Previous Page Next Page 
అర్పణ పేజి 15

                                  
    "సరూ, సరిగ్గా అలోచించి చెబుతావా?' అన్నాను.
    "ఏమిటేమిటి?" అంది మామూలు ధోరణి లో.
    "ముందు వాగ్దానం ఇస్తే కానీ లాభం లేదు. లేకపోతె మెల్లగా జారుకుంటావు."
    "సరే, చెబుతాను " అంది దృడంగా.
    "అలా అను. ఇప్పుడు చెబుతాను, విను. నీ కోక పురుషుడి తో పరిచయం అవుతుందను కో. ఏం? అతను సౌందర్య వంతుడు , విజ్ఞాని, వివేకి కావచ్చు. ;లేదా కురూపి, విద్యావంతుడు , మంచి వాడు అయి ఉండవచ్చు. అదీ కాకపోతే అందగాడు, పెంకితనం జాస్తిగా ఉన్నవాడు అయి ఉంటాడను కో. అతను ఎటువంటి విభిన్న గుణాలు , ఉత్తమ ఆదర్శాలు , ప్రత్యెక అర్హతలు కలిగి ఉన్నా నువ్వా వ్యక్తీ లో ప్రత్యేకత ను పరిశీలించ లేకపోయినప్పుడు , కౌతుకం కనబరచలేనప్పుడు బలవంతంగా నైనా నీ మనస్సు నేవరైనా ఆ వైపు మళ్ళించగలరా? కాస్త ఆలోచించు, సరోజా!" అన్నాను.
    కొంతసేపు దీర్ఘంగా ఏదో ఆలోచించింది నా మీద దయ తలచి.
    అకస్మాత్తుగా అంది: "నువ్వన్నది నిజమే, రాజూ!"
    నా సంతోషానికి పగ్గాలు  లేవు.
    "మరిక పార్వతి గురించి నాకు చెప్పడం ఎంత అసందర్భంగా ఉందొ తెలిసిందా?"
    "అవును" అంది. ఇంతవరకు బాగానే నడిచింది సంభాషణ.
    నేనన్నాను-- ఆందోళన నూ, జాప్యాన్నీ సహించలేక : "ఇక నేమంటావు, సరోజా? ఈ నీ మిత్రుడి కోరిక కొనసాగేటట్లు చూడు. మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎమ్.బి.బి.ఎస్ , అయ్యే బాధ్యత నాది."
    ఇంకా నా మాట పూర్తీ కాలేదు -- 'అలా వల్ల కాదు, రాజూ!" అనేసింది. "హరిహర బ్రహ్మదులు వచ్చి రిజిస్టర్ మారేజ్ చేస్తామని కంకణం కట్టుకున్నా సరే, మన వివాహానికి అంగీకరించను. ముఖ్యంగా పార్వతి స్నేహాన్ని వదులుకోలేను. ప్రపంచంలో స్నేహమే పవిత్రమైనది అనుకుంటాను " అన్నది.
    నవనాడులూ కుంగి పోయాయి. అల్లాంటి పిల్లను అంతసేపు అర్ధించి నందుకే సిగ్గు వేసింది.
    "ఊహూ! నువ్వు కవయిత్రివి కావలసింది; డాక్టర్ వవుతున్నావు " అన్నాను కసిగా.
    "నాబోటి కవయిత్రో, రచయిత్రో ఎక్కడో ఉండే ఉంటుంది " అన్నది . ఇలాటి కబుర్లేన్నయినా చెబుతుంది ఆవిడ.
    "మాటలు మాని ఏదో తేల్చు" అన్నాను.
    "చెప్పానుగా?" అంది, నేను రాక్షసుడ్నయినట్లు అనుమానంతో మరొక వైపు చూస్తూ.
    "నువ్వు లేకపోతె నా జీవితం వ్యర్ధం!' అన్నాను.
    "ఏ అఘాయిత్యమన్నా చేస్తావేమిటి?" అని ప్రశ్నించింది.
    "ఆత్మహత్య చేసుకుంటాను, పార్వతి ని పెళ్లి చేసుకున్న తర్వాత" అన్నాను.
    మొదట ఆందోళన కనిపించింది, ఆ అమ్మాయి కళ్ళలో. తర్వాత మామూలుగా మారింది.
    "అబ్బాయీ! ఆడది ఆత్మహత్య చేసుకుంటే రెండు మూడు రోజులు విచారిస్తారు. జాలి పడతారు. మగవాడు , అందులోనూ అన్నీ అమరి, అనుభవించ లేని వాడు ఆత్మహత్య గనక చేసుకుంటే మరు క్షణం లోనే మరిచి పోతారు. తినలేక చచ్చాడని తిడతారు. ఆ మగవాడే , ప్రపంచంలో అడ్డదిడ్డంగా బతికినా అప్పుడప్పుడు అభినందిస్తారు"అన్నది అడ మగ జాతుల జాతకాలన్నీ పిండి కొట్టినట్లు.
    "నేను లేనప్పుడు నన్నేవరేలా అనుకుంటే నాకేం? ప్రేయసి తిట్టినా ఫర్వాలేదు. నేను చస్తే, ఇంత త్యాగశీలి వి, పరోపకారివి -- నువ్వు అశాంతి తో ఏడవాలని నా కోరిక."
    "అయితే నేనే ఒక పని చేస్తాను."
    "ఏం పని?" నిండు ఆత్రుతతో అడిగాను.
    "నీకన్నా ముందు నేను ఆత్మహత్య చేసుకుంటాను." అతి సహజంగా అని, తర్వాత నవ్వుతూ, "అప్పుడు నేను ఏడుస్తాననే కోరిక కూడా నీలో నశిస్తుంది కాబట్టి, నువ్వు ఆత్మహత్య మానుకుంటావు" అంది.
    "వెర్రి రాజూ! ఆత్మహత్య చేసుకుంటా నంటూ నన్నిప్పుడు బెదిరిస్తే ఒప్పుకోను. ఇంకా అయిదు సంవత్సరాలు గడిచాక నా దగ్గరికి వచ్చి 'ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయంతో ఉన్నా' నని చెప్పగలిగితే విచారించను. అప్పుడు నన్నూ, పార్వతి ని హత్య చేసి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఏ పాపమూ ఉండదు. ఉన్న పాపం పోతుంది."
    నాకు ఒళ్ళు మండింది. చిరాకు వేసింది. "నువ్వు నన్ను వివాహం చేసుకొని పక్షం లో నా భవిష్య జీవితంలో నీకు సంబంధం లేదు" అంటూ కోపంగా వచ్చేశాను. అది మొదలు మళ్లీ ప్రయత్నపూర్వకంగా ఆమెను కలుసుకోలేదు. కనిపించినా మామూలుగా మాట్లాడకుండా  తప్పించు కోలేను. కోపతాపలేవీ ఉంచుకోదు సరోజ. ఆరోజు మా వాదోపవాదాలన్నీ మరిచి పోయినట్టే మాట్లాడింది అనేక పర్యాయాలు.
    పార్వతితో నా పెళ్ళికి ఇంకా పది రోజులు వ్యవధి ఉంది. ఏం వ్రాయమంటావు, ఇంకా? ఆరని నిరాశా జ్యోతి ఉజ్జ్వలంగా ఉద్దీపిస్తూ ఉంది నా హృదయంలో. ఇంతేనోయ్! ఈ వివాహానికి నిన్ను రమ్మని ఆహ్వానించడానికైనా నాకు ఆనందం లేదు.

                                                                                     -- రాజు.'

                              13
    దశమి నాటి చంద్రుడి చుట్టూ స్థావరం ఏర్పరచుకున్నాయి నక్షత్రాలు -- ఆశాదీపం చుట్టూ ముసిరిన అల్ప ప్రాణుల్లాగ . చుక్కలు తనను వెక్కిరించినట్లనిపించింది రాజుకు. చుక్కలు వెక్కిరించకేం? ఒక్కొక్కప్పుడు ప్రపంచమే వెక్కిరిస్తుంది. అలా అనిపిస్తుంది మానవ చిత్తానికి.
    నక్షత్రాల వైపే చూస్తున్నాడు. ఇలాగే మినుకు మినుకు మంటూ మనిషి ఆశలా కనిపిస్తుంది ఒక్కొక్క చుక్కా. తీరా ఒకనాడు పుటుక్కున రాలిపోతుంది. దాని స్థానం లో కి మరొకటి రావచ్చు. భువిలో ఒక ఆశాజీవి; దివి మీదొక ఆశా జ్యోతి.
    ఎంత ఆలోచనల్లో వేదాంతం పులుముకున్నా అంతరాత్మ లో అగ్ని ప్రజ్వలిస్తున్నది. దీని నుంచి తప్పించుకుని బతికి పోవడం సామాన్యం కాదు.
    రాజు, పార్వతి ల వివాహం నరసింహ మూర్తి గారి ఇంట్లోనే జరిగింది. పెళ్లి కాగానే ఊరు వెళ్ళిపోవాలని పట్టుబట్టాడు రాజు. కాని అదీ సాగలేదు , ఏ మిష వల్లా.
    "ఏమిటో ఆలోచనలు, దొరగారికి?" పార్వతి నవ్వు; రాజుకు నచ్చని నవ్వు.
    కారణం లేకుండా పకపక మని నవ్వుతుంది. గొప్ప కోసమా? ఎప్పుడు వచ్చిందసలు?
    ఆమె వేషం వైపు చూశాడు. ఉహు! తక్కువ లో తక్కువ అయినా మారలేదు. ఇన్నాళ్ళూ లేని అహంభావం అధికారం ఇప్పుడూ విరగాబడ్డాయి మేమూ ఉన్నామంటూ. ఛీ! ఇల్లాంటి స్త్రీతో ఏమిటి, జీవితం? -- తనకు ఇష్టం లేదని తెలుసు కదా? కనీసం తన కోసమైనా వేషంలో మార్పు చేసుకో కూడదూ? పొడవైన జుత్తు రెండు జడలుగా వేసుకున్న మాత్రాన ఏం ఆకర్షణ కలిగింది, ఈవిడ లో? ఈమె గారు ఊహించుకున్న అందంలో పదవ వంతు కూడా కుదరలేదని తెలియదు కాబోలు. ఈ లిప్ స్టిక్ లు, బాక్ లెస్ జాకెట్లు, హైహీల్స్ ఏ మగవాడు భారిస్తాడో అని నవ్వుకునేవాడు, నిన్న మొన్నటి దాకా. ఇప్పుడు 'మొగుడు' తనే అయ్యాడు.
    "నీ అర్ధాంగి నయ్యాను కదా? మనసులో విషయాలిక నాతొ చెప్పినా ఫరవాలేదు." కిలకిలా నవ్వుతూ అంది, ఆ నవ్వే కొంప తీస్తున్నదని తెలియక.
    "చెప్పవలసినవి ఏనాడో చెప్పాను. ఇంకేం ఉంటాయి? ఉన్నవేవో నీకు తెలిసినవే!" పట్టు తేర లాటి గగనం వైపు చూపి టిప్పు కున్నాడు రాజు. గొంతు లోనే కోపాన్ని అణచడానికి ప్రయత్నం జరుగుతున్నది.
    "ఆ గదిలోకి పద, బావా! నీకోసమని మీ అమ్మ అతి శ్రమతో కాచి పంపిన పాలు చల్లారి పోతున్నాయి."
    "అందులో కొంచెం విషం కలిపి తీసుకురా. లేకపోతె నువ్వు తాగు." రాజు సమాధానం.
    పార్వతి అవలించింది. "మనం కడుపు నిండా పాలారగించే వచ్చాము." సందేహించ కుండా చెప్పింది.
    రాజు లేచి గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. అతని పరధ్యానం చూస్తూ పార్వతి అనుసరించి వచ్చి పక్కనే కూర్చుంది. అతనేమీ అనలేదు. విద్యుద్దీపాల కాంతి లో పార్వతి వేషం రాజుకు వెగటు కలిగించింది.
    పెదవులు తిప్పుతూ. "నువ్విలాంటి ముఖం పెట్టి కూర్చుంటావని నాకు ముందే తెలుసు , బావా!" అన్నది. తర్వాత మెల్లగా రాజు చేయి తన చేతుల్లోకి తీసుకో బోయింది, అతన్ని గమనిస్తూనే. చెంప దెబ్బ కొట్టినట్లయింది ఒక్కసారిగా. విదిలించి కొట్టాడు.
    అంత తీవ్రంగా ప్రవర్తిస్తాడను కోలేదు పార్వతి. చిన్న బుచ్చుకుని వెంటనే ఏమనాలో తెలియక ముఖం మాడ్చుకుంది.
    ఈలోగా మరొకసారి ఆమె అహం బాగా దెబ్బతింది.
    "దయచేసి నన్ను ముట్టుకోకు, పార్వతీ! ఎందుకో, ఎవరైనా తాకితే కారం పూస్తున్నట్లు ఉంటున్నది. మీ ఊరి నీటి ,మహిమేమో!" మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తున్న అతని ముఖ కవళికలు గుర్తించిన పార్వతి ఆవేశంతో ఉక్కిరిబిక్కిరయింది.
    పగ పెంచుకునే వాళ్ళ మధ్య పచ్చగడ్డి భగ్గు మనక మానదు.
    పార్వతి అంది: "నీ మండే మనస్తత్వానికి ఊళ్ళ నూ, మనుషులనూ ఆడి పోసుకోవడం లో అర్ధం లేదు."
    "పార్వతీ!" అరిచాడు రాజు.
    "మరేం అనాలి, బావా? నేనెంత అభిమానంతో దగ్గరికి వచ్చినా రెచ్చ గోడుతున్నావు నన్ను. ఏం చెయ్యను?"
    "నీ సంగతి నాకు వేరే చెప్ప నవసరం లేదు. మాటల్లోనే నీ అభిమానం, అభినయాల్లో నే........"
    "ఎలా అనుకున్నావు? ఈ సూటి పోటీ మాటలేమిటి?"
    "అదంతా వదులు. నామీద నిజంగా అభిమానం ఉంటె ఆ వేషం అంతా తీసి పారేసి సాధారణ స్త్రీ లాగ తయారుకా. అప్పుడు ఉన్నంత లో మర్యాదగా చూడగలను."
    "ఊ! మంచి పన్నాగం పన్నావే? నువ్వు చెప్పినట్లల్లా చెయ్యడానికి నేను సనాతన చారాలతో మగ్గే పురాతన స్త్రీ ని కాను. అధునాతన యువతినని నువ్వు గుర్తుంచు కోవాలి. ఈనాటి మగువలు మగవాళ్ళ తో సమాన హక్కులు కలవాళ్ళు. మగవాడివని నువ్వాడించి నట్లల్లా  ఆడటానికి నేనేం తోలు బొమ్మను కాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS