"ఎందుకలా నన్ను హింసిస్తారు?" అంది తులసి.
"ఏమో మరి. నీ బుద్ది ఎప్పుడెలా మారుతుందో ఎవరు చెప్పగలరు. తీరా ఆయనింటి కొచ్చాక నువ్వే మైనా తలతిక్కవేషాలు వేస్తే మాత్రం పరిస్థితులు చాలా విషమిస్తాయి. ముందే చెబుతున్నాను" అన్నాడు సీతాపతి.
తులసికి ఏడుపాగలేదు.
సీతాపతి నెమ్మదిగా తులసి వద్దకు వచ్చి, తలమీద చెయ్యేసి నిమురుతూ, "ఊరుకో, తులసీ" అన్నాడు.
అతడు చేయి బుజంమీదికి పోనిచ్చి, దగ్గిరగా తీసుకుని, "తులసీ, నువ్వు నన్నపార్దం చేసుకోకు. కాని నీ ప్రవర్తన నాకు నిజంగా నచ్చలేదు. ఎవరితో ఎలా మెలగాలో నాకు తెలుసు. నువ్వు నన్నే విధంగా అవమానించినా నేనేమీ అనుకోను. కాని నాన్న ఉన్నప్పుడు కూడా నిన్నటి నీ ప్రవర్తన మళ్ళీ కనిపించిందంటే, ఇంతకన్నా తీవ్రంగా ఉండాల్సొస్తుంది" అన్నాడు.
తులసికి భర్త సాన్నిహిత్యంలోని మాధుర్యం మాయమైంది.
"మరి, మీరు చేసిన పనేమిటి?" అని అడగాలనుకుంది.
కాని ఇప్పుడదంతా తిరగేస్తే ఎలా? అసలు సంగతి- పాప.
"పాప మధ్యాహ్నం వెళ్ళింది. ఎక్కడికో నాకు చెప్పలేదు. భయంగా ఉంది" అంది తులసి.
"సాయంత్రం నా వద్ద కొచ్చింది. పిల్ల బెదిరి పోయింది" అన్నాడు సీతాపతి.
తులసికి నోట మాట రాలేదు.
"నువ్వలా చెయ్యటం నాకు నచ్చలేదు, తులసీ. నువ్వెంత ఘోరమైనా చేస్తావు. ఎందర్నైనా హింసిస్తావు. నీ యిష్టం వచ్చినట్టల్లా ప్రవర్తిస్తావు. వ్యవహారం చేతులు దాటితే సుఖంగా ఏడుస్తావు. ఏడుపుతో సాదించాలనుకుంటావు గదూ. పాప ఎలా ఉందో చూశావా? నువ్వామెను రమ్మని, రాసి పిలిపించుకుని, ఇప్పుడిలా నోటికొచ్చినట్టల్లా తిట్టి వెళ్ళగొడతావా? పాప అసలు మళ్ళీ ఇంటికే రానన్నది" అన్నాడు సీతాపతి.
"నే నంతగా ఏం తిట్టాను?" అంది తులసి.
"ఏమో, నాకేం తెలుసు. ఐనా నువ్వేమైనా తిట్టగలవు. నీ నోటికి హద్దేముంది. నువ్వేమీ అనందే ఆ పిల్ల అలా హైరానా పడిపోతుందా? పొరబాటు చేసినవాళ్ళను క్షమించటం నేర్చుకో. బాధితులను ఊరడించు. నిన్నటి నీ అనుమానాలతోనే సగం చచ్చిపోయి ఉంటే, ఇంకా అలా హింసిస్తావా పాపను!" అన్నాడు సీతాపతి.
"పోనీ, నేను ఛస్తే మీ అందరికీ సుఖంగా ఉంటుందేమో చెప్పండి. నన్ను ఊపిరి పీల్చుకోనివ్వటం లేదు. నే నేమన్నా ఆ మాట మీకు పది అర్ధాలతో వినిపిస్తుంది. నా బాధ ఎవ్వరూ పట్టించుకోరు. నేనే చస్తాను లెండి. మీరు సుఖంగా ఉండండి" అంది తులసి.
సీతాపతి విసుగ్గా లేచాడు.
"చావు అంత సులభం కాదు, తులసీ. నన్ను భయపెట్ట ప్రయత్నించకు. బ్రతికి ఉండగానే మనుషులు మారాలి. ఆ పిల్లను ఒప్పించి సాయంత్రం ఇంటికి రమ్మన్నాను. రానంటే రానన్నది. వాళ్ళ ఫ్రెండ్సు ఎవరో ఉన్నారట, వెడతానన్నది. దగ్గిర డబ్బుకూడా లేదట. పర్సులో ఒక్క రూపాయకూడా ఉండకపోతే ఎలా ఉంటుందో నీకూ తెలుసనుకుంటాను" అన్నాడు సీతాపతి.
"రక్షించారు. ఎలాగో దాన్ని ఇంటికి రప్పించారు. అంతేచాలు" అంది తులసి. కాని అప్పుడే తనలో ఏదో అస్వస్థత వ్యాపిస్తున్నట్టుంది. నీరసం వచ్చేస్తున్నది. ఆగకుండా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ప్రాణం దిగాలు పడిపోయింది. మాట తడబడుతున్నది. గొంతు గద్గదమైంది.
ఆవల తలుపు తట్టారు.
వెళ్ళి తలుపు తీసింది తులసి.
పాప నిలబడి ఉంది.
"పాపా, రా" అంది ఉద్రేకంగా, చేతులు చాచి.
"పక్కకు తొలగు. అంత ప్రేమ నా కక్కర్లేదు. బావ రమ్మన్నాడు గనక వచ్చాను. ఈ రెండు రాత్రులూ ఎలాగో గడిపితే తరవాత నా బ్రతుకు నేను చూసుకుంటాను" అంది పాప కర్కశంగా.
తులసికి అసలు విషయం ఏమిటో అర్ధం కాలేదు.
12
"ఎందుకమ్మా, అలా మాట్లాడుతున్నావు, నా మీద అంత కోపమెందుకే, పాపా?" అంది తులసి ప్రాధేయపడుతూ.
"నన్నలా విసిగిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను. వెళ్ళమంటావా?" అంది పాప.
తులసికి ఈ విపరీతం మనసును పట్టలేదు. పాప ఏ ధైర్యంతో తనను ఇలా భయపెడుతున్నదో అర్ధం కాలేదు. నెమ్మదిగా, "పోనీ, అన్నం తిందుగాని పద" అంది.
"నా కొద్దు తినేసే వచ్చాను" అంది పాప.
పాప లోపలికి వెళ్ళి పడుకుంది. తులసి అన్నీ గమనించిందే కాని నోరు మెదపటానికి ధైర్యం చాల్లేదు. భర్తకూడా కలగజేసుకోవటం లేదేం? పాప అతడివైపే చూడలేదు.
"మీరు లేవండి భోజనానికి" అంది.
సీతాపతి వచ్చి తిని వెళ్తాడు. తులసికి తినాలని లేదు. అయినా అదె కంచంలో నాలుగు మెతుకులు కతికి లేచింది. లోపలినుంచి దుఃఖం, బాధ పొర్లు కొస్తున్నాయి. ఏం లాభం, ఇంకిదింతే. ఉద్రేకపడి ప్రయోజనం లేదు. జరిగేదేదో జరగనీ, కనీసం తండ్రి వచ్చేస్తే తనకు ఈ బాధ్యత తీరుతుంది.
వంటింట్లో పని పూర్తి చేసుకుని వచ్చింది. సీతాపతి రేడియో వద్ద కూర్చున్నాడు. తను చూస్తూనే ఉంది, పాప నిద్రపోలేదు. నిద్రపోయినట్టుగానే కదలకుండా పడుకుంది. అప్పుడప్పుడూ ఉమ్మి మింగిన శబ్దం మాత్రం తప్పలేదు.
వద్దనుకుంటూనే, "పాపా, పాలుగాని తాగుతావా?" అంది.
పాప మాట్లాడకుండా అటువైపు తిరిగి పడుకుంది.
లైటు ఆర్పేసి భర్తవద్దకు వచ్చింది తులసి.
"ఇదేమిటో, నాకేమీ పాలుపోవటం లేదు" అంది. సీతాపతి పలకలేదు. కాసేపు ఉండి, "రేపు నేను ఆఫీసుకెళ్ళాలి" అన్నాడు.
"అదేం, రేపు ఆదివారంగా" అంది తులసి.
"ఔననుకో. పనుంది. కొంచెం పొద్దున్నే వెళ్ళాలి" అన్నాడు.
"నాకేం తోచటం లేదు" అంది తులసి మళ్ళీ.
"మీ నాన్నను రమ్మని రాయకపొయ్యావా" అన్నాడు సీతాపతి.
"రాశాను. అది వాళ్ళ కెప్పుడు చేరుతుందో, వాళ్ళెప్పుడు వస్తారో ఏమిటో, నాకంతా అయోమయంగా ఉంది" అంది తులసి.
"అలా ఊరికే గాభరాపడితే ఏమొస్తుంది? కథను అందరూ కొంతమంది నడిపిస్తుంటారు. ఎప్పుడూ పరిస్థితులు నీ ఇష్టప్రకారమే రావుగా" అన్నాడు సీతాపతి.
అదా తనకు సాంత్వన?
* * *
ఉదయం ఎనిమిదింటికే సీతాపతి ఆఫీసుకి వెళ్ళిపోయాడు. అంత క్రితంరోజునించీ గోవిందరావు ఇంటికి రాలేదు. పాప ఏడింటికే లేచి, పనులు ముగించుకుని, తులసి కొంచెం ఆగి వెళ్ళమన్నా వినకుండా తనకు పనుందని వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చేసింది. తన గుడ్డలు సర్దుకోవటం ప్రారంభించింది. తులసి అడక్కుండానే, "నాకు శైలజా పట్టాభిరామన్ గారు ఉద్యోగమిచ్చారు. నాకు వేరే వసతి దొరికిందాకా వాళ్ళింట్లోనే ఉండమన్నది కూడా" అంది పాప.
తులసి కేమీ అంతుపట్టలేదు.
పాపే మళ్ళీ, "హిమాయత్ నగర్ లో 'నృత్యవాటి' అనే డాన్సు స్కూలు ఉంది. దాని డైరెక్టు రావిడ. ఇన్నాళ్ళూ ఆవిడ దగ్గిరున్న స్టెనోటైపిస్టు 'డెలివరీ'కి వెడుతున్నదట. ఆ వేకెన్సీలో నాకు ఉద్యోగమిప్పించారు గోవిందరావుగారు" అంది ఉత్సాహంగా.
"ఏమో, పాపా, నీ సంగతేమీ నాకు అర్ధం కావటం లేదు. నేను చెబితే నువ్వు వినవనుకో. కానీ కనీసం నాన్నగారు వచ్చిందాకానైనా ఓపికపట్టు. ఆ తరవాత నువ్వేం చేసుకున్నా నా కభ్యంతరం లేదు" అంది తులసి.
"నేను అంత తగని పనేం చెయ్యటం లేదు. దీనికి నాన్నగారి అనుమతికోసం నిరీక్షించవలసిన అవసరమూ లేదు. నువ్వు నాకు గార్డియన్నను కుంటున్నావే గాని, ఈ సంగతి బావకుకూడా తెలుసు. బావా, గోవిందరావుగారూ ప్రయత్నిస్తేనే ఇది దొరికింది" అంది పాప.
తులసికి గుండెఆగినంత పనైంది. ఒళ్ళు మరిచే కోపంకూడా వచ్చింది.
"మరి అప్పుడే ఎలా వెడతావు? అన్నింటికీ తెగించినదానివి, నువ్వు బాగానే వెడతావు. చిన్నా, పెద్దా లేకుండా నోటికొచ్చినట్టల్లా మాట్లాడటం, చెయ్యటం నీ కలవాటే. కాని నా బాధ్యతలు నాకు ఉన్నాయి. మీ బావ రానీ. ఆయన్నే అడుగుతాను. ఆ పెద్దమనిషి ఎలా నీకు ఉద్యోగం చూశాడో, ఇంకా పద్దెనిమిదేళ్ళు నిండని నీకు ఎవరు ఉద్యోగమిచ్చారో, ఎవరి దగ్గర ఉంటావో అన్నీ అడగాలి మరి. తేల్చుకోవాలి. నువ్వు వెడతాననగానే ముగిసే విషయం కాదిది" అంది తులసి.
"నే నిప్పుడే వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఆపుతావా?" అంది పాప ఛాలెంజి చేస్తూ.
తులసికి నాలిక తడారింది.
"నేను వెడుతున్నాను" అంది పాప.
"వద్దు, పాపా, ఆగు. మీ బావ వచ్చిందాకా ఆగు. నా మీద దయ ఉంటే కనీసం నాన్నగారు వచ్చిందాకా ఆగు. ఆ తర్వాత నువ్వేం చేసినా నీ ఇష్టం.
"నిన్నిలాగే వెళ్ళనిస్తే నలుగురూ నా మొహాన్న ఉమ్మేస్తారు, తెలుసా నిన్నిక్కడకు రప్పించుకోవటమే నేను చేసిన నేరం. దానికి నన్నిలా శిక్షిస్తున్నావా?" అంది తులసి.
పాప అక్కడే ఈజీ ఛెయిర్ లో వాలింది.
"సరే, బావ వచ్చిందాకా ఉంటాను. ఆయనే నీకు నచ్చచెబుతాడులే" అంది.
అరగంటకూడా గడవలేదు. అలా ఒకరి మొహాలొకరు చూసుకుంటూ, మాట్లాడలేకుండా ఎంతసేపు కూర్చో గలరో తెలియలేదు. పాప అప్పుడే కుర్చీలో మసలు తూంది.
"ఎంతసేపిలా కూర్చునేది? ఎప్పుడొస్తాడో ఆ మహాశయుడు. పోనీ, అతడు వచ్చింతర్వాత నీకు అంతా విశదంగా చెబుతాడు గాని, నన్ను వెళ్ళనీ" అంది పాప.
తులసి మాట్లాడకపోవటంతో, "ఏమంటావక్కా?" అంది పాప మళ్ళీ.
పాప గొంతులోని పెంకితనం తులసికి కన్నీళ్లు తెప్పించింది.
తలెత్తి ఓ సారి చెల్లెలివైపు చూసింది కాని గొంతు పెగల్లేదు. పాప కళ్ళార్పకుండా చూసింది తులసి వైపు జవాబుగా.
"నన్నేం చెప్పమంటావు, పాపా అన్నివిధాలా నా నోరు మూయటానికే చేస్తున్నావు. నేనే మంటానిప్పుడు" అంది తులసి. ఆమెలోని ఆగని కన్నీళ్ళు మాట్లాడనివ్వలేదు.
"ప్రతి మాటకూ నువ్వలా ఏడుస్తుంటే, నా కిక్కడ కూర్చోవటమే అసహ్యంగా ఉంది" అంది పాప విసుగ్గా మళ్ళీ కూర్చుంటూ.
నాలుగింటికి సీతాపతి వచ్చాడు.
తులసి స్టౌ వెలిగించింది. పాప కూర్చున్న కుర్చీ పక్కనే ఉన్న సంచీ అదీ సీతాపతి గమనించకపోలేదు. కాని అదేమీ పట్టించుకోనట్టుగా, ఏదో పత్రిక తిరగేశాడు.
"అడగవేం, అక్కా, ఏదో అడుగుతానన్నావుగా" అంది పాప.
తులసి పాపవైపైనా చూడలేదు.
"నువ్వైనా మాట్లాడవేం, బావా నే నప్పుడే వెళ్ళిపోతానంటే అక్క ఏడ్చి, గోలపెట్టి నువ్వొచ్చిందాకా కూర్చోమంది. నా కెలా ఉద్యోగం వచ్చిందో, నే నెక్కడ ఉంటానో అన్నీ నువ్వామెకు తీరికగా చెప్పు" అంది పాప.
