Previous Page Next Page 
ముద్ద మందార పేజి 14

 

    భాస్కరం వచ్చి , రమణ వెళ్ళిపోయినట్టు చెప్పిన తరువాత నెమ్మదిగా లేచాను. జీవచ్చవం లా పక్క మీంచి లేచాను. ఏవిటో దొంగ బ్రతుకు. ఏనాటి కైనా రమణకు నా ముఖం చూపించి తీరాలి కదా! ఆ మాట తలుచుకోడం తోనే నాలో పరికితనం ప్రవేశిస్తుంది.    
    భాస్కరం నా పక్కన మంచంమీద కూర్చుంటూ, "నువ్వే లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటూన్నావోయ్. బాగా చిన్న వయసులోనే విషయాలు తేల్చి చెప్పేస్తే పోయుండేదా-- ముదర పెట్టావు. మనుష్యులతో పాటు మనస్సులూ ఎదిగాయి, ముదిరాయి . ప్చ్" అన్నాడు.
    "అవును నాకూ అదే భయంగా వుంది. కానీ గతం గతమే కదా! ఇప్పుడు ఆలోచించాల్సింది కర్తవ్యం. ముందు రామంతో చెప్పాలి. తరువాత రమణతో చెప్పాలి. ఇవన్నీ ఎప్పటికి అవుతాయో. అసలు మనచేతుల్లో ఏముంది" అన్నాను.
    "మనిషి తప్పు చేసి హాయిగా తప్పించుకుపోవాలంటే వేదాంతం అంత చక్కగా మరేదీ వుపయోగపడదు. ఈ రకం వేదాంతమే మనిషిని దిగజార్చి చివరికెందుకూ పనికి రాణి వాణ్ణి గా చేస్తుంది" అన్నాడు.
    భాస్కరం చెప్పినది నగ్నసత్యం.
    "చేస్తుందేవిటి , చేసింది అను" అన్నాడు.

                              *    *    *    *
    సూర్యం పెళ్ళి చూపులు తృప్తిగా జరిగాయి. "ఇక నీకు రమణను చూపించాలి కదూ" అన్నాడు భాస్కరం. రమణ సూర్యం ఒకే సినిమాకు వెళుతూన్నారనీ, అక్కడికి వెళ్ళి చూడవచ్చనీ చెప్పాడు. ఇద్దరం కారోదిలి టాక్సీ లో హాలుకు చేరాము. 'ఇంటర్వెల్ లో నేను రమణతో మాట్లాడుతుంటాను. నువ్వు బాల్కనీ నుంచి చూడు" అన్నాడు.
    "అలాగే" అన్నాను.
    ఇంటర్వెల్ లో బాల్కనీ మీద నిలబడ్డాను. క్రింద కూల్ డ్రింక్ షాపు దగ్గర భాస్కరం, సూర్యం , రమణ నిలబడి వున్నారు. నా దృష్టి రమణ మీద నిలిచింది. సుమతి చెప్పినదాంట్లో అసత్యం ఏమీ లేదు. రమణ అచ్చం నా పోలికే!
    నా మనస్సులో సింహాచలం మెదిలింది.
    ఆమె మహా తపస్విని. తనకు పుట్టబోయేది మగపిల్లాడేననీ, అతను ముమ్మూర్తులా నన్ను పోలే వుంటాడని చెప్పింది. అలాగే వున్నాడు. తన జీవితంలో ఆమె కోరిన ఒక్కగా నొక్క కోర్కె -- తన కొడుకు డాక్టర్ అవ్వాలని -- తీరుతోంది. రమణ డాక్టరవబోతున్నాడు.
    గంట గణగణలాడింది.
    భాస్కరం వెనక్కు వచ్చి నా పక్కన కూర్చుంటూ , "దొరలా లేడూ ...జమిందారు కొడుకు  గదా మరి" అన్నాడు. గర్వంతో నా శరీరం బిగిసింది. అవును రమణ జమిందారు కొడుకే! అతనికేం తక్కువ? వున్న పళంగా కారు కూడా కొనివ్వ గలను.
    కానీ, తను నా కోడుకైనట్టు చెప్పగలనా!
    "రామం -- నీకు ఒక అన్నయ్య వున్నాడు అతనూ నీలాగా డాక్టర్ చదివినాడు. అతన్ని నువ్వు అన్నగా స్వీకరించి తీరాలి" అని జెప్పగలనా!!
    ఆ ప్రశ్నకు సమాధానం ఆలోచించుకోబోయే సరికి భయం వేసింది.
    అట విడిచిపెట్టే లోపునా బయటికి వచ్చేసి, యిల్లు చేరాము. ఆరాత్రి నా నిత్యకృత్యమయిన బాధ నేననుభవించాను.

                                *    *    *    *
    అమర్నాడు నూజివీడు వచ్చేశాను.
    మళ్ళీ నేనూ, నా యాంత్రిక జీవితం మొదలు. గతం భయంకరం-- భవిష్యత్తు అంతకన్నా దారుణం.....ముందు నుయ్యి వెనుక గొయ్యి సామెతగా అయ్యింది నా పని.

                                *    *    *    *
    రాములూ, సింహాచలం తోటంతా మందారవనంగా మార్చారు. ఇళ్ళన్నీ శుభ్రం చేయనిస్తారు గానీ, బాబుగారు ఆ మేడ మీద మూల మలుపులో రూమెందుకెప్పుడూ తాళాలైనా తీయరు" అంటోంది ఓనాడు సింహాచలం రాములుతో. రాముడి నవ్వు నాకు వినిపించింది. ఏమి చెప్తాడోనని అక్కడే నిలబడ్డాను.
    "పిచ్చిదానా! అందులో ఏదో ధనాగారం వుండుటుంది. అయ్యగారూ, రామయ్యా తప్ప ఎవ్వరూ వెళ్ళరు చూడు" అంటున్నాడు రాములు.
    నేను తిన్నగా ఆరూము తాళం తీసి లోపలకు జోరపడి, తలుపు గడియ వేశాను. ఎదురుగా యింకా కొంచెం పూర్తీ చేయవలసిన సింహాచలం తైలవర్ణచిత్రం వుంది. కుర్చీలో కూర్చొని బ్రష్ తీసి చేత్తో పట్టుకున్నాను.

                                                         *    *    *    *
    ఆనాటితో ఆ బొమ్మ వేయడం పూర్తీ చేశాను. రామయ్యను పిలిచి గోడకు పెద్ద మేకు కొట్టమన్నాను. రామయ్య మేకు తెచ్చి విశ్వప్రయత్నం చేశాడు. అతని సాయంతో మేకు కొట్టడం పూర్తీ చేశాను.
    "రామయ్యా, యీ పటానికి సరిపోయే దండ కేవలం మందార పువ్వుల తోనే కట్టించి గమ్మున పట్రా" అన్నాను. 'అలాగే బాబూ" అంటూ రామయ్య వెళ్ళి పోయాడు. నేను పెయింటింగ్ కేసి చూశాను.
    నోట్లో గడ్డి పరక పెట్టుకుని, మిలమిలా మెరిసే కళ్ళతో కిలకిలా నవ్వుతున్నది సింహాచలం!!
    జేబులోంచి రుమాలు తీసి పెయింటింగ్ శుభ్రంగా తుడిచాను. ఆ పెయింటింగ్ లోంచి సింహాచలం నాకేసి చూసినట్టయింది. నాలో ఉన్నట్టుండి ఉద్రేకం కలిగింది.
    గమ్మున సింహాచలం పెదిమల మీద ముద్దు పెట్టుకుని, అంతలోనే సిగ్గు పడ్డాను. ఇంతలో రామయ్య దండతో వచ్చాడు. దండ దానికి వేసి , పటాన్ని మేకుకు తగిలించాము. "రామయ్యా యీ బొమ్మ ఎవరిదీ అనే కదూ నీ సందేహం? ఇది ఒక పవిత్ర మూర్తిది. రోజూ లేచి నమస్కరించదగిన మూర్తి. అంతే-- అంతకుమించి సమయం వచ్చినపుడు చెప్తాను" అన్నాను.

                                     8

   
    మరునాడు టపాలో రామం వద్ద నుంచి, భాస్కరం వద్ద నుంచి ఉత్తరాలు వచ్చాయి. రామం ఉత్తరం పక్కన పెట్టి, భాస్కరం కవరు చింపి ఉత్తరాన్ని తీశాను. ఉత్తరంలో మరో వుత్తరం ఉంది. అది భాస్కరానికి రమణ రాసింది.
    ....మీరు చెప్పరాని రహస్యమేదో దాస్తున్నారు. నాకు చాలా ఆత్రంగా వుంది. కనీసం ఆ విషయమై నాకు తెలియజేయండి. ఓనామలు మొదలు యంబిబియస్ వరకు నన్ను చదివించిన పుణ్యాతుడ్ని నేను చూడలేకపోతే నా జన్మ వృధా, చదువు వృధా అవుతుంది -- మీ పాదాలు పట్టుకుంటాను. నేనిక యీ మానసిక వ్యధ కు గురి కాలేను. నిట్టుర్చాను.
    భాస్కరం రాసిన భాగం తీశాను.
    "-- ఈ దాగుడు మూతలు మాని, యిప్పటి కయినా నిజం చెపితే అందరికీ మంచిది. లేకపోతె అతను పిచ్చివాడై పోతాడేమోనని భయంగా వుంది. ఆ తరువాత నువ్వూ నేనూ చేయ గలిగిందేమీ లేదు. ఇప్పటి కయినా నీ పిరికితనానికి స్వస్తి చెప్తే మంచిది. అతని ముఖం చూడడానికే భయంగా వుంది. నీ అనుమతయితే డబ్బు నాకు , నువ్వే యిస్తున్నట్టు నిన్ను కలుసుకుంటే, విశేషాలు తెలుస్తాయనీ చెప్తాను. ఈ పద్దతి మంచిదో, కాదో నాకు తెలియ జై-- కాలం వృధాగా పాడు చైడం మంచిది కాదు. అతను మానసికంగా చాలా బాధ పడుతున్నాడు....."
    నుదుట పట్టిన చమట తుడుచుకున్నాను.
    రామం ఉత్తరం చదివాను. పరీక్షలు బాగా రాసినట్టు రాశాడు. ఒక వారం రోజుల్లో వస్తానని రాశాడు. ఉత్తరం బల్ల మీద పడేసి, కుర్చీలో కూలబడ్డాను. తన కోక అన్నయ్య ఉన్నట్టు తెలిస్తే, రామం వూర్కుంటాడా! అంతటి నీచుడునని తెలుస్తే నా మీద యిదివరకు వున్న ప్రేమానురాగాలుంటాయా!!
    రామం అసలే కోపిష్టి.
    నా మనస్సు రామం చిన్న తనం మీదకు పోయింది.
    "....... రామానికి మూడు సంవత్సరాలు వచ్చేవరకూ నేను పెళ్ళి విషయం తలపెట్టలేదు. నాన్నగారూ, వారి స్నేహితులూ, నా స్నేహితులూ చుట్టాలు నన్ను పెళ్ళి చేసుకోమని బలవంత పెట్టడమే కారణం. పదిమందీ కలిసి ఒకటి చెయ్యమని బలవంత పెడితే అది చైబుద్ది కాదంటారు. అలాగే వద్దన్నపని చై బుద్ది అవుతుంది కూడా. నా పరిస్థితి అలాగే అయ్యింది.
    గడచిన మూడేళ్ళ లోనూ నాన్నగారు చాలాసార్లు చెప్పారు. చెప్పించారు. నాకు వివాహమంటేనే భయం వేసేది. అనేకసార్లు గోపాలపూర్ వెళ్ళి సింహచలాన్ని చూడాలని పించినా , వెళ్ళడానికి ధైర్యం చాలేది కాదు. నాన్నగారి క్రిందే పని చేయడం వల్ల వెళ్ళాలంటే తనకు చెప్పాలి. ఏ కారణమూ లేకుండా ఏదో స్నేహితుణ్ణి చూడడాని కంటే-- "ఇలాటి వాటి మీద కష్టార్జితం తగలెయ్యడం నా కిష్టం లేదు" అంటారు నాన్నగారు.
    ఓరోజు నాన్నగారు నన్ను పిలిచి "అబ్బాయ్! చేస్కో చేస్కో అంటే చేస్కోను చూస్కో , అని పంతం పట్టి నువ్వా సంగతసలు మాట్లాడటం లేదు. నేను యివాలా, రేపో హరీ మంటాను. నువ్వీ లోకంలో ఏకాకివయిపోతావు. ఒక మనిషికి కనీసం ఒక అత్మీయుడైనా అవసరం యీ లోకంలో. నా అనుకునే వస్తువు-- అంటే ఒక ప్రాణి అనుకో-- అవసరం. నీకు వయస్సేమీ విపరీతం అవలేదు. నీ వయస్సు వాళ్ళింకా వివాహాలు చేసుకొని వాళ్ళే వున్నారు. ఆలోచించుకో! ఆ పసికందును వాళ్ళు ఎన్నాళ్ళు పెంచుతారు? నువ్వు ఎలా పెంచగలవు? నిన్ను బలవంతం చైడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు" అన్నారు.
    నాన్నగారి మాట కాదనలేక, తల వూపి, పెళ్ళి చేసుకోడానికి కిష్టం లేకపోయినా, "అలోచించి చెప్తా నండి" అన్నాను. ఆ మాత్రానికే నాన్నగారు ఆనందపడ్డారు.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS