'ఎందుకు ' అర్ధం కాలేదు ప్రభాకరానికి.
'నీతో ఏదో చెప్పి తీరా యిక్కడికి వచ్చాక నిన్ను దగా చేసినట్లున్నాను.'
'అదేం లేదు.'
ప్రభాకరం మనసు అద్దం లాంటిది. సర్దుకుపోయే తత్వాన్ని అతనికి పుట్టుక తోటే యిచ్చాడు దేవుడు.
రైలు ముందుకు పోతోంది. శ్రీనివాస్ మెదడులో వొకే వొక రూపం రంగులు మారుతూ కూర్చుంది చెల్లి, అమ్మ, పిన్ని కొత్త నేస్తం రాజేశ్వరి.
* * * *
'మీరు తండ్రి కాబోతున్నారనే వార్త మీకు యెలా వుంది?' జగదీశ్ ని నిండుగా 'యావండీ' అంటుంటే మనసు దూది పింజలా సంతోషంతో గాలిలోకి తెలిపోతుంటుంది. అతని వొడిలో తలవుంచు కుని నవ్వింది. సుభద్ర అసలే అందంగా అపురూపంగా వుండే సుభద్ర ని యీ సమయంలో మరీ మరీ చూడాలని పిస్తోంది. ఆ పెదవిని జగదీశ్ మరి మాట్లాడ నివ్వలేదు! ఈ అందం యెంతటిదో నీకు యెలా చెప్పను? నేను అదృష్ట వంతుడిని సుభద్రా!' ఆ కౌగిలిలో కరిగి పోతోంది మంచు గడ్డలా. నేను మీ డాన్ని. సరస్వతి ని భగవంతుడు చిన్న చూపు చూశాడు. నేను శ్రీనివాస్ మొహం చూడలేను. నన్ను యెక్కడి కైనా తీసుకు వెళ్ళండి. మనం పెళ్లి చేసుకుందాం.'
జగదీశ్ కళ్ళు ఎర్ర బడ్డాయి. రెండేసి చారలతోటి.
'పెళ్లి...పెళ్లి ..పెళ్లి. అది లేకుండా బ్రతకలేమా మనం?'
'అది సంఘానికి సంబంధించిన వ్యవస్థ . మనం పెళ్లి చేసుకోవాలి.'
'నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు.'
'యిప్పుడా,' ఆశ్చర్యంగా అంది: 'ఇంత జరిగాక యిప్పుడు ఆలోచిస్తారా? నన్ను యెందుకు యిలా చేశారు?'
జగదీశ్ అనునయంగా అన్నాడు : 'మనం హైదరాబాదు వెళ్ళిపోదాం. పెళ్లి అనగానే చాలా చిక్కులు వస్తాయి. నాన్న చిల్లి గవ్వ యివ్వరు. ఆస్తి అంతా యే శరణాలయానికో యిచ్చేస్తారు. మనం అప్పుడు బికారుల్లా .........' చలి జ్వరం వచ్చిన దానిలా వణికిపోయింది సుభద్రా: 'ఒద్దు నాకు గుర్తు చేయకండి. ఆ సంగతి నేను భరించలేను.' ఆరోజులు జ్ఞాపకం తెచ్చుకుంటుంటే కుడితి లో పడ్డ మిడతలా విలవిల లాడిపోతోంది . అందమైన సుభద్ర మోహం క్షణం లో నీలి మేఘాలు క్రమ్ముకుని నిర్వేదావస్థలో కొట్టుకు పోతోంది. అయినా ఏదో చైతన్యం కదిలిస్తూ, వూపేస్తూ సుభద్ర అంతరంగం లోంచి బయలుదేరి మెదడు గుండా వ్యాపించి పిచ్చి డాన్ని చేస్తున్నాయి.
'అన్నంలోకి ఏముంది పిన్నీ .' సరస్వతి అడిగింది.
'ఏముంటుంది. వట్టి అన్నం వండిందుకే హైరానా పడిపోయెను. ఆ జగదీశ్ యివ్వబట్టి.
'మళ్ళి అతన్ని అడిగావా పిన్ని.'
'ఏం, నాకు కడుపులో కాళ్ళు పెట్టి పడుకోవటం సుతరామూ యిష్టం లేదు. నాకు అవసరం లేదు యీ పరువూ ప్రతిష్టా నా కడుపు మండుతుంటే నేను నోట్లో వేలేసుకుని కూర్చోలేను. నాలుగిల్లు బిక్షం యెత్తి అయినా...!'
'అన్ని మాట లెందుకు పిన్ని. లేదు లేదు అనే పదం వొకటికి రెండుసార్లు వింటుంటే నాకు చావాలని పిస్తోంది.
అనారోగ్యంతో చచ్చిపోతూ వుంటే యీ పాడు బ్రతుకులో ఆ మాటలు నన్ను చిత్ర వధ చేస్తున్నాయి.'
సుభద్ర కి కోపం రాలేదు. జాలితో నిండిపోయింది ఆవిడ మనసంతా. జలజలా రాలిపోతున్న నీళ్ళని చటుక్కున తుడుచుకుంది.
'నీకు యింత అభిమానం వుంటుందని అనుకోలేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. అలాగే చేస్తాను.'
'మనం యెవరి దయా బిక్ష లోనూ వుండడ్డు పిన్నీ. ఆ జగదీశ్ ని నువ్వింక కలుసుకోకు. నీకు మనసులో యేదైనా వుంటే చెప్పు. నేను సహాయం చేసిందుకు ప్రయత్నం చేస్తాను.'
సుభద్ర మొహం నవ్వుని పులుముకుంది.
'ఏం రోగిష్టి సరస్వతి ఏవీ చేయలేదనా పిన్నీ.'
'వుహూ ,' సుభద్ర సిగ్గుతో కుదించుకు పోయింది.
'మరి?'
'జగదీశ్ తో నేను గడిపిన క్షణాలు యెలా మరిచిపోను? నేను పాపిష్టి డాన్ని....నా మనసు చపలత్వానికి లొంగిపోయి నట్టేట కలిసిపోయింది. అయినా తప్పదు. నేను అతనితో వుండి పోవాలి. నాకు జీవితంలో యేమేమో ఆశలు లేవు. ఒకటికి రెండు సార్లు తప్పు చేసి నేను కులట ని కాకూడదు.' సుభద్ర స్వగతంగా అనుకుంది.
'పోన్లే పిన్నీ... యేవీ అనను నిన్ను. నీ కెలా నచ్చితే అలాగే చెయ్యి.' సరస్వతి అనేసి నిశ్శబ్దం గా తలగడ లోకి మొహం దూర్చి పడుకుంది.
యెన్నో ఉపవాసాలూ, మరెన్నో గడ్డు రోజులూ దొర్లించిన సుభద్ర ఆరోజుల్ని జీవితంలో మరచి పోలేదు. ఉన్నట్టుండి కడుపులో గిరగిరా తిరిగే జగదీశ్ ప్రతిబింబాన్ని తను మిధ్యా వాదిని చేయలేక పోతోంది.
'సరే మీ యిష్టం మీతోనే వుంచుకోండి నన్ను చాలు నాకీ జీవితం. జగదీశ్ గుండెల మీద వాలిపోయింది సుభద్ర. ఆ తరువాత రెండు మూడు వారాలకే సరస్వతి కాలగర్భం లో కలిసిపోతే జగదీశ్ హైదరాబాదు బయలుదేరాడు సుభద్ర తో.
7
గోదావరి కి కొంచెం దూరంలో వున్న అతని రూమ్ లోంచి స్పష్టంగా రేవు అంతా కనిపిస్తుంది. ప్రతిరోజూ ఆ రేవు వైపు దూరాన తెరచాపల నెత్తి వెళ్ళే పడవలు, బారులు తీర్చి ఆకాశం లోకి రివ్వున ఎగిరి పోయే కొంగల్లా , చిరిగిపోయిన తెల్లని కాగితం ముక్కలు పైపైకి పోతున్నట్లు కనిపిస్తాయి . 'జర' మానిపిస్తూ కదిలిపోయే లాంచీల వేపు చూడడం అతనికి చాలా యిష్టం. శ్రీనివాస్ కి కర్తవ్యం తెలీడం లేదు. ఎటైనా వెళ్ళిపోయి నిశ్చలంగా , ప్రశాంతంగా గడిపేయాలని వుంది. కానీ' మనసులో లేని ప్రశాంతి బయట పుట్టుకు వస్తుందేవిటి శ్రీనివాస్. నీకున్న అత్మీయుల్లో కలిసిపో. కొంతైనా వుపశమనం కనిపిస్తుంది.' ప్రభాకరం ప్రతి నిమిషం అంటి పెట్టుకుని హెచ్చరిస్తూనే వున్నాడు.
'ఎన్నాళ్ళ కి వచ్చావురా ?' అన్నపూర్ణ వొళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రీనివాస్ ని ఆదరంగా పిలిచింది.
అవధాని గారు నిదానంగా చూసి అన్నారు. 'ఏవిటో శ్రీనివాస్ ని గురించి అంతా విన్నాను. బాధపడటం తప్ప నాలాంటి వాళ్ళు ఏం చెయ్యగలరు? కొందరికి అదృష్టం పుట్టుకతోటే వస్తుంది. మనలాంటి వాళ్లకి అది యెలా వుంటుందో కూడా తెలీదు.'
నేలమీద గీతలు గీస్తుండి పోయాడు శ్రీనివాస్....కొంచెం ఆగి 'అన్నం పెడితే తినాలని వచ్చాను పిన్నీ.' అన్నాడు.
అవధాని గారు పంక్తి లోనే కూర్చున్నారు. 'ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు.'
"చేసేందుకు యేముంది బాబాయ్. రాజమండ్రి వచ్చాను. అన్నీ పోగొట్టుకున్నాను. ఏకాకి నై పోయాను. ఎలా బ్రతకాలో , ఏం చేయాలో తెలీడం లేదు. అసలు యీ వూరి మీదే మహా చికాకుగా వుంది.'
'అయితే ఆప్తుల్ని వదులుకొని వెళ్ళిపోతా వుట్రా' అన్నపూర్ణ కి దుఃఖం ఆగింది కాదు.
'మరేం చేయను పిన్నీ' శ్రీనివాస్ కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. అతనికి యింత మహా ప్రపంచం లో వొంటరిగా వుండిపోవడం , అసరాగా అదుకుందుకు ఎవరూ లేకపోవడం గొంతులో అగ్ని పర్వతాలు దొర్లి పోతున్నట్టు గానే వుంది. అయినా అతనికి ఏదో ఆశ 'పిన్ని కనిపిస్తుంది. జగదీశ్ ని పిన్నినీ ఒక్కటి చేసి నిలబెట్టాలి, ఆవిడ జీవితం ' అని.
'నేను రేపే వెళ్లి పోతున్నాను పిన్నీ '
'ఎక్కడికిరా?'
'వరంగల్'
'అక్కడేవరున్నారు ?' యిద్దరూ ఒక్కసారే అడిగారు.
'నిన్ననే అపాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చింది. స్కూల్లో చేరాలి నేను.'
'వుద్యోగం దొరికిందన్న మాట. చెప్పావు కాదు యింతసేపూ.'
'మంచిరోజులు వస్తున్నట్లున్నాయి శ్రీనివాస్ ' అవధాని గారి మొహం లో వెలుగు రేఖలు వోక్కుమ్మడిగా మెర్క్యురీ లైట్ల లా వెలిగిపోతున్నాయి.
'పెంచుకున్ననాడు బిడ్డడు కాదంటారు. నిన్ను పెంచుకోలేదు కానీ నువ్వు వస్తుంటే యిక్కడే వుండి పోతావను కున్నాను. కానీ యిలా ' అన్నపూర్ణ గొంతులోంచి మాటలు మరి పైకి రాలేదు.
'శుభమా అని వాడు వెడుతుంటే మనం యిలా అడ్డుకోవడం బాగులేదు అన్నూ. వెళ్లి రానీ. ఎక్కడికి వెడతాడు. మనవాడోయ్ వాడు. ఎక్కడున్నా మనం వాడికి కాకపోము అయిన వాళ్ళం.'
యింత దృడంగా ఏం చూసి అనుకుంటున్నారు? శ్రీనివాస్ బిత్తర పోయాడు. అతను ఏదో అనాలనుకుని మరి మాట్లాడలేదు.
శ్రీనివాస్ అడుగు వేస్తుంటే కనుమరుగు అయ్యేవరకూ చూస్తుండి పోయారు పిచ్చి దంపతులు. అయిన వాళ్ళకి దూరంగా, చుట్టలనే రాబందులకి అతీతంగా వచ్చేసిన అవధాని గారికి శ్రీనివాస్ వెళ్లి పోవడం గొడ్డలి పెట్టు అయింది. అతను వొంగి కాళ్ళకి నమస్కారం చేస్తుంటే అన్నపూర్ణ అన్నీ మరిచిపోయి గట్టిగా గుండెలకి అడుముకుని ఆ జుట్టులోకి వ్రేళ్ళు పోనిచ్చి చూస్తుండి పోయింది. అయోమయంగా. అతను కొంచెం దూరంగా జరుగుతే వూహ చెదరిపోయి తన నుంచి కర్మ దూరం చేస్తున్నందుకు తపించి పోయింది. ఆ ఘడియ తనకు రాకూదదన్నట్లు గా గుండెల్ని అదిమి పట్టుకుంది. అయినా తప్పలేదు కాలచక్రానికి ఒక చుట్టూ గిర్రున తిరిగి ఆ వూహ చెరిపేసే వంతు.
ప్రభాకరం నవ్వుతూ వీడ్కోలు యిచ్చాడు. 'చెల్లాయి వల్ల పరిచయం అయ్యావు. నువ్వు మనిషిని అవుతే అంతేచాలు. ఏదో నిన్ను వోదారుస్తూన్నానే గానీ నాకు తెలుసు నీ స్థితి ఏవిటో. నిన్ను మభ్య పెట్టాలనే భ్రమలో నాలో నేనే సంఘర్షణలో పడి పోయే వాడిని. నిన్ను సమర్ధించ లేను నేను. ఆ సంగతి గ్రహించాను ఎప్పుడైనా ఈ నేస్తం గుర్తుకు వస్తే తప్పకుండా రా.'
శ్రీనివాస్ తదేకంగా చూశాడు. చాలాసేపు. యెంతో సేపటికి నెమ్మదిగా తల వాల్చేసి అడిగాడు. 'చూడు ప్రభాకరం. నాకే యింత కష్టంగా వుంది. నీకు బాధగా అనిపించలేదా ఆ యింట్లో.'

పేలవంగా నవ్వాడు ప్రభాకరం. 'అలవాటు అయిపొయింది. మగపిల్లడిని కనుక అప్పుడు వుద్రేకం లో పారిపోయాను. రాజేశ్వరి లాంటిది యిటువంటి వాటికి తట్టుకోలేక పోవచ్చును బహుశా.'
'భగవంతుడు అటువంటి పరిస్థితుల్లో గుండెల్లో తాళ్ళు పడేస్తాడు.'
'అడగ కూడదు కానీ మీ అమ్మ యేవీ అనరా.'
'కొన్ని కొన్ని బంధాలు ప్రేమలను సునాయసంగా ఏం వస్తాయి. అప్పుడు కొడుకూ, కూతురూ యిలాటి వి గుర్తుకు రావు.'
'రాజేశ్వరి కి కూడా....'
'అవును. అమ్మ కఠినంగా నే చూస్తుంది. అలా చూడకపోతే అతను వూరుకోడు , అదీ చదువుకుంది. ఈ సంవత్సరం గట్టెక్కి దాని త్రోవన అది పడుతుంది.
'ఎప్పుడైనా రాజమండ్రి వస్తే తప్పకుండా రా. నీకోసం నువ్వు నాకు వదిలేసిన ఈ రూమ్ లోనే ఎదురు చూస్తుంటాను .'
