Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 16


    "మీలో ఒకరు వచ్చి ఈ పుస్తకాలను సూపరింటెండెంట్ గారి నుండి తీసుకోండి." అన్నాడు అర్జున్.
    ఖైదీ లెవ్వరూ కదలలేదు. అతి నిశ్శబ్దం తాండవిస్తున్నది.
    "గౌతమ్ గారిని వచ్చి తీసుకోమని నేను కోరుతున్నాను." అన్నాడు ధర్మారావు లేచి.
    అంతవరకూ నిర్లిప్త దృక్కులతో ఒక మూల పరధ్యానంగా కూర్చుని ఉన్న గౌతమ్ ఒక్కసారి అధికారు లందరినీ సాలోచనగా వీక్షించి, మౌనంగా మంద గమనంతో వచ్చి పుస్తకాలు తీసుకుని నమస్కరించి పోయి కూర్చున్నాడు.
    అందరికీ కృతజ్ఞత చెప్పి , సభ ముగించడానికి లేచిన ధర్మారావు గంబీర స్వరంతో చెప్పసాగాడు; "గౌరవనీయులు సూపరింటెండెంట్ గారు చెప్పినట్లు మీ జీవితాలను చక్క బరచటానికి ఇది కేవలం మేము చేస్తున్న ఒక ప్రయోగం మాత్రమే. ఈ పుస్తకాలే కాదు; మీకు కావలసిన తెల్ల కాగితాలు, కలాలు కూడా ఇస్తాము. మీలో ఎన్నో అభిరుచులున్నవారుంటారు. బొమ్మలు వేయడం; పాటలు , పద్యాలు , కధలు వ్రాయడం -- ఇలాగే ఎన్నో, ఎన్నో. మీరు అటువంటి మీ అభిరుచులకు ఇక్కడ జీవం పోసి వృద్ది చేసుకొనవచ్చు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం మీరు ఇటువంటి విషయాలకు ప్రత్యేకించి వినియోగించు కొండి. పండుగ పబ్బాల రోజుల్లో మీ చాతుర్యాలను ప్రయోగించి ఏదైనా ప్రదర్శనలు ఏర్పాటు చేసుకొని మీరు ఆనందించండి; మమ్మల్ని ఆనందింప చేయండి."
    ఈసారి కరతాళధ్వనులు మరీ ఉదృతంగా వినిపించాయి. అంతలో ధర్మారావు కంఠస్వరం కఠినంగా మారిపోయింది. "కాని మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం -- మీ బుద్దులు ఏమాత్రం పెడదోవ పట్టినా మిమ్మల్ని మీరు మరింత బందించుకొని నాశనం చేసుకుంటున్నారన్న మాటే! మన సూపరింటెండెంట్ గారి గౌరవార్ధం జైలు క్లబ్బులో ఒక చిన్న ప్రదర్శన ఏర్పాటయింది.అది ఖైదీలు కూడా చూడడానికి దయతో అనుమతించమని వారిని ప్రార్ధిస్తున్నాను."
    ఎస్.పి నొసలు చిట్లిస్తూ ధర్మారావు ను చూచాడు. నిర్మలంగా, అపర ధర్మమూర్తి లా, ఏదో అనిర్వచనీయమైన తేజస్సు తో ఉన్న ఆ యువకుని మాటను తోసివేయలేక పోతూన్న అతడు మౌనంగానే అంగీకారాన్ని సూచించాడు.
    అందుకు ఆయనకు ధన్యవాదాలు తెల్పుతూ ధర్మారావు అన్నాడు. ఖైదీల నుద్దేశించి "మేము చేస్తున్న ఈ పని ఎంత బృహత్తర మైనదో మీలో చాలామందికి అర్ధం కాకపోవచ్చు. అయినా చెబుతున్నాను. రెండు పుస్తకాలూ, నాలుగు కాగితాలూ ఇచ్చి, పెద్ద కబుర్లు చెబుతున్నట్లు మీరు భావించ వచ్చు. కాని ఈ స్వల్ప కార్యనికే మేము ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి; నిష్టూరాలు భరించాలి.
    "మా యీ ఉద్యమం అధికార వర్గాలలో తీవ్ర సంచలనం లేవతీసింది. కాని, ఎన్ని కష్ట నిష్టూరాలనైనా ఫలితం దక్కితే మరిచి పోవచ్చు . మా యీ ప్రయత్నం ఫలవంత మౌతుందనే ఆశిస్తాము.
    "ఇక చివరి మాటగా ---ప్రస్తుతం రెండు ప్రహసనాలు న్నాయి. అవి 'భస్మాసుర' , 'అంగుళీమాల్' ఇవి రెండూ కూడా మీకు రెండు నీతులను బోధిస్తాయి. చూచి అర్ధం చేసుకోండి."
    
    
                                *    *    *    *
    సత్యాదేవి ప్రార్ధనాంతరం ప్రహసనాలు ప్రారంభమయ్యాయి. తాను పెరిగిన ఆశ్రమం లోని బాలబాలికల బృందాన్ని ప్రత్యేకంగా ఇందు కోసమే రప్పించాడు ధర్మారావు.
    బాలబాలికల బృంద గానం అనంతరం 'మోహినీ భస్మాసుర' ప్రారంభమైంది. భస్మాసురుడు ఘోర తపం చేసి శివ సాక్షాత్కారం పొంది, వరం అడిగాడు -- తాను ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ళు భస్మమై పోవాలని, శివుడు అయిష్టంగానే ప్రసాదించాడా వరాన్ని. ఆ క్రూరాసురుడు విశ్వాస ఘాతకుడై తన భయంకర వర పరీక్ష కై ఓం ప్రధమంగా శివుని నెత్తినే చెయ్యి పెట్టడలిచాడు.
    సృష్టి లయకారకుడైన శివుడే ఖర్మ కాలి స్వరక్షణార్ధం, దిక్కు తోచక పరుగు లంకించు కున్నాడు, సామాన్య ఆర్తమానవుని లాగా. భస్మాసురుడు వెంటాడాడు. అప్పుడు సృష్టి కారకుడు శ్రీ మహావిష్ణువు శివ రక్షణార్ధం మోహినీ రూపం లో వచ్చి భస్మాసురుని భ్రమింపచేశాడు. మోహిని పొందు కొరకు సుస్నాతుడై శుచిగా రావడానికి నదీ స్నానం చేస్తూ ఉదకం నెత్తిన పోసుకుంటూ తన చేతులు తననే భస్మం చేసి వేయగా అంతమై పోయాడు.
    తమ చెడు తమనే అంతం చేస్తుందని , అది తమకు గుణ పాఠం గా అందరూ గ్రహించారు. ఆ సంగీత రూపకం అందరినీ ముగ్ధులను చేసింది.
    రెండవది నృత్య నాటిక 'అంగుళీ మాల్.'
    బుద్ధ భగవానుని పెద్ద తైల వర్ణ చిత్రంతో వేదికకు అపూర్వమైన కళ వచ్చింది.
    "బుద్ధం శరణం గచ్చామి
    సంఘం శరణం గచ్చామి.
    ధర్మం శరణం గచ్చామి."
    సిద్దార్ధుని శిష్య గణం ప్రార్ధనతో ప్రారంభమైంది ప్రహసనం. వారి వెనక శాంత తేజో విరాజ మానుడైన అహింసా మూర్తి బుద్దుడు ప్రవేశించాడు. ప్రేక్షకులలో విద్యా వంతులు, విద్యావిహీనులు అందరూ కూడా ఆ ధర్మమూర్తి వేషానికి సరిగా కుదిరిన ధర్మారావు ను చూచి సంభ్రమాశ్చర్యాల నందారు.
    సామాన్య మానవుల నుండి , రాజాదిరాజులందరి వరకూ గడగడ లాదిపోతున్నారు , గజదొంగ అంగుళీ మాలుని ఘటకాలకు. వీరాధి వీరులందరూ కూడా అతడిని జయించలేక ప్రాణాలను కోల్పోతున్నారు. అనాటికానాడు అతడి రాక్షస కృత్యాలు అధికమై పోతున్నాయి. చేజిక్కిన మానవులను దోచుకుని, వారి చేతి వెళ్ళు నరికి దండగా గుచ్చి మెడలో మాలగా ధరించేవాడు ఆ గజదొంగ. అందుకే అతడికి అంగుళీ మాలుడనే నామం.'
    విషయాలన్నీ బుద్ధ భగవానుడు విన్నాడు. వెంటనే అతడి దగ్గరకు బయలుదేరాడు. ఆబాల గోపాలం కంపించి పోయింది. భావగానుని శిష్య గణం అదిగా సంసార స్త్రీలు, పురుషులు, శిశువులే కాదు; రాజ్య పాలకులైన చక్రవర్తుల కూడా దీనంగా విలపించారు.
    మానవత్వంమంటేనే ఏమిటో తెలియని ఆ నరరూప రాక్షసుని చెంతకు పోయి, లోకంలోని వెలుగును అంతం చేయవద్దని దీనంగా వేడుకున్నారు. కాని బుద్దుని సంకల్పాన్ని మరల్చలేక పోయారు.
