తెల్లవారి నిద్ర లేచేసరికి బారెడు ప్రోద్దేక్కింది. 'ఎప్పుడూ అంతే కదా. రాత్రి పడుకోబోయే ముందు ఎంత త్వరగా లేద్దామనుకుంతామో, మర్నాడు లేచేసరికి అంత ఆలస్యం అవుతుంది.' అనుకుంటూ చివాల్న లేచి కూర్చుంది కళ్యాణి.
అలవాటు ప్రకారం మొదట భర్త ముఖం చూసి అతని నుదుటి మీది వెంట్రుకలను లాలనగా పైకి నిమిరి, లేచింది. పక్కకు తిరిగి చూసేసరికి పాప అప్పటికే నిద్ర లేచి పక్కంతా ఖరాబు చేసి, వంటి నిండా పూసుకుంటోంది.
'అయ్యో! అవెం పనులే పాడు పిల్లా!' అంటూ గబగబా దాని నెత్తు కుని బాత్ రూమ్ వైపుకు నడిచింది.
ఆ శబ్దానికి కాంతారావు , బాబు యిద్దరూ లేచి కూర్చున్నారు.
బాబు లేస్తూనే పక్కన ఉన్నదాన్ని చూసి 'ఛీ! పాప 'జీ' పోయింది' అన్నాడు ముఖం అంతా అసహ్యం గా పెట్టి.
'చిన్నప్పుడు అవన్నీచూసి నీకంటే ఎక్కువగా అసహ్యించుకునే వాడిని లేవోయ్. పెళ్ళయి, పిల్లలు పుడ్తే అదే బంగారం లా కనిపిస్తుంది లే! ముఖం కడుక్కుందాం' అంటూ వాడిని తీసుకుని తను కూడా బాత్ రూమ్ వైపుకు నడిచేడు.
స్నానాలు వగైరా ముగించుకుని బయట పడేసరికి యించుమించు ఎనిమిది కావస్తోంది.
బయటకు రాగానే 'ఆకలీ....అంది కళ్యాణి.
'ఆకలీ లేదు, గీకలి లేదు. పద. ముందు గోవిందరాజస్వామి దేవాలయం లోకి వెళ్ళి వచ్చిన తరువాతనే టిఫిన్లు, కాఫీలు' అన్నాడు కాంతారావు.
'ఖాళీ కడుపుతో పూజిస్తే గాని మీ దేవుళ్ళ కు తృప్తి కలుగదు కాబోలు....' ఎగతాళి చేసింది కళ్యాణి.
'చాల్లే! నోర్మూసుకో! అందులోని అంతరార్ధం నీలాటి మెటీరియలిస్టు కి ఏం తెలుస్తుంది? ఆకలిని చంపుకోవటం అంటే మనం కొంత త్యాగం, నిగ్రహం చూపాలని అర్ధం. పరిశుభ్రమైన శరీరంతో, త్యాగంతో నిండిన మనసుతో ఉన్నప్పుడే మనిషి దైవానికి దగ్గరగా రాగలడు. అందువల్లనే యీ నియమాలన్నీ పెట్టేరు మన పెద్ద వాళ్ళు. తెలిసిందా?"
'పరిశుభ్రమైన శరీరం, త్యాగంతో నిండిన ,మనసు ఉన్నప్పుడు ఆసలు దేవాలయాలకు వెళ్ళవలసిన అవసరమే ఉండదు. సార్! అవన్నీ లేకపోవటం వల్లనే యింత దూరం 'దేవాలయం' కోసం వెర్రిగా పరుగెత్తుకోస్తున్నారు మనుషులు.' అంది కళ్యాణి కొంటెగా. ఎలాగైనా భర్తని ఉడికించాలని ఆమెకు సర్దాగా ఉంది.
'చాచా! అసలు నిన్ను నాతొ దేవాలయానికి తీసుకు రావటమే బుద్ది తక్కువ!' విసుక్కున్నాడు కాంతారావు.
'ఏవండీ మాస్టారూ! వో పక్క 'అహం బ్రహ్మాస్మీ' అని అద్వైతాన్ని బోధించిన శంకరా చార్యులను , 'దేవుడిని గురించి అలోచించనే వద్దు, అయన ఉన్నాడా లేదా అన్న ప్రశ్న వల్ల ప్రయోజనమే లేదు . ఆశలను చంపుకుని, కారుణ్యాన్ని పెంచుకుని జీవించండి' అని ఉపదేశించిన బుద్దుడిని కూడా గౌరవించే మీ సనాతనులందరూ యింకా విగ్రహారాధన మీద అంత శ్రద్ధ చూపిస్తా రెందుకండీ?' అని విద్యార్ధి నిలా అమాయకంగా ముఖం పెట్టి అడిగింది కళ్యాణి.
'హిందూ మతంలో ఉన్న గొప్పతనమే అది కళ్యాణి! విగ్రహరాదనను అద్వైతాన్ని ఆఖరికి నాస్తికతను కూడా జీర్ణించుకోగల శక్తి హిందూమతానికి తప్ప మరే మతానికీ లేదు. మార్గాలు వేరైనా వీరందరి గమ్యం ఒకటే నన్న సత్యం సనాతనులకు తెలుసు. హిందూమతమన్నది అసలు ఒక మతమే కాదు. ఎందరో మేధావులు యోగులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, సిద్దాంతాలను సమీకరించుకుని ఏర్పడి, నిత్య నూతనంగా వెలిగి అద్భుతమైనది కళ్యాణి! మనిషి పుట్టి నప్పుడే హిందూమతం పుట్టింది. మనిషి అంతమయినపుడే దానికి కూడా అంతం. ఎన్నో సెలయేళ్ల ను, నదులను, జలపాతాలను నింపుకుని శాశ్వతంగా స్థిరంగా నిలచిపోయే సముద్రం లా అన్ని మతాల సారాలను తనలో లీనం చేసుకున్న యీ సనాతన మతం చాలా విచిత్రమైంది.
అనుసరించే మార్గాలు వేరైనా, భారతీయ తాత్వికుల గమ్యం ఒక్కటే! మానవుడి పంచేంద్రియ జ్ఞానానికి అతీతమైన శక్తి ఒకటున్నాదన్న సంగతిని అందరూ ఒప్పుకుంటారు. ఆ శక్తి లో తాదాత్మ్యం పొందటమే అధ్యాత్మికుల ధ్యేయం.
ఉదాహరణకు సౌందర్యం అన్న భావాన్ని తీసుకో. నిజానికి సౌందర్యం అనేది ఏ నిర్వచనానికి అందని ఒక మహత్తర మైన భావం. దానికి చిత్రకారుడు రంగులతో రూపకల్పన చేయాలని తాపత్రయ పడతాడు. శిల్పి తన ఉలితో సౌందర్యాన్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కవి లలితమైన పదజాలంతో సౌందర్యాన్ని బంధించాలని చూస్తాడు, వేదాంతి బౌతిక ప్రపంచం లోని ఏ సాధనాలనూ ఉపయోగించ కుండానే ఆ సౌందర్య భావాన్ని మానసిక నేత్రంలో సందర్శించగలుగుతాడు' అన్నాడు కాంతారావు.
'అందుకే అంటాను నేను. నిజమైన సౌందర్యం ఎప్పుడూ బౌతిక రూపాన్ని ఆశ్రయించి ఉండదని, ఉండకూడదనీను. చర్మ చక్షువులకు గోచరించని ఆ మహా సౌందర్య భావాన్ని అంతర్నేత్రం తో సందర్శించగలిగిన నాడే మానవుడు ధన్యుడౌతాడు. అలా ధన్యులయిన వ్యక్తులు యీ ప్రపంచం లో చాలా కొద్ది మంది మాత్రమే! కోట్లాది ప్రజలలో ఏ ఒకరిద్దరో తప్ప మిగతా వారంతా పరిమిత జ్ఞానం కలవారే కనుక, ఆ సౌందర్యాన్ని , అలౌకికమైన ఆ అనుభూతిని రాతి బొమ్మలో బంధించి దానిని ఆరాధిస్తున్నారు మన పెద్దలు. కాని ఏ భావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రాతి బొమ్మ మలచ బడిందో ఆ భావం నశించి పోయి, రాయిని మాత్రమే పరమ పూజ్యిమైన వస్తువుగా బావిస్తున్నారు సామాన్య ప్రజలు. అందుకే నా కనిపిస్తుంది. ఈ విగ్రహారాధన మానవుని లోని ప్రాధమిక లక్షణాలకు నిదర్శనమని.
నా దృష్టి లో ఆధ్యాత్మిక చింతన అనేది వ్యక్తిగతమైన విషయం, ఒక వేదాంతి ఎన్ని బోధనలు చేసినా, ఎన్ని గ్రంధాలు రచించినా అవి చివరకు అతని అత్మౌన్నత్యానికి దారి తీస్తాయే తప్ప అవి సామాన్య ప్రజల లోని అజ్ఞానాన్ని ఏ మాత్రం తొలగించ లేవు, కొందరు జిజ్ఞాసువులకు జ్ఞాన ప్రసాదం చేస్తుంది. అంతే. ఇప్పుడు మనం నివసిస్తున్న యుగం, మనం నేర్చుకున్న విజ్ఞానం.... యీ విగ్రహారాధన ఎంత హాస్యాస్పదమైన విషయమో నాకు మాటి మాటికీ జ్ఞప్తికి తెస్తున్నాయ్! కాని సామాన్య ప్రజల మనస్తత్వమే మంటే తరతరాలుగా వస్తున్నా సాంప్రదాయాలను మంచివా, చెడ్డవా అన్న ఆలోచనకు తావీయకుండా అనుసరిస్తుంటారు.
పరిణాను సూత్రం మనిషి యొక్క బౌతిక రూపానికి వర్తిస్తోందే తప్ప మానసిక స్థితికి వర్తించటం లేదు. ముఖ్యంగా భారతీయుల స్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. వో పక్క మానవుడు చంద్ర లోకంలో అడుగు పెట్టి అక్కడి రాళ్ళను తెస్తుంటే, మన వాళ్ళు యిప్పటికీ రాయికీ, రప్పకూ మొక్కటం, వినాయుడి ని చూసి చంద్రుడు నవ్వేడని, చదువుకుని తత్నయత్వం పొందటం చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. కాదు కాదు, మనం నవ్వటం కాదు చెయ్యవలసింది . మన ప్రజల అజ్ఞానానికి, మూర్కత కి సిగ్గు పడాలి.' అంది.
ఆమె దీర్ఘోపన్యాసం ముగిసేసరికి వాళ్ళు గోవిందస్వామి ఆలయానికి దగ్గరగా వచ్చేసేరు. వాళ్ళున్న హోటలు ఆలయానికి దగ్గరలోనే ఉండటం వల్ల నడుచుకుంటూనే వచ్చేరు వాళ్ళు. తండ్రి చేతిని పట్టుకుని నడుస్తున్న బాబు, తల్లి భుజం మీద ఉన్న పాప యిద్దరు కూడా. అమ్మా, నాన్నా అంత తీవ్రంగా , తమకు అర్ధం కానీ భాషలో ఏదో మాట్లాడు కుంటున్నారని ఆశ్చర్యంగా వింటూ తమని తాము మర్చిపోయేరు.
దేవాలయ ప్రాంగణం లోకి ప్రవేశించేక చుట్టూ వోసారి పరికించి చూసి యీ గుళ్ళో నిజంగా దేవుడున్నాడో లేదో కాని, ఒకప్పటి భారతీయుల కళా నైపుణ్యా నికి, వారి మత , సంస్కృతిక జీవితానికి చిహ్నాలుగా ఉన్న యీ దేవాలయాలను భారతీయులమైన మనం తప్పక చూడవలసిందే!" అంది కళ్యాణి.
'మనం చూడు. ఎంత 'ఫూల్సు ' మో! దేవాలయం లోకి వెళ్తూ 'దేవుడున్నాడా, లేడా అన్న విషయాన్ని గురించి వాదించుకుంటున్నాం!' పొడిగా నవ్వేడు కాంతారావు.
'భోజనం ముందు కూర్చున్నప్పుడే మనిషికి కూరల రుచి పచులకు గూర్చిన ఆలోచన వస్తుంది. అలాగే పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నప్పుడే ఆలోచించే ప్రతి మనిషి లోనూ దేవుడు నిజంగా ఉన్నాడా, లేడా అన్న మీమాంస బయల్దేరుతుంది.' నవ్వింది కళ్యాణి.
'వండ్రఫుల్ సిమిలీ! ఈ ఆంధ్ర దేశంలో 'దేవుడు లేడు' అని అంత గట్టిగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పగలిగిన గుండె ధైర్యం 'గోరా' లో చూసేను. మళ్ళీ యిప్పుడు నీలో చూస్తున్నాను. నిజంగా నామటుకు నాకు 'దేవుడు లేడు' అని ఖచ్చితంగా చెప్పటానికి ఎంతో గుండె ధైర్యం ఉండాలని పిస్తుంది. 'దట్స్ వై ఐ సింప్లీ ఎడ్మైర్ యువర్ కరేజి మై డార్లింగ్.' అన్నాడు కాంతారావు కూడా నవ్వేస్తూ.
'ఇక్కడ ఉన్న యీ సామాన్య జనాన్నంతటినీ చూడండి. వాళ్ళ ముఖాల్లో ఎక్కడైనా భక్తీ అనేది కనపడుతోందా? వీళ్ళంతా ఎన్నడూ బడి ముఖం ఎరగని వాళ్ళు. ఎక్కడో మారుమూల పల్లెటూర్లో కూలి నాలి చేసుకుని బ్రతుకేవాళ్ళు. సరదాగా ఊళ్ళు చూసొద్దామని టూరిస్టు బస్సును ఏర్పాటు చేసుకుని ఊళ్ళన్నీ తిరుగు తున్నారు. వీళ్ళకు హైదరాబాద్ లోని చార్ మీనార్ ని చూసినా, మద్రాసు దగ్గర మహాబలి పురాన్ని చూసినా, గోవిందరాజు దేవాలయం చూసినా, మైసూర్ లోని బృందావన్ గార్డెన్స్ చూసినా -- ఏం చూసినా వాళ్లకు కలిగే అనుభూతి ఒక్కటే! ఆశ్చర్యం , అంతే! ఎ పుణ్య క్షేత్రాలన్నీ చూసి యింటికి వెళ్ళేక వాళ్ళు చెప్పుకునేది పక్షీ తీర్ధంలోని పక్షులు ప్రసాదాన్ని భుజించటం , కంచి లోని బంగారపు బల్లులను ముట్టుకున్నప్పటి అనుభూతి, బీచ్ వడ్డున నిల్చుని చూసిన సముద్రం.... యివే! వాళ్లకు అంతకుమించిన ఆలోచన ఉండదు. నిజానికి ఆచరణ లో అందరూ నాస్తికులే! భావాల్లోనే 'ఆస్తి నాస్తి' అన్న విభేదం కనపడుతుంది. 'నారు పోసిన వాడు నీరు పొయ్యడా?' అంటూ ఎవరూ దేవుడి మీద భారం వేసి చేతులు ముడుచుకుని కూర్చోరు. తమ ఉదర పోషణార్ధం , మానసిక వికాసం కోసం , అత్మౌన్నత్యం కోసం మనిషి జీవిత కాలమంతా కృషి చేస్తూనే ఉంటాడు. ఎవరో ఒక అదృశ్య వ్యక్తీ తనని పాలిస్తున్నాడని, రక్షిస్తున్నాడని అన్న ఆలోచన అతని కా సమయంలో రానేరాదు. ఇలాంటి ఆలోచనలు, దేవుడున్నాడా లేడా అన్న చర్చలు మనలా సోమరిగా తిని కూర్చునే వాళ్ళకి, లేదా అతిగా పుస్తకాలు చదివి, అతి తెలివి తేటలను పెంచుకున్న వాళ్ళకు మాత్రమే వస్తయ్. అందుకే నాకనిపిస్తుంది నిజంగా భగవంతుడనేవాడు ఉంటె అయన గుళ్ళోనో, గోపురాల్లోనో లేడు. ఏ భావ వికారమూ లేకుండా చెమటోడ్చి కష్టపడే శ్రమ జీవులలోనే భగవంతుడున్నాడనిపిస్తుంది.' అంది కళ్యాణి. అలా అంటుంటే కళ్యాణి కంఠం బరువుగా కంపించింది.
