Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 14


    జయమ్మ చెప్పిందంతా విని "ఈ పెళ్ళి వద్దని బావగారికి నే చెబుతానులే" అన్నాడు సాంబమూర్తి.
    జయమ్మకి పూర్తిగా ఆశ తొలగిపోయింది. "చీ! నీకు కూడా నామీద అభిమానం లేదు ...... నాన్నగారు నీమాట వినరు....." అన్నది.
    నిజం కూడా అంతే......"వెయ్యి చెప్పు. లక్ష చెప్పు..... ఈపీడ నిప్పుడు విడిశాప్న చేసుకొనక పోతే ....... ఇక ఈ జన్మలో సాధ్యపడదు ..... ఈ పెళ్ళి జరగవల్సిందేనయ్యా" అని నిర్ణయంగా చెప్పేశాడు పాపయ్య.
    "నేను నూతిలో పడి చస్తా" ననీ సాంబమూర్తి మీద వొట్టు పెట్టుకుని మరీ చెప్పేసింది జయమ్మ.
    సాంబమూర్తి విచిత్రమైన పరిస్థితులలో చిక్కుకున్నాడు. బంగారంలాంటి పిల్లను ముసిలాడికి, గడియో యిప్పుడో అనిపించేవాడికి యిస్తున్న తల్లిదండ్రులను అడ్డలేడు. పోనీ జయమ్మను .....? కాని సాంబమూర్తి జయమ్మను యీ పెళ్ళికి వొప్పుకోమని చెప్పలేకపోయాడు.
    "జయం! నేను నీ తండ్రి ప్రాణదానం చేస్తే బ్రతికిన వాణ్ణి.......ఆ ఋణం ఏదో విధంగా తీర్చుకోవాలి......అందుకుగాను నా శాయశక్తులా .....కృషి చేశాను.....మూర్ఖుడు......మాట యిచ్చాను. మర్యాద మంట కలుస్తుందీ అంటున్నాడు.....మరి నువ్వు నాతో వస్తావా?....." అన్నాడు సాంబమూర్తి.
    జయమ్మ కళ్ళల్లో ఆశ తొణికిసలాడింది. "వచ్చేస్తా" నంది.
    ఆవిధంగా, అప్పటికే ఒక కొడుకును కనుక్కున్న సాంబమూర్తికి జయమ్మ ఒక సమస్యగా మెడను చుట్టుకుంది.
    సాంబమూర్తి "సరే" అన్న రెండు మాటలు మాత్రం అని-అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
    కాని కాలం ఆగుతుందా?
    జయమ్మ దుఃఖం కూడా ఆగలేదు.
    నిండు చంద్రునిలాంటి జవ్వని-పెళ్ళికూతురైంది కదా? అన్నట్లు-రాత్రి పది గంటలకు మునుపే, ఆకాశం మబ్బుపట్టి చెందమామా నక్షత్రాల జాడ లేకుండా పోయింది.
    పీటల మీదికి పెళ్ళికూతుర్ని తెమ్మని అవతల కేకలు వినిపిస్తున్నాయి.
    ఇవతల పెరట్లో నీడలు పడని చీకట్లో నూతి అంచు మీదికి జయమ్మ పాకుతున్నది.
    సరిగ్గా అక్కడే సాంబమూర్తి "అమ్మయ్యో అనుకున్నంతా చేసేవే ....." నంటూ ఆ పిల్లను పొదివి పట్టుకుని-నోరు నొక్కి "నేనూ, మావయ్య" నన్నాడు.
    అలా తప్పింది జయమ్మ పెళ్ళి!
    అలా తిరిగింది జయమ్మ కథ!

                                                   *    *    *

    జయమ్మ కనుల వెంట ధారాపాతంగా కారుతున్న కన్నీటిని చెంగుతో తుడిచి "అమ్మా! బార్లీ" అన్నది పద్మావతి.
    "పాపిష్టిదాన్ని! మరి కొంచెం రోజులు నీ మెడను మూడు ముళ్ళూ పడేవరకూ అయినా మీ నాన్న ఉండక పోయేరూ" అన్నది నిట్టూర్చిన జయమ్మ.

                                     21

    అహంకారాన్ని జయించాలి-అలా చేయడం ఒక గొప్ప పని అనే భావం రావడానికీ యవ్వనం కాదు సరియైన వయస్సు. అందమైన ఆడపిల్ల విషయంలో అందమైన అబ్బాయి గురించి చెలరేగే తుఫానులో మరో అమ్మాయి యిరుక్కున్నప్పుడు....ఆ అమ్మాయిని తప్పనిసరిగా ఐతేను-తప్పించు కున్ధికి అవకాశం లేకపోతేను-తప్ప ఏ ఆడపిల్లా! రానివ్వదు.
    సురేఖ చిత్రమైన సమస్యలోనే పడ్డది. పద్మావతి భాస్కరం గురించి చెప్పని క్షణమంటూ ఉండదు.
    సురేఖకి అందుకనే భాస్కరం సుగుణాలన్నీ అంత బాగా తెలిసినవి కూడా. కాని పద్మావతి అనుకుంటున్నట్లు భాస్కరం ఆ పిల్లను ప్రేమిస్తున్నాడా? అన్న అనుమానం మాత్రం సొంతంగా కలిగింది.
    సురేఖ మనస్సులో స్వార్ధ పూరితమే ఐనా, అహం కార జనితమే ఐనా ఈ తలంపు మాత్రం ఉండిపోయింది. దాన్నుంచి ఆమె తప్పించుకోలేక పోతున్నది.
    అందుకనే తొలినాడు వాల్తేరులో పద్మావతిని కలుసుకున్న క్షణంలోనే "ఏమోయ్! ఏమిటి సంగతులు?...." అని పలకరించింది.
    "ఏమున్నాయ్! అంతా నీ దయ.....నాలుగు రోజులు నీ రూమ్ లో ఆశ్రయ మిస్తివో .... ఒక చిన్న గూడు చూసి- మా అమ్మను తెచ్చుకుంటా" నన్నది పద్మావతి.
    "భలేదానివేనే..... నీకూ మాకో ఏదో తేడా ఉన్నట్లు బరువుగా ఎందుకే పద్మా! మాట్లాడతావూ? .....మా అందరిలాంటిదానివే గాని నీకేం నాలుగేళ్ళు పైబడి పోలేదు కదా?" సురేఖ స్నేహితురాలి ఉదాసీనతకి కారణం వెతకబోయింది.
    "నా దారి వేరులే, సురేఖా! ..... లోకంలో తల్లి నిలా దిక్కులేనిదాన్ని.....దానికి తోడు పై చదువులు చదవాలని మమకారం పెంచుకుంటున్నాను...."
    పద్మావతి నిజమే చెప్పింది. కాని సురేఖ నవ్వుతో తోసి పారేసింది విషయాన్ని. "చదువు కొడం దోషమూ కాదు.....అపరాధమూ కాదులే......ఇంతకీ నీ ప్రేమ ప్రభావం కాదుగదా యిదంతా?" -తనకి ఏమీ తెలియనట్లే అడిగింది.
    "ఛీ! పోవే, అవేం మాటలూ? ఈ మధ్య ఆయన దగ్గర్నుంచి ఉత్తరం లేదే ...... వాల్తేరులో కల్సుకుంటాముగా అని మన సీటు వచ్చాక అభినందిస్తూ రాసిం తర్వాత మరి లెటర్ లేదు సుమా..."
    "ఏమో మరి.....ఒకవేళ ఇవేనా పెళ్ళి చూపులు చూడ్డానికి వెళ్ళాడేమో ఆయనగారు.....బహుశా తీరిక ఉండి ఉండదు." సురేఖ నవ్వులో కృత్రిమ ధ్వని పద్మావతి గమనించనే లేదు.
    "చాల్లే! సరస..... అసలూ! అమ్మాయ్! నీకూ ఎవర్నేనా ప్రేమిస్తేగాని తెలియదులే"-అన్నది పద్మావతి సురేఖ బుగ్గమీద చిన్న దెబ్బవేసి.
    సురేఖ అవతల నుంచి ఎవరో కేక వేయడంలో విషయం అక్కడే వదిలేసింది. "ఇప్పుడే వస్తా" నంటూ లేచిపోయింది.
    ఆ అమ్మాయి అన్న మాటలు పద్మావతిలో చాలినంత ఆందోళన మాత్రం రేపకపోలేదు.
    "అయ్యో! ఎన్నడూ లేంది సురేఖ యిటువంటి హాస్యం ఆడిందేమా" అని అని ఆపిల్ల గుండెపీకింది.
    ఐతే ఇల్లు చూసుకోడం ..... తల్లికి ఉత్తరం రాయడం ....ఆమెనూ తెచ్చి "కాపురం" పెట్టడం యిత్యాది అనేక బరువు బాధ్యత లున్నవి. పద్మావతి తలమీద నప్పుడు-నిట్టూర్చి వూరుకుంది.
    అన్నా? ..... నాన్నా? ఎవరు చూస్తారు ఆపిల్ల అవసరాలు.....అమ్మ తప్ప ఎవరూ లేరు పద్మావతికి.

                              *    *    *

    విశ్వవిద్యాలయం తెరిచేసరికి వసంతం నిష్క్రమిస్తూన్నది గాని.......విద్యార్ధినీ విద్యార్ధుల రాక......సందడి సంబరంతో.....ఇంకా గొంతుకపోనీ కోకిలల కుహూ రవాలతోనూ; ఆమని అప్పుడే వచ్చిందా అన్నట్లు ఉంది.
    పద్మావతికి జలజ అనే అమ్మాయి వాళ్ళ బంధువుల ఇంటికి దగ్గరగా అప్ లాండ్సు వాల్తేరులోమె ఒక ఇల్లు చూపెట్టింది.
    ఇల్లు ఇరుకుగా ఉంది. చీకటిగా ఉంది. కాని అద్దె మాత్రం విపరీతంగా చెప్పేడు ఆసామీ. ముప్పయి మూడు రూపాయలు.
    "అసలు .... మా యావిడ, కుటుంబం, మర్యాదస్తులూ ఐనవాళ్ళకు యిమ్మన్నది గాని లేపోతే స్టూడెంట్సుకితే అరవై రూపాయలొస్తాయమ్మా" -అన్నాడు అందులో అబద్ధమేమీ లేదు. "సరే" ఆలోచిస్తే అదీ దొరకదని తలపోసి పద్మావతికి ఎడ్వాన్సు కట్టేసింది.
    జలజకీ, పద్మావతికీ కూడా వాల్తేరు కొత్తే ..... సురేఖకీ కొత్తే.....
    భాస్కరం కనిపిస్తాడేమోనని వెయ్యి కళ్ళతో వెతకసాగింది పద్మావతి.
    సురేఖ తన పెళ్ళి చూపుల ఉదంతం చెప్పాలనే అనుకుంటూనే ఎందుకో ఉపేక్షించి వూరుకున్నది.
    "ఒకవేళ దీనికి యీ వార్త చెప్పగానే .......వెంటనే చుద్వు మానేసి గుంటూరు వెళ్ళిపోతుందే మో...." ఎందుకేనా మంచిది. ఇది నాలుగు క్లాసులకి వచ్చేకానేసరి" అని సమాధానపడింది తనలో తాను.
    పద్మావతి భాస్కరం కనిపించకపోగా ఇంకా రాలేదేమోలే అనుకుని గుంటూరు బయలుదేరింది.
    "ఓయ్! సురేఖా .... ఇక కాపురం పట్టు కొచ్చేస్తానోయ్.....దొరికిందిగా ఇంద్రభవనం...." అన్నది సురేఖ దగ్గరికి వెళ్ళి.
    "త్వరగా రా! పాఠాలు మొదలెట్టేస్తారేమో?" నన్నది సురేఖ. "ఎంతేనా యూనివర్శిటీ కదూ" అన్నది మళ్ళీ.
    యూనివర్శిటీ ఐనా కాలేజీ ఐనా, విధా విధాన మదే.....వ్యక్తుల నైజమూ అదే.....కాని కొత్త పిల్లలు .... పద్మా, సురేఖలకేం తెలుసూ? "ఎంతైనా యూనివర్శిటీ కదూ" అని ఉబలాట పడ్డారు.
    "భాస్కరంగారు రాలేదేమోనే"-సురేఖ కంటే ఎవరున్నారు పద్మావతికి చెప్పుకుందికి ....    
    "అదా? నీ బాధ ....ఓసి వెర్రిదానా .....వస్తారులే.....రాక ఎక్కడికి పోతారు? ఫైనలియరేమో. కాస్త జాగర్తపడ్తారులే.....వాళ్ళ చెల్లెలికి ఈ ఏడాది పెళ్ళి చేస్తారుట కదూ?" అన్నది సురేఖ.
    "ఆఁ ..... అరె..... నీ కెలా తెలుసే?"
    పద్మావతి ఆశ్చర్యపోయింది. నిజమే ..... మొన్న నేమో పెళ్ళిచూపులకు "వెళ్ళేరేమో" నన్నది. నేడేమో....."చెల్లెలి పెళ్ళి" మాట.
    ఇవి దీనికెలా తెలుస్తాయనుకుంది పద్మావతి.
    "ఉత్తదేనే......అంతా థాట్ రీడింగు! అంతే. దివ్య దృష్టి అనుకుంటున్నావేమిటి .....? నిశ్చింతగా పోయిరా....." అన్నది సురేఖ.
    పద్మావతి రైలు కదిలిపోయింది. కాని పద్మావతి మాత్రం నిశ్చింతగా లేదు.
    "అయ్యో! దీనికి నేని అసలు సంగతి ఏమని చెప్పను?" అని బాధపడింది సురేఖ. రైలు కదిలి పోయేకా తదేకంగా అంటే చూస్తూ కొన్ని క్షణాలుండి పోయింది.

                                 *    *    *

    సురేఖను పదేపదే భాస్కరం ఆలోచన వెంటాడసాగింది.
    "సరే! ఆ భాస్కరంగారినే అడుగుతా" నన్నది అద్దంలోకి చూసుకుని. ఆపిల్ల నా ఆలోచనలు సాయంకాలం కూడా వదలడంలేదు.
    "ఏమిటోయ్! నీ అందం సంగతా? అడుగు అడుగు.....ఆ మహానుభావుడెవరో అతగాడి నోటి మీదుగా వింటేనే హాయి" అంటూ ప్రవేశించింది. సుందరి. సుందరి కెంతసేపు ప్రియుల నారా తీయడమే సరదా.
    సురేఖ ఉలిక్కిపడ్డది. తన గుండెల్లో రాయి పడ్డది...."అబ్బే! అస్సలామాట అనందే" అన్నది. స్నేహితురాలి నాహ్వానిస్తూ కొంచెం తడబాటుతో "ఇదింకొక విషయంలే" నన్నది.
    "......తెలిసింది లేవోయ్ కథా.....ఇంకో విషయ మంటేనే ప్రేమా ...." అన్నది సుందరి. సురేఖ కలవరపాటును గమనించకుండా .....అసలు ఆ "కుర్రాడె" వరో ఆరా తీయాలనే విఫల ప్రయత్నంలో సుందరి సురేఖ నా సాయంకాలం ప్రాణాలు కొరికేసింది. సురేఖ కన్నీళ్ళ పర్యంతమైంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS