Previous Page Next Page 
వంశాంకురం పేజి 14

 

    "నెలవుతుంది. ఇక్కడే చదువుతున్నాను....ఆనంద్ మాటలను పొడిగించబోయాడు. ఆమె మధ్యలోనే త్రుంచి వేసింది.
    తీరికగా సాయంత్రము మాట్లాడుకుందాము. మీకు కాలేజీ టైం అవుతున్నట్టుంది." అని ఆనంద్ స్నేహితుల వంక ఒక చిరునవ్వు విసిరింది. అందరికి వడ్డించింది. అంతవరకు ఆగక వసబోసిన పిట్టల్లావాగే పెద్దమనుష్యులు తలలు వంచుకుని, తప్పు చేసినట్టు భోజనము చెయ్యసాగారు. నిజంగా సురేఖ వంట, తల్లిని గుర్తు చేసింది. ఆమె కొసరి కొసరి వడ్డించింది. భోజనాలు కాగానే తంబి అనే కుర్రవాడు అందరి విస్తర్లు తీశాడు.
    "మీరు వచ్చారని చెబితే నాన్నగారు చాలా సంతోషిస్తారు. శాస్త్రి గారు బావున్నారా?' అని అడిగింది.
    "వాడికేం? చక్కగా చదువుతున్నాడు. సాయంత్రము నాన్నగారిని కలుసుకుంటాను." ఆనంద్ అని బయటికి వచ్చాడు. స్నేహ బృందము ఒక్కసారిగా ఆనంద్ పై విరుచుకు పడ్డారు.
    "మా అత్తగారు మీకెలా తెలుసురా?"
    "గోవిందూ! అత్తగారికి అరవము తప్ప మరో భాష రాదని ఇష్టమొచ్చినట్టు అన్నాము. మళ్ళీ అనోదురా."
    "ఆ అమ్మాయి పేరు సురేఖా! బ్యూటిపుల్ నేమ్ రా." అన్నాడు విలియమ్స్.
    "అపరా నీ కామెంట్. చెప్పరా ఆనంద్. సురేఖ అను ఈ సుందరీ మణి నీ కెట్లు పరిచయము?' ఆత్రంగా అడిగాడు చక్రవర్తి. వారి కుతూహలము చూస్తుంటే ఏడ్పించాలని పించింది ఆనంద్ కు.
    'అదిగో బస్సు వస్తుంది. వివరాలన్నీ చెబుతుంటే బస్సు కాస్త దాటిపోతుంది. తరువాత చెప్తాను." తప్పించుకున్నాడు.
    "చాల్లేరా, మాకు చచ్చే కుతుహలముంటేనూ." బస్సు రావటమూ, అందరు బస్సు ఎక్కటము నిముషం లో జరిగింది. నిలబడి కబుర్లు చెప్పుకునే అవకాశము అరవ దొరలిస్తారా ? వారి మాటలు బస్సు రోద తలనొప్పి కలుగ జేస్తుంటేను, క్లాసుల లోకి వెళ్ళినా -- సరిగ్గా పని చేయలేక పోయారు. వారి మనసులో సురేఖ ను అన్న మాటలు మెదులుతున్నాయి.
    సాయంత్రము అందరూ మెరీనా బీచ్ చేరారు . యేగిరేగిరిపడే అలలను చూస్తుంటే, మైమరిచి పోవచ్చు. కాని సురేఖ వారి ముందు ప్రశ్న బాదకమై నిలిచింది. ఆనంద్ సురేఖ ను గూర్చి చెప్పబోయే లోపలే ఓ కుర్రవాడు వచ్చాడు.
    "సార్! టంగా, మంగా సుండేత్ !" ఆనంద్ కొని అందరికి యిచ్చాడు. వాటిని నములుతూ సురేఖ పరిచయమూ, సీతారామయ్య గారి ఉద్దేశము చెప్పాడు.
    "ఆ అమ్మాయి మాతో నిజము ఎందుకు చెప్పలేదురా? తెలుగురాదని ఇష్టమొచ్చినట్టు మాట్లాడినాము." బాధగా చూచాడు గోవిందు.
    "ఆ సీతారామయ్య గార్నిఇంతవరకు చూడలేదురా నేను."
    "రాత్రికి వెళ్ళి యెలా ముఖం చూపేదిరా."
    "ముగ్గురూ ముఖాన ముసుగులు వేసుకోండి."
    "పెద్ద ఫోజులు నువ్వూనూ. ఆ అమ్మాయి కేదో నచ్చ చెప్పరా."
    "ప్రయత్నిస్తాను." అభయమిచ్చాడు ఆనంద్. ఏడున్నర కు, సురేఖ ఇల్లు చేరినారు అందరూ. తంబి వేసిన విస్తళ్ళ లో అందరికి వడ్డించింది.
    "నాన్నగారూ రాలేదా?" ఆనంద్ అన్నము కలుపుతూ అడిగినాడు.
    "యెనిమిది దాటితే గాని రారండి. ఇప్పుడు బస్సు చార్జీలు అవుతాయని నడిచి వస్తారు." అన్నది. మిగిలిన ముగ్గురు అపరాదులలా తలలు వంచేశారు."
    "పచ్చడి కావాలా? చీపురు తేను లెండి." నవ్విందామె.
    "అబ్బే, పరిహాసానికి అనేవాడిని, గోవిందు తల వంచేశాడు. అందరూ భోజనాలు ముగించి, సీతారంమయ్య కొరుకు ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఆమె అన్నట్టుగానే ఎనిమిది దాటాక వచ్చాడు. ఆనంద్ ను చూచి సంతోషంతో కౌగలించుకున్నంత పని చేశాడు.
    "ఉదయమే అమ్మాయి చెప్పింది నాయనా." అన్నాడు. ఏం మాట్లాడాలో అతనికి తోచనట్టుంది. చిన్న గది అందరూ కూర్చుంటే ఇరుకుగా అనిపించింది. ఆనంద్ ను వదిలి మిగిలిన వారు అతనికి నమస్కరించి వెళ్ళిపోయారు. ఆనంద్ తాను మద్రాసు ఎందుకు వచ్చింది చెప్పాడు. అతను తన వివరాలు చెప్పబోయాడు.
    "మీరు అలసిపోయారు. భోజనము చేయండి తరువాత మాట్లాడు కుందాము." వారించాడు ఆనంద్. కూతురు కంచము తెచ్చి పెట్టింది అతని ముందు.
    "నువ్వూ కూర్చో రాదమ్మా...."
    "ఈరోజు గురువారము సాయంత్రము భోజనము చేయనని తెలియదా నాన్నా?' అతనికి వడ్డిస్తూ అడిగింది.
    "అవునులే. ఇంట్లో అధరువులు మిగలని నాడు నీకేదో పర్వదినము , పవిత్రమైనదీను." అతను బాధగా అన్నాడు. ఎందుకో ఆనంద్ కళ్ళు చెమర్చాయి. బీదరికము కూడా అంత భయంకరమైందని అతనికి తెలియనే తెలియదు. అన్నపూర్ణలా విసుగు లేక ఇంతమందికి వంట చేసిన వ్యక్తీ ఆకలితో పడుకోవడమా?"
    "మీరు భోజనము చేస్తుండండి. నేనిప్పుడే వస్తాను." ఆనంద్ లేచి బయటకు వచ్చాడు. సురేఖ తండ్రిని మృదువుగా మండలిస్తుందని తెలిసిపోయింది.
    "మన పరిస్థితి అందరికీ తెలుపాలా నాన్నా. నేను ఏది చెప్పినా కోపగించుకుంటారు."
    "పొరపాటయిందమ్మా ఆనంద్ మన వాడేగా?' ఆనంద్ కామాటలు ఎంతో నచ్చాయి. త్వరగా మైన్ రోడ్డు పైకి వచ్చాడు. పళ్ళ దుకాణం వద్ద ఆగి , బేరం చేసి అరటి పళ్ళు, బత్తాయి కాయలు కొని వెనుతిరిగాడు. సీతారామయ్య భుక్తాయాసము తీర్చుకుంటున్నాడు. కూతురు లోపల పని చేసుకుంటుంది. ఆనంద్ పళ్ళు అతని ముందుంచాడు.
    "గురువారము ఫలహారము చేయటానికేం అభ్యంతరము లేదు కదా. రమ్మనండి." తండ్రి పిలిస్తే వచ్చింది. పండ్లను చూచి ముఖము మాడ్చు కుంది.
    "క్షమించండి. మీరలా చూస్తె నేనేం చెప్పలేను. మాకందరికీ కడుపు నిండుగా సుష్టుగా భోజనము పెట్టి మీరు డొక్క వ్రేల్లాడేసుకుంటారంటే చాలా విచారము వేసింది. మీరు అన్యధా భావించరనే తెచ్చాను." ఆనంద్ ప్రాధేయ పూర్వకముగా చూచాడు.
    "పాపా! మనపై ఈపాటి ప్రేమాభిమానాలు ప్రకటించే మానవులేవరమ్మా. ఆనంద్ సహృదయుడు. అతని మనసు నొప్పించకు." అన్నాడు.
    "మీరంతా మంచివారే. మధ్య నేనేనా చెడ్డ దాన్ని...." నవ్వుతూ తండ్రికి కాస్త దూరంలో కూర్చుని బత్తాయి కాయ వలచసాగింది.
    "అన్నపూర్ణాదేవి ప్రసన్నురాలయింది . ఇక చెప్పండి మాస్టారూ.' అన్నాడానంద్.
    "మీ స్నేహితులు అత్తగారని పెట్టుకున్నారు. మరో జట్టు ఫేరింజన్ అంటారు. మీరేమో అన్నపూర్ణంటారు వద్దు బాబూ ఇన్నీ, మారు పేర్లు అన్నది.
    "సరేలే , వారికేం తెలుసు! నీ బెదిరింపులు చూచి అలా పేర్లు పెట్టారు." కొట్టి వేశారు సీతారామయ్య. "ఏం చెప్పాలి బాబూ! సరస్వతీ దేవి ప్రసన్ను రాలయినా, లక్ష్మీ దేవి చిన్నచూపు చూచింది. యెంతో ఆశతో మద్రాసు వచ్చాను. నా ఆశ నిరాశే అయినది. చిన్న చిన్న ట్యూషన్లు దొరికాయి. వాటి వల్ల వచ్చే ఆదాయము ఒక్క పూట తిండికే సరిపోదు. వసతి కావాలి, బట్టా యెన్ని ఉన్నాయి. నీవు నమ్మవు గాని వచ్చిన తరువాత రెండు నెలలు ఒంటి పూట భోజనముతో గడిపాము. మరో వారం రోజులు శనగ గుగ్గిళ్ళు ఉడికించుకుని తిన్నాము."
    "మీరు చాలా అభిమానానికి పోయారు మాష్టారూ. అవసరమైతే ఉత్తరము వ్రాయమని చెప్పలేదా/ మరిచి పోయారను కుంటాను."
    "లేదు బాబూ. అయాచితంగా వస్తుందని యెంతకని సాయము పొందుతాము? అక్కడ నువ్వూ , శాస్త్రి చేసిన సహాయము మాములుదా? నేను మొదట పనిచేసే బడిలో ఇంగ్లీష్ చెప్పే ఉపాధ్యాయుడు అనేవాడు. వెధవ దుస్తులు, వెధవ వేషాలు అనుకుని ఈశ్వరచంద్ర విద్యా సాగారుడిని గుర్తు తెచ్చుకునే రోజులు కావండి . మన వేషాన్ని బట్టి కూడా గౌరవము లభిస్తుంది." అతని మాటలు అక్షరాలా నిజము. నా వేషము చూస్తూనే అందరికీ తేలిక భావము కలిగేదేమో పది రూపాయలకు పైకి వచ్చేవారేకాదు. తిరిగి వచ్చేద్దామనుకున్నాను. అక్కడ మాత్రమూ ఏం చెయ్యాలి? ఈ ఇంటికి పదిహేను రూపాయల అద్దె. పట్నము నుండి బస ఇచ్చటకు మార్చాను. నాకోచ్చే ఆదాయము లో అద్దె, బస్సు చార్జీలు పోను మిగిలింది చాలా కొద్ది మొత్తము. అమ్మాయినే ప్రయివేటుగా మెట్రిక్ ప్యాసు చేయిద్దామనుకున్నాను. తిండికి సరిపడని రోజులు" పుస్తకాలెం కొంటాము" నాకు తెలియకుండా సురేఖ ఓ అరవావిడ వద్ద పనులు చెయ్యడానికి కుదిరింది. తెలిసిన రోజు యెంత కృంగి పోయానో బాబూ." అతని ముడతల చెంపల మీదుగా కన్నీరు జారింది.
    "ఏం పని నాన్నా!" కూతురు తన చెంగుతో అతని కళ్ళు ఒత్తింది.
    మీరే చెప్పండి పని చేసుకుని బ్రతకడము లో అవమానమేముంది? పెద్ద చదువులు చదివిన వారికే మంచి ఉద్యోగాలు దొరకటము లేదు. నాలాంటి వారి నెవరడుగుతారు? నాన్నగారి కెప్పుడూ పగటి కళలు వస్తుంటాయి. నేను, ఉపాధ్యాయినిని అయినట్టు నవ్వింది." ఆ నవ్వు సహజంగా లేదు. బాధను బిగపట్టి నవ్విందని తెలిసి పోయింది.
    "అందులో పెద్ద అసాధ్యమేముంది? ఇప్పటి కైనా చదవచ్చు." ఆనంద్ మష్టారిని సంతృప్తి డిని చేయాలని ఆ మాట అన్నాడు.
    "ఏం చదువుతుందో బాబూ. అది పుట్టిన నాడు, దాని తల్లి, నేను యెన్నో ప్రణాళికలు వేసుకున్నాము. ఆమె అదృష్ట వంతురాలు ఇవేమీ  చూడకుండానే మరణించింది. నేను ఇంకెన్ని చూడాలో?"
    "నాన్నా! మీరిలా మాట్టాడితే నేను తల పగుల గోట్టుకుంటాను. నీకెన్ని సార్లు చెప్పాను. బీదరికము కూడా ఒక రకమైన వ్యాధి నాన్నా. ప్రతి మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కాటేస్తుంది. కొన్నాళ్ళకు కోలుకుంటాము! పురాణాలు, చరిత్రలు ఏం చాటుతున్నాయి?' అరిచినట్టే అడిగింది. ఆనంద్ ఆమె వంక చిత్రంగా చూచాడు . వయసుకు మించిన అనుభవ పూర్వకమైన సలహాలు బీదరికమే నేర్పుతుంది కాబోలు.
    'అసలు విషయము చెప్పరేం మాష్టారు? మీ కూతురు అత్తగారి అవతారమెప్పుడు దాల్చినది?' కొంటెగా సురేఖ వంక చూస్తూ అడిగాడు.
    "ఆ..........' అతను బలవంతముగా నవ్వాడు.
    "నేను పని చేయొద్దని కట్టడి చేశాను. కాని మలేలే వంటి పూట తిండే మిగిలింది. అప్పుడే అరవామేతో తగాదా పడి వచ్చిన జట్టు, నల్గురు ఏదో ఆఫీసు ల క్లర్కు లుగా పని చేస్తున్నారు. వారంతా మా ఇంటికొచ్చి సలహా ఇచ్చారు. వారి నల్గురి కి అమ్మాయి వంట చేసి పెడితే, మా ఇద్దరి తిండి ఉచితంగా లభిస్తుందని చెప్పారు. వారు హోటల్లో ఖర్చు భరించ లేమన్నారు. నాకయితే ఇష్టం లేదు కాని అమ్మాయి బలవంతము చేసి పని ప్రారంభించింది. వారన్నట్టు అమ్మాయి వంట చేసినందుకు మా ఇద్దరికీ సరిపడే వంటకాలు మిగిలేవి? నిజంగా ఆ నల్గురు వేరు వేరు ప్రాంతాల వారయినా యెంతో మంచివారు బాబు. పాపం చెల్లిగా చూచుకునే వారు. మరో నాల్గు నెలలు గడిచాక, ఇందాలా నీతో వచ్చారే ఆ అబ్బాయిలను తీసుకువచ్చి పరిచయం చేశారు. వారికి వండి పెడితే నెలకు పాతికా, పరకా మిగిలితే తను పుస్తకాలు కొంటానని అమ్మాయి పట్టు పట్టింది. నా సంపాదన లో మిగిలింది అమ్మాయి పెళ్ళి కని కూడ బెడుతున్నాను. నువ్వు నవ్వుతావు యెంతో లేదు బాబూ నూట పది రూపాయలు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS