ని నాశనం చేయాలను కున్నాడు. దానిని వశం చేసుకున్నాడు. జ్ఞానం లేని పసిపాప పాము దగ్గిరికి పోతున్నట్టు కల్యాణి సారధికి లొంగి పోయింది."
    నిశ్శబ్దం వికృతంగా ఉంటుంది కొన్నిసార్లు.
    "ఇందంతా నీ ఊహ మాత్రమెనెమో?"
    "కల్యాణి తో నాలుగేళ్ల నుంచీ కాపరం చేస్తున్నాను. దాని సంగతి నాకు బాగా తెలుసు. మనస్సులో ఉన్న సంగతి ని దాచుకోవటం దాని స్వభావం కాదు. మొదట సారధిని పరిచయం చేసింది నేనే. నా బాల్య స్నేహితుడని చెప్పాను. ప్రాణ స్నేహిరుడని వర్ణించాను. తరవాత ఆనతి కాలంలోనే సారధి మా ఇంట్లో అంతులేనంత చనువు సంపాదించాడు. నేను రవ్వంత కూడా అనుమానించలేదు." సారధికి జబ్బు చేసింది. మా ఇంట్లో ఉన్న నాలుగు రోజులూ కల్యాణి స్వయంగా అతనికి సపర్యలు చేసింది. నేను అన్యదా భావించలేదు. కాని, సారధి ని మీ ఇంటికి తీసుకు పోతున్నప్పుడు, తీసుకు వెళ్ళిన తరువాత కల్యాణి ని చూశాను. గదిలో మంచం మీద పడి ఏడుస్తుంది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నాకు భయం వేసింది. అది నాకు కొత్త అనుభవం. నేను భరించలేని సంగతి. ఎందు కేడుస్తున్నావు కల్యాణీ అని అడిగాను."
    "సారధిని ఎందుకు పంపించారు ఇంట్లోంచి?" అంది.
    'అతను వెళతానని పట్టుపడితే నేనేం చేసేది?' అన్నాను.
    "కాదు. అతను వెళ్ళాలను కోలేదు. నువ్వే పంపించావు. అనుమాన పిశాచం నిన్ను పీడిస్తుంది. అతన్ని చూసి నీవు అసూయ పడుతున్నావు. అతన్ని నేను మొహిస్తున్నానని నీ బాధ. నాకు తెలుసు. కావాలనే నీ వతన్ని ఇంటి నుంచి గెంటి వేశావు" అంటూ పిచ్చెక్కి నట్లు, వెర్రి ఆవేశంతో అరిచింది కల్యాణి. ఏదో ఉన్మాదం ఆమెలో ప్రవేశించిందనుకున్నాను.    కల్యాణి ఎన్నడూ ఇలా మాట్లాడలేదు. ఎన్నడూ ఇలా ప్రవర్తించ లేదు. నా మనస్సు వికలమై పోయింది. నా హృదయం బద్దలై పోయింది. ఏం చెయ్యాలో తోచక, ఎలా పరిష్కరించాలో అర్ధం కాక, ఏ మార్గం అనుసరించాలో కనిపించక కుమిలి పోతున్నాను. ఎవరితో చెప్పను? ఎవరి సలహా అడగను? ఈ పరిస్థితుల్లో ఈ ఊరు వదిలి వాడికి దూరంగా పోవటం కంటే మార్గమే ముంది చెప్పు?' అని సూటిగా అడిగాడు లింగరాజు.
    "ఊరు వదిలి ఎక్కడికి వెళతావు?' అన్నాను.
    "ఎక్కడికైనా సరే. మా దంపత్యానికి భంగం రాని చోటుకి."
    నేనూ అదే బావుంటుందని ఒప్పుకున్నాను. లింగరాజు తన ప్లాను చెప్పాడు. మద్రాసు వెళ్లి అక్కడే సెటిలై పోతానని, ఏదన్నా చిన్న వ్యాపారం పెట్టుకొని కాలం దోర్లిస్తానని చెప్పాడు. వారం పది రోజుల్లో బెజవాడ వదిలెయ్యటం జరుగుతుందన్నాడు.
    బారేజీ దగ్గిరి నించి బయలు దేరేసరికి రాత్రి ఒంటి గంట అయింది. ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ ఒక ఉత్తరం ఇచ్చింది.
    "ఈ ఊళ్ళో ఉంది ఒకర్ని బాధపెట్టే అధికారం నాకు లేదు. నేను వెళ్ళిపోతున్నాను మూడు గంటల ఎక్స్ ప్రెస్ లో . వీలుంటే స్టేషన్ కి రా -- నీ సారధి"
    గడియారం అప్పుడే రెండు కొట్టింది. స్టేషన్ కి బయలు దేరాను. ఎక్స్ ప్రెస్ ఇంకా రాలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS