12
నాకు అతి సన్నిహితమైన మిత్రుల్లో లహరీ ఒకడు. మేం అగర్తలాలో వుండగా అతనొచ్చాడు. అప్పటికి మా ఓ పీ, నలుగురు తెలవాళ్ళు, పాతికమంది భారతీయ సైనికులు వచ్చారు, మాది వర్కుషాపు కావడం చేత అంతా వృత్తి పనివాళ్ళు. మేము భోజనం, క్రమశిక్షణ మొదలైన వాటికి ఆర్. హెచ్, క్యూకి అనుబంధించబడివున్నాం, ఆఫీసులో రెండే సీట్లు. ఒకటి ఓ నీది, రెండోది నాది. వర్కుషాపుకి సంబంధించిన యంత్రాలు, పనిముట్లు, ఉండవలిసినన్ని ట్రక్కులు యింకా లేవు. అంచేత మా సిపాయిలు గార్డు, లంగరు (వంట), రేషన్లు తీసుకురావడం, తవ్వడం. నీళ్ళు మొయ్యడం మొదలైన సామాన్యవైన పన్లు చేస్తున్నారు, లంగరు డ్యూటీలో కర్రలు చీరవలసికూడా వస్తుంది.
లహరీ ఒక వుదయం పదిగంటలకి ఆఫీసులో కొచ్చి ఓ సీకి సెల్యూట్ చేశాడు.
"నాపేరు లహరీ, నేను ఇన్ స్ట్రుమెంటు మెకానిక్కుని. కిర్కీనుంచి వచ్చా...
ఓ సీ అతన్ని యెగా దిగా చూశాడు. అతని కాయితాలు చూశాడు. లహరీ హోదా సిపాయి, మూడో గ్రేడువాడు.
"బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నావా?" ఓ సీ.
"లేదు సర్. ఇదే రావడం. ఇంకా నీళ్ళైనా పోసుకోలేదు."
"సరే. వెళ్ళి స్నానం పానం చేసి కొంత విశ్రాంతి తీసు కో. మూడు గంటలకి ఆఫీసుకి రా..."
"యస్ సర్"
"ఆర్డర్లీ....!" నేను.
ఉర్ ఫాన్ వచ్చాడు.
"ఇతన్ని తీసుకెళ్ళు..."
"అచ్చా సాబ్..."
లహరీ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
"ఈ కుర్రాడు మంచి హుషారు, తెలివిగల వాళ్ళా వున్నాడు." ఓ సీ.
"అలాగే ఔపిస్తున్నాడు."
"ఇంకా వర్కుషాపు పనిలేదు, అందాకా యితనేం చేస్తాడు?"
నేను క్షణం ఆలోచించా. అతన్ని సిపాయిల లైన్లలో తోలేస్తే కర్రలు కొట్టడం పనికూడా వంతువారీగా చెయ్యవలసొస్తుంది. కుర్రాడు చిక్కితే పాలుగారినట్టున్నాడు. అందంగా వున్నాడు. మెట్రిక్కు ప్యాసయ్యాడు. అసలు వర్కుషాపు పని ఆరంభమయే వరకూ అతనికి మోటుపన్లు తగలకుండా చూడాలి. నేనెలా ఆలోచిస్తున్నానో, ఓ సీ కూడా అలాగే ఆలోచిస్తూండాలి.
"మన వర్కుషాపులు తయారయేవరకూ లహరీని ఆఫీసు పనిలో పెడితే...."
"ఆఫీసులో ఏం జేస్తాడు? అతను వృత్తి పనివాడు. ఆఫీసు పని అతనికి నచ్చదేమో? తెలీదేమో...."
నా సైనిక జీవితంలో ఒక విశేషం చూశాను. కమ్మరి, కుమ్మరి వంటి సామాన్య కార్మికుడు మొదలు. పెద్ద ఇంజినీరువరకూ, చేతిలో పని వున్న ఏ తెల్లవాడూ, ఆఫీసులో పడి కాయితాల్లో పొర్లుతూండడాని కిష్టపడడు, కాలూ చెయ్యి బావున్న మగాడికి ఆఫీసులో గుమాస్తా గానో, టైపిస్టుగానో పన్జెయ్యడం అంటే అసహ్యం, నామోషీ. ఆ పన్లు స్త్రీలు, తప్పితే అంగలోపం వున్న మగవాళ్ళు చెయ్యాలి, గంటలకొద్దీ ట్రక్కుల కింద వెల్లకిలా పడుకుని పనిచేసేవాడిని లేతు యంత్రం మీద పనిచేసేవాడిని, గన్నులు, రేడియోలు, వాచీలు, మీటర్లు, మెగ్గర్లు మొదలైనవి బాగుచేసే వాడిని ఆఫీసులొ పన్జెయ్యమంటే ససేమి ఒప్పుకోడు, మగాడు యంత్రాలు తయారు చెయ్యాలి, నడపాలి. బాగుచెయ్యాలి. ఉత్పత్తి చెయ్యాలి. అది వాళ్ళ నమ్మకం. ఈ విశ్వాసం, చైతన్యం, వాళ్ళలో యుద్ధం టైములో మరీ యెక్కువైంది. యుద్ధం ముగిసిన వెంటనే ఇంగ్లండులో గుమాస్తాల ప్రభుత్వం పతనమై లేబరు పార్టీ గద్దెకెక్కడానికి ఈ చైతన్యమే కారణం. అని నాకనిపిస్తున్నది.
"నాకు యిందెట్ల పనెక్కువైంది. అంచేత లహరీ నాకు సాయంగా వుంటాడు. ఉత్తరాలు డిస్పాచి చేస్తాడు."
ఓ సీ మీసంలో వెంట్రుకలు లాక్కుంటూ ముసి ముసి నవ్వు నవ్వేడు.
"ఓ కే, నీ యిష్టం."
అప్పటి నించీ లహరీ ఆఫీసులో నా తోటే వున్నాడు. క్రమేణా వర్కు షాపులు తయారయేయి. అతను తన పనిలోకి వెళ్ళిపోయేడు, నా పలుకుబడి వుపయోగించి క్రమేణా అతని హోదా పెరిగేలా చేసేను. మేం చిట్టగాంగు వచ్చే సరికి అతను, "హవల్దార్ ఇన్ స్ట్రుమెంటు మెకానిక్ గ్ర్ డ్ వన్" అయేడు. నా అభిమతం సిద్ధించింది.
ఒక సాయంత్రం లహరీ ఒక తొమ్మిదేళ్ళ కుర్రాణ్ణి తీసుకొచ్చాడు, నే నప్పుడు మెస్సులో టీ తాగుతున్నా.

"రావ్! చూడీ కుర్రాణ్ణి..."
నేను పరికించి చూశా. ఎక్కడో చూసిన మొహంలా వుంది. కాని జ్ఞాపకం రాలేదు.
"వీళ్ళది చాలా బీదకుటుంబం. ఇతన్ని మన మెస్సులో వుంచుధామా? ఈ పనీ ఆ పనీ చేస్తాడు.
కుర్రాడు సన్నగా వున్నాడు, అంచేత కాస్త పొడుగ్గా అవుపిస్తున్నాడు, ఉంగరాల జుత్తు,
"నీ పేరేవిటి?"
'ఆషూ..."
ఈ వూరేనా.
"కాదు. కొమిల్లా...."
"మీ తండ్రేంజేస్తున్నాడు?"
"ఇతనికి తల్లిదండ్రుల్లేరు. అక్కలున్నారు. చాలా బీదవాళ్ళు, మనమెస్సులో వెయిటరుగా వేస్తే? ఇక్కడే తిండి తింటాడు.....రావ్! ఎలా గైనా నువ్వీ కుర్రాడికి నౌఖరీ యిస్తే, మగ దిక్కులేని వాళ్ళ కుటుంబానికి కనీసం వీడి భారం తగ్గుతుంది. "లహరీ బతిమా లేడు.
"అది సరే. వీడిక్కడేదో పనిజేస్తాడు. మనతోబాటు తింటాడు, కాని వాళ్ళ కుటుంబానికేం ప్రయోజనం?"
"ఫరవాలేదు, ఒకడి తిండి భారం తగ్గుతుంది కదా...."
నే నా లోచించా....
"ఇల్లు దూరమా? "నేను.
"పావుగంట నడక. రోజూ పొద్దున్నే ఆరు గంటల కొస్తాడు. రాత్రి ఎనిమిదికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా రాత్రి వుండిపొమ్మంటే వుండి పోతాడు..." లహరీ.
"ఏం చికో?"
"అలాగే నండి..."
"రోజుకి రూపాయిద్దాం, పైగా యేదో ముట్ట చెపుతూంటాం కదా..."
"చాలా బావుంది...." లహరీ సంతోషించాడు.
"జీతం నెలకొక సారే యిద్దాం..."
"అవును."
"జీతం యితనికిస్తే పారేస్తాడేమో....ఖర్చు పెట్టేస్తాడేమో..." "ఫరవాలేదు. నువ్వు ఆఫీసు నించి ముఫ్ఫై రూపాయిలిస్తే, మనం దానికైదో పదో కలుపుదాం, మొత్తం వాళ్ళింట్లో నే నిచ్చేసా..."
"ఎవరి కిస్తావు?"
"వాళ్ళ పెద్దక్క అంటే రెండో అక్క, ఇక్కడున్న వాళ్ళలో ఆవిడే పెద్దది."
"చాలా పెద్దదా?"
"ఔను."
"నలభై యేళ్ళుంటాయా?"
లహరీ తడబడ్డాడు.
"లేదు లేదు.... చిన్నదే..."
"పదకొండేళ్ళుంటాయా?"
"నన్ను ఫూల్ చేస్తున్నావా?" అయోమయంగా నవ్వాడు.
"గాభరాపడకు. నేను ఆఫీసు వాణ్ణి వివరాలు తెలీకుండా యెలా?"
ఆవిడకి యిరవై యేళ్ళుంటాయి. ఉద్యోగం చేస్తూంది."
"ఆవిణ్ణి కెలా తెలుసు?"
"రావ్! లాయర్లా పట్టుకుని చిత్ర వధ చేస్తున్నావు నీకూ నాకూ మధ్య దాపరికాల్లేవు, అంతా చెప్తా తాపీగా చెప్తా."
చికో యెప్పుడూ మా మెస్సులో లింగూ లింగూ తిరుగుతూండేవాడు. మెస్సు నీటుగా వుంచేవాడు. టేబిలు మీద పేట్లు కప్పులు సర్దేవాడు. మా జోళ్ళు జిగ్ జిగ్ మెరిసేలా పాలిష్ చెయ్యడవంటే అతనికి సరదా. ఏదో పన్జేస్తున్నాం కదా. డబ్బు సంపాదిస్తున్నాం కదా అని తృప్తి. కాని నేను జోళ్ళు తుడవద్దన్నా.
తొమ్మిదేళ్ళ "చి కో తల్లిదండ్రుల దగ్గర ముద్దుగా పెరుగుతూ, చక్కగా బడికెళ్ళి చదూకోవలసినవాడు. మెస్సు వెయిటరు పనిచేస్తున్నాడంటే నాకాశ్చర్యం కలుగలేదు, అక్కడ బీద కుటుంబాల్లో యేడెనిమిదేళ్ళ కుర్రాడు కూడా పనే జేస్తాడు. పనికాకపోతే ముష్టి. "సా య బ్! బోస్కేస్!". ఎవరి ఆకలి తీర్చుకోవలసిన బాధ్యత వాళ్ళదే. వయోభేదం, లింగభేదం లేదు.
13
నేను చిట్టగాంగు చేరిన కొద్ది నెలల్లోనే "పూజా" రోజులొచ్చాయి, బెంగాల్లో దుర్గపూజ చాలా వైభవంగా జరుగుతుంది. నెల రోజులు ముందు నుంచీ ఉత్సవ ప్రయత్నాలారంభమవుతాయి.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినుంచీ పూజ ఆరంభ మవుతుంది. ఇంటింటా దుర్గపూజలు చేస్తారు. ప్రతి వీధిలో కనీసం ఒక మందిరమైనా వుంటుంది.
కలకత్తాలో పూజా వుత్సవాలు చూశాను, చిట్టగాంగు తూర్పు బెంగాలు సరిహద్దు జిల్లా. ఇప్పుడు యుద్ధం ముమ్మరంగా తూర్పు రంగంలోనే సాగుతూంది. అంతవరకూ శత్రువుల వశంలో వున్న ఇంఫాల్, "కాక్సస్ బజార్" రామూ మొదలైన అతి సమీప ప్రదేశాలు తిరిగి మిత్ర మండలి వశమయాయి. యుద్ధపు హడావుడితో చిట్టగాంగు ప్రాంతం చమురు కళ పెళ్ళాడుతూన్న కళాయిలా వుంది. ఇక్కడ పూజా సంబరాలుండవనుకున్నా.
కాని నా అంచనా తప్పింది. పాడ్యమి దగ్గర్నించీ వూరు స్వరూపం మారిపోయింది. వీధికి రెండు మూడు పూజామందిరాలు లేచేయి.
ఇది నిన్న మొన్నటివరకూ వున్న వూరేనా? పగలంతా ఆలివ్ ఆకుపచ్చతో నిండిపోయి, సంజపడితే మందకొడిగా వుండి, ఆరుదాటగానే నవచైతన్యం పుంజుకుంటూంది లెక్క లేనన్ని కరెంట్ దీపాలతో వీధులు కలకల్లాడుతున్నాయి. జన సంచారం అప్పుడే ఆరంభమై రాత్రి పడుతూన్న కొద్దీ యెక్కువై పోతూంది.
ఎక్కడ చూసినా సంతోషం. నవ్వులు పలకరింపులు, కౌగిలింతలు, పరాచకాలు, "మిఠాయి తిను- మిఠాయి తినిపించు" అనే మాటలు.
ఆ స్త్రీ లేవిటి? వీళ్ళంతా ఎక్కణ్ణించొచ్చేరు? మెరుపు తీగెల్లా, చిరునవ్వులతో, చక చక నడుస్తూ, ఆహ్వానిస్తూ, ఆహ్వానాలందుకొంటూ, కళ్ళు మిరుమిట్లు చేస్తున్నారు.
నాకు కొన్ని ఆహ్వానాలొచ్చాయి. అక్కడికి ప్రత్యేకంగా వెళుతున్నా. లహరీ నాతోటే వుండే వాడు. పూజ చూడ్డానికి ఆహ్వానమేమిటి? పద అనేవాడు. ప్రతిరోజూ సాయంత్రం ఏడు గంటల్నించి. తెల్లవార్లూ పూజలు చూస్తూ తిరిగేవాళ్ళం. పదిగంటల వరకూ దుర్గ విగ్రహం ముందు ధూప దీపాలతో నృత్య గీతాలతో పూజజరుగు తుంది. తరువాత నృత్య, సంగీత నాటక ప్రదర్శనాలు, పెద్దల పర్యవేక్షణ కింద యువజనం నడిపించే ఈ సాంస్కృతిక కార్య క్రమాలు చాలా హుషారుగా వుంటాయి.
ఆ నాడు నాటకం ఆరంభమయే ముందు, ఉత్సాహం, వుత్తేజంగల యువకుడొకడు రంగ స్థలం మీద తెరముందుకు వచ్చి జరగబొయ్యే కార్యక్రమం గురించి ఒక చిన్న ఉపన్యాసం యిచ్చాడు. "మన విశ్వకవి రవి ఠాకూర్ రచించిన "చిత్రాంగద" ఈ రాత్రి ప్రదర్శించబోతున్నాం. అంతా సావధానంగా చూసి ఆనందించండి..."అదిగో చూడు!" లహరీ అటు చేత్తో చూపించ బోయేడు. నేను వారించా.
"ఏవిటి?"
"ఇప్పుడలా వెళ్ళిందే అమ్మాయి..."
"ఎలా వెళ్ళింది?"
"పూజా స్థలం దగ్గిర్నించి, స్టేజీ వెనగ్గా యింట్లోకి..."
"గుర్తించలేదు..."
"అదిగో - చూడు - మళ్ళీ బైట కొస్తూంది." స్టేజి వెనక నుంచొచ్చి, వెంటనే ఎడం పక్కకి తిరిగి మరో గుమ్మంలోంచి లోపలి కెళ్ళిపోయింది. బాగా గుర్తు అనలేదు. ప్రక్కగా ఔపించింది. తరవాత వీపు, వెంటనే మాయమైంది.
"ఆ అమ్మాయే చికో అక్క..." లహరీ,
"ఎక్కడో చూసినట్టే వుంది. కాని బాగా గుర్తు రావడం లేదు,
"పద కొంచెం లోపలి కెళదాం..." లహరీ,
"వద్దు. వీళ్ళెవరో మనకి తెలీదు"
"చికో అక్క వుందిగా..."
"అయినా, బావుండదు..."
"అదిగో అలా చూడు. నవ్వుతూ యిలా వస్తూంది. ఏం? చూశావా ?
