Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 14

 

                             

    శ్రీనివాస్ తిరిగి ఇలా అన్నాడు.
    "కాని దురదృష్టవశాత్తు ఓ రోజు రాత్రి నేను డ్యూటీలో ఉన్నాను. మామూలుగా అవసరమయ్యే విషయాలు మేమే చూడాలి. మరీ సీరియస్ కేస్ ఏదైనా ఉండి అవసరం ఉంటే పెద్ద డాక్టర్ని పిలవాలి. ఆ రాత్రి ఆ అమ్మాయి చాలా ప్రమాద స్థితిలో ఉంది. ఉన్నట్లుండి కోమా వచ్చి, అలాగే ప్రాణం పోయింది. అంతకు ముందే నాకు చెయ్యాలని తోచినవన్నీ చేశాను. కాని భయంతో డాక్టర్ కు కూడా కబురు చేశాను. కాని ఆయన వచ్చేసరికే ఆ అమ్మాయి ప్రాణం పోయిందిట! డాక్టర్ వచ్చి చూచి వెళ్ళిపోయాడు. కాని ఆ అమ్మాయికి ఇవ్వవలిసిన ఆఖరి ఇంజక్షన్ కూడా నేనివ్వలేకపోయాను! ఆ బెడ్ దగ్గిరికి వెళ్ళి చూచే ధైర్యం నాలో లేకపోయింది. ఇంజక్షన్ నర్సుని ఇమ్మని ఆ హాస్పిటల్ ఆవరణలో కూడా ఉండకుండా వెళ్ళిపోయాను! మరునాడు మా సీనియర్ డాక్టర్ వచ్చి నేను చేసిన పనికి మొహం వాచేలా చివాట్లు పెట్టాడు. చెయ్యవలసిన పనులన్నీచేసి చివరి సమయంలో దగ్గిర ఉండకుండా వెళ్ళడం డాక్టర్ చెయ్యవలసిన పని కాదన్నాడు. అదే నా మొదటి పొరపాటు కావడంతో, రికార్డు దాకా వెళ్ళలేదు. మా డాక్టర్ అంతచెప్పి చివరికి "మనం చెయ్యవలసినదంతా మనం చేశాం. ఆ అమ్మాయికి అదృష్టంలేదు" అన్నాడు సామాన్యంగా. కాని నేనంత తేలికగా తీసుకోలేకపోయాను. ఆ సంఘటన దాటిపోవడానికి చాలాకాలం పట్టింది. ఎప్పటికప్పుడు నా నిర్ణయం మా నాన్నకు చెప్పెయ్యా లనుకునేవాడిని.
    "కాని ఆ పని చెయ్యడం నాకు చేతనయ్యేదికాదు. ఇలాటి ఒడిదుడుకుల తోనే నా చదువు పూర్తి అయింది. కాని వీటన్నిటికంటే నన్ను విపరీతంగా కదిలించింది మా నాన్నగారి మరణం. మా అమ్మకు ఒంట్లో బాగాలేదని తెలిసేటప్పటికి గుంటూరు వెళ్లాను. మా అమ్మ మరీ అనారోగ్యంగా లేకపోవడంతో రెండుమూడు రోజులు కులాసాగా జరిగిపోయింది. ఆ సాయంత్రం నాన్న మామూలుగా ఏడు గంటలకు ఇంటికి వచ్చారు. కాస్సేపు కబుర్లతో గడిపి, ఇద్దరం భోజనానికి కూర్చున్నాం. కాని ఆయన మొదలుపెట్టకుండానే చివాలున లేచి వరండాలోకి వెళ్ళారు కొద్దిగా తూలుతూ. అది చూచి హడావిడిగా ఆయన వెనకనే నేను వెళ్లాను. క్షణంలో ఒళ్లంతా విపరీతమయిన చమటలు పోశాయి. పల్స్ చూస్తూంటేనే ఆయన గురికాబోతున్నది దేనికో చులాగ్గా తెలుసుకోగలిగాను. ఆయనకు చెయ్యవలసిన ప్రథమ చికిత్స చేసి, వెంటనే గుంటూరులో నిపుణులను పిలవడం, వాళ్ళు రావడం అన్ని జరిగిపోయాయి. అప్పటికే నాలో ఉత్సాహం అంతా చచ్చి పోయింది. జరగబోతున్నది గ్రహించుకునేటంత శక్తి లేకపోయింది. ఆ క్షణంలోఅక్కడనుండి పారిపోవాలన్నంత పిరికితనం నన్నావహించింది. డాక్టర్ గా డ్యూటీ తోనో, కొడుకుగా ప్రేమతోనో కట్టుబడిపోయాను. ఆ క్షణంలో నేను అక్కడ ఉండకుండా ఉంటే ఎంత బావుండునో అనికూడా అనిపించకపోలేదు. ఆఖరికి ఆ సమయంలో డాక్టర్ గా చివరికి మా నాన్నకు ఇచ్చిన ఇంజక్షన్ కూడా నేనే ఇవ్వవలసి వచ్చింది. కొంతసేపటికి ఆయన పరిస్థితి బాగుపడడం చూచి హార్ట్ ఎటాక్ వచ్చి తగ్గుతూందని ఆశించాము. బాగా విశ్రాంతి అవసరం అని అప్పటికప్పుడు గది అది ఏర్పాటు చేశాము. మరో అరగంటకు ఇంకో ఎటాక్ రావటం, ఆయన ప్రాణవాయువులు అనంతంలో లీనమయిపోవడం క్షణాలలో జరిగాయి. ఆ క్షణంలో ఒక డాక్టరుగా ఉండవలసి వచ్చినందుకు ఎంత అసహ్యించుకున్నానో! జరగబోతున్నది తెలిసి, చెయ్యవలిసినదేదో తెలిసి, ఆ రోజు మా నాన్నను బ్రతికించలేకపోయినందుకు నాలో నామీద నమ్మకం పూర్తిగా తగ్గిపోయింది. ఆ మార్ఫియా ఇంజక్షన్ ఇవ్వడంవల్ల ఏమయినా నష్టం జరిగిందేమోనన్న బాధ ఒకపక్క వేధించింది. కాని అలాటి ఆలోచనకు తావులేదన్న సంగతి తెలిసికూడా దాన్ని మళ్ళించలేకపోయాను. ఆరోజుఅక్కడికి వచ్చిన డాక్టర్లు అందరూ పెద్ద పెద్ద హేమా హేమీలు. కాని అంతా అయిపోయింది. నాకే ఇష్టంలేని ఈ విద్యకు కారకుడయిన వ్యక్తిని కనీసం కొద్ది రోజులుకూడా బ్రతికేందుకు ఏవిధంగానూ తోడ్పడలేక పోయాను.అప్పటికప్పుడు ఆ ప్రదేశంనుండి దూరంగా పారిపోవాలని ప్రయత్నించాను. కాని ఒక్కగానొక్క కొడుకుగా నా ధర్మం, ఆయన కోరిక నిర్వర్తించడానికి కదలలేకపోయాను! నాలో ఎప్పుడు ఉన్నా, అప్పటితో ఆ నమ్మకం ఎక్కువగా బలపడిపోయింది. 'నేను డాక్టరుగా పనికిరాను. ఆ వృత్తి నాకు సరిపడదు' అని నిర్ణయించుకున్నాను. దానికి ఇక తిరుగు లేదనుకున్నాను. కాని..."
    "కాని మీరిలా అర్ధంలేని అనుమానాలతో, భయాలతో మీ విద్యను వృథా పోనిస్తున్నారని నా నమ్మకం. మీరు ప్రయత్నిస్తే తప్పకుండా వృద్దిలోకి వస్తారు."
    "ఇంతగా, ఇన్ని విషయాలు విన్నాక అంతా అర్ధంలేనిదిగా అనిపిస్తూందా, అనూరాధా!" అన్నాడు బాధగా.
    "మీరిలా బాధపడటం నాకు సబబుగా తోచడంలేదు, శ్రీనివాస్. ఇంత చదువుకున్నారు. ఎంతమందికో ఉపకారం చెయ్యవలసినవారు మీరిలా అనుమానాలతో వెనకంజ వెయ్యడం నేను ఊహించలేను."
    "ఊహించక్కరలేదు, అనూరాధా! నా నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారి పోతూనే ఉన్నాయి. అదికూడా నాలో బలహీనతే ఏమో! మా నాన్నగారి ఆఖరిక్షణాలు నా చేతులలో జరగటం ఎంతో అదృష్టం అన్నారు. బంధువులంతా దేవుడే పంపాడా అన్నట్లు ఆ సమయానికి వచ్చానన్నారు. కాని ఆ క్షణంలో నా బాధ ఎవ్వరికీ అర్ధంకాలేదు.
