Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 14


    అతడు బరువుగా లేచాడు. సూర్యుడు పశ్చిమాన క్రుంగి పోతున్నాడు. సాయంకాలం ఎందుకో బెరుగ్గా వస్తున్నట్ల నిపిస్తున్నది. పుస్తకాల రాక్ దగ్గిర కాసేపు తచ్చాడి మళ్ళీ వచ్చి తను ఇదివరకు కూర్చున్న సోఫాలోనే కూర్చుని ఏదో ఆలోచనలో కాసేపు నిమగ్నుడయ్యాడు. తరవాత తల ఎత్తి కాంతి విహీనంగా నవ్వుతూ "మీరు నన్ను గురించి తెలియజేస్తారని కాదు. కాని నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. నన్ను గురించి వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకోవడం ఇష్టం లేదు"అన్నాడు.
    ప్రియ నొచ్చుకుంటూ 'అలాంటిది ఎన్నటికీ ఉండదు. నా మాట నమ్మండి. మీ విషయాలు ఎవరికీ తెలియవు" అంది. ఎందుకనో ఆమెకు అతడు ఆ సమయంలో పసిపిల్ల వాడిలా అనిపించాడు.
    మళ్ళీ నిమిషాలు బరువుగా దొర్లాయి. చీకట్లు కమ్ముకుంటున్న ఆ తరుణం లో ప్రియ లైటు వేస్తూ , 'పెళ్ళిలో జరిగిన విషయా లేమిటో మాకు తెలియవు కాని మీరు పెద్ద షాకు తిన్నట్లుగా కనపడుతున్నారు. కానీ వాటిని మరిచిపోయి సంతోషంగా ఉంటారని మాకు విశ్వాసం ఉంది" అంది.
    రవి నిశ్చలంగా ఆమెను చూశాడు. "ఈ విషయం లో మీకు సందేహం అనవసరం. మీవారు చెప్పిన మాటలు నేను ఇప్పటి దాకా చేసిన తప్పును తెలియ జెప్పాయి. వారన్నట్లు ఈ ప్రపంచంలో సంతోషాన్ని, సుఖాన్ని పంచి పెట్టె హక్కు ఉంది కాని, దుఃఖాన్ని కాదు. కొంచెం ఆలస్యంగా నైనా అవి నా మార్గమేమిటో తెలియజేప్పాయి. " ఆ మాటలంటూ అతడు వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడయ్యాడు.
    ప్రియకు అతడన్న మాటలు సరిగా అర్ధం కాలేదు. కొంచెం తత్తర పాటుతో "లేచారేం? కూర్చోండి వారు రాకుండానే వెళతారా?" అంది.
    ఇంతలో బయట కారు హారన్ మ్రోగింది.
    ఆమె అదుగో , వారు వాచ్చేశారు " అంది వేగిరం ఎదురు వెళ్ళుతూ. రాజగోపాలం వస్తూనే కోటు విప్పుతూ భార్యకు అందించాడు. ఆప్రయత్నంగా రవిచంద్ర ను చూసి, ప్లెజెంట్ సర్ప్రైజ్ . మీరెప్పుడూ సర్పరయిజేన్ తో చేస్తారే!" అన్నాడు. ఆ మాటల్లో కొట్టవచ్చేటట్లుగా ఆప్యాయత, రవిచంద్ర అంటే అపేక్ష ధ్వనించాయి.
    రవిచంద్ర నవ్వుతూ ;లేచి నిల్చుని, "మీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తూ వారి దగ్గిర నించి వెయిటింగ్ ఫీగా కాఫీ, బిస్కట్స్ వసూలు చేశాను" అన్నాడు.
    "ఓష్, ఇంతేగా. ఇప్పుడు మళ్ళీ ఇంకో కాఫీతో నన్ను కూడా టాక్స్ చేయండి. ప్రియా , అర్జంటుగా కాఫీ' అని రవి వైపు తిరిగి , "కూర్చోండి. ఈ సాయంత్రం మీరు కబుర్లతో ముంచెత్తాలి. ఆఫీసులో కొంచెం హెవీ వర్క్ అయింది. నేనిప్పుడే బట్టలు మార్చుకొని వస్తాను" అంటూ లోనికి వెళ్ళాడు.
    రెండు క్షణాల్లో బట్టలు మార్చుకొని వచ్చి "ఊ, ఇహ చెప్పండి" అన్నాడు కాఫీ కప్పును అందిస్తూ.
    రవి కాఫీ సిప్ చేస్తూ, "ఏమున్నాయి చెప్పడానికి?" అన్నాడు.
    'అదేమిటి అలా అంటున్నారు. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటె? ఒక పక్కన వియాత్నాం, ఇంకో పక్క కాశ్మీర్, ఒక పక్క రోడీషియా, మరో పక్క ఇంకోయిషియా -- న్యూస్ పేపర్ల వాళ్ళు చస్తున్నారు ఇన్ని సమస్యలకు చోటు దొరక్క.
    "అవును, చోటు ఉన్నప్పుడు సమస్య లుండవు" అన్నాడు రవి. ఆ మాటలకు "అవును, అదీ నిజమే" అన్నాడు దరహాస వదనంతో రాజగోపాలం.
    మరాఠీ పిల్ల వచ్చి మూడు కుర్చీలు ఫెన్సింగ్ నానుకొని ఉన్న గులాబీ చెట్టు వద్ద వేసింది. అటు ఇటు తిరుగుతూ రాజగోపాలం ఒక కుర్చీలో కూర్చున్నాడు. రవిచంద్ర కూడా కూర్చున్నాడు. కొంచెం సేపయిన తరవాత ప్రియంవద కూడా వచ్చి మిగిలిన కుర్చీలో కూర్చుంది.
    "ఎలా ఉంది నాగపూర్ లో? బాగా పొద్దు పోతుందా?" అని అడిగాడు రాజగోపాలం.
    ఆ ప్రశ్నకు రవి ఏమీ సమాధానం ఇవ్వలేక పోయాడు. చుట్టపు చూపుగానో, మార్పు కోసమో వచ్చిన వాడు కాదు తను. ఏదో తెలియని శక్తి విసిరివేస్తే వచ్చి పద్దట్లుగా ఉంది. అందుకనే మౌనంగా చిరునవ్వు జవాబుగా ఏమీ రాజగోపాలానికి ఇవ్వలేక పోయాడు.
    "అయిదారు రోజుల క్రిందట సురేంద్ర కలిశాడు" అన్నాడు రాజగోపాలం.
    క్షణం ఆగి రవిచంద్ర "సురేంద్ర అసలెలా మీకు పరిచయ మయ్యాడు?' అని అడిగాడు.
    "నేను నాటకాలు బాగా చూస్తాను. ఏదో నాటకంలో అతన్ని చూడటం తటస్థించింది. రెండేళ్ళ కిందట తెలుగువాడని కూడా తెలిసింది. అప్పుడు ఈ వీధిలోనే ఉంటుండే వాడు. అలా పరిచయం క్రమంగా స్నేహంగా మారింది."
    సమయం భారంగా కదలసాగింది. మాట్లాడ డానికి ఏమీ తోచడం లేదు. రాజగోపాలం ఉపక్రమిస్తూ "ఆ పుస్తకాలు చదివారా?' అన్నాడు.
    'అందులో ఒకటి పూర్తీ చేశాను."    
    "ఎలా ఉంది?"
    "అంతా బాగానే ఉంది కాని, దాన్ని ఏ విధంగా పూర్తీ చేయాలో తెలియక రచయిత భగవంతుణ్ణి సహాయంగా తెచ్చుకున్నాడు."
    కుతూహలంగా అతన్ని చూస్తూ "అంటే....? నా కర్ధం కాలేదు' అన్నాడు రాజగోపాలం.
    "ఈ ఇరవయ్యవ శతాబ్దంలో కూడా మనకు తెలియనిది ఏదో మాయ లాంటిది ఒకటి ఉందని, అది మనందర్నీ కంట్రోలు చేస్తున్నదని అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఈ సూత్రాన్ని ఆ రచయిత ఎప్పుడైతే సపోర్టు చేయడం మొదలెట్టాడో, అప్పటి దాకా చక్కగా వచ్చిన కధా గమనం దెబ్బ తిన్నది."
    "ఆ రచయితకు తను ప్రతిపాదించిన విషయాల్లో నమ్మకం ఉండి ఉండవచ్చు. అందుకని అలా రాశాడని మనం ఎందుకను కోగూడదు?"
    "అది వేరే విషయం. తను ఖచ్చితంగా నమ్మిన దాన్ని చెప్పటం కోసం ఆ రచన చేశాడంటేనే నంగీకరిస్తాను. కాని అతను తీసుకున్న ప్లాటు కధ డానికీ దోహదం చేసేవిగా లేవు. ఏదో కధను సుఖాంతం చేయడం కోసం ఆ మలుపు అవసరం ఉంది కాబట్టి అలా రాశాడనే అభిప్రాయం పాఠకులకు కలగడమే గాకుండా ఆకస్మికమయిన ముగింపు కొంచెం ఎబ్బెట్టు కలగజేసింది."
    "మీరు ఆ నమ్మకానికి న్యాయం చేసే విధంగా రచయిత కధ అల్లుకొని రాలేదు అంటారు. అంతేనా?"
    "అవును. ఏదో పరిస్థితులు, ప్రభావాలు అన్నాడు. మొదటి నుంచి జాగ్రత్తగా చదువుతూ వస్తుంటే, ఆ పరిస్థితులు , వాటి ప్రభావాలు భగవంతుడు సృష్టించినవి కావని, సామాన్యంగా ఎవరికైనా భగవంతుడి ప్రమేయం లేకుండానే అటువంటివి రావచ్చని అనిపిస్తుంది. అసలు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే , భగవంతుడు లేడు అనుకొనే వారిని, లేకపోతె భగవంతుడి ఉనికి విషయంలో అనుమానాస్పదంగా ఉన్నవారిని ఒప్పించే విధంగా కొన్ని రుజువుల్లాంటివి ఇచ్చినట్లయితే ముగింపుకు  కూడా బలం చేకూరేది."    
    "తను నమ్మిన విషయంలో రుజువుల్లాంటి వి ఇవ్వవలసిన అవసరం ఆ రచయితకు లేడేమో?"
    "అది వేరే విషయం. వ్యక్తిగతంగా ఆ విధంగా అనుకోని ఆ రచయిత సంతృప్తి పడి ఉండచ్చు. కాని తన రచనను, రచన ద్వారా చెప్పిన విషయాలను పాఠకుల చేత ఒప్పించటం కోసం ఆ విధంగా చేయవలసిన బాధ్యత అతని మీద ఉంది."
    "ఇంతవరకు తుదీ మొదలూ లేకుండా, భగవంతుడు ఉన్నాడా లేడా అనే సమస్య పై వాదోపవాదాలు సృష్టి పుట్టినప్పటి నుండి ఉన్నాయి. నిత్యమూ ఉండే సమస్య పై అతడు నవలలో చర్చ లాంటిదో, లేకపోతె తన అనుభవాల ద్వారా ఏర్పడిన నమ్మకాలకు రుజువుల్లాంటివో రాసినప్పటికీ కేవలం తన రచన ద్వారా మీలాంటి వారి అభిప్రాయాలను మార్చలేడు. ఒకవేళ మార్చటం లో అతను కృతకృత్యుడయినట్లయితే మీ నమ్మకాలు అంత బలమైనవి కావని తేలిపోతుంది. అందువల్ల కేవలం తను నమ్మిన విషయాలను బలపరుచుకునేందుకు మాత్రమె ముగింపు ఆ విధంగా చేశాడు. ఇలా అనుకుంటే రచన బాగానే ఉన్నట్లని పిస్తుంది.
    ప్రియంవద "ఎవర్ని గురించో మీరు వాదించు కోవడమెందుకు? ఇంతకూ భగవంతుడి మీద మీకు నమ్మకం ఉందా, లేదా చెప్పండి?" అంది.
    "ఆ సంగతి నీకు తెలుసు, మళ్ళీ చెప్పమనడ మెందుకు?" అన్నాడు రాజగోపాలం ఆమెను చూస్తూ.
    "కాదు, కాదు . నాకు తెలుసుకోవాలని కుతూహలం గా ఉంది. చెప్పండి" అన్నాడు రవిచంద్ర ఉత్సుకత తో.
    "ఊ. ఇహ చెప్పండి" అన్నది ప్రియ.
    రాజగోపాలం నవ్వుతూ ఇద్దర్నీ చూశాడు కాని ఏమీ చెప్పలేదు. క్షణ కాలం వేచి ఉన్న తరవాత రవిచంద్ర ను చూస్తూ "మావారికి నమ్మకం ఉందొ, లేదో చెప్పమంటారా?" అంది ప్రియంవద.
    "చెప్పండి" అన్నాడు రవి.
    "చెప్పనా?" భర్తను చూస్తూ కొంటెగా అడిగింది.
    "ఊ, చెప్పు. నీ పరిశీలన శక్తి బయట పెట్టు కొంటావంటే నేనెందుకు వద్దంటాను?"
    "మావారు పూజ అయిన తరవాత హారతి ఇస్తే కళ్ళ కద్దుకోరు. దేవుడికి దండం పెట్టరు....మరి." ఇంకేదో ప్రియ చెప్పబోతుండగా రాజగోపాలం మధ్యలో అందుకొని , "అవును , నేను చేయను. అలా చేయడం నాకు కిట్టదు కూడా. నిన్న నేను ఎవరినో చూశాను వీదీలో. సూటూ బూటూ వేసుకొని ఉన్నాడు. ఎలక్ట్రిక్ లైట్లు వేలగ్గానే చెంపలు వేసుకొని లైటు వైపు తిరిగి దండం పెట్టాడు. అలా చేయడం నాకిష్టం లేదు."
    అందరూ నవ్వారు అతను అది చెప్పినప్పుడు.
    "ఏం? అందులో తప్పేముంది?" ప్రియ అడిగింది.
    "తప్పు ఉందని కాదు. మూడ నమ్మకాన్ని తెలియ జేబుతుంది ఆ పని."
    "పంచ భూతల్లోనూ అగ్ని కూడా ఒకటి కాబట్టి దాన్ని ప్రార్దిస్తున్నాడని అనుకోవచ్చు."
    "అది వేరే విషయం. అట్లా కాకపోయినప్పటికీ విద్యుత్తు ను శక్తిగా ఊహించుకొని వైజ్ఞానికంగా బాగా అభివృద్ధి చెందిన కాలంలో దాన్ని సింబాలిక్ గా తీసుకొని ప్రార్ధించడం లో గూడా తప్పు లేదేమో కాని, అతడు అలా చేయలేదు, అసలు అతనికి ఆ ఉద్దేశమే లేదు. కేవలం మూడ నమ్మకం తోనూ, తన పూర్వీకులు అలా చేస్తుంటే చూసి యాంత్రికం గాను అలా చేస్తున్నాడు."
    ఒక్క క్షణ కాలం నిశ్శబ్దం. దాన్ని చీలుస్తూ గంబీరంగా అన్నాడు రాజగోపాలం. "మన వాళ్ళల్లో "ప్రతి విషయాన్ని పరిశోధించాలి. పరిశోధించందే దేన్నీ నమ్మకూడదు. దేన్నీ గుడ్డిగా తీసుకోకూడదు" అనే భావం చాలా తక్కువగా ఉంది. మనకు భావ స్వాతంత్యం, వ్యక్తిగతంగా ఆలోచించడం లేనంత కాలం పురోభివృద్ధి సాధించలేము. ఏదో చేయాలనే తపన, ప్రతిదీ తెలుసుకోవాలనే ఉత్కంట మనలో చాలామందికి లేకపోవడం నిజంగా మన దురదృష్టం. ఈ దృష్ట్యా , మనం పాశ్చాత్యుల కంటే చాలా వెనకబడి ఉన్నాం."
    "అసలు మీదృష్టిలో దేవుడున్నాడా, లేడా?"
    రవిచంద్ర సూటి ప్రశ్న కు రాజగోపాలం కొంచెం ఆశ్చర్యం చెంది కాసేపు ఏమీ మాట్లాడలేదు. తరవాత నెమ్మదిగా చెప్పసాగాడు.
    "ఇదొక చిత్రమైన సమస్య. మనిషి మేధస్సును తూట్లు పడేటట్టుగా చేసిన సమస్య ఏదైనా ఉందా అని నన్నెవరన్నా అడిగితె నేను "ఇది ' అని చెప్పగలను. నిరంతరం , ఈ సృష్టి ఉద్భవించినప్పటి నించి ఎదురవుతున్న ఈ ప్రశ్నకు ఇంతవరకు ఖచ్చితంగా ఎవరూ జవాబు చెప్పలేదేమో!
    చిన్నప్పుడు నా అంతట నేను అలోచించుకొనే శక్తి లేనప్పుడు "అగొ దేముడు, దండం పెట్టు' అంటే పెట్టె వాణ్ణి . 'పుస్తకం సరస్వతి. త్రోక్కితే కళ్ళు పోతాయి' అని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. పొరపాటున తొక్కటం సంభవిస్తే ఆరోజు నాకు నిద్ర పట్టేది కాదు. గట్టిగా లెంపలు వేసుకుంటూ "స్వామీ! పోరపాటయింది నా కళ్ళు తీసుకోకు నాయనా' అని ప్రార్ధిస్తుండే వాణ్ణి. అదేవిధంగా పరీక్షలు దగ్గిరికి వస్తున్నా యంటే దేవుడి మీద భక్తీ ఎక్కువవుతుండేది. అంతకు మునుపు తలవని దేవుడు, ఆకస్మికంగా పరీక్షల భయంతో గుర్తుకు వచ్చేవాడు. ప్రతి రోజు సాయంత్రం దేవాలయానికి వెళ్లి, పరీక్షల్లో పాసు చేస్తే కొబ్బరికాయ కొడతానని కొబ్బరి కాయలు ఆశ పెట్టి వస్తుండే వాణ్ణి."
    ప్రియ నవ్వుతూ "మీరుత్త మోసగాళ్ళ ని దేవుడికి తెలియదు. పాపం, అమాయికుడు! లేకపోతె మిమ్మల్ని పరిక్ష అయ్యేటట్లు చేసేవాడు కాదు" అంది.
    రవి మాత్రం దీక్షగా వినసాగాడు.
    సిగరెట్టు ముట్టించి రాజగోపాలం మళ్ళీ ప్రారంభించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS