రమేశ్ బదులు పలకలేదు. అతడి మౌనంతో కలవరపడి, రత్న అతడి వైపుకు చూసింది. రమేశుడి మొహం చిన్నబోయింది. గాలికి అతడి ముంగురులు ఎగిరి అతడి నుదుటి మీదికి పడుతున్నాయి.
వాత్సల్యంతో రత్న-హృదయం పొంగి పొరలింది. అతడి నుదుటి మీదకు పడ్డ జుట్టును వెనక్కు తోసి, అతడి చేతిని తన చేతిలోకి తీసుకోవాలనిపించింది.
కాని, ఎలాంటి సమయంలో నయినా తన మనస్సును తన అధీనంలో ఉంచుకోగల శక్తి ఉంది ఆమెకు.
"రమేష్ ......"
"ఏమిటి ?"
"నేను చెప్పింది నిజంకాదా?"
"కొంచెం మాత్రమే నిజం. కాని, అందరి విషయంలోనూ నేను ఇలాగే ఉంటాననుకోండి. మీ విషయంలో మాత్రం నా హృదయం దుర్భరంగా ఉంది."
"అది చాలా తప్పు."
"ఎందుకు?"
"ఎందుకో మీకు తెలియదా? ..... మీ రనుకుంటున్నంత మంచిదాన్ని కాను నేను. నా ప్రవర్తనా, మాటా అంతా నటన ....."
"రత్నా !......"
రత్న మాట్లాడకుండా కూర్చుంది.
"నన్నెందు కిలా బాధపెడుతున్నారు? మీరు ఎలాంటివారైనా సరే; నా మట్టుకు నాకు సరిగ్గానే ఉన్నారు. నా కింత బుద్ది చెబుతున్నారే ..... ఉ ....... ఏం లేదులెండి."
"ఏమిటో చెప్పండి."
"మీకు తెలీదా? నేను చేసిన తప్పునే -అది తప్పని మీరు అనుకుంటున్నట్టయితే- మీరు చేయటం మంచిదే నంటారా?"
ఎదురు - ప్రశ్న వేశాడు రమేశ్.
"నాదంతా ఒట్టి నటన అని చెప్పాను కదా! కాలేజీలో చదివేటప్పుడు 'మంచి నటి' అని నాకు పేరుండేది. ఒకవేళ నేను నటించటంలేదని మీరు అనుకున్నా, జీవితంలో నాకున్న అనుభవంలో నూరో వంతు కూడా మీకు లేదు. నేను జీవితం నుండి ఏమీ ఆశించను. ఎంతటి వ్యధ, నిరాశ ఎదురయినా, ఎదిరించగల ధైర్యం నాకుంది. ఆ దృష్టితో చూస్తే, మీరింకా ఓ పసి పాపాయి అనే చెప్పవచ్చును. ఒక చిన్న ఎదురుదెబ్బను కూడా తట్టుకోలేరు. నా సంగతలా ఉంచండి; మిమ్మల్ని గురించే నా బెంగంతాను."
మాయానగరపు ముఖద్వారంలా ఉన్న మబ్బుల వెనక సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుని అరుణకాంతిని అప్పు తెహ్చ్చుకుని, మబ్బులు బంగారు రంగును పులుముకున్నాయి. ఆకాశపు టంచులో సూర్యుడు శక్తి హీనుడిలా క్షణక్షణానికి కృంగిపోతున్నాడు. అతడి అస్తమయంతో, సూర్యుని మాయాదండంతో నిర్మించిన మాయానగరం క్షణమాత్రంలో నల్లరంగు పూసుకుని, శత్రువులు లూటీచేసి వెళ్ళిపోయిన రాజధానిలా కళావిహీన మయింది.
రమేశుడి హృదయం వ్యధతో బరువెక్కింది. రత్నవైపు చూశాడు. చీకటిలో ఆమె మొహం కనిపించటంలేదు. ఆమె చెవులకున్న దుద్దులు మాత్రం మెరుస్తున్నాయి.
"జీవితాన్ని అనుసరించి నేను వెళ్ళగలను. ఎలాంటి విషమ పరిస్థితిలోనైనా చిరునవ్వు నవ్వగలను. కాని మిమ్మల్ని గురించిన బెంగ నన్ను వేధిస్తోంది."
రమేశ్ దారి-తప్పిన పసిపిల్లాడిలా "అయితే నన్నేం చెయ్యమంటారు చెప్పండి. మీరు చెప్పి నట్టు నేను వింటాను" అన్నాడు.
"నిజంగానా?"
"ఊ"
"అయితే ఆలోచించి చెపుతాను. ఇంటికి వెడదాం పదండి."
"రమేశ్ లేచాడు. లేచి నించున్న రత్న కళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్న రాతిమీద నడవటానికి మొండికేస్తున్నాయి.
"నేను పట్టుకోనా?"
"వద్దు."
"పడితే మరీ కష్టం. ఈ విషయంలో మీ మాటను అతిక్రమిస్తున్నాను" అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు రమేశ్.
"వద్దు, వద్దు, వదిలేయండి."
"నేను అస్ప్రుశ్యుడినా? నేను పట్టుకుంటే మీరు అపవిత్రులవుతారా?"
"చ! ఏమిటా మాటలు? మీ చెయ్యి మురికవుతుందేమోనని ...."
"అయితే మీ రింకేం బాధపడకండి" అన్నాడు రమేశ్.
ఒకటి రెండు రాళ్ళను దాటాక, రమేశ్ ఆమెకు దగ్గరగా జరిగి, రత్నను తనకు మరింత దగ్గరగా లాక్కున్నాడు. నడుస్తున్న రత్న చటుక్కున ఆగిపోయింది.
"రమేశ్ నన్ను పరీక్షించకండి. క్షణక్షణానికి నన్ను ఆశ పెట్టకండి. నేను మానవమాత్రురాలిని; దుర్భలురాలిని."
మునిగిపోతున్నవారి ఆర్తనాదంలా ఉంది రత్న కంఠస్వరం.
"లేదు రత్నా! నేను మిమ్మల్ని పరీక్షించటం లేదు. ఎలాంటి అగ్నిపరీక్షలో నైనా గెలుపు మీదే కాని నా కొక మధురస్మృతి కావాలి."
"మధుర స్మృతా! నా స్నేహమే మీ కో పీడ కలగా ఉన్నప్పుడు మధురస్మృతి ఎక్కడిది రమేశ్!" "మన భావనలోనే ఉంది అంతా."
సముద్రతీరం నిర్జనమైన మరుభూమిలా ఉంది. చీకటిపడటంవల్ల చాలామంది సముద్రతీరాన్నుండి వెలుగు వైపుకు వెళ్ళిపోయారు.
రమేశ్, రత్న-మోహాన్ని తన రెండు చేతులతోనూ పైకెత్తి పట్టుకుని మండుతున్న తన పెదవులతో, ఆమె చల్లటి పెదవులను చుంబించాడు.
అతడి ప్రేమ ముద్రకు ఆకాశంలోని అసంఖ్యాక తారలు, అగాధమైన జలరాశి సాక్షీభూతాలుగా నిలిచాయి.
రత్న ప్రతిమలా అతఃది చేతులలో ఉండిపోయింది. ఎన్నో రోజులుగా నీళ్ళు లేక, దప్పిగొన్న ఎడారి ప్రయాణికుడు నీళ్ళను చూడగానే తనివితీరా జలపానం చేసినట్టు రమేశ్, రత్న ప్రేమామృతాన్నిపానం చేశాడు.
అల్లరిచేస్తున్న పిల్లాడిని సముదాయించి నట్టుగా అతడి తల నిమిరింది రత్న.
"రత్నా!"
"ఏమిటి?"
"నామీద కోపమా?"
"లేదు."
"అయితే మాట్లాడరేం?"
"మీ రెక్కడ అవకాశ మిచ్చారు నాకు?"
"మీకు కోపం వచ్చింది. కావాలంటే ఫెడీల్మని కొట్టండి. మీరేం శిక్ష విధించినా అనుభవిస్తాను. కాని, నామీద కోపగించుకోకండి" అంటూ రమేశ్, ఆమె చేతిని తన చెంపలమీదుంచుకొన్నాడు.
రత్న అతడి చెంపలను మృదువుగా నిమిరి తన చేతి రుమాల అతడి పెదవులను తుడిచింది.
"నా పెదవులెందుకు తుడిచారు?"
రత్న బదులు-పలకలేదు. అదే రుమాలుని తన నోటికి అడ్డు పెట్టుకుని పొంగివస్తున్న ఏడుపు నాపుకుంది.
వెలుగులోకి రాగానే, రత్న బుగ్గలమీద ప్రవహిస్తున్న కన్నీటి ధారలను చూసి చకితుడయ్యాడు రమేశ్.
"రత్నా!"
"ఏమిటి?"- రత్న ధ్వని మాత్రం శాంతంగా ఉంది."
"మీరు నా తల పగలగొట్టినా సరే. కాని ఏడిస్తే మాత్రం నేను సహించలేను. నా ప్రవర్తనతో మిమ్మల్ని నొప్పించిఉంటే చెప్పండి. రేపే ఊరికి వెళ్ళిపోతాను.
"అలాగే. కాని, మీరు పెదవులపై ముద్రించిన ఈ అమూల్యమైన ముద్రను ఏం చేయను?"
"నాకే తిరిగి ఇచ్చివేయండి."
"ఉహుఁ. మీ కివ్వను."
"అయితే ఏం చేస్తారు?"
"నాలోనే దాచుకుంటాను. ఒక్కొక్కప్పుడు జీవితం శూన్యంగా అనిపించినపుడు అద్దంముందు నిల్చుని మీ ముఖం చూసుకుని జెవెఇథమ్లొ ఉత్సాహం తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తాను."
రమేశ్ మౌనంగా తన చేతిలోని ఆమె చేతిని నొక్కాడు.
వాళ్ళు ఇల్లు చేరేసరికి ఎప్పటికన్నా కాస్తపొద్దు పోయింది. అంత రద్దీగా ఉన్న బొంబాయిలో కూడా తమదే అయిన ఒక ప్రత్యేకమయిన లోకాన్ని నిర్మించుకుని విహరించి వచ్చారు వాళ్ళిద్దరు.
ఇంటికి రాగానే, తన మరాఠీ స్నేహితురాలింట్లో కూర్చున్న ఆశను తీసుకొచ్చింది రత్న.
రమేష్ వచ్చినప్పటినుండి రత్న సహవాసమే అపురూప మయింది ఆశకు. శేషగిరి ప్రొద్దుటే వెళ్ళిపోతే, మధ్యాహ్నం భోజనానికి వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. మళ్ళీ రాత్రి పది గంటల తర్వాతే గాని, వచ్చేవాడు కాదు.
దీనితో ఆశకు తండ్రితో ఎక్కువ స్నేహమే లేకపోయింది. తల్లి వడిలోనే పెరిగిన ఆశకు రమేశుడి రాకతో అదీ దుర్లభ మయింది.
తల్లిని తననుండి దూరం చేస్తున్న మామయ్యంటే ఆశకు కోపంగా ఉంది:
"ఎక్కడి కెళ్ళావమ్మా?" ఆశ అడిగింది.
"దేవాలయానికి."
"ఇంతసేపయిందేం?"
"బస్సు దొరకలేదమ్మా."
తన ప్రతిస్పర్ధిని చూసినట్టుగా రమేశ్ వైపు చూసింది ఆశ. "నువ్వింత ఆలస్యం చేస్తే, నాకు విసుగ్గా ఉంటుందమ్మా" అంది ఆశ.
"ఇక మీదట త్వరగా వస్తాను" అని రత్న భరోసా ఇచ్చింది కూతురికి.
ఆశ కన్నుల్లోని ఆక్షేపణను ఎదురించలేక అటు తిరిగాడు రమేశ్.
నిజమే! ఇంతకూ తనెవరు? వాళ్ళింట్లో కొద్ది రోజులపాటు ఉండి పాత గాయాలు మరచి పోవటానికి వచ్చినవాడు తను. రత్న మధుర స్నేహంలో తన పాత గాయాన్ని మరిచిపోయినా పోవచ్చు కాని, దాని స్థానంలో కొత్త గాయం కాకుండా మానదు.
భవిష్యత్తులోకి చాలా దూరం తొంగిచూసే దైర్యం కలగలేదు రమేశుడికి. కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి వరిగాడు.
రాత్రి శేషగిరి వచ్చేసరికి పదిగంట లయింది. అతడు రాగానే, అందరి భోజనాలు అయ్యాయి. రమేశ్ అయిదు నిమిషాలు శేషగిరితో మాట్లాడి, తరువాత:
"నాకో నిద్ర మాత్ర ఇవ్వండి డాక్టర్" అన్నాడు.
"నిద్రపోవడానికి మాత్ర వేసుకోవలసిన వయస్సటయ్యా నీది" అంటూ నవ్వాడు శేషగిరి.
"దయచేసి ఇవ్వండి."
శేషగిరి ఇచ్చిన మాత్ర మింగి నీళ్ళు తాగి పక్కమీద పడుకున్నాడు రమేశ్.
అతడి కణతలు పగిలిపోతున్నాయి. తన గదికి కొంచెం దూరంలో వెడుతున్న ట్రామ్ కింద పడి ప్రాణం వదిలేయాలన్న తీవ్రమైన కోర్కె కలిగిందతనికి. నిప్పులో పడ్డ పురుగులా పడక మీద పడి దొర్లాడు.