    "మా నాన్నగారు పోయాక, ఆ పద్ధతులు తెలిశాక నాకు పూర్తిగా మన ఆచారాలు, ధర్మాలు అంటే అసహ్యం పుట్టిపోయింది. పూలదండలతో, అశేష జనసమూహంతో ఆనందంగా వెళ్ళిన మా నాన్నగారు ఎప్పుడు అదృష్టవంతులే! కాని మిగిలిపోయిన మా అమ్మమాత్రం .... భర్త పోయి ఒక స్త్రీ అఘోరిస్తూ ఉంటే మన హైందవాచారాలు, పద్ధతులు ఎంత క్రుంగదీస్తాయో ఆలోచించండి. అంతవరకు ఎంతో పవిత్రంగా ఉన్న స్త్రీని ఆ క్షణంనుండి చూస్తే తప్పు! ఎదురువస్తే తప్పు! ఆమె తిరిగిన పక్కకి తిరగడం తప్పు. నాకీ విషయాలన్నీ పిచ్చెత్తించేశాయి! ఆ వాతావరణం నుండి పారిపోవాలనిపించింది. కాని నాకంటే ఎక్కువమనస్తాపాన్ని అనుభవిస్తున్న మా అమ్మకు దగ్గిరగా ఉండటం కనీస ధర్మంగా తోచింది. దానితో అక్కడే ఉండిపోయాను.
    "ఆరు నెలలు గడిచిపోయాయి, మా బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరే కనిపించినప్పుడల్లా 'ఏం చేయబోతున్నావు? ప్రాక్టీసు ఎప్పుడు పెడతా?' వని అడగటం ప్రారంభించారు. నాకు ఏం చెప్పాలో తోచేదికాదు. నేను డాక్టరు కావాలని కాంక్షించిన వ్యక్తి ఎలాగూ లేరు. నేను ఇంక ఎందుకు నా కిష్టంలేని పని చేయాలని పించేది. కాని మా అమ్మ ప్రతిరోజు చెప్పే మా నాన్న కబుర్లలో, ఆయన ఎంతగా నా చదువును గురించి కలలు కన్నారో, నేను పెట్టబోయే ప్రయివేట్ ప్రాక్టీసు ను గురించి ఎన్ని ప్లానులు వేశారో అన్ని చెప్పి, చివరకు 'ఆయన కోరిక నువ్వెట్లా తీరుస్తావో?' అనేది. మా నాన్న కోరిక నెరవేరాలని మా అమ్మకు కూడా బాగా ఉండేది.వీటన్నిటితో, బయటినుండి వచ్చే ఒత్తిడితో నాలో మళ్ళీ సంఘర్షణ ప్రారంభమయింది. వైద్యవృత్తి ప్రారంభించడమా? మానడమా? మా నాన్నగారి ఆత్మ శాంతికి, మా అమ్మ మనస్సంతృప్తికి మొదలుపెట్టడమా? మౌనంగా ఊరుకో వడమా? తిరిగి ఎప్పటి బలహీనతే నాలో తలఎత్తింది. చివరకు ప్రాక్టీసు మొదలుపెట్టాను. మా నాన్న ఆ ఊరిలో ముఖ్యులవడంమూలంగా, చిన్నప్పటినుండి పుట్టి పెరిగిన ప్రదేశం అవడంతో బాగానే ప్రారంభమయింది.
    "ఒక రోజున విపరీతంగా వాన కురుస్తూంది. వాతావరణం బాగా చీదరగా ఉంది. ఆ పూట హాస్పిటల్ లో పని ఎక్కువగా ఉండటంతో బాగా అలిసిపోయి ఇంటికి వచ్చాను. అప్పటికే ఎవరో ఒక పది పన్నెండేళ్ళ అమ్మాయి ఏడుపు ముఖంతో, మడి కారుతూ, జాలిగా, బాధగా నుంచుని ఉంది. ఆ పూట హాస్పిటల్ లో పని ఎక్కువగా ఉండటంతో బాగా అలిసిపోయి ఇంటికి వచ్చాను. అప్పటికే ఎవరో ఒక పది పన్నెండేళ్ళ అమ్మాయి ఏడుపుముఖంతో, మడి కారుతూ, జాలిగా, బాధగా నుంచుని ఉంది. ఆ అమ్మాయిని చూడగానే కొంచం చిరాకనిపించింది. ఆ పిల్ల తల్లికి జబ్బుగా ఉందిట! ఒక్కసారి చూచి వెళ్ళమని కోరింది. కాదనలేక ఆ పిల్లను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లాను. నీళ్ళు కారు తున్న గుడిసె పొగచూరిన దీపంతో కళా విహీనంగా ఉంది. ఒక మధ్య వయస్కురాలు మంచంలో పడిఉంది. ఆమెను పరీక్షించి, నాకు తోచింది నేను చేస్తున్నాను. ఇంతలో ఎక్కడో పిడుగు పడింది! నేను ఉలిక్కిపడ్డాను. ఎక్కడో కుక్కలు మొరుగుతున్నాయి. మిణుకుమిణుకుమంటున్న దీపం ఆరిపోయింది. చేతిలో ఉన్న ఆమె చెయ్యి చల్లబడింది. ఆ క్షణంలో నాలోని భావాల ఘర్షణ చెప్ప నలివికాదు! ఆ చావు నాకు మూడో పరీక్ష. దానితో అక్కడ నిలబడే శక్తీ కూడా లేకపోయింది. చివాలున లేచి మందు పెట్టెకూడా తీసుకోకుండా బయటికి వచ్చాను. ఒక డాక్టరుగా నా విధ్యుక్త ధర్మం నిర్వర్తించుకోలేకపోయినా, కనీసం మానవత్వమున్న మనిషిలాకూడా ప్రవర్తించలేకపోయాను. ఆ విధంగా తయారుచేసింది నా బలహీనత భయం కరంగా ఉన్న వాతావరణంలో, చీకటి చిందులు వేస్తున్న ఆ యింట్లో తల్లి పోయి హృదయవిదారకంగా విలపిస్తున్న పదేళ్ళ బాలికను ఓదార్చాలన్న జ్ఞానం కూడా నాకు లేకపోయింది. కనీసం మరొక మనిషి ఆ అమ్మాయికి ధైర్యాన్ని చ్చేందుకు, తోడుగా నిలిచేందుకు వచ్చేవరకుకూడా నిలబడలేకపోయాను.
    "అదే ఆఖరు.... మా నాన్నను నిరుత్సాహపరుస్తున్నా ననుకునందుకు ఆయన ఎలాగూ లేరు! మా అమ్మను ఎలాగైనా ఒప్పించగలను. కాని అంత ఓర్పు నాలో లేకపోయింది. ఆ మరునాటి మరునాడు అక్కడినుండి, ఆ ఊరునుండి లేచి వెళ్ళిపోయాను. ఓపిక ఉన్నన్నాళ్ళు ఊళ్లు తిరిగాను, ప్రతీది నాకు సంతోషానికి బదులు మనస్తాపాన్నే కలిగించసాగింది. ఈ తిరుగుతో నా ఆరోగ్యం దెబ్బతిన సాగింది. ఈ ఊళ్ళో నా స్నేహితున్నాడు. అనుకోకుండా ఇక్కడికి రావడం, ఈ ఉద్యోగం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా మనసుకు కలుగుతున్న సంతృప్తి నా జీవితంలో మరెన్నడు కలగలేదు."
    "మీలాంటి విద్యాధికులు ఇలాంటి కారణాలతో వెనకంజవేస్తూంటే మన దేశానికి ఎంత నష్టమో ఆలోచించారా?"
    "నాలాంటి ఒక్కడివల్ల కలిగే లాభంకంటే, జరిగే నష్టమే ఎక్కువ. అనూరాధ! అయినా మన దేశంలో సంవత్సరానికి వేలకొలది డాక్టర్లు తరారవుతున్నారు. నాలాంటి ఒక్కడివల్ల నష్టమేమీ జరగదు."
    "అదేమన్నమాట! వైజ్ఞానికంగా మన దేశం ఎంత వెనకగా ఉందో మీకు తెలుసు, దేశోన్నతి ప్రతిఒక్కరు మూలాభారం అవుతారు. చూడండి, చిన్న చిన్న ఇసుకరేణువులు. చిన్న చిన్న నీటిబొట్లు అనంత మయిన ఈ విశ్వాసానికి ఈ మహా సముద్రానికి మూలం కాదంటారా? ప్రతి ఒక్క వ్యక్తి అవసరం ప్రపంచానికి ఉంది."
    "........."
    మౌనంగా ఉండిపోయిన శ్రీనివాస్ ను చూచి ఆలోచనలతో మునిగిపోయింది. ఎక్కడో విహరిస్తూ, ఆలోచనానిమగ్నమయిన ఆమె ముఖం చూడసాగాడు. పచ్చని ముఖంమీద చీకటి తెర పడి క్రీనీడగా కనిపిస్తూంది. చిరుగాలికి ముందు జుట్టు ముఖంమీద పడి అల్లలాడుతూంది. నిశ్చలంగా ఎటో సారించి ఉన్న దృక్కులలో ఆశ్చర్యం, ఆనందం, అనుమానపు తెరలు పొడలు చూపుతున్నాయి. కోలముఖం, నున్నటి చంపలు, పొడుగాటి నాసిక-ఆమెను చూస్తూ ఉంటే, అప్పటి వరకు బహుమార్గాలలో విహరించిన శ్రీనివాస్ భావాలు కొత్తదోవ తొక్కాయి. ఆమెను ఒక్కసారి హృదయానికి బలంగా హత్తుకుని గట్టిగా ముద్దుపెట్టుకోవాలన్నంత ఆవేశం కలిగింది. తనలోని కోరికల్ని అదుపులోకి తెచ్చుకుంటూ అకస్మాత్తుగా కారు స్టార్టుచేసి "ఇక వెడదాం" అన్నాడు. మౌనంగా అతనివంక చూచింది అంగీకారసూచకంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS