Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 14

 

    నవ్వుతూ మరకతం వెళ్ళిపోయింది.
    వెన్నెలతో కూర్చుని స్వర్ణా , ఇందిరా , శేఖర్ కబుర్లు చెప్పుకొంటున్నారు.
    ఇంతలోనే హాస్టల్ వాచ్ మన్ పరుగెత్తుకొచ్చాడు.
    "అమ్మా! డాక్టరమ్మ గారు వెళ్ళిపోయారా? మంగళమ్మ కేమో అయిందమ్మా! ఎట్లెట్లనో చేస్తున్నది! ఏమో తాగిందంటున్నారు!" అన్నాడు ఆయాసంగా.
    గాభరా పడుతూ లేచింది ఇందిర.
    "అదేమిటి, వాచ్ మన్! నాలుగు గంటలప్పుడు బాగానే ఉందే? వాళ్ళ నాన్నగారు వచ్చినట్లున్నారు. మాట్లాడుతూ కనిపించింది. ఇంతలోనే ఏమయింది? డాక్టరమ్మ ఇప్పుడే వెళ్ళిపోయారు. పదపద! హాస్టల్ కు వెడదాం" అన్నది గబగబా అడుగు ముందుకు వేస్తూ.
    "ఉండమ్మా, ఇందిరా! నేనూ వస్తాను. ఆడపిల్లల హాస్టల్ కు రావచ్చా? అయినా, ఎమర్జన్సీ కేస్ అయినప్పుడు రూల్స్ , రేగ్యూలేషన్లూ పాటించరులే! అగు!" అంటూ , లోపలి నుండి మెడికల్ కిట్ తీసుకొని ఇందిర వెంట బయలుదేరాడు శేఖర్.
    పరుగులు పెట్టినట్లు హాస్టల్ కి  చేరారు. మంగళ రూములో మేట్రస్ , కొంతమంది , అమ్మాయిలూ బిక్క ముఖాలతో ఉన్నారు.
    ఇందిరను చూస్తూనే మెట్రాస్-- "రండి, ఇందిరా , చూశారా, ఈ పిల్ల ఎంత పని చేసుందో!" అన్నది.
    శేఖర్ గబగబా వచ్చి , ఆ పిల్ల నాడి చూసి నోరూ , పొట్టా పరీక్షించాడు.
    "ఈ అమ్మాయి తలిదండ్రులుకు వైరిచ్చితే మంచిది. అమ్మాయి స్థితి ప్రమాదమే. ఈ మందులు తెమ్మని సుధేష్ణ గారికి వెంటనే ఫోన్ చేయండి" అన్నాడు శేఖర్, పరిస్థితి ని తన అదుపులోకి తీసుకుంటూ.
    వంట అయ్యర్ దగ్గరి నుండి పరుగులు పెట్టారు, పనులు చెయ్యటానికి.
    ఇరవై నిమిషాల్లో సుధేష్ణ వచ్చింది. ఆత్రంగా-- "ఎట్లా ఉంది, శేఖర్ గారూ!' అని అడిగింది.
    "మే బి హోప్ లెస్!' అన్నాడు శేఖర్.
    రోగిని పరీక్షించింది సుధేష్ణ.
    "డూ దే నో దట్ ది గర్ల్ ఈజ్ ప్రెగ్నెంట్?" అని అడిగాడు శేఖర్.
    సుధేష్ణ ముఖంలో విపరీతమైన దిగులు కనిపించింది.
    "ప్రెగ్నెంట్ ' అన్న మాటకు అర్ధం తెలిసిన మెట్రస్ పిల్లలూ తెల్లబోయారు.
    "ఏమిటండీ, ఇందిరా! డాక్టర్ గారు చెబుతున్నది. వింటున్నారా? ఆ పిల్ల ప్రవర్తన బాగాలేదని మనసంతా అనుకొంటూన్నాముగా? ఇంతలోనే కొంప ముంచుకొందా ఏమిటి?' కంగారుగా అడిగింది మేట్రస్ .
    "తక్షణమే హాస్పిటల్ కు నాతొ పంపండి." అన్నది సుధేష్ణ.
    ఇంతలోనే -- "ఏమయిందమ్మా , నా బిడ్డకు?" అని కంగారు పడుతూ మంగళ తండ్రి వచ్చాడు.
    వంట అయ్యర్ ఎందుకయినా మంచిదని, ఊళ్ళో లాడ్జింగ్ ఉన్న అన్ని హోటళ్ళకూ ఫోన్ చేశాడు, మంగళ తండ్రి కోసం. అదృష్టవశాత్తూ ఊళ్ళోనే ఉన్నాడు.
    మంచం మీద అపస్మారక స్థితిలో ఉన్న కూతురిని చూడగానే మతి పోయినట్లయింది ఆయనకు.
    "ఏం జరిగింది నా తల్లికి? సాయంత్రమెగా నాతొ మాట్లాడింది! ఇంతలోనే ఎందుకిట్లా జరిగింది ?" అన్నాడు ఆక్రోశంతో.
    శేఖర్ అతని ముఖాన్ని పరీక్షగా చూసి, "మీ అమ్మాయి గర్బవతి . బహుశా అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకొని ఉంటుంది!" అన్నాడు.
    "నాన్సెన్స్ ! నా పిల్ల అలాంటిది కాదు!" అన్నాడు మంగళ తండ్రి. అయితే, మాటల్లో అంత నమ్మకం ధ్వనించలేదు.
    హాస్పిటల్లో డాక్టర్లు చేయకలిగినంతా చేశారు కాని, తెల్లవారుజామున మంగళ చనిపోయింది.
    కూతురి శవం మీద పడి ఏడుస్తున్న మంగళ తండ్రిని చూసి శేఖర్ -- "నాయుడు గారూ! 'నేమిసిన్' అన్నమాట విన్నారూ? ప్రతీకారం అన్నమాట! అనటానికి ఇది సమయం కాదు గాని, ఇంతకంటే సమయం చిక్కదు నాకు. మీరు సుకన్యను చంపితే, ఇంకొకరు మీ అమ్మాయిని చంపారు. నేను శేఖర్ ని -- గుర్తు పట్టారో, లేదో! ఇప్పటికి మీకు జ్ఞానోదయ మయిందనుకొంటాను. తండ్రి చేసిన పాపానికి మీఅమ్మాయి శిక్ష అనుభవించింది! భగవంతుడున్నాడన్న నమ్మకం ఇప్పుడు పూర్తిగా కలిగింది నాకు!" అన్నాడు.
    నిశ్చేష్టుడై నిలబడ్డాడు నాయుడు.

                                     
    శేఖర్ ఇల్లు అధునాతనంగా ఉంది.
    ఉన్న డబ్బును ఎట్లా సద్వినియోగం చెయ్యాలో శేఖర్ కు బాగా తెలిసినట్లుంది. ముద్దు లోలికే బంగళా. పూలతోట మధ్యన ఉంది. వెన్నెలలో చూస్తె పూల పడవ లాగా ఉంది.
    తోటలో రకరకాల పూల చెట్లు.
    అన్నిటి కన్న మరకతాన్ని ఆకర్షించిన విశేషమింకొకటి.
    బంగళా వెనకగా తోటలో చిన్న మందిరం ఉంది. మందిరం అంటే నాలుగు స్తంభాలూ , వాటి పైన గోపురం లాగా కట్టడం . ముందు రెండు స్తంభాలకూ సన్నజాజి తీగా, వెనక స్తంభాలకు నీలి శంఖుపూల తీగా అల్లించారు. వాన వచ్చినప్పుడు జల్లు పడకుండా నాలుగు వైపులా చాపలు పైకి చుట్టి ఉంచారు.
    మందిరం మధ్యన ఎత్తైన అరుగు, దాని మీద కమల పీఠం, కమలం మధ్యన శ్రీ వేంకటేశ్వరుని దివ్య విగ్రహం! పాలరాతి శిల్పం! శిల్పానికి కుడి వైపున సరస్వతి, ఎడమ వైపున లక్ష్మీ విగ్రహాలు ఉన్నాయి.
    పీఠానికి దిగువగా -- "శ్రీ వేంకటేశ చరణే శరణం ప్రపద్యే!" అని వ్రాయబడి ఉన్నది.
    మందిరానికి చేరి ఒక వైపునా పారిజాతం చెట్లు.
    ప్రశాంత సంధ్యా సమయంలో, బంగారు సూర్య కిరణాలు తెల్లని పాలరాతి విగ్రహం పై పడి మెరుస్తూన్నప్పుడు , చూచినవారి జన్మ తరించేటట్లుగా ఉంది ఆ విగ్రహం!
    ఎంత నాస్తికుడైనా , ఆ నిమిషాన ఆస్తికుడిగా మారుతాడు!
    రాత్రి వేళ , రంగు రంగుల విద్యుద్దీపాలతో మెరిసి పోతున్న ఆ విగ్రహం మనస్సులను యిట్టె దొంగిలిస్తుంది.
    మరకతం ఎక్కువ కాలం విగ్రహం దగ్గరే గడుపు తున్నది.
    శేఖర్ తో -- "అన్నా! తిరుమల మీద నిత్యం భక్తుల రాకతో, కేకలతో విసుగెత్తి , వెంకటేశ్వర స్వామి ప్రశాంతంగా ఉన్న ఈ మందిరంలో విశ్రాంతి తీసుకొంటున్నాడు! అందుకే స్వామి ముఖంలో ఆ హసరేఖ! సంతృప్తి రేఖ!" అని అన్నది.
    ఆ మాటలకు శేఖర్ భార్య భారతి ఎంతో సంతోషించింది. "ఎంత చక్కగా చెప్పావమ్మా!" అని మరకతాన్ని మెచ్చుకోంది.
    "డబ్బు ఉండగానే సరికాదన్నా! దానిని సరిగ్గా అనుభవించే యోగ్యతా కూడా ఉండాలి. మా రాజన్న ఊరు పల్లెటూరు. అందులో కొంతమంది ధనికుల ఇండ్లను చూశాను. ఒట్టి చీకటి కొంపలు! ఇంటి లోపల అడుగు పెడుతూనే పేడ వాసనలు స్వాగతం పలుకుతాయి. ఇంటికి తీరూ తెన్నూ ఉండదు. బాత్ రూమ్ పరమ చండాలంగా ఉంటుంది. శుభ్రంగా ఇళ్ళు కట్టుకోవాలని వాళ్ళకి తోచదు. ఇంక వీధులు సరేసరి! సన్నగా, మురికిగా ఉంటాయి. ఇండ్లలో నుండి మురికి నీరు వీధుల్లోకి జీవ వాహినిలాగా ప్రవహిస్తూ ఉంటుంది! దారికి ఇరు వైపులా పిల్లలు అసహ్యం చేస్తారు. వాన వచ్చిందంటే ఒకటే దుర్వాసన! పల్లెటూళ్ళు దేశానికి వెన్నె ముకలు అని ఉపన్యాసాలు చెప్పడం తప్ప, వాటిని మార్చడానికి ఏం ప్రయత్నాలు  జరుగుతున్నాయి? ఒక బావి తవ్వించి, పాకీ దొడ్డి కట్టి, నాలుగు లైట్లు వెయ్యగానే పల్లె టూళ్ళు బాగుపడి పోతాయా? ఏం చూసి ఈ పల్లెటూళ్ళ ను ఇష్టపడాలి?" అన్నది మరకతం.
    "చెడును అసహ్యించుకొని, మంచిని ప్రేమించు, అది చాలు" అన్నాడు శేఖర్ నవ్వుతూ.
    శేఖర్ కూతురు శైలజ అప్పుడే బడి నుండి వచ్చింది. పుస్తకాల సంచీ పక్కగా పెట్టి, మరకతాన్ని రెండు చేతులతో చుట్టి, "అత్తా! ఈ వేళ మనం ఎక్కడికి వేడదామూ?' అని ముద్దుగా అడిగింది.
    శైల ముఖంలో స్వర్ణ పోలికలు కొట్టవచ్చినట్లు కనిపించుతున్నవి.
    'అన్నా! శైలు ముఖంలో మేనత్త పోలికలు చాలా ఉన్నాయి. స్వర్ణ అంత అదృష్టవంతురాలవుతుందిలే!" అన్నది మరకతం , శైలును ముద్దు పెట్టుకుంటూ.
    భారతీ, శేఖర్ ల ముఖం మీద విషాద రేఖ మబ్బుల్లాగా కదలాడింది.
    క్షణం సేపే అయినా, మరకతం చురుకయిన కళ్ళు ఇదంతా గమనించాయి. లోలోపల ఆశ్చర్య పడింది మరకతం.
    "ఈ వేళ షికారుకు 'జూ' కి పోదాము!' అంటూ పాపతో తోటలోకి పోయింది మరకతం
        
                                              *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS