తన కన్నీళ్ళ తో సంబంధం లేని రైలు వేగం అందుకుని అతన్నించి దూరంగా తీసుకుపోయింది సుమిత్రని --
* * * *
ఆ ఇంట్లో అమ్మ లెని లోటు కనపడడం లేదు వదిన ఆదరణ లో.
'అత్త ఇప్పుడు బావుంది -- ఆ వూరి నీళ్ళు బాగా సరిపడ్డాయి కాబోలు ' అన్నది సావిత్రి. సావిత్రి కూడా బాగా పొడుగైనది. అలంకరణ లో కూడా అనేక మార్పులొచ్చాయి. ఎలాగైనా కాలేజీ విద్యార్ధిని కదా!
'నువ్వు చదువు కునే టప్పుడు ఏ బట్టలు వేసుకునే దానివో , ఎలా వెళ్ళే దానివో! దీనితో వేగడం చాలా కష్టంగా వుంది సుమిత్రా!' అని ఫిర్యాదు చేసింది ఇందుమతి.
ఆ సాయంత్రం అద్దం ముందు కూర్చుని ముప్పావు గంట ముస్తాబయిన మేనకోడల్ని చూస్తూ, ' అయితే పరీక్ష లేలా వ్రాశావూ?' అనడిగింది సుమిత్ర.
'బాగానే వ్రాశాను--' అన్నది సావిత్రి.
'నాకోసం మంచి వాచీ తెచ్చిస్తావని అనుకుంటూ వుండేదాన్ని-- బొత్తిగా టైం తెలుసుకోడం చాలా కష్టంగా వుంది--' అన్నది మరి కాసేపాగి.
'అవును-- నువ్వు అలంకరించు కోడానికి ఎంతకాలం పడుతోందో తెలుసుకొడానికైనా నీకు వాచీ అవసరమే. ఈసారి కొని పంపిస్తాలే-- ' అన్నది సావిత్రి వంక వెగటుగా చూస్తూ సుమిత్ర.
గేటు త్రోసుకుని ఇద్దరమ్మాయిలు వచ్చారు లోపలికి.
వాళ్ళు సావిత్రిని మించిపోయారు ఫాషను లో. 'మంచి స్నేహితులే' అనుకుంది వాళ్ళని చూసి.
'నాన్నా, నువ్వూ ఎంత కష్టపడితే మాకు చదువు లోస్తున్నాయో గ్రహించదు . వొట్టి పిచ్చిది సావిత్రి!! చెప్పినా అర్ధం చేసుకోదు, చిన్నత్తా!' అన్నాడు విశ్వం . సావిత్రి వెళ్ళిన దిక్కుగా చూస్తూ.
ఉలిక్కిపడింది సుమిత్ర.
'బాబాయి ఏమంటున్నాడు నా గురించి!' అన్నది తరువాత.
'బాబాయీ, పిన్నీ నిన్ను గురించి ఎప్పుడూ అనుకుంటూ వుంటారు. నీకోసం పెళ్లి సంబంధం కూడా చూశారు. అయన ఈ వారంలో ఈ వూరోస్తాడట. వచ్చి నిన్ను చూస్తాడట--!'
'ఇప్పుడు నాకేం పెళ్లి సంబంధాలు విశ్వం! పెళ్లి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు?' అని నవ్వింది సుమిత్ర విరక్తిగా!
'అదేమీటమ్మడూ! మేం ఇద్దరం అన్నలం లేమా? నీకు పెళ్లి చెయ్యడానికి!' అని మాధవరావు అంటాడేమోనని ఆశించింది సుమిత్ర.
ఆ సంభాషణ తో తనకి నిమిత్తం లేనట్లు ముఖానికి పేపరు అడ్డం వేసుకున్నాడు మాధవరావు . అవతల గదిలో ఇందుమతి మిషన్ మీద బట్టలు కుట్టుకుంటోంది.
'అయిదు నిముషాల సేపు నిశబ్ధం ఆవరించింది గదిలో.
'నీ చదువెలా వుంది విశ్వం?' అన్నది సుమిత్ర ప్రసంగం మార్చి.
'బాగానే వుంది-- చిన్నత్తా -- ఇంకా మూడేళ్ళు ఎలాగో కళ్ళు మూసుకుంటే గట్టెక్కి పోతాను!' అన్నాడు.
విశ్వం చాలా పెద్ద వాడయ్యాడు. వాడి కళ్ళల్లో కార్యదీక్ష వెలిగిపోతోంది. పట్టుదల ప్రస్పుటమౌతోంది.
'బాబాయి నీకేమన్నా సాయంగా వుంటాడా?' అని అడిగింది.
'అదేమిటత్తా అలా అడుగుతావు! వాళ్ళ మూలంగా నెలకి అరవై రూపాయలు హాస్టల్ ఖర్చు తప్పింది నాకు. అంతకన్నా సాయం ఏం కావాలి ?' వినయంగా అన్నాడు విశ్వం.
'ఫరవాలేదు విశ్వం -- నువ్వు వయస్సు కి అనుగుణంగా పెరుగుతున్నావు!' అనుకుంది సుమిత్ర.
'విమలత్త యింటికి వెళ్లి చూసొద్దాం వస్తావా? రెండు రోజుల్లో వద్దాం.
మాధవరావు వైపు చూస్తూ విశ్వాన్ని అడిగింది.
'నాదేం లేదు వాడి యిష్టం' అన్నట్లు వూరుకున్నాడు మాధవరావు. అతని ప్రవర్తన అయోమయంగా వుంది సుమిత్రకి.
'విమలకి నల్ల చీరే లంటే యిష్టం-- ఇదుగో ఈ నల్ల చీరే మీద జరీ పువ్వులు కుట్టాను .' అని ఆడబడుచు కో చీరే యిచ్చింది ఇందుమతి.
ఏ రక్త సంబంధమూ లేని ఆవిడకి తను మీద వున్న వాత్సల్యం , రక్త సంబంధం వున్న అన్నలో కాలక్రమంగా హరించి పోవడం ఆశ్చర్యం కలిగించింది సుమిత్రకి. విమలకి మల్లె తను సారే చీరలు అడగదు. కానీ హృదయం నిండుగా ప్రేమతో 'ఏం! అమ్మడూ!' అని ఒక్కసారి పిలవడాని కేం? ఏకగార్భ జనితుల మధ్య కూడా త్యాగాలూ, డిప్లోమసీ లూ ఎందుకు??
'నీ ధర్మమా అని ఈ మిషన్ వచ్చింది. ఎంత లేదన్నా నెలకి వంద రూపాయలు సంపాదిస్తున్నా నిప్పుడు!' అని కృతజ్ఞత కురిసే కళ్ళతో ఎన్నోసార్లు అన్నది ఇందుమతి.
వదిన ఆదరణ వెన్నెల లాంటిది అనుకుంది సుమిత్ర. ఈ లోకంలో కృతజ్ఞతా విశ్వాసం, ప్రేమో అనేవి క్రమంగా హరించి పోయి, నూటికి ఏ ఒక్కరిద్దరి లోనో మిగిలి పోతున్నాయి. మానవత యింకా నిలిచే వున్న దన్నందుకు వాళ్ళే చిహ్నాలు.
సుమిత్ర, విమల ఇంటికి వెళ్లి చాలా సంవత్సారాలయింది. చిన్నపిల్లగా వున్నప్పుడు ఆలోచనలకి స్థిరత్వం లేనప్పుడు, ఎప్పుడో వెళ్ళింది.
ఇన్నేళ్ళ కు మళ్లీ తన పుట్టినింటి మనిషంటూ గడప లో అడుగు పెట్టాడం విమలకి సంతోషం కలిగించింది.
'రావే సుమిత్రా!' అంటూ చెల్లెల్ని కౌగలించుకుని కళ్ళు తుడుచుకుంది. ఇల్లూ వాకిలీ చాలా అగంగా వున్నాయి. పెరట్లో గొడ్ల దగ్గర కూడా బాగు చేసి నట్లు లేదు. వంట ఇల్లు సంగతి వర్ణించడం అనవసరం. పిల్లలు 'పిన్నీ, పిన్నీ' అంటూ సుమిత్రని చుట్టుకున్నారు. వాళ్ళ కోసం తెచ్చినవి యిచ్చేస్తే దూరంగా వెళ్ళిపోయారు.
'మరదలు గారికి మామీద దయ గలిగిందా! ఇన్నాళ్ళ కి!' అనే వెటకారంతో కూడిన పలకరిం పోకటి విసిరి వెళ్ళిపోయాడు విమల భర్త సత్యానందం. ఏడుగురు పిల్లల్లో ఒకరిద్దరు మంచి బట్టలు వేసుకున్నారు. విమల కూడా నల్లబడి పోయి, చిక్కిపోయి వుంది.
'మీరందరూ ఒకటై మీ జీవితాలు తీర్చి దిద్దుకుంటున్నారు-- నేనే విసిరి వేసి నట్లు దూరంగా వున్నాను-- 'అన్నది విమల ఆ రాత్రి పిల్లలందరూ నిద్రపోయాక తను కూడా వచ్చి చెల్లెలి ప్రక్కన పడుకుంటూ.
పైన వెన్నెల వర్షం కురుస్తోంది . చల్లని పైరు గాలి చెంపల్ని తాకుతోంది.
'ఒకమాట చెబుతాను-- కోపగించు కోవు కదూ?' అన్నది సుమిత్ర. విమల ముఖంలోకి పరిశీలనగా చూస్తూ.
'కోపం ఎందుకే పిచ్చిదానా? చెప్పు!' అన్నది విమల సరసమైన కంఠంతో.
'మేమంతా ఏకమై మా జీవితాలని బాగు చేసుకున్నామని అన్నావే! అది అబద్దం అక్కయ్యా! నా మటుకు నేను పరిస్థితులు ఎటు నెడితే అటు నడుస్తూ బ్రతుకుతున్నాను. పెళ్లి చేస్తామంటే సరే నన్నాను. అది తప్పిపోయింది. చదువుకో మంటే దానికీ సరేనన్నాను. ఇప్పుడు ఉద్యోగం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది చేస్తున్నాను-- మనందరి జీవితాలూ ఒకటే, నువ్వూ తలుచుకుంటే నీ జీవితాన్ని ఇంకా కాస్త మెరుగైన పద్దతిలో నడిపించుకో గలవేమో ఎప్పుడైనా ప్రయత్నించావా ?' అన్నది కొంచెం ఆవేశంగా సుమిత్ర!
'నాకేం వున్నదని ఇంకా మెరుగుగా బ్రతకగలను సుమిత్రా! నాకు చదువైనా చెప్పించారా!' అన్నది విమల సాధిస్తున్నట్లు.
'అంతకన్న ఎక్కువే చేశారు అక్కయ్యా! అన్నయ్య నీకోసం యిష్టంలేని పెళ్లి చేసుకున్నాడు. వాడి సరదాలు, సంతోషాలు నీకోసం అర్పణ చేసి, తనకి లభించిన దాంట్లో నుంచే సంతోషం పొందడానికి అలవాటు పడ్డాడు. అంతకన్నా ఎక్కువేం కావాలి నీకు?'
విమల మాట్లాడలేదు-- చెల్లెలి మాటలు అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తోందేమో!
'అది త్యాగం అనుకో, పిరికితనం అనుకో! నీకోసం వాడి జీవితం మారింది కదా! కానీ నా సంగతి అలా కాదు -- చిన్నన్నయ్య కోసం నా జీవితమే మారింది! నా పరిస్థితిలో వుంటే నువ్వేం చేసేదానివో! ఎప్పుడైనా ఆలోచించావా?' అన్నది సుమిత్రే మళ్ళీ.
'నువ్వు చాలా తమాషాగా మాట్లాదతావే సుమిత్రా! అయితే నన్నిప్పుడెం చేయ్యమన్నావో చెప్పు!' అన్నది విమల కాస్సేపాగి.
'అలా దారికిరా అక్కయ్యా!' అంటూ లేచి కూర్చుంది సుమిత్ర.
'నీ పిల్లలంతా పెద్ద వాళ్లై నారు కదా! వాళ్ళ కోసం నువ్వేం శారీరకంగా ఎక్కువ కష్టపడ నవసరం లేదు. అందుకని ఏదైనా వ్యాపకం పెట్టుకుంటే, మనస్సుకి కొంత క్రమశిక్షణ అలవడుతుంది-- కాలక్షేపం అవుతుంది . నాలుగు రూపాయలూ గడించవచ్చు --'
'బాగానే వుంది -- ఇప్పుడు నేను డబ్బు గడించాలంటే పిడకలు అమ్మాలి. లేకపోతె విస్తళ్ళు కుట్టాలి. అన్నట్లు! వదిన బట్టలు కుడుతోందిటగా సుబ్బలక్ష్మమ్మ తో కలిసీ!' అని దీర్ఘం తీసింది విమల.
'ఎవరికి అపకారం చేయకుండా మనరోజులు గడపడం కోసం మిషను కుడితే తప్పేం లేదక్కయ్యా! నువ్వు సూటిగా ఆలోచించడం ఎప్పుడు నేర్చు కుంటావో! నీకు మనుష్యులు ఎప్పుడూ సరిగ్గా అర్ధం కారు!' విసుక్కుంది సుమిత్ర.
'నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో చెప్పు!' అన్నది విమల చివరికి.
'ఎప్పుడో మీ మామగారి హయాం లో మీరు జమీందార్లు కావచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా! ఇంత పెద్ద ఇల్లెందుకు మీకు? సగం అద్దె కివ్వకూడదు! చావిట్లో నాలుగు గేదేలున్నాయి. ఒకదానికి సరైన మేత లేదు -- పాలు యివ్వవు. అవి అమ్మేసి తిన్నగా పాలిచ్చే గేదె నొక దాన్ని కొనుక్కుని సరిగ్గా మేప కూడదూ? ఇప్పుడేనేన్ని ఆధునిక వ్యవసాయ పరికరాలోస్తున్నాయి.
ఎన్ని ఎరువులు వాడకం లోకి వచ్చాయి! వున్న భూమి కౌలు కిచ్చి టింగు రంగా మని వూళ్ళో పెద్దలతో కబుర్లు చెబుతూ కాలం గడపక పొతే మీ అయన దగ్గరుండి భూమిలో బంగారం పండించ వచ్చునే?
ఇలాంటివే! కష్టపడితే పైకి వచ్చే మార్గాలు చాలా వున్నాయి అక్కయ్యా! సోమరి పోతులకి ఎప్పుడూ ఎదుగూ బొదుగూ వుండదు. ఆ మాట కొస్తే నలభయ్యో వడిలో మీ అయన కింకా ఆడవాళ్ళ స్నేహాలెందుకు? ఏడుగురు పిల్లల తండ్రి కదా! మాధవన్నయ్య చూడు వదిన అంటే ఎంత ప్రేమగా వుంటాడు!' అన్నది సుమిత్ర గబగబా.
ఆ మాటలూ నాలుగు అడిగేసి విమల ముఖంలోకి చూస్తూ కూర్చుంది. ఆమె ముఖంలో మారుతున్న రంగులు చూసి "నన్ను అర్ధం చేసుకో అక్కయ్యా! ఎవరి నుదుటి వ్రాలు ప్రకారం వాళ్ళ జీవితాలు జరిగి పోతాయని నమ్మి చీకటిని తిట్టుకుంటూ కూర్చునే రోజులు పోయాయి. ఎవరి బ్రతుకు బాటలు వాళ్ళు వేసుకుని సుఖంగా నడిచి గమ్యం చేరుకోవలసిన కాలం యిది. మన కోసం పూల బాటలు వేసి ఎవరూ సిద్దంగా ఉంచరు. మన మార్గం కంటకావృతం చేయాలనీ ఎవరూ వాంచించరు. ఒకవేళ అలా జరిగినా , మనం జాగ్రత్త గా వుండి మన బాటలో ముళ్ళని ఏరి వేసుకుంటూ నడవడం నేర్చుకోవాలి గానీ. అవి పరిచిన వాళ్ళని తిట్టుకుంటూ , విచారిస్తూ కూర్చో కూడదు. అది నా పద్దతి -- ' అన్నది సుమిత్ర మళ్ళీ.
'నువ్వు చెప్పేది బాగానే వుంది-- కానీ మీ బావ నా మాట లక్జ్ష్య పెట్టరు -- ఆసలు నన్నేది చెప్పనివ్వరు . ఇంట్లో ఒక్క క్షణం వుండరు - ఇల్లా వుంటూనే ఏడుగురు పిల్లల్ని కన్నందుకు సిగ్గుపడుతూ వుంటాను-- అదే మా స్నేహం ' అన్నది విమల, తడిసిన కంఠం తో ఆమె తెల్లని కళ్ళల్లో నీరు వెన్నెల్లో మెరిసింది.
'నువ్వాయనతో నవ్వుతూ, సరసంగా మాట్లాడి, అయన కిష్టమైన పనులు చేసి చూసు కొన్నాళ్ళు-- అప్పుడు వింటాడు నీమాట! కొన్నాళ్ళు నీకోపాన్ని, విసుగునీ జయించి, చాలా శాంతంగా వున్నట్లు నటించు. చివరికి అదే అర్ధం అవుతుంది. అదే అలవాటు కూడా అవుతుంది నీకు!'
'నీ చేత పాఠాలు చెప్పించు కోవాల్సిన అగత్యం వచ్చింది నాకు!'
'చెప్పించుకోకపోతే మానుకో!' కోపంగా అనేసి కళ్ళు మూసుకుంది సుమిత్ర. ఇక మాట్లాడడం యిష్టం లేనట్లు. రాత్రి చాలాసేపటి వరకూ నిద్ర రాక మంచం మీద అటూ, ఇటూ పొర్లుతున్న విమల కేసి జాలిగా నవ్వుకుంది. కొందరు వయస్సు కనుగుణం గా పెరగరు. వాళ్ళ ఆలోచనలు, భావాలు, హృదయ స్పందన విస్తరించదు. మెదడు లో నరాల చురుకుదనం తగ్గిపోతుంది వయస్సుతో పాటు!! ఇలాంటి వాళ్లకి బోధించబోవడం తెలివి తక్కువ అనుకుంది సుమిత్ర.
