"రుజువేం లేదు నా దగ్గిర. కానీ ఇందిరకు నేనంటే ఇష్టం లేదంటే మాత్రం నేను నమ్మను. అంతేకాక, వాళ్ళక్క ని పెళ్లి చేసుకోనందుకు ఇందిర మూర్ఖంగా నన్ను శిక్షించదలుచు కుంటుందని నేననుకోను."
"మిమ్మల్ని అవమానపరచానని నాకు రాసింది ఇందిర. మరి దాని కేమంటారు?"
"నన్నా? అవమాన పరచడమెందుకూ?" భ్రుకుటి ముడివేసి అడిగాడు మాధవరావు. జోగీందర్ సమాధానం చెప్పలేదు.
రెండు నిమిషాల సేపు ఇద్దరూ అలాగే కూర్చున్నారు. తనముందు చల్లారిపోయిన కాఫీని ఒక్క గుక్క లో తాగి, సిగరెట్టు వెలిగించాడు మాధవరావు.
"ఇందిర చాలా తెలివి తక్కువగా వ్యవహరిస్తుందని నేనంటే మీరు నమ్ముతారా?" మాధవరావు నిట్టురుస్తూ అన్నాడు.
"తప్పకుండానూ. మొదటి నించీ ఆమె విపరీతంగా ఆలోచిస్తున్నదనే నాకూ అనిపించింది. కానీ దాని వెనక ఉన్న సత్యం నాకు కొంచెం అర్ధం అయిందనుకుంటాను." చిరునవ్వు నవ్వాడు జోగీ.
ఆశగా అతని వంక చూస్తూ "మీరు ఇందిర నెందుకు హెచ్చరించ లేదు?' అన్నాడు మాధవరావు.
జోగీ జవాబివ్వకుండా కాలిపోయిన సిగరెట్టు ని ఆష్ ట్రేలో నలిపి వేశాడు.
ఇంతకాలం లోనూ మొదటిసారిగా మాధవరావు ఇందిర ఎంత అబలో గ్రహించాడు. తన చుట్టూతాను అల్లుకున్న ఊహల జాలం లో నించి ఇందిర బయట పడలేదు. ఇందిర తిరిగి వచ్చాక తను ఆమెకు అండగా నిలిచి, నెమ్మదిగా సున్నితంగా ఆమెను ఆ వలలో నించి తప్పించి తనవేపు తిప్పుకుంటాడు.
బేరరు కి సైగ చేసి బిల్లు తెమ్మన్నాడు మాధవరావు. అతని ముఖ కవళికలను జాగ్రట్టాగా పరిశీలిస్తున్నాడు జోగీ. బిల్లు చెల్లించి, అతని వంక చూస్తూ మాధవరావు అన్నాడు.
"ఇందిర అంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందని అంటే నమ్మ బుద్ది వేయటం లేదు. కానీ నమ్మక తప్పదల్లె ఉంది మీ మాటలు విన్నాక."
మాధవరావు లేచాడు. అతన్ని చూసి కొద్దిగా భుజాలెగరేసి లిప్త లో జోగీ కూడా లేచాడు.
"మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు. పరిచయం లేకపోయినా, మీరు ఓపికతో విని నాకెన్నో సంగతులు చెప్పారు. మన పరిచయం స్నేహంగా మారుతుందని ఆశిస్తున్నాను." మాధవరావు హృదయపూర్వకంగా అన్నాడు.
"మీతో పరిచయం నాకూ ఆనందదాయకమే. ఇందిర నాకు ఆప్తురాలు. మీకూ ఆమె అంటే అనురాగం ఉంది. కాబట్టే ఆమెను గురించి మీతో చర్చించగలిగాను. మనం కలిసిన విషయం రాస్తాను. మీ ఇద్దరికీ కూడా ఈ మానసికమైన అశాంతి తొందరలోనే తోలిగిపోవాలని కోరుకుంటున్నాను."
"కృతజ్ఞుడ్ని."
జోగీ స్కూటరెక్కి స్టార్టు చేశాడు.
'అన్నట్టు, అడగడం మరిచిపోయాను. ఇందిర ఎప్పుడు వస్తున్నదో మీకు తెలుసా?' అరిచాడు.
"బహుశా తిరిగి రాదను కుంటాను." స్కూటరు చప్పుడు మీద నించి వచ్చింది జోగి గొంతు.
నిర్ఘాంత పోయి నుంచున్న మాధవరావు ను పేవ్ మెంటు మీద వదిలేసి జోగీందర్ వెళ్ళిపోయాడు తన దోవను.
ఇంటికి వెళ్ళిన జోగీ ఇందిర కు ఉత్తరం రాశాడు వెంటనే. రాజధాని విశేషాలన్నీ రాశాక, చివరన "నీ మాధవరావు ను కలిశాను ఇవాళ సాయంత్రం. నీ గురించి మాట్లాడుకున్నాం. మనిషి ఏదో బాధ పడుతున్నాడల్లె ఉంది. నీ తిరస్కర బాణం మరీ లోతుగా గుచ్చుకున్నట్టుంది." అని రాసి పూర్తీ చేశాడు. తన లౌఖ్యానికి తనే అభినందించుకుంటూ ఉత్తరం పోస్టు చేశాడు.
* * * *
మాధవరావు కు రాత్రంతా నిద్ర లేదు. ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందీ ఇందిర అన్న ఆలోచనే అతన్ని పీడిస్తుంది. కేవలం తన అక్కని చేసుకోలేదన్న కోపంతో తన ప్రేమని నిరాకరించడం తెలివైన వాళ్ళు చేసే పని కాదు కదా. ఇందిర నిజంగా తిరిగి రాకపోతే? ఎలా? ఈ కొద్ది నెలల్లోనే ఇందిర తనకు కావాలని తెలుసుకున్నాడు. గత కొద్ది రోజులుగా ఇందిర లేని జీవితం తన కక్కర లేదని కూడా తెలిసిపోయింది. అలాంటప్పుడు ఇందిర ను తనెలా వదులుకో గలడూ? కానీ ఆమెను దక్కించుకునే సాధనం మాత్రం ఏదీ? ఇందిరకు ఉత్తరం రాస్తే? ఔను, తనని మాట్లాడనివ్వ లేదు గానీ, ఉత్తరం ఆసాంతం చదవ వచ్చును. తన కధ పూర్తిగా విన్నాక కూడా ఆమెలో మార్పు లేకపోతె, తన కర్మ అనుకుంటాడు.
అప్పటికప్పుడే రజాయి కింద వెచ్చగా పడుకుని, తెల్లవారే ఆమెకు తను రాయబోయే ఉత్తరానికీ చిత్తు ప్రతి మనసులోనే తయారు చేయడం మొదలు పెట్టాడు.
"ప్రేమించడమంటే ఏమిటో నేను నీ దగ్గిరే నేర్చుకున్నాను, ఇందిరా. నీ సాంగత్యం లోనే నేను మనిషిగా, మగవాడిగా ప్రవర్తించ గలిగాను. నిన్ను చూసేదాకా ప్రేమించడమంటే నాకు తెలియదు. సన్నగా నాజూగ్గా, గాజు బొమ్మలా ఉండే నిన్ను చూశాక, నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలనీ, హృదయంలో భద్రంగా దాచుకోవాలనీ, అనిపించింది. నీ ప్రేమలో నన్ను నేను తెలుసుకునేసరికి, నువ్వు నన్ను ఇంత నిర్దయగా తృనీకరిస్తేఎలాగ, ప్రాణ ప్రియ? నీకు నిజంగా నేనంటే ఇష్టం లేకపోతె , ణా దురదృష్టాన్ని తలుచుకుని, విధిని నిందించే వాణ్ణి. కానీ, ఇందిరా నీకూ నాకూ కూడా నువ్వు చేస్తున్న అన్యాయాన్ని నేనెలా సహించను?
మనం కలుసుకున్నది కేవలం విడిపోవడానికే నని నాకు తెలియలేదు. ఇప్పుడు నిన్ను వదులుకుంటే , కాలం గడిస్తుంది నిజమే, కానీ , నీ జ్ఞాపకం నన్ను వదిలి పొదే!......స్వప్న సరళి లో నన్ను తప్పించుకు పోదామని ఎందుకు ప్రయత్నిస్తున్నావు , ఇందూ? ఎందుకు నన్నింత బాధపెడుతున్నావు?
గోరంతలు కొండంతలు చేసి నిన్ను నువ్వు వంచించుకుని , నన్ను కూడా వంచింపచూస్తావెందుకు? నిన్ను నువ్వు మోసం చేసుకో గలవు కానీ, ఇందిరా, నన్ను చేయలేవు. నాకు తెలుసు నీకు నాయందనురక్తి ఉందని,.
ఇందుకేనా వివాహ ప్రసక్తి తేవద్దన్నావు? ఇందులో అంత కూడని పని ఏముందని నువ్విలా ప్రవర్తిస్తున్నావు?"
అతని తలపులు ఊహలై, కలలై ఇందిర చుట్టూ పరిభ్రమించ సాగాయి.

ఇందిర ఎదురు చూసిన ఉత్తరమైతే వచ్చింది కానీ, తన పరిస్థితి ని బొత్తిగా పట్టించు కోకుండా రాశాడు జోగీ అనుకుంది. చివర మాధవరావు గురించి రాసిన రెండు పంక్తులూ ఆమెను అమితంగా కలవర పెట్టాయి. తనేం చేయగలదూ? అతను నిజంగా తనని అంతగా ప్రేమిస్తున్నాడా? మరి తానో?
ప్రేమంటే కధల్లో వాడే మాటే గానీ, జీవితాని కది వర్తించదని ఎప్పుడూ తలపోసేది ఇందిర. పెళ్లి అనేది చాలా తీవ్రమైన వ్యవహారమై నప్పుడు , దాన్ని కేవలం ప్రేమ అనబడే చంచలమైన పునాది మీద కట్టుకు రావడం తెలివి హీనం అని తలచిందామె. మరి ఇరవయిరెండేళ్ళ తన జీవితంలో గట్టిగా నమ్మిన ఈ సూత్రాన్ని ఇప్పుడు పుటుక్కున తెంచి పారేసి, ఈ ప్రేమ జాలంలో తనెలా ఇరుక్కో గలదూ? హృదయన్నవతలికి నెట్టి ఆలోచిస్తే , మాధవరావు ని మరిచి పోవడమే శ్రేయస్కరమనిపిస్తున్నది.
అతను రెండు రోజుల్లో తనని మరిచి పోగలడు. అత్తయ్య అనుకున్నట్టుగా మంజుల నిచ్చి అతనికి వివాహం చేస్తుంది. అతనూ మంజులా హాయిగా........... భరించలేని బాధతో తల విదిలించుకుని లేచింది మిగిలిన రాత్రినీ పడక కుర్చీలో కూర్చుని గడిపింది. తెల్లవారే సరికి మాధవరావు ని మనసులో నించి తుడిచెయ్యాలని, డిల్లీ తిరిగి పోరాదనీ, ఇక్కడే ఇంటి పట్టున కొద్దికాలం ఉండిపోవాలని నిర్ణయం చేసుకుంది. ఈ నిర్ణయాలు కొంతవరకూ ఇందిర మనసుని తేలిక పరిచాయి.
