Previous Page Next Page 
ఇంద్రధనుస్సు పేజి 14

 

    స్కూలు నుంచి భానుమూర్తి , "బుగ్గ మీద నొక్కు పడదే, భామ పడదే!" అనుకుంటూ వచ్చాడు.
    "భామ యేమని జవాబిచ్చింది?' ప్రకాశం అడిగాడు.
    "బావా! మొగల పై కెత్తుకొని మల్లె మందిరి క్రింద నిలబడి మొగ్గలు కోస్తుంటే, మొగ్గ పడి నా బుగ్గ నొక్కు పడింది-- అంటుంది."
    'ఆహా! ఎంత బావుంది భానూ! మల్లె మొగ్గపడి బుగ్గ నొక్కు పోయిందా? ఎంత సుకుమారి ఆ పిల్ల!"
    "మన ప్రబంధ కవ్యల కన్నా సుకుమారి. అది సరే గాని ఏమిటి చెప్మా, నువ్వు శృంగార చర్చలు చేస్తున్నావు! విరహంలో పడ్డావా? లేక నాకు తెలీకుండా దాచుకున్న విరాహం తీరిందా?"
    ఇంతలో హడావుడిగా విశ్వనాధయ్య గారి పాలేరు నాగడు పరుగెత్తుకు వచ్చాడు. విశ్వనాధయ్య గారు ప్రకాశాన్ని తక్షణం పిలుచుకు రమ్మన్నారని చెప్పాడు.
    "ఎందుకూ నాగడూ?"
    "పెద్దయ్యగారి మీద చిన్నయ్య గారు లడాయి యేసుకున్నారండి. అమ్మగోరు మిమ్మల్ని పిల్చక రమ్మన్నారండి. అయ్యగోరు పిల్చేరని చెప్మన్నారండి."
    ప్రకాశం క్షణం అలోచించి వెళ్ళడమే మంచిదనుకొని బయలుదేరాడు. ప్రకాశం వెళ్ళిపోగానే భానుమూర్తి చదువుకోవటానికి కూర్చున్నాడు. పొద్దు పోయింది. చంద్రుడు మెల్లిగా నింగి మీది ఎగబ్రాకుతున్నాడు. తెల్లగా వెన్నెల పరచుకొంటుంది. పుస్తకం తీసుకొని కిటికీ లో కూర్చున్నాడు భానుమూర్తి.
    మరి కాస్సేపటికి తలుపు తట్టడం వినిపించింది. సావిత్రమ్మ వచ్చిందే మోనని తలుపు తీశాడు. మసక వెన్నెల్లో, చేతిలో సంచీతో ఎవరో నిలబడి ఉన్నారు.
    "ఎవరు కావాలండీ?' ప్రశ్నించాడు.
    "ప్రకాశం లేడూ?"
    "లేడు. ఇప్పుడే వస్తాడు. లోపలికి రండి."
    అతడు లోపలికి వచ్చాడు. వారం రోజులు పెరిగిన గడ్డం ముఖాన్ని కాస్త కప్పుతుంది.
    "మీరెవరో నేను తెలుసుకోవచ్చా?' భానుమూర్తి అడిగాడు.
    "నా పేరు సారధి."
    "ఓ! రుద్రవీణగారన్న మాట. అలా చెప్పండి. మీ నాన్నకూ, మీ అమ్మకూ మీరు పెరిగి కవులవుతారని బహుశా తెలీదు. తెలిస్తే ఆ పేరు పెట్టరు. మీకు రుద్రవీణ అన్న పేరే చాలా బాగుంటుంది." భానుమూర్తి బిగ్గరగా నవ్వాడు.
    సారధి బిత్తర పోయాడు. మరు క్షణంలోనే భానుమూర్తి కి తాను అతిగా వాగానని అర్ధమైంది.
    "నా పేరు భానుమూర్తి. ఇక్కడే హైస్కూల్లో టీచర్ని. ప్రకాశం మిమ్మల్ని గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు." అన్నాడు.
    'చాలా సంతోషం. మీ వృత్తి చాలా మంచిది." అన్నాడు సారధి ఏదో అనాలి గదా అని.
    'అవును! బెస్ట్ ఆఫ్ అల్ ప్రొఫెషన్స్ , బట్ వర్ట్స్ ఆఫ్ అల్ ట్రేడ్స్."
    సారధి నవ్వాడు.
    'అంతమాత్రం చేత నాకు నా వృత్తి మీద గౌరవం లేదనుకోనేరు. నేను టీచర్ని కావాలనుకునే అయ్యాను. కానీ కొందరు మరో ఉద్యోగం దొరక్క టీచర్లవుతుంటారు. నాకు నా వృత్తి మీద చాలా గౌరవం."
    'అవునండి. ప్రతివాడికీ తన వృత్తి మీద గౌరవం ఉండాలి. అలా లేకనే దేశం ఈ గతికి వచ్చింది."
    భానుమూర్తి బిగ్గరగా నవ్వి అన్నాడు,"మీకు కొన్ని మంచి అభిప్రాయాలు కూడా ఉన్నాయి."
    "ఏం అలా అంటున్నారు?"
    "ఆహా. ఏమీ లేదు. ఏదో మాట వరస కన్నాను. మీరు దాన్ని మనసులో వుంచుకోకండి. ఈ లోగా ఏమైనా రాస్తున్నారా?"
    "పది రోజుల్నుంచి ఏమీ రాయలేదు. కానీ కేవలం మనస్తత్వాన్ని చిత్రించే ఒక నవల రాస్తున్నాను" అన్నాడు సారధి.
    "దాన్ని నూగులు, నీళ్ళతో గూడా ఒక సద్భాహ్మణుడికి దానం చేసెయ్యండి. శని విరగడవుతుంది."
    "ఎందుకూ?" ఆశ్చర్యపోయాడు సారధి.
    'అది గాలిని మూటకట్టడం."
    "ఏది?"
    "మనుష్యుల్నీ, వారి జీవితాల్నీ వదిలి మనస్తత్వం మీద పడటం. మీరు అభ్యుదయం అంటారు. చూడండి -- దానికది విరుద్దం."
    ప్రకాశం, సావిత్రమ్మ రావటంతో భానుమూర్తి మాటలు ఆగాయి. ఇద్దరూ సారధిని చూసి ఆశ్చర్యపోయారు.
    ఎప్పుడొచ్చావు నాయనా?' మొదట సావిత్రమ్మే పలాకరించింది.
    "ఇప్పుడేనండి" అన్నాడు సారధి.
    "వారు యిప్పుడే వచ్చారమ్మా, నేను అప్పుడే వారికి విసుగెత్తిస్తున్నాను" అన్నాడు భానుమూర్తి.
    "ఒక్క క్షణం అలా మాట్లాడుతూ కూర్చోండి. కాఫీ పెడతాను" అంటూ సావిత్రమ్మ లోపలికి వెళ్ళింది.
    "ఏం సారదీ! ఆరోగ్యం బాగాలేదూ?" ప్రకాశం ప్రశ్నించాడు.
    "లేకేం? నిక్షేపంలా ఉంది. కాస్త బాగాలేని దల్లా మనస్సే."
    "ఎందుకూ?"
    "ఉద్యోగం పోయింది"
    "ఎందుకూ?"
    "మా ఎడిటరు కూ నాకూ పేచీ వచ్చింది. వాడికి పొట్ట చించితే అక్షరం లేదు. పైగా చీటికి మాటికీ నన్ను తప్పులు పడతాడు. అంతే గాకుండా నేను కమ్యూనిస్టు నని యజమానికి రిపోర్టు కూడా చేశాడు. ఆయజమాని నన్ను ఉద్యోగం లోంచి తీసేశాడు."
    "పోనీలే. అదీ మంచికే జరిగింది. ఆ అణా కానీ పత్రికలో పనిచేయటం మన పరువుకే తక్కువ." కాస్సేపు అలోచించి అన్నాడు ప్రకాశం.
    "నాకూ ఏం బాధగా లేదు. వూరికే ఏమీ తోచక ఇలా వచ్చాను."
    "తర్వాత అన్ని విషయాలూ మాట్లాడుకుందాం. స్నానం చేస్తావా?"
    "చేస్తాను."
    "అమ్మతో చెప్పి వేడ్నీల్లు పెట్టమంటాను."
    'అవసరం లేదు. ఈ వేసవి కాలంలో వేడ్నీళ్ళు ఎందుకూ?" సారదీ స్నానానికి వెళ్ళాడు.
    "సుందరమ్మ గారు ఎందుకు పిలిపించారు?' భానుమూర్హి ప్రశ్నించాడు.
    "అదో పెద్ద గొడవ భాను. నన్ను గురించి వారు శాంతి లేకుండా అవస్థ పడుతున్నారు."
    "ఉమాపతి మళ్ళీ ఏమైనా గొడవ పెట్టాడా?
    ఔనన్నట్లు తల ఊపాడు ప్రకాశం.
    "ఏమా కొత్త గొడవ?"
    "ఏముందీ? పాతదే! శారదనేమో అన్నాడట! శారద తిరగబడి నాలుగు వడ్డించింది. ఆ విషయం ఉమాపతి రత్నమ్మతో చెప్పాడు. రత్నమ్మ శారదను చావ బాదింది. ఈ విషయం సుందరమ్మ గారికి తెలిసేసరికి గొడవ ప్రారంభమైంది."
    "విశ్వనాధయ్య గారేమన్నారు?"
    "ఏమంటారు , పాపం! ఎందుకు శారదను కొట్టావని రత్నమ్మ ను మందలిస్తే -- నా యిష్టం, అది నా కూతురు --అందిట."
    "....."
    "అలాగైతే నీ కూతుర్ని పిలుచుకు ఇంటి నుంచి బయటి కెళ్ళమన్నారు విశ్వనాధయ్యగారు."
    "వారేనా!"
    "అంతటితో ఆవిడ నోరు మూసుకుంది. విశ్వనాధయ్యగారు ఆవిడని గట్టిగా చీవాట్లు పెట్టారు. శారద విషయంలో నోరు మెదిపితే ఇంట్లోంచి మెడ పట్టి గెంటిస్తానన్నారు. కానీ ఉమాపతి వారి మీద నోరు చేసుకున్నాడు. అదే నాకు బాధగా ఉంది."
    "కుక్క మొరిగితే బాదెందుకు? మొరాగటం దాని లక్షణం."
    సారధి స్నానం చేసి వచ్చాడు. సావిత్రమ్మ కాఫీ యిచ్చింది. ముగ్గురూ త్రాగారు.
    "అబ్బ, చాలా ఉక్కగా ఉంది. పెరట్లో కూచుందాం" అన్నాడు భానుమూర్తి.
    ముగ్గురూ లేచి పెరట్లో కి వెళ్ళారు. మల్లెపందిరి ప్రక్కనే చాప పరిచాడు భానుమూర్తి. దాని మీద కూర్చున్నారు.
    అబ్బ , ఎన్ని మల్లె పూలు ప్రకాశం!' అన్నాడు సారధి.
    "విచారం ఏమంటే వాటిని పెట్టుకొనే ఇల్లాలు లేదు" అన్నాడు ప్రకాశం.
    "ఇల్లాలు కేం ? వస్తుందిగా...."
    "మా ఇందిర ఉందిగా యీ పూల మీద హక్కుదారు!" అన్నాడు భానుమూర్తి.
    "ఎవరు లేకున్నా మా యింట్లో దేవుడున్నాడుగా!" అన్నాడు ప్రకాశం.
    'అదేమిటి?పూజ , జపం కూడా మొదలెట్టావేమిటి?"    
    "నేనేనాడూ నాస్తికుడ్ని కాదుగా!"
    "ఇదంతా శుద్ధ నాన్సేన్సు! మార్క్స్ ఏమన్నాడో తెలుసా--మతం మానవుడి పాలిట మత్తు మండన్నాడు."
    "దానికీ దీనికి ఏం సంబంధం?'మతం' అంటే మతదురభిమానం అని అతని అభిప్రాయం. అది నిజంగా మత్తు మందే!కానీ మతం అంటే ఏమిటో తెలీని వాడు కూడా మానవుడు నిరీశ్వరవాది కాడు."
    సావిత్రమ్మ వచ్చి భోజనాలకు లేవమంది.
    "అన్నమైతే నేమిరా, మరి సున్నమైతే నేమిరా! అందుకే, ఈపాడు పొట్టకు అన్నమే వేతామురా." పాటఅందుకున్నాడు భానుమూర్తి.
    "వాడెవడో చాలా ఘటికుడు. అన్నమైనా సున్నమైనా ఫరవాలేదని చివరకు అన్నమే వేతామన్నాడు. పైగా అది పాడుపొట్టట కూడా" అన్నాడు సారధి.
    భోజనాల వద్ద పంచాయితీ ఎన్నికలను గూర్చి చెప్పాడు ప్రకాశం.
    'అలాగైతే ఎవరు పోటీ చేస్తున్నారు జగన్నాధం తో?' అంతా విన్న తరవాత సారధి అడిగాడు.
    "అందరూ వెళ్ళి విశ్వనాధం గారితో మీరే చేయాలని చెప్పాము."
    "అయన సరే నన్నారా?"
    "లేదు"
    "వీల్లెదన్నారా?"
    "ఆ మాటా అనలేదు. వారీ రాజకీయాల్తో చాలా చితికి పోయారు. పదేళ్ళుగా రాజకీయల్తో సంబంధం లేకుండా ఉంటున్నారు. మళ్ళీ ఆ ఊబి లోకి నన్ను లాగవద్దంటున్నారు."
    "అలా అంటే ఎలా? సమర్దులూ, అనుభవం కలిగిన వాళ్ళూ అలా అనకూడదు. మన స్వార్ధమే చూసుకోవడం న్యాయం కాదు."
    'ఈ గాలి కబుర్లు అందరికీ తెలుసు కానీ...."
    "కానీనూ, లేదు, అర్ధణా లేదు. వారు పోటీ చేసి తీరాల్సిందే! రేపు నేను వారితో మాట్లాడుతాను."
    'అలాంటి పనేం చేయకు బాబూ! నీకు పుణ్యముంటుంది. వారి మనసేమీ బావులేదు."
    'అలాగే కానీ. విశ్వనాధయ్య గారు నిలిస్తే తప్పకుండా గెలుస్తారా?"
    "ఆ విషయం నన్నడకండి. విశ్వనాధయ్య గారు నిలబడితే మా మామయ్యగారు తప్పకుండా ఓడిపోతారు. ఎందుకంటె, వారి కూతురు గూడా వాళ్ళ నాన్నకు ఓటివ్వదు."
    నవ్వలేక ప్రకాశానికి పొరపోయింది.
    
                                *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS