18
"మన అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చాలా మంచివారు. నేను వ్రాయగానే అయన చేతిలో ఉన్నంత వరకూ కొన్ని పర్మిషన్లు ఇచ్చారు. ఖైదీల కు మంచి మంచి పూర్తీ కాలం వారి జీవితాన్ని తీర్చి దిద్దడానికి ఉపయోగించేవి వారి చేత చదివింప చేయడానికి అంగీకరించారు. ఇవిగో , కొన్ని పుస్తకాలు తెప్పించాను. చూడండి' అంటూన్న ధర్మారావు ను ప్రశంసా పూర్వకంగా వీపు తట్టాడు మిత్రా.
"చాలా అఖండుడవోయ్! పట్టిన పట్టు వదలవు. నీవంటి విజ్జులు, ప్రజ్ఞా శాలులు దేశానికి ఎంతైనా అవసరం."
ధర్మారావు వినయ సంతోషాలతో అన్నాడు : "పెద్దలు. మీరు నన్ను ప్రశంసించవద్దు . నా ప్రయత్నాలకు సహకరించి , సలహాలు ఇమ్మని కోరుతున్నాను. ఈ నా ప్రయత్నానికి అర్జున్ గారి సహకారం ఉండబట్టే , ఇంతవరకూ చేయగలిగాను. ఏ పని కైనా సహచరుల సహకారమూ, అండదండలు అత్యవసరం కదండీ?"

"అవును . నిజమే . తప్పకుండా సహకరిస్తానయ్యా! ఏదో ఉద్యోగ నిర్వహణ, తప్ప, ఇటువంటి పనులు నేనెన్నడూ చెయ్యలేదు; చేయగల ఓపిక కూడా అందరికీ ఉండదు. నువ్వు చేస్తానంటే ఇంత మంచి పనికి సహకరించడం కంటే కావలసినదేముంది? ఏ విషయం లో సంప్రదించవలసి వచ్చినా నీవు నా దగ్గరకు నిరాటంకంగా వచ్చి వెళ్ళవచ్చు."
"సంతోషం. కృతజ్ఞుడిని. మరి సెలవిప్పించండి.' నమస్కరించి వెళ్ళిపోయాడు ధర్మారావు.
"అయన చాలా అపూర్వ వ్యక్తీ కదూ, బాబాయ్? అసలు మనిషి ని చూడగానే యెనలేని గౌరవభావం కలుగుతుంది ." సాలోచనగా అతడు వెళ్ళిన దిక్కే చూస్తూ అన్నది సత్య.
"అవునమ్మా. చాలా ఉత్తముడు. నువ్వు సరైన వ్యక్తినే ఎన్నుకున్నావని నేనను కుంటున్నాను. ఎందరు ఉద్యోగులను చూడడం లేదు? ఇంతటి మహత్తరాదర్శాలతో జీవించే వాడిని ఎక్కడా చూడలేదు , నా సర్వీసు లో. మానవుడంటే అతడే మానవుడు. ఉజ్జ్వలమైన భావితవ్వం ఉంది అతనికి."
"బాబాయ్!" ధర్మారావు మిత్రా హృదయంలో ఉన్నత స్థానాన్నధీవసించినందుకు సంభ్రమాశ్చర్యాలు ప్రదర్శించింది సత్య.
"అవునమ్మా. పురాణ పురుషులు, ఉన్నత వ్యక్తులూ, మహా నాయకులూ -- ఎందరెందరి చరిత్రలనో చదివాము; చూస్తున్నాము. ఇతడూ అటువంటి కారణ జన్ముడే. కారాగారాలలో మ్రగ్గుతున్న ఖైదీలను ఉద్దరించడానికి పుట్టిన మహాపురుషుడు!'
ఆ మాటలు వింటున్న సత్య మనస్సు ఆనంద తరంగిత మయింది.
19
జైలు డాక్టరు, ధర్మారావు ఇద్దరూ కలిసి రావడం దూరం నుండే గమనించిన ఖైదీలు, చేస్తున్న పనులు ఆపి చేతులెత్తి నమస్కరించారు. పోలీసులందరూ సెల్యూట్ కొట్టారు.
"అందరినీ ఒక పద్దతిలో కూర్చో బెట్టండి.' ధర్మారావు పోలీసులను ఆజ్ఞాపించాడు. వెంటనే అమలు జరిగింది. ధర్మారావు ముందే ఏర్పాటు చేసి ఉంచిన విధంగా , అక్కడ అయిదారు కుర్చీలు, ఒక బల్ల వేసి, బల్ల పై ఒక పార్శేలు పెట్టబడి ఉంది.
"ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాము. జాగ్రత్తగా వినండి.' అని ధర్మారావు ఖైదీ లకు చెబుతుండగానే వెనక నుండి అర్జున్, ఒక సబ్ ఇన్ స్పెక్టర్ గంబీరాకృతి లో ఉన్న మరొక పురుషునితో ప్రవేశించారు.
"వీరు మన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు. మీ కష్ట సుఖాలను గమనించి, అవసరమైన ఏర్పాట్లు చేసే తండ్రి వంటి వారు.' ధర్మారావు మాటలు వింటూ అ నూతన వ్యక్తీ ని అందరూ నమస్కరించారు.
అందరూ ఉచితాసనాలలో కూర్చున్నారు. ధర్మారావు లేచి మాట్లాడసాగాడు.
"సోదరులారా, సోదరీ మణులారా!"
మగ, అడ ఖైదీ లందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఆ సంబోధనకు. అధికారుల వదనాలు కూడా చలించినట్లే కనిపించాయి.
"ఒక తల్లి బిద్దలందరూ సోదరీ సోదరులే. వారిలో వారికి వయో విద్యా గుణ రూప సంపదలలో అనేక బేధాలు, దూరాలూ ఉండవచ్చు. అయినా ఏక గర్భ జనితులు కావడం వల్ల సోదర భావమే కాని, ఆ అంతరాలకు స్థానం ఉండదు. అలాగే తల్లులందరకూ తల్లి అయిన ఆ జగజ్జనని బిడ్డలం మనం. ఎవరే స్థితిలో ఉన్నా, ఎటువంటి వారైనా సరే మనమందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళ మే. ఒకడు తప్పు చేస్తే, ఆ తప్పును ఎత్తి చూపి దండించే అధికారం సోదరుడికి ఉంది. అధికారుల మైన మాకూ, నేరస్తులైన మీకూ కూడా అదే సంబంధం వర్తిస్తుంది. పిల్లలు తప్పు చేస్తే తల్లి, తండ్రీ శిక్షించకుండా వదలరు. అంత మాత్రాన వారికి బిడ్డల మీద ప్రేమ పోతుందా? పోదు. ఎదుటి వారి పట్ల జాలీ, సానుభూతీ అధిక మౌతాయి. చట్టానికీ, మీకూ ఉన్న సంబంధం కూడా అటువంటిదే. అంతకు మినహా వ్యక్తిగత వైరాద్వేషాలకు తావు లేదు. నేరము, శిక్ష -- వీటిని మినహాయించి మిగిలిన అన్ని విషయాలలో మనం అందరమూ ఒక్కతే. అల్పాదిక్యాలు లేవు."
ఆ మాటలు వింటూనే అధికారులూ ఖైదీలు కూడా చలించి పోయారు.
"సరే. నేను ఎక్కువగా చెప్పదలుచు కోలేదు. నేను ఉద్యోగానికి వచ్చిన నాటి నుండి మీకు చాలా విషయాలు చెబుతూనే ఉన్నాను. మన జిల్లా సూపరింటెండెంట్ గారు చాలా సహృదయులు. మీ కష్ట సుఖాలన్నీ నేను మీ తరపున వారికీ విన్నవించాను. వారు అన్ని విషయాలు సరి చూస్తారు. మీ భోజనాలు వగైరా లన్నీ ఇక సక్రమంగా ఉంటాయి. మీ ప్రవర్తన కూడా సరిగా ఉంటె మీకింకా ఎన్నో సౌకర్యాలు చేస్తాము. విడుదలై వెళ్ళిన వారికి మంచి ఉపాధి లభించే టట్లు ప్రయత్నిస్తాము. మీ మంచి ప్రవర్తన వల్ల మీకు మీరే కాకుండా, ఇప్పటి వారికి, తర్వాత వారికి కూడా, ఎందరు నేరస్తుల కో ఎన్ని విధాలుగానో ఉపకారం చేసిన వారవుతారు. మీ సత్ప్రవర్తన మీ శిక్షా కాలాన్ని తగ్గించ గలదు కూడా."
అతి నిశ్శబ్దంగా వింటున్నారు ఖైదీలు. "మన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు మిమ్మల్ని స్వయంగా చూచి, మీ భవిష్యత్తు ను బాగు చేయడానికి వేసిన ఈ పధకానికి ప్రారంభోత్సవం చేయడానికే ఇప్పుడు వచ్చారు. నా మాటకు విలువ ఇచ్చి, నా ఆహ్వానాన్ని మన్నించిన వారికి నా తరపున, మీ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతాభినందనలు తెలుపుతున్నాను."
కరతాళధ్వనులు మిన్ను ముట్టుతుండగా జిల్లా సూపరింటెండెంట్ దర్జాగా లేచి, ఒక్క సారి అందరినీ కలయ జూచాడు. తర్వాత తన గంబీరోపన్యాసం ప్రారంభించాడు.
"మేము ప్రారంభించిన ఈ పని మీ కందరికీ చాలా ఆనందదాయకంగా ఉన్నదని మీ ముఖాలే చెబుతున్నాయి. మీ నియమ నిబంధనలకు లోబడి వినయ విదేయతలతో మీరూ వర్తిస్తే అది మాకూ ఆనందం." ఒక్కసారి ఆగి , ఖైదీ లందరి పైనా పరిశీలనాత్మక దృష్టి జరిపాడు.
"చిత్తం, బాబూ. అలాగే చేస్తాము' అనే మాటలు, విన వచ్చాయి ఖైదీలలో చాలా మంది నుండి.
"సంతోషం. నేను పెద్దగా ఏమీ చెప్పదలుచు కోలేదు. ఇవిగో ఈ పుస్తకాలు -- మహా భారతం , రామాయణం, భగద్గీత -- ఇవి ఏనాటివో! మహా మునులూ, తపసు లూ అది యుగం లలోనే రచించినవి. అయినా నేడు తరతమ బేధాలు లేకుండా మీకూ. మాకూ అందరికీ ఉపయోగించి అందరి జీవితాలకూ అన్వయించి, అందరి సమస్యలకూ సమాధానాలూ, మార్గాలూ చూపగల మహత్తర గ్రంధాలు ఇవి. మీలో విద్యావంతులు వాటిని చదివి అర్ధం చేసుకొని, మిగిలిన వారికి కూడా బోధించవచ్చు. పుస్తక మనేది మనిషికి మంచి స్నేహితుని వంటిది. స్నేహితులంటే మన హితవు కోరేవాళ్ళన్న మాట. అందువల్ల మంచి పుస్తకం, మనిషి మనిషికి నేర్పలేని మంచిని నేర్పుతుంది. మంచి ఆలోచనలు కల్పించి మంచి పనులు చేయిస్తుంది. కనుక, మీరు మీ తీరిక సమయాలను ఈసత్కాలక్షేపానికి వినియోగించుకొని జీవితాలను చక్కదిద్దు కోవాలి."
ఖైదీలు కరతాళ ధ్వనులతో సంతోషం వెలి బుచ్చారు. "కాని, మీరు ఒక విషయం గుర్తుంచు కోవాలి." ఖంగున మోగింది అయన కంఠం. "ఇది కేవలం మీలో ఒక మార్పు రావాలని చేస్తున్న ఆశా పూర్వక ప్రయత్నం మాత్రమే. మీరీ అవకాశాన్ని మరొక విధంగా ఉపయోగించు కొని, కుతంత్రాలు పన్ని అవిధేయత ప్రదర్శించిన నాడు ఈ అవకాశాలన్నీ బంద్ కావడమే కాక పరిస్థితులను బట్టి మీకష్టాలు ఇప్పటి కంటే అధికమై పోతాయి జాగ్రత్త!" చూడడానికే భయంకర స్వరూపం లో ఉన్న ఎస్. పి. మరింత భయంకర స్వరంతో హెచ్చరించి ప్రసంగాన్ని ముగించాడు.
