నాలుగైదురోజులు గడిచేటప్పటికి పరిస్థితులు కుదుటబడి. మళ్ళీ ఇంట్లో పూర్వపు వాతావరణం ఏర్పడింది. కొంచెం ఏదో ఎబ్బెట్టుగా ఉన్నట్టు అప్పుడనిపించినా మొత్తం మీద అంతా సర్దుకుపోయింది. ఓ రోజు రాత్రి తన గదిలో మంచం మీద కూచుని ఓ చేత్తో బాబిగాడిని జోకొడుతూ రెండోచేత్తో భగవద్గీతా వ్యాఖ్యాన్ని చదువుకుంటోంది సునంద, పక్కగదిలో రత్నం పరువు మీద పడుకుని వారపత్రిక తిరగేస్తోంది.
గంటక్రితం భోజనంచేసి అర్జంటు పని ఉందంటూ వీధిలోకి వెళ్ళిన గోపాలం భయం భయంగా ఏదో తప్పుకుని చేసినవాడిలాగ లోపలికివచ్చి వెంటనే తలుపు గడియవేసేసుకున్నాడు. సునంద అతని వాలకం చూసి చకితురాలై మంచంమీంచి లేచి నుంచుంది చప్పుడు విని పక్కగదిలోంచి రత్నంకూడా వచ్చి గుమ్మంలో నిలబడింది.
'ఉష్' అంటూ ఎంతో భారం తీరినట్లు కుర్చీలో కూలబడి వేరువేరుగా నిలబడి తెల్లబోయి తఃనకేసి చూస్తూన్న సునందనీ, రత్నాన్నీ బెదురు బెదురుగా చూసి "నాకేసి అలా గుడ్లప్పగించి చూస్తారేం" అన్నాడు గోపాలం కంగారుపడుతూ.
సునందకాని, రత్నంకాని మాట్లాడలేదు.
కాస్సేపు స్త్జిమితపడ్డాక "రత్నం ఆ వీధి తలుపు గడియ వేసిరా" అన్నాడు గోపాలం.
"మీరే గడియ వేసి వచ్చారు కదండీ!" అంది రత్నం.
"ఆ....అవునవును.... నేనే వేసివచ్చాను కదూ!" అంటూ తడబడాడు. సునంద అతనికేసి ఇంకా తెల్లబోయి చూస్తూనే ఉంది. గంభీరంగా ఉన్న ఆ వాతావరణం ఇబ్బందిగా తోచి ఆ గాంభీర్యాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించడం కోసం. పకపకా నవ్వాడు గోపాలం. సందర్భం లేని ఆ నవ్వువల్ల మరింత సీరియస్ గా తయారైంది అక్కడి పరిస్థితి, రత్నం కంగారుపడుతోంది. ఏమీ అర్ధంకాక సునంద తెల్లబోతోంది.
"అసలు ఏమైందంటే వదినా" అంటూ అప్పుడప్పుడు రత్నం కేసి కూడా చూస్తూ మొదలు పెట్టాడు.
"ఇవాళ మా ఆఫీసుకి ఒకే ఆసామీనుంచి, ఒకే కౌలుకు సంబంధించి, పొరపాటున రెండు చెక్కులు వచ్చాయి. పదేసి వేలని ఒకటి అదనంగా వచ్చింది వెనక్కి పంపించేద్దాం అని నేను ఆఫిసరుకి చెప్పాను. ఆయన నవ్వి అవసరంలేదు నేను చెప్తాను. ఒకటి ఆఫీసుపేర జమ కట్టెయ్యి. రెందోదికేష్ చేసి సాయంత్రం ఇంటికి పట్రా" అన్నారు. నేను ఏదో చెప్పబోతే' నేను చెప్పినట్లు చెయ్యి.' అని కసురుకున్నారు. ఇందాకవెళ్ళి పదివేలూ ఆయనకి ఇవ్వబోతే, నీవాట ఈ వెయ్యి తీసుకో ఆలోచించకు. ఇది ఇంతే- ఈ సంగతి మూడో కంటివాడికి తెలియనివ్వకు అన్నారు" అంటూ జేబులోంచి పదివంద రూపాయల నోట్లూ వణుకుతూన్న చేతుల్తో తీసి, టేబిల్ మీద ఉంచాడు గోపాలం!
"ఎంత డబ్బో! "అంది ఆనందంగా రత్నం.
"లంచం "నిశ్శబ్దంగా అరిచింది సునంద. గోపాలం బిత్తరపోయాడు ఆ మాటవిని.
"ఎందుకు తీసుకున్నావు గోపాలం ఈ లంచం?" అంది సునంద బాధగా. 'ఏం చెయ్యమంటావు వదినా- నాకూ మొదట ఇష్టంలేదు. కానీ, ఈ ఏడెనిమిది నెలల నుంచీ చేసిన అప్పులూ, వచ్చేనెలలో అన్నయ్యకి చేయించవలసిన లంగ్ ఆపరేషనూ, ఇన్నీ నా చుట్టూ వలయాలుగా తిరిగి నన్నీ ప్రపంచంలో పడేశాయి "సంజాయిషీ ఇచ్చుకున్నాడు, "వద్దు గోపాలం.ఈ రకం అయిన డబ్బు మనకి వద్దు. మా ఉభయుల కారణంగా నువ్వీ పాపపు పని చెయ్యొద్దు. ఇప్పటికే నీ మీద మొయ్యలేని భారం పడిపోయింది. పైగా ఇదొకటా?నా దురదృష్టం నిన్ను కూడా వెంటాడడమా? వీల్లేదు పట్టుకెళ్ళి ఆ డబ్బు వెనక్కి ఇచ్చెయ్యి. అంతగా తప్పనిసరి అయి డబ్బు కావలసి వస్తే. నా పౌరుషాన్నీ అభిమానాన్నీ అయినా చంపుకొని మా పుట్టింటికి వెళ్ళి కావలసింది తీసుకువస్తాను. కాని నువ్వీ పాపపు పని మాత్రం చేయడానికి ఒప్పుకోను. నా కరణంగా ఈ ఘోరం జరగడానికి వీలులేదు. నా దురదృష్టం అందర్ని బాధిస్తోంది. ఈ కారణంగా రేపొద్దున నీకు ఏ వైనా జరిగితే.... వద్దు గోపాలం....ఇచ్చెయ్యి" అంది ప్రాధేయపడుతూ సునంద.
"ఎలాగా వదినా యివ్వడం తీరా తెచ్చాక?" అంటూ తికమక పడసాగాడు గోపాలం.
"ఏదో సామ్యం చెప్పినట్లుంది, అణా కాసు పైన వచ్చే తికాణా లేదు. ఖర్చులు చూస్తే జమీందారీ ఫాయీలో సాగాలి. నీతులు వల్లించడానికి మాత్రం అంతా తయారు. తెలివిగా తేగలిగిన మొగాడికి తెలియదేవిటి గడుసుగా తప్పించుకోవడం ఎలాగో? మనకు ఎవరి సలహాలూ అక్కర్లేదు. ఆ డబ్బు ఇలా ఇవ్వండి అలమార్లో దాస్తాను" అంటూ తనే టేబుల్ మీద డబ్బు తీసుకుని, లోపలికి వెళ్ళిపోయింది రత్నం, గోపాలం నిస్సహాయంగా ఉండిపోయాడు. గట్టిగా నిట్టూర్చి "భగవంతుడా మమ్మల్ని రక్షించు" అని మనసారా మొక్కుకుంది సునంద-
11
"అమ్మాయి వచ్చిందే!"
ఏవిటి మన అమ్మాయే! మన సునంద? మా మీద కోపం తగ్గి వచ్చావా తల్లీ!" అంటూ ఆనంద పారవశ్యంతో. కళ్ళు చెలమలయి చేతులు జాపుకుంటూ వీధిలోకి రెండంగల్లో వచ్చిన కాంతమ్మ, అనాధ శిశు శరణాలయం వార్డెన్ ని గుమ్మంలో చూసి నిరాశతో నిలువెల్లా కృంగిపోయింది.
"పొద్దుట ఈ అమ్మాయిని కబురంపించావు కదుటే! చాపమీద వేసుక్కూచున్న దస్తా వేజులూ కాగితాలూ చూసుకుంటూ అన్నాడు రాఘవయ్య. "అవును" అంది నీరసంగా కాంతమ్మ.
"ఎందుకమ్మా" అంది వార్డెన్.
"ఎందుకా? నే చెప్తాను విను ఇవాళ మీ శరణాలయంలో ఉన్న బాలికల నందర్నీ మా యింటికి తీసుకురా వాళ్ళతో మా ఆవిడ ఆడుకుంటుందిట" - అలా అతి సీరియస్ గా అన్న రాఘవయ్య మాటలకి. నవ్వు వచ్చి ఎంతో ప్రయత్నం మీద ఆపుకుంది వార్డెన్ ఆ నవ్వుని.
"ఆయన మాటల కేంలే - సాయంత్రం వాళ్ళందర్నీ తీసుకురా అమ్మా, బిళ్ళలూ బిస్కెట్లూ పంచిపెడదాం అంది విచారంగా కాంతమ్మ.
ఏదో సంతోషంగా ఉండే సందర్భంలో తప్ప ఇలాంటివి ఏం చెయ్యరు ఎవరూ! అలా సంతోషంగాను సరదాగానూ చెప్పవలసిందిపోయి ఈవిడ ఇంత విచారంగా చెబుతుందేవిటి చెప్మా ఈ విషయం అనుకుంటూ విస్తుపోయంది వార్డెన్.
"వెళ్ళిరా...పిల్లల్ని పెందరాళే తీసుకురా....మళ్ళీ మాకు ప్రయాణం ఒకటుంది. పిలుపు ఎప్పుడొస్తుందో మూట ముల్లీ కట్టుకుని సిద్ధంగా కూచున్నాం" అన్నాడు ఆఘవయ్య.
సెలవు తీసుకుని వార్డెన్ వెళ్ళిపోయింది.
'ఏమిటండి దానితో....దానికేం అర్ధం అవుతాయి మీ మాటలు?....ఆ పిల్లలతో నేను ఆడుకోవడం ఏమిటి? మీరు మరీను అంది కాంతమ్మ బాధగా.
"ఆడుకోవడం కాకపోతే ఇదంతా ఏవిటే? అమ్మాయిని అరచేతిలో నిమ్మపండులాగ అల్లారు ముద్దుగా పెంచామా - ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూన్న మనల్ని కాదని, ఇవాళ వచ్చిన ఆ పెద్ద మనిషి ముఖ్యం అని, మనతో తగాదా పెట్టుకుందా? అయినా ప్రాణం ఉండబట్టలేక నేను డబ్బు పంపిస్తే, నువ్వు మనిషివే వెళ్ళి చూసివస్తే, ఆ రకంగా ప్రవర్తించిందా? ఇన్ని ఉత్తరాలు రాస్తున్నావు ఒక్క దానికేనా సమాధానం రాసిందీ?..... అయినా వెర్రి భ్రమ వదలక మనం దాని పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడమా-ప్చ్....అది లేకుండా దానిపుట్టిన రోజూ మనం ఇక్కడ చేసుకుని ఈ అనాధ బాలికలకందరికీ మిఠాయిలూ లడ్లూ పంచిపెట్టడం ఆడుకోవడం కాక మరేవిటే!"
"లడ్డు అంటే జ్ఞాపకం వచ్చింది తొక్కుడు లడ్డు అమ్మాయికి చాలా యిష్టం అది కూడా నాలుగు వీశలు తెప్పించండీ! పిల్లలకి పంచి పెడదాం"
"ఓ....అలాగే......ఇంకేవిటి?"
"ప్రస్తుతానికి ఇంకేం అక్కర్లేదు. అన్నీ ఉన్నాయి. మీరింక ఆ దస్త్రాలన్నీ మూటగట్టి లేవండి తలంటుకోడానికే"
"తప్పదా?.....అంటుకోవలసిందే?....ఏం ఆపాద వచ్చిపడిందిరా భగవంతుడా?....నా చిట్టి తల్లి ఉంటే ఇలాంటి ఎన్ని ఆపదలనుంచో నన్ను తప్పించేది కదా!"
"అదే ఉంటే మీకెవరు తల అంటుతారు? దానికే అంటుదును"
"ఇప్పుడు దానిబదులు అన్నమాట నేను? చంపావు."
"మాటలతో నాన్చక లేవండి. అవతల నాకు పొద్దు ఎక్కిపోతోంది"
"పొద్దు ఎక్కడంకాదే- వాలిపోతోంది మనకి పొద్దు. అందుకే ఈ జంజాటన అంతా తగ్గించుకొని. చప్పున ప్రయాణానికి సిద్ధం అవు అంటున్నా.
"మాట్లాడితే ఈ మధ్య ప్రయాణం ప్రయాణం అంటున్నారు. ఈయనకి మతిగాని పోలేదు కదా!" తనలో తను అనుకున్నట్లు అంది కాంతమ్మ.
"ఆ....నీ ధర్మమా అనీ. నీ సుపుత్రిక ధర్మమా అనీ ఇంక అదొక్కటే తరవాయి" అన్నాడు రాఘవయ్య.
"లేకపోతే ఏవిటండీ లేవమంటూంటేను. పూట పూటా ఆ దస్తావేజులూ బ్యాంకు పుస్తకాలూ, కాగితాలూ పరుచుకోవడం వాటి మధ్యన కూచోవడం వెండి సామానూ అదీ చూసుకోవడం పిచ్చి నాకు పట్టిందన్నారు కాని, అసలు నన్నడిగితే ఈ కాగితాలూ అవీ చూసుకోవడం చాదస్తం మీకు బాగా పట్టింది. ఆట సామానూ లక్కపిడతలూ అన్నీ పరుచుకు కూచునే చంటి పిల్లల్లాగ"

మనిద్దరం చంటిపిల్లలమేనే నిజానికి. అందుకే మన అమ్మాయి మనల్ని ఇలా ఆడిస్తోంది. ఏమంటావు?"
"ఇలా బాధపడుతూ కూచోపోతే, ఓమాటు' వెళ్ళి "అమ్మాయి! ఏదో జరిగిపోయిందేదో జరిగిపోయింది నువ్వేం మనస్సు కష్టపెట్టుకోకు తల్లీ- ఉద్యోగం చేసి అతనికి మందు ఇప్పించుకోవడం అవస్థా, ఇదంతా నీకెందుకు? అక్కడికి వచ్చెయ్యి అతన్ని తీసుకుని, అదంతా నేను చూసుకుంటాను అని ఒక్కముక్క ఒక్కటంటే ఒక్కముక్క అని రాకూడదూ? మీరుమరీను. చిన్నపిల్ల దానితో పంతం పట్టుకుని కూచున్నారు"
"కాదుటే మరీ?....దానికే అంత పంతం అయితే దాని బాబుని నేను. తెలిసిందా?..... నన్ననకపోతేపోనీ నువ్వువెళ్ళి ఆ మాటే చెప్పి తీసుకురాకూడదూ. దాన్నీ దాని మొగున్నీను"