    పాదచారి అయి, తన చెంతకే వస్తున్న ఆ తేజోమూర్తిని అల్లంత దూరాన ఉండగానే చూచిన అంగుళీమాలుడు తనకే అర్ధం కాని బాధతో పశ్చాత్తాపం తో ఊగిపోయాడు. చేతిలోని అస్త్ర శస్త్రాలను దూరంగా విసిరి వేసి, పరుగు పరుగున పోయి బుద్ధ భగవానుని పాదాలను కన్నీటి తో కడిగి పాప విముక్తుడై , బుద్దుని ప్రధాన శిష్యులలో ఒకడయ్యాడు.
    తిలకిస్తున్న న్యాయ మిత్ర ఆనంద భాష్పాల వోత్తుకున్నాడు. వీడ్కోలు తీసుకుంటూ, "చాలా సందర్బోచితంగా ఉన్నాయయ్యా, నీ ప్రహసనాలు" అంటూ ధర్మారావు ను భుజం తట్టాడు ఎస్.పి. " నీ ప్రయత్నాలు అన్ని విధాల ఫలవంతం కావాలి. నీకు నా సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది."
    "కృతజ్జుడిని ." వినయంగా నమస్కరించాడు ధర్మారావు.
    సత్య ప్రత్యేకంగా అభినందించిందతడిని.

                                    20


    "అలా అగు! నిల్చో!"
    తన గదిలోకి పోతున్న సత్య సుమిత్ర గద్దింపు విని అదిరిపడింది.
    "ఇప్పుడు టైమెంత?' గద్దించింది సుమిత్ర.
    "........."
    "రాత్రి తొమ్మిది గంటలు!' ఉరిమింది మళ్ళీ.
    మ్రాన్పడి నిల్చున్న సత్య మాట్లాడలేక పోయింది.
    "ఇంతవరకూ ఆ ధర్మారావు తోనే తిరిగి వచ్చావు కదూ?' మరో బాణం.
    "తిరగడమేమిటి, పిన్నీ?' అసహనంగా ఎదురు ప్రశ్నించింది సత్య. "ఖైదీలను గురించి పై అధికారులకు దరఖాస్తులు తయారు చేస్తున్నాము నేను, అయన, అర్జున్కలిసి."
    "చిట్టి తల్లీ! ఎంత చక్కటి మాట చెప్పావే!' వికటంగా బారలు చాపింది సుమిత్ర. "ఇదెక్కడి విడ్డూరమొచ్చి పడిందో, నా ప్రాణానికి? తన తిండి తనకు తినడం ఈనాటికి చేతకాదు. పోరి పోరి తినిపించాలి. బ్రతుకు దిద్దుకోవడం తెలియని ఆడపిల్ల వెయ్యి మంది దొంగాళ్ళ జీవితాలు దిద్దడానికి పదిమంది మగాళ్ళ తో రాత్రింబవళ్ళు తిరిగి తాపత్రయ పడుతుందట! తాపత్రయం! విన్నవాడు నవ్వి పోగలడు-- 'డానికి బుద్ది లేకపోతె దాని పెద్ద వాళ్ళెం చేస్తున్నారూ-- నిద్ర పోతున్నారా , గడ్డి తింటున్నారా?' అని."
    "ఏమిటే నీ గోల?' మిత్రా ప్రవేశించాడు చేతిలో పైప్ తో, నైట్ డ్రెస్ తో.
    సుమిత్ర కంఠస్వరం తారాస్థాయి నందుకుంది. "మీకేమో అప్పుడే శయనించే వేళయిందా? మీ కూతురి కింకా షికార్లె పూర్తీ కాలేదు, హవ్వ!' నోరు నొక్కుకుంది. "ఇంతవరకూ ఏమిటీ షికార్ల ని అడిలించటం అట్టే పోయి, నన్ను గోలంటారా , పైగా?"
    "ఛీ, నోర్ముయ్!' కోపం ప్రదర్శించాడు మిత్రా. "అదేమైనా చంటి పిల్లటే, అడుగడుగునా నువ్వు ఆంక్షలు పెట్టడానికి? ఇరవై రెండేళ్ళ పిల్ల. పైగా లాయరు. రోజూ నీలా, నాలా దెబ్బలాడుకునే వాళ్ళకేందరికో ఎంత చక్కగా న్యాయం చెబుతుందో , వాళ్ళ బతుకు లేలా దిద్దుతుందో నీకేం తెలుసు? దాని  బాగోగులు డానికి తెలియవూ?"
    "పోనీ , బాబాయ్! కోప్పడకండి.' సత్యాదేవి కల్పించుకుంది. "పిన్నికి నామీదేంత ప్రేమ లేకపోతె నా మంచి కోసం ఇంత తాపత్రయ పడుతుంది? పెద్దతనం మూలాన కట్టడి ఎక్కువ చేస్తుంది అంతే."
    సుమిత్ర కరిగిపోయింది. "నాతల్లే! కాదు మరీ? మీ అమ్మ లేదు. మీ నాన్న మా దగ్గర ఉంచింది నీ జాగ్రత్త కోసమే కదా? ఏమైనా పొరపాటు వస్తే మీ నాన్న' 'ఇందుకా నేను మీ దగ్గరుంచింది ?' అని నన్నంటే నేనేం సమాధానం చెప్పను?"
    "అదుగో, ఆ మూర్ఖత్వమే వద్దంటాను." మిత్రా అందుకున్నాడు. "మనమ్మాయి పొరపాట్లు చెయడమేమిటే, తెలివి తక్కువదానా? లక్షణమైన రత్నం లాంటి పిల్లాడి నేన్నుకుంది. ఓహ్! ధర్మారావు మనల్లుడంటే జన్మ తరించి పోదుటే?"
    'అదుగో . అదే వద్దన్నది! ఏం చూసి నిర్ణయించు కున్నారు? పుట్టుపూర్వోత్తరాలు లేమిటి? ఎటువంటి వంశం? మనకు తగిన వాళ్ళేనా? అని ఏమైనా ఆలోచించారా? ఈ ఇంటికి అల్లుడు కావాలంటే మాటలా?"
    "అదా నీ కాకిగోల?' తేలికగా అనేశాడు మిత్రా. "సరే. మంచి రోజు చూసి ఓసారి వాళ్ళింటి కి పోయిరా. ఆడపిల్ల వాళ్ళం కదూ? మనమే ముందు వెళ్లి కదిలించాలి. నీకు కావలసిన వన్నీ తెలుసుకో. నేను మా అన్నయ్య కు కూడా వ్రాస్తాను. వస్తాడు. త్వరగా ఆ వివాహం జరిగిపొతే వాళ్ళూ సుఖ పడతారు; నేనూ సుఖ పడతాను , నీ ఏడుపు వదిలి."
    
                              *    *    *    *
    "అమ్మాయ్! అమ్మాయ్! సత్యా! లేవవే అమ్మా!"
    అప్పుడే ఉషోదయ మైంది , ప్రకృతి పూర్తిగా మేల్కంచనే లేదు.
    "ఏమిటి పిన్నీ? ఏమిటీ తొందర?' విసుగ్గా అడుగుతూ నిద్ర మత్తులోనే పక్కకు ఒత్తిగిల్లింది సత్య.
     "అయ్యో , తొందర కాదూ? నా తొందర నీకేం తెలుస్తుంది? నా బెంగ రాత్రింబవళ్ళు నీ గురించి కాదూ, తల్లీ ? తల్లి లేని నిన్ను పెంచి ఇంత చేశాను. నేనే నీకు తల్లిని. నాకు పిల్లలు లేని లోటు నువ్వు తీర్చావు. నీ జీవితం తీర్చి దిద్దాలనే తొందరేనమ్మా, నాకు ఇరవై నాలుగు గంటలూ."
    ఎక్కడి మత్తు అక్కడే వదిలిపోయింది సత్యకు. "ఏమిటి, పిన్నీ? ధర్మారావు గారు గానీ వచ్చారేమిటి?" అంది  లేచి కూర్చుని కిటికీ నుండి పొద్దు చూస్తూ.
    "లేదమ్మా. అయన రాలేదు. లేచి త్వరగా తయారుకా. మనమే వెళ్దాము.
    'అదేమిటి? ఇంత ప్రొద్దున్నే?"
    "ఊ! ఆ నిమిషాని కా నిమిషం, ఆ రోజు కారోజు ఆలస్యం ఆలస్యమే! త్వరగా చేసుకోవాలమ్మా పనులు!"
    "నువ్వెంత మంచిదానివి , పిన్నీ!" ఒక్కసారి చిన్నపిల్లలా మారిపోయి, సుమిత్ర మెడ చుట్టూ చేతులు వేసింది సత్య. "మరైతే మనం వస్తున్నట్లు వారింటికి ఫోను చేయించు" అంది స్నానానికి వెళ్ళుతూ.
    "ఎందుకూ.? వద్దు" ఖచ్చితంగా అంది సుమిత్ర. "చెప్పా చెయ్యకుండా హటాత్తుగా వెళ్తేనే వాళ్ళ అసలు బండార మంతా తెలుస్తుంది."
    "ఛ! అది మర్యాద కాదు, పిన్నీ."
    "అదంతే, "! ఖరాగా అన్నది సుమిత్ర. "పెద్దవాళ్ళ వ్యవహారాలివి. నీకు తెలియవు. వెళ్లి త్వరగా తయారై రా. " ఆర్డరు జారీ చేసింది. నిస్సహాయంగా చూచింది సత్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS