"ఆ మాట నిజమే! నాకు అంత అదృష్టం ఉండద్దూ? ఊ సరే గాని, పారూ, అసలు సంగతి చెప్పు. నిన్ను చేసుకోవడం ఇష్టం లేదని రాజేప్పుడైనా నీతో చెప్పాడా?"
"ఖచ్చితంగా చెప్పాడు-- నేనంటే విసుగనీ, తనకు నచ్చననీ కూడా."
"అలాగా?" అంది సరోజ, ఎడమచేతి వేళ్ళను లెక్కించుకుంటూ.
కొంచెసేపు మౌనం అనంతరం "నీకు అతనంటే ఇష్టమేనా?' అని అడిగింది సరోజ.
"ఊ" అంది పార్వతి, ఏ భావమూ వ్యక్త పరచకుండా.
"ప్రేమిస్తున్నావేమిటి?" సరోజ ప్రశ్న.
"ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు. అతనంటే ఇష్టం మాత్రం ఉంది. ముఖ్యంగా అతన్ని పెళ్లి చేసుకుని ఎలా అయినా లొంగ దియ్యాలనే పంతం ఉంది" అంది పార్వతి, సరోజ ఎటువంటి అభిప్రాయం వెల్లడి చేస్తుందో అని చూస్తూ.
"ఇల్లాంటి విషయాల్లో పంతం ఉండకూడదేమోనే?" అంది సరోజ.
"ఏమో కాని, ఏదైనా అందమైన వస్తువును చూచి అది మనదైతే బాగుంటుందనుకోవడం లో తప్పులేదుగా? అది ఇక మనది కాబోదని రూడి అయిపోయినప్పుడు చింతించడం లో తప్పు ఉంది అనుకుంటాను. అన్నింటి కంటే అతని పెంకితనానికి శిక్ష వెయ్యాలని ఉంది........"
"అదంత సులువైన పని కాదు. అతను మగవాడు. నువ్వు ఆడదానివి. తలుచుకుంటే అతనేమైనా చెయ్యగలడు. నువ్వు చేయలేవు."
"ఎందుకు చెయ్యలేను?" పార్వతి కి కోపం వచ్చింది.
"లాభం లేదు, పార్వతీ, పౌరుషం తెచ్చుకుంటే లాభం లేదు. కార్యం సాధించు కుంటే సాధించుకో."
కొంతసేపు ఆగి, పార్వతి అంది: "సరూ! నిన్నోకటి అడుగుతాను చెబుతావా?"
"ఏమిటి?" కుతూహలంగా చూచింది సరోజ.
"నువ్వు రాజును ప్రేమిస్తున్నావా? నా దగ్గర దాచకుండా చెప్పు." కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది.
సరోజ సన్నగా నవ్వుతూ, "ఇంతవరకు స్కాల్ సెల్ తో శరీరాలను కోయ్యటమే గానీ, జీవితాలను ఉత్తరించటం అలవాటు కాలేదు" అంది.
పార్వతి ఆ మాట పట్టించుకోకుండా సరోజ ను చూస్తూ "ఒకవేళ బావ నీ దగ్గరికి వచ్చి, నిన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేనంటాడనుకో-- అప్పుడు ఏమని చెబుతావు? అతని మాట పూర్తిగా కొట్టి పారేయ్యలేవు కదా? ఎలా పరిష్కరించు కుంటావు?" అన్నది.
"నువ్వే చెప్పు , ఏం చెయ్యాలో." సరోజ చూపుడు వేలితో పేజీలు తిప్పుతూ అంది.
"ఉ. హు. నన్ను చెప్పమనడం కాదు, అతను గనక అలా నిన్ను కోరితే ఆ సంగతి నాకు తెలియజెయ్యి. అదే నువ్వు నిర్వర్తించవలసిన అవసరమైన పని."
సరోజ ఆశ్చర్య పడినట్ల యింది." మీ బావని నేను పెళ్లి చేసుకోవాలన్నట్లు మాట్లాడుతున్నా వేమిటి? మా స్నేహం లో అటువంటి భావ ప్రదర్శన ఎప్పుడైనా కనిపించిందేమిటి నీకు?"
సరోజ ఎటు వైపూ దృష్టి లేకుండానే ఆలోచిస్తుండగా పార్వతి అంది: "రాజు నిన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నట్లున్నాడు."
సమాధానం రాలేదు. దేనినో గుర్తించాలన్నట్లు సరోజ వదనాన్నే అవలోకిస్తున్న పార్వతి కి ఏ భావమూ చిక్కలేదు.
ఒక్క క్షణం తర్వాత సరోజ తగ్గిన ఉత్సాహంతో నిట్టూర్చింది. "పారూ! చిన్నప్పుడు లేడి పిల్లల్లా , లేగ దూడల్లా గెంతే రోజుల్లో ఇటువంటి సమస్యలు, సంకోచాలు, వాంఛలు మున్ముందు రాబోతాయని ఊహించము. ఆ పసి మనసులకి తెలియదు. అందుకే జీవితాన్ని ఇంకా ఎక్కువగా అభిలాషిస్తాయి. అప్పుడు మనం భ్రమించే సుఖం, తర్వాత శూన్యమే."
పార్వతి కి ఆ వేదాంతం అంతు పట్టలేదు. మాటల్లోనే చిన్నప్పటి ఆటపాటల స్నేహస్మృతుల్లోకి తీసుకు పోయింది ఆ అమ్మాయిని సరోజ.
12
"పద్మా!
ఇక్కడికి నేను వచ్చిన తరువాత ప్రయత్నం ఏవిధంగా ఫలో న్ముఖం అవుతుందో అది అంతా కధలా నీకు వ్రాయాలని నువ్వు ఆజ్ఞాపించి నందుకు సరిపోయినట్లు కధలాగే జరిగింది. కధను నాటకంగా మార్చి ప్రదర్శించ వచ్చు కూడా. ఆశించింది కరగలేదు.
నేననుకున్నట్లే ఇక్కడికి వచ్చిన వెంటనే పెళ్లి ప్రయత్నాలకు నడుం బిగించబోయారు అందరూ. కానీ దురదృష్టవ శాత్తు ముహూర్తాలు రెండు నెలల వరకు సరయినవి కుదరలేదు. అంతవరకూ ఆగక తప్పదన్నారు పురోహోతులు. అంతా నా అదృష్ట బలం అనుకున్నాను, దురదృష్టానికి జానెడు దూరం లోనే ఉన్నానని తెలియక. సరోజ దగ్గర నిస్సందేహంగా , సవ్యంగా నా ఉద్దేశాలను బహిరంగ పరచడానికి , చర్చించి , వాదించి ఎలాగో అపరిష్కృత సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడానికి చాలా వ్యవధి దొరికిందని ఆనందపడ్డాను.
కానీ గీత సరిగ్గా లేకపోతె ఏ ప్రయత్నం ఫలించధనుకో , పద్మా! సరోజ మునపటి లా లేదు. ఎందుకనో నాతొ మామూలుగా ఉన్నట్లు ఉంటూనే , నవ్వుతూ , నవ్విస్తూనే -- తీరా నా మనసులో అగ్ని పర్వత శిఖరాగ్రం లా మండిపోయే ఆలోచన సారాంశాన్ని చెప్పేటందుకు ఉరకలు వేస్తున్నప్పుడు చక్కగా తప్పించుకునేది. ఆ నేర్పు చూస్తె పార్వతి ఏమైనా గొడవ పెట్టిందేమో అని అనుమానం వేసింది.
మిగతా అవకాశాలను పార్వతి చెడ గొట్టేది.
ఒకనాడు నానుంచి తప్పించుకు పారిపోలేక పోయింది సరోజ.
"సరూ! నేనంటే నీకేతువంటి అభిప్రాయం ఉంది?' అని అడిగాను. అలా అడగటం నా అలవాటు.
"ఏముంది? స్నేహితుడివి" అంది నిర్మొహమాటంగా.
నిగ్రహించుకొని, "నేనంటే ప్రత్యేకమైన ఇష్టమేమీ లేదా?' అన్నాను ఇంచుమించు తగ్గింపు స్వరంతో , డానికి సమాధానం విను.
"ఉంది. లేకేం? పార్వతీ, నువ్వు ప్రత్యేకమైన అభిమాన స్థానాన్ని ఆక్రమించుకున్నారు నా హృదయం లో."
"పార్వతి ని చేర్చకు, ఇక్కడ. నేనంటే ఇష్టమా, కాదా? అది చెప్పు" అన్నాను నిర్భందిస్తూన్నట్లు.
"చెప్పానుగా -- నీ ఒక్కడి గురించే నా ఉద్దేశాన్ని గ్రహించడం లో కారణ మేమిటో?' అంది ఆశ్చర్యపోతూ.
"కారణం చేబుయాను కానీ......' అంటూ ఎలా ఆమెకు చెప్పాలో అర్ధం కాక చాలాసేపు మాట్లాడకుండా ఉండిపోయాను.
విన్న తర్వాత ----అసలే ఆడది, ఎంతెంత మాట లనేస్తుందో అని కంగారు ఒక వైపు. ఆఖరికి తెగించాను. "సరూ! ఆ ఇష్టాన్ని ప్రేమలోకి మార్చలేవా?" అన్నాను.
అనుకున్నంతా అయింది. గబుక్కున లేచి, "నేను వెళ్తాను." అంది.
నేను ఊరుకోలేదు. "నా సమస్యలు ఆందోళన లు తీరే దాకా నిన్ను విడిచి పెట్టేది లేదు. అలా కాదంటే మీ ఇంటికే వస్తాను. పార్వతి నీ దగ్గరున్న సరే, ఈ ప్రసక్తి తేకుండా మానను." చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి బెదిరించినట్టు అన్నాను.
భయపడిందని చెప్పలేను కానీ, ముఖం కోపంగా పెట్టుకొని కూర్చుంది. అదంతా పై నటన అని నాకు తెలుసు.
"సరూ, ఇన్నాళ్ళూ నీకు చెప్పలేదు. నువ్వుగా కోరేదాకా చెప్పకూడదనుకున్నాను. ఇప్పుడు సమయం మించింది. నా కోసమనే నేను కోరుతున్నా నిప్పుడు. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను , సరోజా!' అనేశానోయ్! ఆ మాట అన్నప్పుడు ప్రపంచమే గడగడ లాడిపోతున్నట్ల నిపించింది నాకు. తర్వాత ఆమె నవ్వు చూశాక ధైర్యం వచ్చింది.
"ఏ మొహం పెట్టుకు ప్రేమించావు. నన్ను?' అంది నవ్వుతూనే.
"ఏం ? నా మొహని కేం?" అన్నాను.
"చంద్రబింబం లా ఉంది కదూ?' అంది. "నేను నిన్ను ప్రేమించాలాంటావా?' అని ప్రశ్నించింది మళ్ళీ , ఆలోచిస్తూ.
"అందుకు ఇప్పుడా లోచిస్తున్నావా?" అన్నాను, ఆమె తత్వానికి విస్తుపోతూ.
"అబ్బే! జరగదు. పార్వతి ఏమనుకుంటుంది, నేను నిన్ను ప్రేమిస్తే?' అంది.
ఆమె హాస్య ధోరణి ని వినిపించుకోకుండా నేను ఖండితంగా అనేశాను. "ఇక్కడ ఎవరూ ఎవరినీ అనుకోవడంతో పని లేదు. నాకోసం నువ్వు త్యాగం చెయ్య గలిగితే మనకొక మార్గం ఉంది." అన్నాను.
"ఏమిటది?" అంది, కళ్ళల్లోకి చూస్తూ.
నేనూ, ఆమెను చూస్తూ "చెప్పనా?' అన్నాను, గుండెలు ఆగిపోయే స్థితిలో.
"ఇద్దరం లేచి పోదాం, పద!" అన్నాను ఎలాగో.
నేను చెప్పబోయేది ఊహిస్తూన్నదేమో పకపకా నవ్వడం మొదలు పెట్టింది. నవ్వడమే కాదు. "ఏమన్నారు , రాజు వారు? లేచిపోవాలా? కావాలంటే ఈ ఊళ్ళో నే రిజిస్టర్ మారేజీ చేసుకోవచ్చుగా?
"రాజూ! నాకు లేచి పోవడమన్నా భయం లేదు. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకోవడమూ భయం లేదు. పార్వతి నిన్ను వివాహం చేసుకోవడానికి విముఖురాలై ఉంటె నీ గురించి ఆలోచింఛి ఉందును. కానీ పార్వతి ఈ పెళ్ళికి మహోత్సాహం చూపిస్తుంది, ఎందుచేతనో . ఆ వివరాలు నాకు తెలియవు. ఇంతకూ చెప్పేది -- నేనా అమ్మాయికి ద్రోహం చెయ్యలేను. ముఖ్యంగా ప్రాణాలను ఒకరి నుండి ఒకరం మార్చుకున్నంతటి స్నేహం మధ్య అగాధం తవ్వలేను. దీన్ని "గోప్పత్యాగం' అని వెక్కిరిస్తావో, 'నటన' అని ఏవగించు కుంటావో -- ఏమైనా సరే. ఎప్పుడో పుస్తకాల్లో చదివాను -- స్నేహితులకు ద్రోహం చేస్తే ఆ పాపం మురికి కూపం లోకి తోస్తుందని. అమ్మ బాబోయ్! తగని భయం నాకు. ఏమైనా అను" అని ఇలాగే నవ్విస్తూనే ఖరా ఖండి గా నాతొ వాదించింది, పద్మ చరణ్! నేను పొడిగా చెబుతున్నాను గానీ, ఆమె గారు పెద్ద కవిత్వ ధోరణి లోనే మాట్లాడిందోయ్! పార్వతి ప్రసక్తి వచ్చినప్పుడు మరీ ఎక్కువగా!
"పార్వతి ని నువ్వెందుకు కాదంటూన్నావో నాకు తెలియడం లేదు" అంది హటాత్తుగా.
నాకేం చెప్పాలో తోచలేదు. ఏమందామన్నా ఆమె గారు ఈమె గారి ప్రియ స్నేహితురాలు అనే సంగతి చరాలున గుర్తు వస్తున్నది.
మళ్ళీ ప్రారంభించింది.
"ఆ వినీల నయనాలు, నీ రూపం ప్రతి బింబించ గల నీలపు చెక్కిళ్ళు, మేఘ శకలం లో దాగిన అర్ధ శశిబింబం లాంటి నుదురు........" అంటూ ఏవో చెబుతుండగానే ఆపాను. సరోజ పార్వతి ని అలా పోగిదినప్పుడంతా నాలో వ్యక్తీకరించ లేని ఉద్రేకం పొంగుతుంది. నన్ను సరూ అర్ధం చేసుకోవడం లేదన్న ఆవేదన కూడా పొర్లుతుంది. అందుకే తగ్గిపోయి ఊరుకోలేదు నేను.
