ఆ తరవాత ఆదివారం ఇద్దరం కాకినాడ వెళ్లాం.మేం వెళ్లేసరికి బావ ఇంట్లోనే ఉన్నాడు. మమ్మల్ని చూసి ఆశ్చర్య పోయారు. అయన ఉంటున్నది రెండు గదుల భాగం. ఒక చిన్న డాబా ఇల్లు. మిగతా ఇల్లంతా అద్దె కిచ్చేశారు. తండ్రి వాళ్ళ స్వగ్రామం వెళ్ళారు.
"రండి రండి దారి తప్పి వచ్చినట్లున్నారే. మీ రాక వల్ల నేనుండే ఈ స్వంత ఇల్లు పావనం కాకపోయినా నన్నేదో పావనం చెయ్యటానికే వచ్చారు. కూర్చోండి కాఫీ తెప్పిస్తాను."పనిమనిషి కి ఫ్లాస్కు ఇచ్చి పంపేరు.
"ఆడదిక్కు లేని ఇల్లు. ముగ్గురం హోటల్లోనే భోజనం చేద్దాం.ఊ. ఇక చెప్పండి. ఈ ఊరు ఇద్దరికీ బదిలీ అయిందా , కలెక్టర్ ఆఫీసు కు వేశారా?"
"లేదు బావగారు . అక్కయ్య విషయమే మాట్లాడదామని వచ్చాం" అన్నాను. వారేమీ అంటీ ముట్టని అగ్రహారీకుల్లా కూర్చున్నారు.
"విషయానికేముంది. కోర్టే తేల్చాలి"
"భార్య భర్తల విషయం లో కోర్టేందుకు చెప్పండి. నాన్నగారు పోయారు కదా. అన్నయ్య సంగతీ అందరికీ తెల్సిందే. అక్కయ్య ను ఏలుకోమని ప్రార్ధించడానికి వచ్చాను. దాని బ్రతుకు బండలు చెయ్యకండి. అది మీ మీదనే ఆశ పెట్టుకుంది. వ్యవహార రీత్యా మనోవర్తికి దావా వేసినా కోర్టులో దాని అభిప్రాయం విన్నారు కదా రాజీ పడదామనే వచ్చాము. మీరు అంగీకరించాలీ పిల్లని నిచ్చుకున్న తండ్రి లా ప్రాధేయ పడుతూ అడిగాను. ఆ ప్రయత్నంగానే కళ్ళు చెమ్మగిల్లాయి. వారు పేపరు చదువుకుంటూ కూర్చున్నారు.
"చూడండి సుభాషిణి. నా అభిప్రాయాలు కూడా కోర్టు లోనే చెప్పాను. మళ్ళీ చెప్పటం చర్విత చర్వలుమే అవుతుంది. మా తమ్ముడు గారు ఎంతో అదృష్ట వంతులు. సునంద తెలివితేటలూ కూడా సుభాషిణి కే ఇచ్చాడు ఆ బ్రహ్మదేవుడు. ఏమంటారు." అన్నాడు బావ. వారు పేపరు ప్రపంచం లో నుంచే ఈ ప్రపంచం లోకి చూశారు.
"నన్నా పిలిచింది."
"పిలవలేదు. మీరు చాలా అదృష్ట వంతులని చెప్తున్నాను."
"అవునవును నా అదృష్టం మండినట్లే ఉంది."
మళ్ళీ పేపరు లో ముఖం దూర్చారు. అక్కయ్య వ్యవహారం లో వారికి జోక్యం కలుగ జేసుకోటానికి ఇష్టం లేదని గ్రహించాడు బావ.
"రాజీ మార్గం లేదంటారా" మళ్ళీ అడిగాను.
ఆ పిచ్చి దానితో, వెకిలి దానితో కాపురం చెయ్యలేను సుభాషిణి. నేను కోర్టు తీర్పునే కోరుకున్నాను గాని రాజీని కాదు"
"కోర్టు ఏదో ఒక తీర్పు నిస్తుంది కాని , న్యాయాన్ని ప్రసాదించ లేదు. అందుకనే మిమ్మల్ని వేడుకుందామని వచ్చాను. అక్కయ్య మీరనుకున్నంత తెలివి తక్కువది కాదు. నిప్పు లాంటిది."
"కావచ్చు. కాని సునంద మీద నాకు మనస్సు పోవటం లేదు. ప్రతి వారూ తమ భార్య తెలివి కలది, ప్రేమానురాగాలూ, ఆదరణా, అణుకువ గల ఆదర్శ గృహిణి గా ఉండాలని కోరుకుంటారు గాని పిచ్చిదానిలా ఉండాలని కోరుకోరు. నన్ను క్షమించు సుభాషిణి."
వ్యధిత మనస్కుడై అన్నాడు బావ. మరొక గంట సేపు కూర్చుని ఎన్నో రకాలుగా నచ్చ చెప్పటానికి ప్రయత్నించాను. కాని బావ ససేమిరా అన్నాడు. పుట్టెడు నిరాశా, నిస్పృహ నెత్తిన వేసుకుని వచ్చెను. నాకు ఎకార్టిగా వచ్చినట్లే ఉంది గాని వారికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు.
మరొక పది రోజులు గడిచాక అడిగారు. "ఏం సుభా మీ అమ్మ, అక్కయ్య సంగతి ఏం చేశావ్. ఏం అలోచించావ్. నేను కావాలో, వాళ్ళు కావాలో ఆలోచించుకో మరి."
ఈ విషయం మళ్ళీ హెచ్చరిస్తారని నాకు తెల్సు. దానికే ఒక మార్గం అన్వేషించాను.

"అంతేనంటారా."
"అంతే."
"నాకు మీరూ కావాలి. వాళ్ళూ కావాలి."
'అట్లా కుదరదు. నీ దగ్గర ఉండేది ఎవరో ఒకరే."
"అయితే నాకు మీరే కావాలి."
"వెరీ గుడ్. వాళ్ళను ఎక్కడి కయినా పంపెయ్యి.
"నాకూ మీరొక అవకాశం ఇవ్వాలి."
"ఓ యస్. అట్లాగే నీక్కావలసిన అవకాశం నీకే ఇస్తాను. కోరుకో" సిగరెట్ వెలిగించి దర్జాగా పొగ వదిలారు.
"మీకు నేను కావాలా, నా జీతం కావాలా."
"రెండూ కావాలి."
"అట్లా కాదు స్వామి ఏదో ఒకటే కోరుకోండి. ప్లీజ్. నాక్కావలసిన అవకాశం నాకే ఇచ్చానన్నారు. గడ్డం నిమురుకోసాగారు. నా కళ్ళలోకి సూటిగా చూస్తూ.
"నువ్వే కావాలి" అన్నారు.
"అయితే వాళ్ళిద్దరూ నా జీతంతో బ్రతుకుతారు. మీరొక్క పైసా వాళ్ళ కోసం ఖర్చు పెట్టనక్కర్లేదు" నవ్వుతూ చూశాను.
నెత్తి గోక్కుంటూ 'సరే, ప్రస్తుతానికి మళ్ళీ నువ్వే గెలిచావు సుభా' అన్నారు. నా ఆనందానికి ఆ సమయం లో హద్దులు లేవు.
9
రోజులు గడిచిన కొద్దీ వారికి కోపం జాస్తీ అవుతున్నది. ఎట్లాగయినా సరే అమ్మనూ, అక్కయ్య నూ వెళ్ళగోట్టాలనేదే వారి కోరిక. వీరి పద్దతి ఇట్లా ఉండే పిల్లలిద్దరూ అక్కయ్య కు పూర్తిగా మాలిమి అయ్యారు. చిన్నవాడు నిద్ర పోయేవరకూ అక్కయ్య దగ్గర పడుకున్నా నిద్రపోయాక నా దగ్గిర పడుకో బెట్టుకునేదాన్ని. పెద్దవాడు అచ్చగా అక్కయ్య దగ్గిరే పడుకునేవాడు. ఒక బాధ్యత లేని వ్యక్తిగా ఉంటంతో వాళ్ళతో తనూ చిన్న పిల్లలా మసిలేది. వాళ్ళను ఏ విషయం లోనూ కేకలేసేది కాదు.
"ఓ సంవత్సరం పాటు కాపురం చేసి దాని కడుపునా ఓ కాయ కాసినట్లయితే దాని జీవితం ఇట్లా ఉండేది కాదేమో" అని వాపోఎది అమ్మ.
పెద్దవాడు వారి వళ్ళో ఎప్పుడయినా కూచుని కబుర్లు చెప్పేవాడు. వారసలు పిల్లల్ని ఎక్కువగా దగ్గరకు పిలిచే వారె కాదు. వారు ఎప్పుడయినా నాతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటె ఆ సమయంలో మెల్లిగా తండ్రి దగ్గరికి చేరేవారు.
అంతకు వారం రోజుల క్రితమే కొత్త ఆర్.డి.ఓ గారు చార్జి తీసుకున్నారు. అయన కాస్త చండ శాసనుడు. తప్పు కనబడితే వదిలి పెట్టేవాడు కాదు. చాలా ఖచ్చితమైన వ్యక్తిత్వం కలవాడు. ఆయనంటే అందరికీ దడగానే ఉండేది. ఆయన్ను గురించీ ఆఫీసు సంగతుల్ని గురించీ యేవో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. పెద్దవాడు నెమ్మదిగా వారి దగ్గరకు చేరెడు.
ఆ ఇద్దరినీ చూస్తుంటే ఆ నాలుగేళ్ళ వాడికే వాడి లేత వయస్సు లో ఏవో ఆలోచనలు దొర్లాయి కాబోలు ఒక ప్రశ్నవేశాడు. "నాన్నా మరేమో అమ్మకి నాన్నవి నువ్వున్నావు. మరి పెద్దమ్మ కి నాన్న ఎవరూ?' అన్నాడు.
"పెద్దమ్మ కీ, అమ్మకీ ఒకరే నాన్న అంటే నీకు తాతయ్య . అయన చచ్చిపోయారు బాబూ" అన్నారు వారు.
ఈ సమాధానం వాడికి నచ్చలేదు. తల అడ్డంగా తిప్పి 'అమ్మకి నాన్నవు నువ్వూ పెద్దమ్మ కి ఎవరు? అంటున్నాను" అని మళ్ళీ అన్నాడు.
నాకూ ఇప్పుడు అర్ధమైంది.
"వాడికి భర్త అనే ముక్క రాలేదండీ. వాడి ఊహ అదే అంటే అమ్మకి భర్తవు నువ్వు, పెద్దమ్మ కు భర్త ఎవరు అని అడుగుతున్నాడు అవునా బాబూ" అన్నాను అవునన్నట్లు వాడు తల ఊపాడు.
"పెద్దమ్మ భర్త నీకు పెద్దనాన్న అవుతారు. మొన్న నేను కాకినాడ వెళ్లి రాలా. ఆ కాకినాడ లో ఉన్నారు. అక్కడ పెద్ద నాన్న గారికి ఉద్యోగం" అన్నాను. వాడికి నమ్మకం కుదిరింది.
"పెద్దమ్మ , పెద్దనాన్న బాగుంది బలే బలే' అంటూ దిగి వెళ్లి అక్కయ్య దగ్గరకు చేరాడు.
"చూశావా సుభా. పిల్లలిద్దరికీ మీ అక్కయ్య వద్ద ఎంత చనువు ఏర్పడిందో. తమను వెళ్లి పోమంటామేమోనని మీ అమ్మ ప్రోత్సాహంతో మీ అక్కయ్య ఈ నాటకం ఆడుతోంది."
వారిలో జుగుప్స, అసహ్యమూ ప్రస్పుటంగా కనిపించాయి.
"నాటకం ఆడే తెలివితేటలే అక్కయ్యకు ఉంటె భర్త ను ఎప్పుడో దక్కించుకునేది, మనింట్లో ఉండి ఇన్ని చివాట్లు తినేది కాదు."
ఈర్ష్యగా నావైపు చూశారు. క్షణం సేపు అలోచించి.
"నాటకం ఆడే తెలివితేటలు నీకున్నాయ్యి కనుకనే నీ భర్త ను నువ్వు దక్కించుకున్నావన్న మాట. నువ్వు నాకూ ఇంతవరకూ తెలీదు సుమా" అన్నారు.
నేను మాట్లాడే ప్రతీ మాటకూ ఇంత విపరీతార్ధాలు ఎందుకు తీస్తారో అర్ధం కాలేదు. అది నా ముఖార విందమెమోనని ఎంతో బాధపడ్డాను.
"నాటకం ఆడటం కాని, ఆడించటం కాని మా వంశం లోనే లేదు. కాని మీ పూర్వ జన్మపు సుకృతం కొద్దీ జీవితం లో ఎటువంటి నాటకాలయినా ఆడగల, ఆడించ గల సమర్దులే మాకు తాళి కడుతున్నారు. అనాటకాలలో వేషాలు వెయ్యటం చేతకాకపోయినా ఎట్లా చూడాలో కూడా మాకు తెలీటం లేదు. ప్రేక్షకుడుగా కూడా మేం పనికి రాలేదు."
నవ్వి ఊరుకున్నారు. నేనూ మాట్లాడలేదు. నాన్న చనిపోయి తొమ్మిది మాసాలయింది. అన్నయ్య విడుదలై వచ్చే రోజులు కూడా దగ్గిర పడుతున్నయ్యి. మనస్సు బావుండక పుట్టెడు దిగులుతో ఉన్న అమ్మఅన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి దర్శనం చేసి, సింహాచలం కూడా వెళ్లి వస్తానన్నది. చేతికి ఒక్క జత బంగారు గాజులుంటే నేను వద్దన్న కొద్దీ ఆ గాజులు అమ్మింది. రెండు వందల యాభై రూపాయలు వచ్చింది. అత్తయ్యను కూడా పంపిద్దామంటే మేం ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఈ పిల్లలిద్దర్నీ చూస్తూ అక్కయ్య ఉండలేదేమోనని ఆవిణ్ణి పంపించలేదు. మా వీధి లోనే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వెళుతుంటే వాళ్లతో అమ్మను పంపించాను. అక్కయ్య ఇంట్లోనే ఉన్నది.
అమ్మ వెళ్ళిన మూడో రోజున దగ్గరలో ఉన్న గుళ్ళో ఏదో మంచి హరికధ చెప్తున్నారంటే రాత్రి పది గంటలకు భోజనాలయాక అత్తయ్య హరికధ వింటానికి వెళ్ళారు. అక్కయ్య మధ్య గదిలో పడుకున్నది. అత్తయ్య వచ్చి తలుపు కొడితే తీద్దామని ముందు గదికీ, వీధి గుమ్మానికీ కూడా గడియ వేసి ఎవరి పక్కల మీద వాళ్ళు పడుకుని నిద్రపోయాం. పిల్లలిద్దరూ ఎప్పుడో నిద్ర పోయారు. నాకూ బాగా నిద్ర పట్టింది. నిద్రపోయాను.
ఒక రాత్రి వేళ సన్నగా 'సుభా, సుభా' అన్న పిలుపు వినబడింది. కలత నిద్ర మెళుకువ వచ్చి చూశాను. మంచం మీద వారు లేరు. ఒక్క ఉదుటున లేచి పక్క గదిలోకి వెళ్లాను. అక్కయ్య ను వారు బలాత్కారం చెయ్యబోతున్నారు. పెనుగులాడుతున్నది అక్కయ్య, మరొక్క నిమిషం లో అక్కయ్య పతనమయ్యే స్త్ఘితిలో ఉన్నది. నాకు ఆ సమయం లో ఆ కేక వినబడక పొతే వారి కోరిక తీరేది. ఆ దృశ్యం చూసేసరికి మనిషికి మించిన కోపం వచ్చింది. రౌద్ర మూర్తి నయాను. అక్కయ్య మీది నుంచి వార్ని ఒక్క నెట్టు నెట్టాను. క్రింద పడ్డారు. విభ్రాంతి తో లేచి నిల్చున్నారు. నాకింకా కోపం ఆగలేదు. వారి రెండు చెంపలు వాయించాను. వళ్ళు మండిపోతున్నది. భర్తనే విచక్షణా జ్ఞానం నశించి పోయింది. ఎవరో దుర్మార్గుడు , కామాంధుడు అక్కయ్య ను బలాత్కారిస్తున్నాడు . అవతలకు నెట్టి చెంపలు వాయించాను. ఆ పరిస్థితిలో అంతకన్నా నాకే ఆలోచనా రాలేదు. ఏమీ తెలీలేదు. భర్తను కొడుతున్నాననే స్పృహ నాకు లేదు. పరమ దుర్మార్గుడుగా నా మనస్సులో నిలిచి పోయారు.
